ఒ స్త్రీ మూర్తి. అతి సున్నితంగా మృదు శరీరంతో అందమైన ఆమెకు కుడిమోకాలు నుంచి కింద భాగం లేదు. చీర వుండడంతో అధాటుగా చూస్తే ఆమెకు కలులేదని తెలియదు. ఆమె నడవటానికి ఉపయోగించే కర్రలు పక్కనే వుండడంతో అనుమానించాల్సి వస్తుంది అంతే. ఆమె కుర్చీలో కూర్చొని ఏకాగ్రతగా రామకోటి రాస్తున్నది. తెల్లచీర తెల్లజాకెట్టుకు తోడు మల్లెపూవు మృదుత్వం. పచ్చని శరీరచ్చాయతో గాజుబొమ్మలా ,శాంతి కపోతంలా వుంది, లోతుకు పోయిన కళ్ళు, ఆ కళ్ళ కింద నీలినీడలు....
ఫోన్ ట్రింగ్ మనడంతో అవంతి కళ్ళ ముందు కదలాడిన స్త్రీ మూర్తి అదృశ్యమైంది. అవంతి మంచం మీద నుంచి స్ప్రింగ్ లా లేచి రెండంగల్లో ఫోన్ దగ్గరకు వెళ్ళింది.
"హల్లో...."
"ఆర్.పి.ఆర్.ఆర్.ఆర్."
"ఆర్.ఆర్.యమ్.ఆర్"
"గుడ్, అవంతీ! నాకు చాలా సంతోషంగా వుంది."
"ఈ మధ్య కేసులతో అలసిపోయాను. శరీరం రెస్ట్ కోరుతున్నది. అందుకే సార్ కేసు స్వరూపం వినగానే మొదలు...." అవంతి నసుగుతూ చివరిమాటలు మింగేసింది.
"నాకు తెలుసు. నీ పాలిట అన్నీ క్లిష్టమైన కేసులేపడ్డాయి. అందుకే నీకో గుడ్ న్యూస్"
అవంతి చెప్పండి అంటూ ఆతృత చూపలేదు .చెవి యొగ్గి వూరుకొంది.
"ఈరాత్రి తొమ్మిది గంటలకు వచ్చేయ్. తలుపులు తీసే వుంటాయి"
"ఈజిట్ ?"
"ఎస్. అంతేకాదు. ఈ కేసు సక్సెస్ అయితే వారానికి రెండుసార్లు అరగంటసేపు తలుపులు తెరిచేవుంటాయి. ఏమిటి అవంతీ మాట్లాడవు?"
"సంతోషంతో గొంతుమూగబోయింది. సార్! నా ఆనందం ఎలా వ్యక్తం చేసుకోను?" అవంతి కళ్ళు తుడుచుకుంటూ అంది.
"ఎలాగో నీకు తెలుసుగా!"
"ఊ...."
"అంతే. వుంటామరి"
"ఊ...." అని అవంతి రిసీవర్ ని పెట్టేసింది. ఫోన్ లో వార్త విన్న తర్వాత అవంతి తలనొప్పి ఎగిరిపోయింది. వేయి ఏనుగుల బలం వచ్చినట్లయింది. సంతోషం పట్టలేక లాలలా అంటూ గిర్రున తిరిగింది. డ్రస్సింగ్ టేబుల్ కి వున్న అద్దంలో తన బింబము కనిపించడంతో చటుక్కున ఆగి నాలుక బయట పెట్టి వెవ్వెవ్వె అని ఎక్కిరించింది. అవంతి ప్రతిబింబం అందంగా వెవ్వెవ్వె అంది.
* * *
"ఊ....దిగు" ఆటోలో నుంచి ముందు దిగిన ఇన్ స్పెక్టర్ గద్దించాడు.
"ఇరుగుపొరుగు చూస్తే తన పరువు ఏంకాను?" అనుకుంటూ బిక్కచచ్చిపోయి ఆటోలో నుంచి దిగాడు చంద్ర. చంద్ర అదృష్టం కొద్దీ ఆ వీధిలో అప్పుడు పెద్దగా ఎవరూలేరు. ఉన్నవాళ్ళు ఎవరూ వీళ్ళని గమనించలేదు.
"ఆటోచార్జి ఎవరిస్తారు నా తాతా!" ఇన్ స్పెక్టర్ గద్దించాడు.
చంద్రం పదిరూపాయలనోటు జేబులోనుంచి తీసి ఆటో డ్రైవర్ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత చిల్లర కోసం చంద్ర చేయిచాచి వుంచాడు.
"ఛలేవ్" ఇన్ స్పెక్టర్ లాఠీతో ఆటో మీద కొట్టి చెప్పాడు.
"ఛేంజ్" లేదని చెప్పబోయాడు ఆటో అతను.
"క్యారే చెప్పింది అర్ధం కాలేదా?"
ఇన్ స్పెక్టర్ గద్దింపుతో ఆటో అతను సలాం చేసి ముందుకు దూసుకుపోయాడు.
"నా తాతగాడి సొమ్ము నీకేం బాధ" చంద్ర అనుకున్నాడు.
"వీధిలో నుంచుని దిక్కులేం చూస్తావు. యింట్లోకి పద. నీతో పని వుంది మాట్లాడాలి. అంత మోజుగా వుంటే చెప్పు నడివీధి పంచాయితీ - పెట్టిస్తాను"
పోలీస్ స్టేషన్ లో డబ్బు తీసుకుంటే లంచంగా పట్టుబడే ప్రమాదం వుంది. ఇంట్లో అయితే నాలుగు గోడల మధ్య ఏ ప్రమాదం వుండదు. ఇదన్నమాట అసలు సంగతి అనుకున్నారు చంద్ర.
ఇరువురు ఇంట్లోకి రాగానే ఇన్ స్పెక్టర్ తలుపులు లోపల గడియ వేశాడు.
"నాతో నీవు సహకరించాలి సరేనా?" ఇన్ స్పెక్టర్ సరాసరి వ్యవహారంలోకి దిగుతూ అన్నాడు.
"అలాగే సార్! ఏనాడూ నేను ఏ చిన్న నేరమూ చేయిలేదు. మీరు కోరినంత డబ్బు యిస్తాను. మళ్ళీ నా జోలికి రాకండి సార్!" చంద్ర ప్రాధేయపడ్డాడు.
"బేవ్ కూఫ్ బచ్చా! నేను నిన్ను లంచం అడిగానా?"
భయంతో చంద్ర అడ్డంగా తలవూపాడు.
"నీ పేరేంటి?"
"చంద్రశేఖర్...శేఖర్ ....ఆజాద్!"
"నీ పేరు నీలాగానే అందంగా వుంది"
ఈ ఇన్ స్పెక్టర్ ప్రవర్తన చంద్రకి అయోమయంగా వుంది. ఓ మాటకి గద్దిస్తున్నాడు మరో మాటకి ప్రేమ వలక పోస్తున్నాడు. తన నుంచి ఈయనకేం కావాలి?
"నీవు చాలా ముద్దు వస్తున్నావ్! ఆడపిల్లకి వున్నట్లు మెత్తటి నున్నటి శరీరం. లడ్డూ లాంటి వళ్ళు, చక్కటి బుగ్గలు...."
ఇన్ స్పెక్టర్ అంటుంటే చంద్ర వెర్రివాడిలా నోరు తెరుచుకుని అలా చూస్తూ వుండిపోయాడు.