ఆయన నవ్వేరు, "నాకు యే దేవతా తెలీదు బాబూ" అన్నారు. "పచ్చగా కళకళలాడే ఓ చెట్టు అన్యాయంగా నాశనం అవకుండా కాపాడమని నా ఇష్టదైవాన్ని ఏకాగ్రతతో, నమ్మకంతో, ఆర్ద్రతతో ప్రార్ధించానంతే. నువ్వు చాలా గొప్ప మాంత్రికుడివి. కానీ మంత్రం కన్నా నమ్మకం గొప్పది దార్కా. నమ్మకం కన్నా నిజాయితీ ఇంకా గొప్పది" ఆ నిరవంలో ఆయన కంఠం మృదువుగా వినిపించింది. "చెట్టును చంపడం చాలా సులభం దార్కా. తల్లి వేరును కత్తిరిస్తే చాలు, చచ్చిపోతుంది. కానీ బ్రతికించడం.......అది చాలా కష్టం. నువ్వు సర్వశక్ిత సంపన్నుడివి. నీ విద్యల్ని ఇలా వృధాపరచుకోకు" అప్పటివరకూ వున్న మత్తులోంచి బయటకు వచ్చినట్టు దార్కా తల విదిలించి, మామూలు మనిషై పోయాడు. పూర్వపు పగ మళ్ళీ కళ్ళలోంచి వచ్చింది.
"నా కన్యాయం చెయ్యని చెట్టుని నేను నాశనం చెయ్యదల్చుకుంటే మీ యిష్టదైవం అడ్డుపడింది. కానీ మా కాద్రాని చంపిన ఆ ముగ్గుర్నీ నేను చంపుతూంటే ఏ దేవతా అడ్డుపడదు. అలా అడ్డుపడితే ఆ దేవతతో స్వయంగా నేనే పోరాడతాను. ప్రాణం పోయేవరకూ పోరాడతాను."
"నీ నిర్ణయం మారదా దార్కా?"
"మారదు. నా గురువన విషాచికి గురుదక్షిణగా ఆ ముగ్గుర్నీ ప్రేతాత్మలుగా మార్చిఅర్పంచనిదే నా ప్రతిజ్ఞ నెరవేరదు"
"ఆ గురువుకేనా నువ్వు దక్షిణ ఇచ్చేది -ఈ గురువుకి ఇవ్వవా?"
ఊహించని ఈ ప్రశ్నకి దార్కా ఖంగుతిని, అంతలోనే సర్దుకుని - "ఏమడిగినా ఇస్తాను ఆ ముగ్గుర్నీ చంపవద్దనడం తప్ప......"
ఆచార్యులవారు చెయ్యి సాచేరు. "ప్రమాణం చయ్యి. నీ కున్న ఈ మహిమాన్వితమైన శక్తుల్ని అమాయకులైన ప్రజలమీద ప్రయోగించనని."
దార్కా నెమ్మదిగా తలెత్తాడు.
"నా గురువైన మీకు, నేను నమ్మిన క్షుద్రవిద్యలమీద ప్రమాణం చేసి చెబ్తున్నాను. ఆ ముగ్గుర్నీ నా పద తీర్చుకోవడానికి కావల్సినవాళ్ళనీ తప్ప మరో వ్యక్తిని "నేను చంపను- నా ప్రాణం పోయే పరిస్థితుల్లోనైనా సరే, కానీ నేను చెప్పిన ఆ ముగ్గురి విషయం కూడా ఎక్కడా వెల్లడి చేయనని మీరూ నాకు మాటివ్వాలి"
"మంచిది వెళ్ళిరా దార్కా.......నీకు తెలుసుగా మా ఇంట్లో నీకు స్థానం లేదిక"
"అఖ్కర్లేదు స్వామీ. మీకు నా కృతజ్ఞతలు నన్ను ఆశీర్వదించండి."
"క్షమించు దార్కా" తల తిప్పుకున్నాడాయన.
దార్కా వంగి మంత్రగాళ్ళ రీతిలో ఆయన కటికి నమస్కరించి దక్షిణం దిక్కుగా సాగిపోయేడు.
ఆయన అటే చూస్తూ నిలబడ్డాడు.
ఈ యువకుడు మహామాంత్రికుడు అందులో సంశయం లేదు. నాగరిక ప్రపంచంలో నిశ్శబ్దంగా పాములా జారిపోతున్న ఈ తాంత్రికుడ్నిఎవరు ఆపగలరు?
5
రోజులు గడుస్తున్నాయి.
వారాలు నెలలవుతున్నాయి. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాలు గడిచినయ్.
అతడి వేట కొనసాగుతూనే వుంది. నిరాశ చెందకుండా వేట సాగిస్తూనే వున్నాడు. ముందు పెద్ద పెద్ద పట్టణాల్లో అన్వేషించటం ప్రారంభించాడు, తరువాత చిన్నవూర్లు.
మొదట్లో కష్టమయ్యేది తరువాత అతడికి సులువు తెలిసింది. కొన్ని సత్యాలు కూడా తెలిశాయి. డబ్బుతో ఏ పనయినా సాధించవచ్చు........మనిషి మానసికంగా బలహీనుడు....... ఇలాంటివి వాటితో తన పని నిర్వర్తించుకునేవాడు.
అతడికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాలేదు. చిన్న చిన్న మాజిక్కులు చేసేవాళ్ళు ఎలాటి విద్యల్ని ప్రదర్శిస్తరో అలాటివి అతడు చాలా సునాయాసంగా ప్రదర్శించేవాడు. అయితే ఎక్కువ సమయం డబ్బు సంపాదనకోసం వెచ్చించేవాడు కాదు. పక్కవూరు వెళ్ళడానికి మాత్రమే. అంతే మళ్ళీ వేట.
అన్వేషణ సాగుతూంది.
అతడికి గడ్డం పెరిగింది. కళ్ళు మరింత లోతుగా వెళ్ళాయి. మొహంలో తొలి యవ్వనపు లేతదనం పోయి మరింత పగా, కసి, చోటు చేసుకున్నాయి.