Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 13

                                                         కవులు బాబోయ్ కవులు
    రోడ్డుమీద నడుస్తున్న రమణరావు కాళ్లకి ఏదో అడ్డు తగిలి బోర్లాపడి పోయాడు.

    లేచి ఒంటికి అంటుకున్న మట్టి దులుపుకుని నేలమీదకి వంగి చూసాడు. అక్కడ రాయో, రాప్పో ఏమీ లేదు.
    మరి దేనికి తట్టుకుని తను పడిపోయాడు?!...
    ఏమీ అర్ధంకాక బుర్రగోక్కుని రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ దభీమని పడిపోయాడు.
    "హర్రే!... మళ్లీ కాళ్లకి ఏదో తట్టుకుందే!!..."
    చాలా ఆశ్చర్యపోయాడు రమణరావు.
    మెల్లగా లేచి దుమ్ము దులుపుకుని మళ్లీ వంగి చూశాడు. ఉహు... అక్కడ ఏ రాయి లేదు. మరి తన కాళ్లకి ఏంటి తట్టుకుంటుంది?...
    ఇలా ఆలోచిస్తుండగా పక్కనుండి ఎవరో కిసుక్కున నవ్విన శబ్దం వినిపించింది.
    పక్కకి తిరిగి చూశాడు రమణరావు.
    అక్కడ, తనకి బాగా దగ్గర్లో సోడా బుడ్డీ కళ్లద్దాలతో, జులపాల గడ్డాలతో తన వయసే ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
    రమణరావు తనని  చూడగానే గెడ్డంతో గోక్కుంటూ నవ్వాడు అతను.
    తను పడినందుకు అలా నవ్వుతున్నడేమో అనుకుని "హబ్బే.. నేను పడిపోలేదు... నా అంతట నేనే కావాలనిపడిపోయా... మరేమో తారురోడ్డుమీద పడ్తే ఎంత దెబ్బతగుల్తుందో సిమెంట్ రోడ్డుమీదపడ్తే ఎంత దెబ్బ తగుల్తుందో, మట్టిరోడ్డుమీద పడ్తే ఎంత దెబ్బ తగుల్తుందో తెలుసుకుందామని కావాలనే నా అంతట నేనే అలా పడి చూస్కుంటున్నా... హి... అంతేనండి నిజ్జం...హిహి..." అన్నాడు రమణరావు ఏడవలేక నవ్వుతూ.
    "నువ్వు రమణరావు కదూ?" అన్నాడతను రమణరావు చెప్పేదేమీ పట్టించుకోకుండా.
    "అవునూ..." అన్నాడు రమణరావు ఆశ్చర్యంగా చూస్తూ. ఎవరబ్బా ఇతను తనపేరు కూడా తెల్సు!
    "నన్ను గుర్తుపట్టలేదా?"
    "ఉహు..." రమణరావు తల అడ్డంగా ఊపాడు "మీ మీసాలు గడ్డాలూ మొహానికి అడ్డొస్తున్నాయ్ గా మరి?"
    "నేను జీళ్లబంకని!!" అన్నాడతను గెడ్డంలో గోక్కుని నవ్వుతూ.
    రమణరావుకి గుర్తుకొచ్చింది.   
    అతనెవరోకాదు జనార్ధన్!డిగ్రీ ఫైనల్ ఇయర్ లో తన క్లాస్ మేట్. జీళ్లబంక అతని నిక్ నేమ్.
    "హర్రే జనార్ధన్...నువ్వా? గెడ్డం మీసాల్లో, జులపాల జుట్టుతో నిన్ను అసలు గుర్తుపట్టలేదు..." అన్నాడు రమణరావు జనార్ధన్ భుజాలు పట్టి కుదుపుతూ.
    కాసేపు ఇద్దరూ ఆమాటా ఈమాటా మాట్లాడుకున్నారు. మాట్లాడుతున్నంత సేపూ రమణరావు నేలవంక చూస్తూ ఏదో వెతుకుతున్నాడు.
    "ఏమిటి అలా వెతుకుతున్నావ్?..." చిలిపిగా చూస్తూ ప్రశ్నించాడు జనార్ధన్.
    "ఏం లేదు... ఏం లేదు..." తడబడ్డాడు రమణరావు.
    "నేలమీద చూస్తే ఏ రాయి లేదు... దేనికి తట్టుకుని ఇందాకా అలా పడ్డనబ్బా అని ఆలోచిస్తున్నావ్ కదూ?... ఇందాక రెండుసార్లు నీ కాళ్లలో నా కాలు అడ్డుపెట్టాను... అందుకే అలా బోర్లాపడిపోయావ్" గర్వంగా అన్నాడు జనార్ధన్.
    "ఎందుకలా?" ఆశ్చర్యంగా అడిగాడు రమణరావు.
    "మరి నువ్వు నన్నుచూడకుండా వెళ్లిపోతున్నావుగా?"
    "అయితే పేరుపెట్టి పిలవాలిగానీ ఇదేం అలవాటు కాళ్లు అడ్డుపెట్టి. పడెయ్యడం?... ఇలా ఎలా అలవాటైంది?" రమణరావు మందలింపుగా అడిగాడు.
    "ఎలాగోలా అయ్యిందిలే..." సిగ్గుపడ్డాడు జనార్ధన్.
    "సర్లే ఈ పాడు అలవాటు మానుకోడానికి ట్రై చెయ్... నేనిహ వస్తా..." అన్నాడు రమణరావు అడుగులు ముందుకు వేస్తూ.
    అంతే... మళ్లీ దభేల్ మని బోర్లా పడిపోయాడు.
    జనార్ధన్ రమణరావుని లేవనెత్తి నవ్వాడు.
    "సారీనోయ్.. ఈ అలవాటు నేను మాన్లేను... ఈ అలవాటుండడం నాకు అవసరం కూడా..." అన్నాడు. అతని కాళ్ల మధ్య తన కాలుపెట్టి మెలిపెడ్తూ.
    "అదేం?...ఎందుకవసరం?..." ఆశ్చర్యంగా అడిగాడు రమణరావు.
    "మరి నన్ను తప్పించుకుని వెళ్లిపోయేవాళ్లని ఎలాగాపడం?"
    "అయితే నన్నిప్పుడు వదలవన్నమాట!..."
    "అప్పుడే ఎలా వదులుతాను?... నీకు కాస్త వినిపించొద్దూ ?..." అన్నాడు జనార్ధన్ జేబులోంచి ఓ కాయితం తీసి మడతలు విప్పుతూ.
    "ఏంటి వినిపిస్తావ్?..." కళ్లితింత చేసి చూస్తూ అడిగాడు రమణరావ్.
    "అందమైన జాబిల్లి...
    ఆకాశంలో పిల్లి       
    నను కన్నతల్లి   
    రతనాల కల్పవల్లి..." అన్నాడు జనార్ధన్ హఠాత్తుగా.
    రమణారావుకి కంగారు పుట్టింది.
    "ఏంటిది?... ఏమైంది నీకు హఠాత్తుగా..."
    "ఏం కాలేదు... దీన్ని వచన కవిత్వమంటారు... నేనీమధ్యనే రాయడం మొదలుబెట్టాను..."
    "బాబోయ్..." గుండెలమీద చెయ్యేస్కుని అరిచాడు రమణరావు.
    "అలా ప్రాణాలు పోయేట్టు అరవకు... పెద్ద పెద్ద కావ్యాలేమి చదవడంలేదుగా... ఓన్లీ మినీ కవితలేగా... ఇహి ఇప్పుడు మరోటి..."
    "చిన్నారి పాప నువ్వు
    నునులేత కొమ్మపై పువ్వు
    ఈ రెండన్నా అందరికి ఎంతో లవ్వు   
    వినాలి ఎప్పుడూ ఈ కవిత నువ్వు"
    "బాబోయ్..." మళ్లీ అరిచాడు రమణరావు.
    ఈ రెండన్నా అందరికీ ఎంతో లవ్వు వినాలి ఎప్పుడూ ఈ కవిత నువ్వు..."
    రమణరావు గడగడలాడిపోయాడు."నేనిహుస్తాన్రా జనార్ధన్..." అన్నాడు భయంగా...
    "జనార్దనా?... వాడెవడు?.... నేను కవితలు చదివేటప్పుడు జనార్ధన్ ని కాను... శ్రీశ్రీశ్రీని. రెండు 'శ్రీ'లు ఉన్న శ్రీశ్రీ అంత గొప్ప కవై పోయాడుగా అంచేత ఇంకా గొప్ప కవినైపోవాలని నేను మూడు'శ్రీ'లు పెట్టుకున్నా. అంచేత నేను కవితలు'శ్రీశ్రీశ్రీ'అనే కలం పేరుతో రాస్తానన్నమాట"
    "బావుంది... బావుంది... మరిహనేనొస్తానేం?...అలాగేనా?...హిహి..." మస్కా కొడుతూ నవ్వి రెండడుగులు ముందుకు వేసి దభీమని పడిపోయాడు.
    "కాలడ్డుపెట్టి పడెయ్యడం ఎలా అలవాటైందని ఇందాక అడిగావుగా... ఇలానే! మరి నా కవితలు పూర్తిగా వినిపించి పంపాలంటే ఇదే మార్గం...." అన్నాడు జనార్ధన్ సీరియస్ గా.
    రమణరావు కిందనుండి లేచి బట్టలు దులుపుకుని జనార్ధన్ వంక కోపంగా చూశాడు.
    "ఏం అలా చూస్తున్నావ్!... పిచ్చి పిచ్చి వేషాలేశావంటే నేనువినిపించాలని అనుకున్న దానికంటే నాలుక్కవితలు ఎక్కువ వినిపిస్తా... ఖబడ్దార్" పళ్లు కొరుకుతూ అన్నాడు జనార్ధన్.
    "అబ్బే... కోపంగా చూడ్డంకాదు కళ్లలో దుమ్ముపడి అట్టా చూశా... హి!" సర్దుకుంటూ అన్నాడు రమణరావు.
    జనార్ధన్ మరో నాలుగైదు కవితలు రమణరావుకి వినిపించాడు.
    రమణరావు బుర్ర తిరిగిపోయింది.
    "నువ్వు చదివిన కవితలన్నీ నోర్మూసుకుని విన్నాగా... మరి నేనిక వెళ్లనా ప్లీజ్!" అన్నాడు గడ్డం పుచ్చుకు బ్రతిమలాడ్తూ.
    వెంటనే జనార్ధన్ రమణరావు కాళ్లమధ్య తన కాలువేసి మెలిపెడ్తూ భలేవాడివే... అప్పుడే ఎక్కడికెళ్తావ్... సారస్వత పరిషత్ హాల్లో కవిసమ్మేళనం జరుగుతుంది... నేను కూడా దాంట్లో పాల్గొంటున్నాను... మరి నేను స్టేజిమీద కవితలు చదూతుంటే నువ్వు వినపోతే ఎలా? అసలే నా ప్రాణ స్నేహితుడివి కూడానూ..." అన్నాడు.
    "నేను నీకు ప్రాణస్నేహితుడిని కాననుకుంటా... నువ్వనవసరంగా నన్నపార్దం చేసుకుంతున్నవేమో!!.. హిహి... అవునా... హి" తనకాళ్లమధ్య ఉన్న అతని కాలుని తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు రమణరావు.
    "ఇప్పుడు కాకపోతే రేపొద్దున్న అవుతావు. రోజూ నన్నిలా కల్సి నా కవితలు వింటూంటే... పద... కవి సమ్మేళనానికి టైమోతుంది..."
    ఇద్దరూ సారస్వత పరిషత్ హాలుకి వెళ్లారు. అప్పటికి కవి సమ్మేళనం మొదలవలేదుగానీ కార్యక్రమంలో పాల్గొనే కవులందరూ వేదికమీద కూర్చున్నారు.
    "వాళ్లందరూ స్టేజిమీద కూర్చున్నారుగా... నువ్వుకూడా వెళ్లి అక్కడ కూర్చో..." అన్నాడు రమణరావు తన ప్రక్కన కూర్చున్న జనార్ధన్ తో.
    "హమ్మదొంగా... తప్పించుకుని పారిపోదామనా?... ఆశ!... అదేం కుదర్దు. నావంతు వచ్చినప్పుడు మాత్రం స్టేజెక్కి చదూతా... అంతవరకూ నీకు కాపలాగా ఇక్కడే కూర్చుంటా... స్టేజిమీద చదూతున్నప్పుడు నిన్నే చూస్తుంటా... మధ్యలో లేచెళ్లిపోయావో మీ ఇంటికి అర్ధరాత్రొచ్చి కవితలు వినిపిస్తా..." అని రమణరావు ఇంటి అడ్రసు నోట్ చేసుకున్నాడు.
    కవి సమ్మేళనం అయిన తరువాత పగిలిన గుండెతో ఇంటికి చేరాడు రమణరావు.
    రమణరావు పిచ్చి చూపులూ ఆ వాలకం గట్రా చూసి అతని భార్య "నిక్షేపంగా ఉండేవారు ఇలాగైపోయరేంటండీ?..." అంటూ ఘొల్లుమంది.
                                                     *   *   *

 Previous Page Next Page