అప్రయత్నంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించిందామె. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతను రావడం క్షణకాలం ఆలస్యం అయివుంటే....తన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
"పోలీస్ స్టేషన్ పోయి....రిపోర్ట్ ఇస్తావా?" అడిగాడు.
వద్దన్నట్లుగా అడ్డంగా తల వూపింది. ఏమని కంప్లెయింట్ ఇస్తుంది? ఎవరి మీద ఇస్తుంది? తనకి శతృవులు ఎవరు? అని అడిగితే....ఎవరని చెబుతుంది. పోనీ సెక్యూరిటీ ఇమ్మంటే....ఆ సెక్యూరిటీ మనుషులు తన స్వేచ్చను పూర్తిగా అడ్డగిస్తారు. ఏ ఒక్కరితోనూ ఫ్రీగా మాట్లాడనివ్వరు. పురుగును కూడా పూర్తిగా చెక్ చేస్తే తప్ప లోపలికి రానివ్వరు. తన మాతృభూమి మీద తను వున్న కొద్దిరోజులు స్వేచ్ఛగా వుండకపోతే ఇంక ఉపయోగం ఏమిటి? అందుకే ఆ ఆలోచన మానుకుంది. ఆమెకు కొన్ని నిజాలు తెలియవు. యునైటెడ్ స్టేట్స్ లో లాగానే ఇక్కడ కూడా సెక్యూరిటీ అనగానే చాలా టైట్ గా వుంటుందనుకుంది. ప్రధాన మంత్రులకే సరియైన సెక్యూరిటీ ఇవ్వలేని అధ్వాన స్థితిలో ఇండియన్ పోలీస్ డిపార్ట్ మెంట్ వుందని ఆమెకు తెలియదు.
"నీ ఇల్లు ఎక్కడ? మీ వాళ్ళు ఎక్కడుంటారు? నిన్ను ఎక్కడికి తీస్కోపోవాలి?"
అతనికి హోటల్ అడ్రస్ చెప్పింది.
"ఇక్కడ హోటల్ దోస్త్ లు కూడా ఎవరూ లేరా?" మళ్ళీ అడిగాడు.
ఆమె సమాధానం చెప్పలేదు.
ఏమనుకున్నాడో ఏమో! ఇంకేం మాట్లాడకుండా కారుని ముందుకి దూకించాడతను.
పది నిమిషాల తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది టాక్సీ.
ఆ పది నిమిషాలూ వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు.
టాక్సీ ఆగగానే "నలభై రూపాయలు అయింది" అన్నాడు మీటర్ వంక చూస్తూ.
వ్యానిటీ బ్యాగ్ తెరిచి అందులో నుంచి నాలుగు పదినోట్లు తీసి అతని చేతికి యిచ్చింది.
అవి అందుకుని జేబులో పెట్టుకున్నాడతను.
"ఒక్క నిమిషం"
ఆమె మాట విని తల తిప్పి చూశాడతడు.
వంద రూపాయల కట్ట అతని చేతిలో వుంచబోయింది.
క్షణకాలం ఆ డబ్బుని చూశాడతడు.
"నువ్వు పైసలిస్తావని నిన్ను బచాయించలే! నా బెహెన్ లెక్క నిన్ను బచాయించిన బస్" సమాధానం చెప్పి కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడతను!
అతని మాటలు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదామెకు.
అప్రయత్నంగా రెండు చేతులూ జోడించిందామె.
కారులోంచి దిగిన ఆ స్త్రీ అలా డ్రైవరుకి రెండు చేతులూ జోడించి నమస్కరించటం చూసి తెల్లముఖం వేసి బుర్ర గోక్కున్నాడు అక్కడి వాచ్ మెన్.
అలా ఆలోచనల్లో ఉన్న ఆమె....తెలీకుండానే నిద్రలోకి జారుకుంది.
* * * * *
"హైదరాబాద్ సిటీకి బెస్ట్ షాపింగ్ సెంటర్ మేడం."
సంజుని ఉద్దేశించి చెప్పాడు మ్యూజిక్ ప్రోగ్రాం ఆర్గనైజర్ శంకర్.
"అయితే ఇక్కడే షాపింగ్ చేస్తాను" జవాబు చెప్పింది సంజు.
ఆమె దృష్టి ఇటూ అటూ తిరిగే జనాల మీద, అక్కడి షాప్స్ మీద వుంది.
"మీరు ఇక్కడే దిగండి మేడం. కారు పార్కింగ్ ఇక్కడ లేదు. డ్రయివరు కారుని ఆ కనిపించే పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాడు" చెప్పాడు శంకర్.
కారులోంచి దిగిందామె.
ఆమె వెనుకగా శంకర్, మరో వ్యక్తి కూడా కారులోంచి దిగారు. కారు తీసుకుని డ్రైవరు పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్ళాడు.
"అదుగో....ఆ కనిపించే షాపులో ఎక్స్ లెంట్ శారీస్ దొరుకుతాయి మీకు కావలసినన్ని డిజైన్ వుంటాయి. హైదరాబాద్ మొత్తానికే బిగ్గెస్ట్ షోరూం అది" చెప్పాడు.
కళ్ళు చెదిరిపోయే నియాన్ లైట్లతో మెరిసిపోతోందా షోరూం.
అటుగా నడిచిందామె.
ఆమె వెనుకనే నడిచారు వాళ్ళిద్దరూ.
ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలవరకు హోటల్ రూంలో నిద్రపోయిందామె. మెలుకువ వచ్చాక స్నానం చేసి టిఫిన్ తిని రెడీ అయింది.
ఇప్పుడామె ఎయిర్ పోర్టుకు వెళ్ళి తన లగేజీ తెచ్చుకోవాలి. అంతవరకూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేదు.
ఆమె వేసుకున్న డ్రస్ నలిగిపోయింది. ఆ దుస్తులలో బయటికి వెళ్లాలంటే చాలా యిబ్బందిగా వుందామెకు.
కనీసం ఒక డ్రస్ అయినా తీసుకోవాలి.
లిఫ్టులో క్రిందికి వచ్చి అక్కడికి సమీపంలో రెడీమేడ్ డ్రసెస్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుంది.
అదృష్టవశాత్తూ ఆ హోటల్ కి కొద్ది గజాల అవతలే ఓ గార్మెంట్స్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి బ్లాక్ కలరు మిడ్డీ స్కర్ట్, లైట్ క్రీం కలరు షర్ట్ కొనుక్కుంది.
హోటల్ కి తిరిగొచ్చి ఆ దుస్తులు ధరించింది.
ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళాలి. ఎయిర్ పోర్టు నుంచి లగేజి తెచ్చుకోవాలి. ఆమెకు మరొక కోరిక కూడా వుంది. వైజాగ్ లో యివ్వబోయే తన ఫెర్మార్మెన్స్ కి ఇరవయ్ పాటలు ప్లాన్ చేసుకుంది. ఇరవయ్ పాటలకు ఇరవయ్ రకాల శారీస్ మార్చాలని నిర్ణయించుకుంది. అలా చీరలతో ప్రోగ్రాం యివ్వటం వలన యిక్కడి నేటివిటీకి దగ్గరగా వుంటుందని ఆమె ఆలోచన.
ఒంటరిగా రావడానికి భయంగా అనిపించినా, లగేజి తీసుకోవడానికి వెళ్ళక తప్పదు. అలాగే డ్రస్ సెలక్షన్ కూడా తనే చేసుకోవాలి. అందుకే ముందు జాగ్రత్తగా ఇద్దరు మనుషుల్ని తోడుగా తెచ్చుకుంది. అయితే ఆ రోజు ఉదయం జరిగిన మర్డర్ ఎటెంమ్ట్ గురించి ఆమె వాళ్ళకి చెప్పలేదు.
కారణం....వాళ్ళు భయపడతారని.
గ్లాస్ డోరు ఓపెన్ చేసుకుని షోరూంలో అడుగుపెట్టిన ఆమె శరీరానికి ఎయిర్ కండిషన్డ్ చల్లదనం తగిలి హాయిగా అనిపించింది.
చాలా పెద్ద షోరూం అది. ఒక వైపు జంట్స్ డ్రసెస్, ఒక వైపు లేడీస్ డ్రసెస్, మరోవైపు చిల్డ్రన్ వేర్.... రకరకాల డ్రస్ లు కళ్ళు చెదిరిపోయేలా వున్నాయి.
క్షణంపాటు షాపంతా పరికించి చూసి శారీస్ సెలక్షన్ వైపు నడిచిందామె.
"ఏం కావాలి మేడం?" అడిగాడు అక్కడున్న కుర్రవాడు.
"శారీస్" చెప్పిందామె.
ఆమెను ఎక్కడో చూసినట్లనిపించింది కాని ఎక్కడో అర్ధం కాలేదు ఆ కుర్రాడికి.
ఆ రోజు పేపర్లో చూశానన్న సంగతి అసలు గుర్తుకురాలేదు.
"ఎంత ఖరీదులో చీరలు చూపించమంటారు?
"ఖరీదు ఎంతయినా ఫరవాలేదు. మంచివి కావాలి" చెప్పిందామె.
క్షణంకాలం అక్కడున్న చీరల వైపు పరికించి చూసి ఒకవైపు నుంచి చీరలు తీసి డిస్ ప్లే చేయసాగాడు.
కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నాయవి.
అంత అద్భుతమైన చీరలు చూసే అవకాశం ఇంతవరకూ ఆమెకు రాలేదు.
ఆమె చీరలు చూస్తూనే వుంది. సెలక్షన్ చేస్తూనే వుంది.
సమయం గడుస్తోంది.
* * * * *
బైక్ పార్క్ చేసి క్రిందికి దిగాడు కౌశిక్.
ఒక ప్యాంటు, షర్ట్ కొసుక్కోవాలి. టైము చూసుకున్నాడు. ఐదు నిమిషాల తక్కువ తొమ్మిదయింది. షాపులు క్లోజ్ చేసే టైమైంది. త్వరగా డ్రస్ సెలక్ట్ చేసుకోవాలనుకున్నాడు.
అతనా సమయంలో డ్యూటీలో లేడు. అందుకే సివిల్ డ్రస్ లో వున్నాడు. డార్క్ గ్రీన్ కలరు ప్యాంట్, వైట్ టీ షర్టు ధరించి వున్నాడు.
పరుగులాంటి నడకతో షోరూంలోకి ప్రవేశించాడు.
షోరూం దాదాపు ఖాళీగా వుంది.
ఒక యువతి ఏదో చీరలు కొనుగోలు చేస్తోంది. ఆమె ప్రకక్నే మరో ఇద్దరు వ్యక్తులున్నారు.
"చాలా అందంగా వుంది" అనుకుని రెడీమేడ్ ప్యాంట్సు, షర్ట్స్ సెక్షన్ వైపు నడిచాడు.
* * * * *
"మేడం....షాపు క్లోజ్ చేసే సమయమైపోయింది. బిల్ తయారు చేయించమంటారా?" అడిగాడు షాపులోని సూపర్ వైజరు.
అలాగే అన్నట్లు తల వూపిందామె.
సెలక్ట్ చేసిన చీరలు ప్యాక్ చేయసాగాడు షాపువాడు.
"మేడం....మేము వెళ్ళి కారు ఇక్కడికి తీసుకొస్తాం. ఈలోగా మీరు బిల్ పేచేసి బయటికి రండి" చెప్పాడు శంకర్.
"ఓ.కె!" అందామె.
అతను బయటికి వెళ్ళిపోయాడు.
బిల్ లో ఎమోంట్ చూసి క్యాష్ కౌంటర్లో యిచ్చింది సంజు.
ఎయిర్ కండిషన్డ్ ఆఫ్ చేసేసినట్లున్నారు. ఆ హాల్లో వాతావరణం వెచ్చగా మారుతోంది.
ఆమె ఇచ్చిన నోట్లు లెక్కపెట్టసాగాడు క్యాషియరు.
సరిగ్గా....అదే సమయంలో....
పెద్ద శబ్దం....