Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 13

అందులో కంపెనీ ప్రొప్రయిటర్ తనకిచ్చిన అడ్వాన్సు వుంది.
దస్తగిరి చెప్పుకెళుతున్నాడు.
"మై లిటిల్ మేడమ్! ఇప్పుడు నాకెలాంటి చింతాలేదు. అమెరికా నుండి రాగానే మా ప్రొప్రయిటర్ నా పనితనాన్ని గమనిస్తాడు. అప్పుడు నేను కంపెనీ నుండి కొంత మనీ అప్పుగా తీసుకుంటా. మ్యారేజెస్ కుదిర్చే మనిషికి తమకో మంచి మీ వర్ణం కుర్రవాడ్ని చూడమని చెప్పాను. ఆ మనీతో మీకు వివాహంచేసి మా యజమాని ఋణం తీర్చుకుంటాను."
అప్పుడు బదరి కనులు చెమర్చాయి. కళ్ళు వత్తుకుని అతనివంక ప్రేమగా చూస్తూ "దస్తగిరీ! నీయజమాని నీకేం చేశాడు-ఋణపడటానికి?" అంటూ అడిగింది.
"నన్ను తనవెంట తిప్పుకుని ప్రపంచమంటే ఏమిటో చెప్పాడు. నా ఆకలిపొట్టకు చాలినంత తిండి పెట్టాడు. నా శరీరం దృఢంగా ఇంత ఆరోగ్యంగా వుండటానికి ఆయనపెట్టిన తిండే మేడమ్. అందుకే మీ ఫాదర్ కి నేను చాలా ఋణపడ్డాను. ఆయనే బ్రతికివుంటే అప్పయినా చేసి తమ పెళ్ళి ఘనంగా జరిపించేవాడు. ఇప్పుడా కార్యం నా భుజాలమీదుంది" అంటూ దస్తగిరి అమాయకంగా చూస్తూ ఆనందంపొందుతున్నాడు.
అతనికి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా వుంది.
కానీ ఆక్షనంవరకూ తెలీదు. తను జయించింది ప్రపంచాన్ని కాదనీ బదరి హృదయాన్ననీ....!
బదరి తిరిగి అతన్ని అడిగింది-
"దస్తగిరీ! నీ భుజస్కందాల మీద మా డాడీ ఏం వుంచాడు?"
"తమ భారాన్ని."
"అంటే నా బరువునా?"
దస్తగిరి అవునన్నట్టు బదరివంక అమాయకంగా చూశాడు.
"మరి నేనెంత బరువున్నానో ఎప్పుడు చూస్తావ్?"
ఆమె మాటలు అతనికి అర్ధంకాలేదు.
"దస్తగిరీ! ఇలా లోపలకి రా."
ఇరువురూ లోనికి వెళ్ళారు.
బదరి తలుపులు మూసింది.
"ఇప్పుడు చూడు నేనెంత బరువున్నానో. జీవితాంతం యిక నువ్వే మోయాలి" అంటూ అతని చేతుల్లోకి వాలిపోయింది.
ఈ విచిత్ర పరిణామం మొదట 'దస్తగిరి'కి అర్ధంకాలేదు. అతడు భయపడి వెనక్కి అడుగేశాడు.
"నో మేడమ్! నేను....నేను...అందుకు తగను" తడబడుతూ అన్నాడు.
"అంతా నిర్ణయం అయిపోయింది దస్తగిరీ! రేపే మన పెళ్ళి. ఆఫీసర్ తో కూడా మాట్లాడాను. రిజిస్ట్రార్ ఆఫీసులో-"
అంటూ అతన్ని బదరి ఆవేశంగా హత్తుకుపోయింది.
దస్తగిరి అంతరంగంలో వున్న కోర్కె అప్పుడు బుసలుకొట్టింది. బదరి తనకు దక్కితే...."గాడెస్ ఆఫ్ బ్యూటీ" తనకు దక్కినట్టే తనకు ఈరోజే ఉద్యోగం రావటం....ఈరోజే బదరి దక్కటం....
ఓహ్! తను ప్రపంచాన్నికాదు జయించింది. స్వర్గాన్ని కూడా జయించాడు.
స్వర్గ ద్వారాలు ఎలా వుంటాయో తనకు తెలీదు.
కానీ బదరి పెదాలంత తెహేయగా-అందంగా మాత్రం అవి వుండవు.
స్వర్గంలో మైమరచే సంగీతం ఎలా వుంటుందో తనకు తెలీదు. కానీ బదరి మాటలంత మధురంగా, మైమరపుగా వుండదని మాత్రం తెలుసు.
స్వర్గంలో ఏ దేవతా బదరి అంత అందంగా వుండదు. ఈ భూమి మీదే ఈ 'దస్తగిరి'కి స్వర్గం కంటే గొప్పదయిన జీవితం మొదలయింది.
అతనిలో అణగారిన కోర్కెలు తమ కుబుసాన్ని విడిచాయి.
మెల్లిగా ఆమె వంటిమీద చేయి వేశాడు.
తరువాత మెల్లిగా ఆమె తలమీద చేయి వేసి, ఆమె అందమయిన తెల్లటి ముఖాన్ని తన ముఖంకేసి తిప్పుకుని.....
"గాడెస్! ఒక్క విషయం చెప్పు....ఇది కలా నిజమా?"
"నిజమే! ఐ లవ్ యూ."
"గాడెస్! ఒక్క విషయం చెప్పు....ఈ బ్లాక్ మాన్ నీకెలా నచ్చాడు?"
అతనిలో స్వచ్చమైన మచ్చలేని తెల్లటి హృదయం వుంది గనుక.
"గాడెస్! ఒక్క విషయం చెప్పు. ఈ నిర్ణయం క్షణికమా? శాశ్వతమా?"
"మనం ఇరువురం ఈ భూమిమీద ఉన్నంతవరకూ విడిపోం! భగవంతుడు మాత్రమే మనల్ని వేరు చేయగలడు. ఇక్కడ ఏ మనిషి మనల్ని విడదీయలేడు. ఏ పరిస్థితీ మనకు ఎడబాటు కలుగజేయలేదు. ఐ ప్రామిస్ యు దస్తగిరీ! ఐ లవ్ యూ దస్తగిరీ!" ఆమె అంది.
అతడు నిలువెల్లా కంపించిపోయాడు.
ఓ తెల్లటి మొగలిపువ్వును పెనవేసుకున్న త్రాచులా అతడు బుసలుకొట్టాడు.
ఆ రాత్రి ఎలా తెల్లవారిందో వారికి తెలీలేదు.

                    *    *    *    *
ఆ రోజు దస్తగిరికీ, బదరికి పెళ్ళయింది. చాలామంది దస్తగిరి అదృష్టాన్ని కొనియాడారు. మరికొందరు బదరి సాహసానికి ఈర్ష్యపడ్డారు.
దస్తగిరి ఎత్తుగా వుంటాడు. మిస్టర్ యూనివర్సల్ లా కండలుతిరిగి వుంటాడు. పైపెచ్చు ముఖంలో కొంత పాలిష్ నెస్ వుంది. నెత్తిమీద నల్లటి జుట్టు రింగులు తిరిగి వుంది. వెరసి పరిపూర్ణమైన మగవాడుగా దస్తగిరి చాలామంది ఆడవాళ్ళకు కనిపించాడు.
అతని ప్రేమలో బదరి కరిగిపోతోంది.
పూర్ణుడు కాని మగవాడు తెల్లగా వున్నా, పచ్చగా వున్నా వుపయోగం వుండదు.
వారి అచంచలమైన ప్రేమలో....
వారి జీవితాల్లో కూడా ఒక పరిపూర్ణత ఆర్ధికంగా చోటుచేసుకుంది. దస్తగిరి కృషికి మెచ్చి....అతని యజమాని కంపెనీ వ్యవహారాల్ని మేసేజ్ చేయటం నేర్పి, ఆ పదవినే కట్టబెట్టాడు.
బదరి కూడా ఓ ప్రయివేట్ కంపెనీలో టైపిస్ట్ కం క్లర్క్ గా చేరింది.
జీవితం గాడిలో పడింది. సాఫీగా దొర్లిపోతోంది.
అప్పటికి ఐదు సంవత్సరాలయింది.
అయితే....స్త్రీగా బదరి పరిపూర్ణత సాధించలేకపోయింది. తల్లి కాలేకపోయింది. తను డాక్టర్ కు చూపించుకుంటే ఏ లోపమూ లేదన్నారు. మరి లోపం దస్తగిరిలోనా?
తను ఒకటికి రెండుసార్లు హెచ్చరించింది.
"దస్తగిరీ! ఒకసారి మెడికల్ చెకప్ కి వెళ్ళిరా!"
దస్తగిరి వెళ్ళివచ్చాడు.
డాక్టర్స్ ఏదో చెప్పి, రిపోర్టు యిచ్చారు. ఆ రిపోర్టు షీటు తీసుకుని దస్తగిరి ఇంటికి వచ్చాడు.
విచారంగా కూర్చున్నాడు.
"ఏమయింది?" బదరి మృదువుగా అడిగింది.
"బదరీ! భగవంతుడు అన్నీ అందరికివ్వడు. కొన్ని మాత్రమే కొంధరికిస్తాడు. నా విషయంలో ఇవ్వాల్సినదానికంటే ఎక్కువే యిచ్చాడు. ఓ ఇల్లు, ఓ అందాల దేవత, మంచి వుద్యోగం.
నిజం! ఈ ఫూల్ బ్లాక్ మాన్ కి ఈ గోల్డెన్ గాడెస్ భార్యగా దొరకటం....మరి భగవంతుడి దృష్టిలో ఎక్కువే బదరీ! గాడ్ కి కూడా కుళ్ళు బోరుతనం వుంది. అందుకే నాకన్నీ యిచ్చి, చివరికి ఒకటి మాత్రం మైనస్ చేసి యిదిచ్చాడు" అంటూ బదరి చేతిలో ఒక కవరు పెట్టాడు.
బదరికి భయం కలిగింది.
అంటే తమ సంతాన హీనత్వానికి దస్తగిరిలో ఏదో లోపం వుందన్న మాట.
ఆ కవరులోని కాగితం బయటకు తీసేప్పుడు ఆమె చేతులు కొద్దిగా షేక్ అయ్యాయి. కాగితాన్ని మెల్లిగా బయటకు తీసింది. అంతకంటే మెల్లిగా మడతల్ని విప్పింది.
అందులోని అక్షరాల్ని చదివింది.
దస్తగిరి....
అతనికి 'మేల్ పొటెన్సీ' వుంది. కానీ 'డిగోస్పెర్ నిక్' బదరి గుండెలో ఏదో బాంబు పేలినట్టు ఆ పదాలు కనిపించాయి.
దస్తగిరి 'ఎస్సెర్నియా'కు గురయ్యాడు.
అతని నుండి వెలువడే స్పెరమ్ లో ఫలదీకరణకు వుపయోగపడే వీర్యకణాలు అసలులేవు.
ఎలాంటి ట్రీట్ మెంటుకూ పనికిరాని పరిస్థితిలో వున్నాడు. అంటే ముందు ముందు తమకు సంతానయోగం లేదు. బదరి మెల్లిగా నవ్వుకుంది.
తరువాత దస్తగిరి వంక చూసింది. మనిషి మరీ డిప్రెషన్ కు గురై నట్టున్నాడు.
ఆమెమేల్లిగా దస్తగిరి దగ్గరకు చేరింది.
"డియర్! నీవు మా ఇంటికి అనాధగా వచ్చి....యజమాని వయ్యావు. నా హృదయాన్ని దోచావు. ఆనందపుటంచుల్ని చూపించావు. నేను పొందిన తృప్తి బహుశా చాలా తక్కువమంది మాత్రమే పొందివుంటారు.
అలాగే మరో అనాధ ఈ ఇంటికి నాకూ, నీకూ కొడుకుగా రాకూడదా? వాత్సల్యాన్ని, మమతానురాగాల్ని మనం ఆ చిన్నారికి పంచి యివ్వగూడదా?"
అతన్ని మామూలు స్థితికి తేవాలని బదరి ఎంతగానో ప్రయత్నించింది.
ఇందులో ముంచుకుపోయేదేం లేదంది. పిల్లలు లేకుండా ప్రపంచంలో లక్షలాది కుటుంబాలు హాయిగా జీవనం చేస్తున్నాయని చెప్పింది.
ఆ రాత్రి....
అతని తలను ఒడిలోకి తీసుకుని....ఆప్యాయంగా నిమిరింది. అతడు మరింత దుఃఖోద్వేగానికి గురవుతున్నాడు. అతన్ని పసిపిల్లాడిలా ఒదార్చింది. మెల్లిగా అతనికి వివరించింది.

 Previous Page Next Page