కోర్టు కేసు తేలేలోపలే ఆ స్థలాన్ని రెండు భాగాలూ చేసి యిద్దరికి అమ్మీ రాత్రికి రాత్రి గుడిశెలు లేపేసి అక్కడి నుంచి పారిపోయాడతను.
జంట నగరాల్లో ఇళ్ళ స్థలాలు కబ్జాకేసి అమ్ముకోవటం మంత లాభసాటి దందా మరోటి లేదని అతనికి అర్ధమయింది.
రెండోసారి అతని దృష్టి బంజారాహిల్స్ మీద పడింది. అన్ని విధాలా బాగున్న ఓ ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రి పాకలు వేయించాడు.
అతనూహించినట్లే ఆ స్థలం ఓనరైన నవాబుగారొకరు పోలీసులను తీసుకొచ్చారు. ఓ వారంలో తీసేస్తామని పోలీస్ ఇన్స్ పెక్టర్ కి హామీ యిచ్చాడు.
తను తిన్నగా లాయర్ దగ్గరకెళ్ళి ఫీజు కట్టేసి సలహా అడిగాడు.
తామంతా ఆ స్థలంలో గత యాభై ఏళ్ళుగా వుంటున్నట్లు కోర్టులో చెప్పమన్నాడు లాయరు.
యాభై ఏళ్ళనుంచీ అక్కడ వుంటున్నట్లు ఆ ఏరియాలో అప్పటి సర్పంచ్ సర్టిఫికెట్ ఒకటి ఫోర్జరీ చేసి తయారు చేయించాడు లాయరు. ఆ సర్పంచ్ ప్రస్తుతం పరలోకంలో వున్నాడు గనుక అది ఫోర్జరీ అని చెప్పేవాడే వుండడు.
కేస్ జరుగుతూండగా అతను పోలీస్ కమీషనర్ యింటికెళ్ళాడు.
"సార్! ఆ స్థలం ఎట్లయినాగాని మాకే వస్తుంది! నువ్ సాయం జేసినావంటే నీకే నువ్ జెప్పిన రేటునిస్తా" అన్నాడు.
కమీషనర్ ఆశ పడ్డాడు.
తను రంగంలోకి దిగి ఆ స్థలం వాళ్ళకే వచ్చేట్లు సహాయం చేశాడు.
దాంతో ఆ స్థలం కమీషనర్ కే అమ్మి యాభయ్ వేలు సంపాదించుకోవటమే కాకుండా పోలీస్ డిపార్ట్ మెంటులో పరపతి సంపాదించుకున్నాడతను.
ఆ తరువాత యాభై వేల పెట్టుబడితో గవర్నమెంటు స్థలాలు ఆక్రమించుకుని రాత్రికి రాత్రి గుడిశెలు వేయటం, తెల్లారేసరికి ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్, రాజీవ్ గాంధీనగర్ అన్న బోర్డులు నిలబెట్టటం, ఆ స్థలంలో వాళ్ళు యాభై ఏళ్ళనుంచీ వున్తున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించటం, ఆ స్థలాల్లో కమర్షియల్ గా విలువ వున్న వాటిని ఎమ్మెల్లేలకు, ఎంపిలకూ, మంత్రులకూ కారుచవగ్గా అమ్మేయటం.... ఆ తర్వాత నెమ్మదిగా రిజిస్ట్రారాఫీస్ సిబ్బందికి లంచాలు యిచ్చి, దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించి ఆ స్థలాలను ఎక్కువ రేట్లకు అమ్మేయడం లాంటి కార్యక్రమాలు ప్రారంభించాడు.
దాంతో అతనికి రాజకీయ వర్గాల్లో పలుకుబడి, ఆశీస్సులు లభించాయి. గుడిశెనుంచి పెద్ద భవంతిలోకి మారాడతను. ఆ సమయంలోనే కారు కూడా కొన్నాడు.
కారు యింటికి తీసుకొచ్చినప్పుడు కూడా అతను సైకిల్ ని మర్చిపోలేదు. తను మొదటిసారి కొన్న చెప్పుల్నీ మర్చిపోలేదు.
ఆ మూడింటినీ వరుసగా వుంచి వాటి కెదురుగ్గా డాన్స్ చేశాడు అలసిపోయేవరకూ.
ఇప్పుడు అతను కోరుకున్నట్లే గూండాలు చాలామంది అతని ముందుకి పొద్దున్నే వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు.
తను బయటికొచ్చి వాళ్ళు ఆ రోజు ఏయే స్థలాలు ఆక్రమించుకోవలసింది ఆదేశాలిస్తాడు. ఆ గూండాలందరిలో శంకర్ దాదా అతనికి చాలా ప్రియమైనవాడు.
ఎందుకంటే శంకర్ దాదా వెనుక కొన్ని వందలమంది బీదాబిక్కీ వున్నారు. వాళ్ళందరూ తనకు మొదటినుంచీ ఎన్నో రకాలుగా వుపయోగపడుతున్నారు. తనకు మామూలు యివ్వడానికి నిరాకరించిన రాజశేఖరం తండ్రి తాలూకు ఎస్టేట్స్ లో ఓ ముఖ్యమయిన స్థలాన్ని వాళ్ళకోసం ఆక్రమించి వారితో గుడిశెలు వేయించాడు.