వాళ్ళిద్దరి మధ్యా తను చొరబడటం తన ప్రాణానికే అపాయం అనిపించింది. వెంటనే తను దుప్పటి తీసుకుని వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు.
తను వెనక్కు తిరగటం చూసి అతను చప్పున వచ్చి చేతులు పట్టుకున్నాడు.
"ఇదిగో! లక్ష్మీనారాయణ నీ కెంతిచ్చాడో నాకు తెలీదు. కానీ నువ్ నా తరపునుంటే నేను నీకు అయిదువేలిస్తాను. ఈ స్థలం మాత్రం అతనికి దక్కటానికి వీల్లేదు- ఏమంటావ్?"
మల్లేష్ కి మతిపోయింది.
"అయిదువేలా?" నమ్మకం చాలక అడిగాడు.
"పోనీ ఆరువేలు తీసుకో."
మల్లేష్ కి నోటమాట రావటం లేదు.
"సరే" అన్నాడు భయంగా.
అప్పటికప్పుడే జేబులోనుంచి అయిదువేల రూపాయలు కట్ట తీసిచ్చాడతను.
"మిగతా డబ్బు తర్వాత"
"అట్లనే సార్."
అతను వెళ్ళిపోయాడు.
ఆ డబ్బు చూస్తుంటే అతనికి రంగుల ప్రపంచం కళ్ళముందు తిరుగుతోంది.
తన జన్మలో వందనోటే చూడలేదు.
ఆ డబ్బు తీసుకుని తిన్నగా మార్కెట్ కెళ్ళాడతను.
తన చిన్నప్పటినుంచీ కోరిక! కాళ్ళకు చెప్పులు కొనుక్కోవాలని! సైకిల్ మీద తిరగాలని!
అదింత కాలానికి తీరింది.
చెప్పులు వేసుకుని సైకిల్స్ అమ్మే షాప్ కెళ్ళి సైకిల్ కొన్నాడతను.
సైకిల్ ని తన గుడిశెకు తీసుకెళ్ళి దాని ముందు స్టాండ్ వేసి, దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆనందంగా తనకొచ్చిన పిచ్చి డాన్స్ చేయసాగాడతను.
ఆ డాన్స్ లో అతనికి కార్లు కనబడుతున్నాయి, విమానాలు కనబడుతున్నాయి, అందమయిన భవనాలు కనబడుతున్నాయి, మెడనిండుగా దండలు వేసి తనను వూరేగిస్తున్న చిల్లరజనం కనబడుతున్నారు.
డాన్స్ చేసి చేసి అలసిపోయి సైకిల్ ముందే కూర్చుని దాని ఫ్రేమ్ ని ముద్దు పెట్టుకున్నాడు.
ఇది తన ప్రారంభం! ఈ ప్రారంభానికి చిహ్నం ఈ సైకిల్!
సైకిల్ మీద వెళ్ళి గుడిశెలు సైక్లోన్ లో కొట్టుకుపోయిన మరో నలుగురిని తనతో తీసుకొచ్చాడు.
"మీరు కూడా ఈడ గుడిశెలేసుకుంటే దానికయ్యే పైసలు నేనిస్తా!" అన్నాడతను.
"ఈ జాగా మనది కాదుగదా?" అనుమానంగా అన్నారు వాళ్ళు.
"అదంతా నీకెందుకు తంబీ! నేను జూస్కుంట గదా."
సాయంత్రానికి గుడిశెలు వేసేశారు వాళ్ళు.
మర్నాడు లక్ష్మీనారాయణ వచ్చాడు.
"ఈ జాగా నాది! ఎవళ్నడిగి గుడిశెలేసిన్రు?" అడిగాడతను.
"ఈ జాగా మాది" అన్నాడు మల్లేష్.
"నాకు తెలుసులే! ఆ రామ్మూర్తిగాడు చేస్తున్న కిరికిరి యిదంతా! నేను పోలీస్ కంప్లెయింటిస్తా" అంటూ వెళ్ళిపోయాడు.