రాజకీయనాయకుల దగ్గర డబ్బు తీసుకుని సభలకు జనాన్ని తీసుకురావటం, ఆందోళనలు చేయించడం, బస్సులు తగలబెట్టించడం, రైలుపడగొట్టటం, షాపులు, ఇళ్ళు తగలెట్టించడం, లూఠీలు చేయడం.
వీటిల్లో ఎక్కువ లాభం కనిపించసాగిందతనికి. ముఖ్యంగా రోజూ ఛోటా రాజకీయనాయకులు, పోలీసు అధికారులు వచ్చి తన ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు.
ఆ రోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా అందమయిన షామియానాలతో నిండిపోయింది.
ఆ రోజు భాగ్యనగర్ అనాధాశ్రమం తాలూకు వార్షికోత్సవం జరుగుతోందక్కడ. ఆ సభకు ముఖ్య అతిధి సభకు అధ్యక్షుడు నగరానికి చెందిన కేంద్రమంత్రి- గవర్నరు సతీమణికి ఆమె అనాధలకు చేసిన సేవలకు గాను సన్మానం. సన్మానం చేసేది అపోజిషన్ లీడరు- ఇవి ఆకర్షణలు.
మామూలుగా మల్లేష్ ఏర్పాటు చేసిన జనంతో మైదానమంతా నిండిపోయింది.
అతిధులంతా వచ్చేశారు.
ముందు వరుసలో కూర్చున్న అనాధలను న్యూస్ పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తుంటే ఒక రిపోర్టర్ కి అనుమానం వచ్చి పక్కనే వున్న పోలీస్ అధికారులను అడిగాడు.
"డెకాయిట్స్ కాదు. వీళ్ళలో మెజారిటీ మా లిస్ట్ లో వున్న రౌడీషీటర్లే- ప్రతి వాడికి ఎన్నో నేరాలతో ప్రత్యక్ష సంబంధం వుంది."
"మరి వీళ్ళు అనాధల యూనిఫారం వేసుకుని, తలకు గాంధీ టోపీలు పెట్టుక్కూచున్నారేమిటి?"
"మల్లేష్ గారి అనాధాశ్రమం ఇంకెలా వుంటుంది మరి? అనాధాశ్రమం అంటే అనాధలుండే ఆశ్రమం అనేది పాత పధ్ధతి"
"అంటే ఇప్పుడెవరుంటారీ అనాధాశ్రమంలో?" అమాయకంగా అడిగాడు రిపోర్టర్.
"ఇప్పుడు ప్రజల మీద దాడులు జరిపి వారిని అనాధలుగా చేసే వారి ఆశ్రమం అని అర్ధం."
"దిసీజ్ టూమచ్! ఈ దారుణాన్ని మనం ఎక్స్ పోజ్ చేయాలి."
"మాదేముంది? దాచినా, బయట పెట్టినా అంతా మీ న్యూస్ పేపరోళ్ళ వ్యవహారమే!"
రిపోర్టర్ చకచక వి.అయ్.పి. లు కూర్చున్నచోటకు నడిచి తమ ప్రముఖ దినపత్రిక ఎడిటర్ని కలుసుకున్నాడు.
సంగతంతా చెప్పాడు.
"ఈ అనాధాశ్రమం బోగస్ అనీ, వీళ్ళంతా అనాధలు కాదనీ, గూండాలకూ మర్డర్స్ కీ ఆ డ్రస్ లు వేసి ఇక్కడ కూర్చోబెట్టారని మనం ఫోటోలతో సహా పబ్లిష్ చేస్తే మన పేపర్ పరువు ప్రతిష్ఠలు వెలిగిపోతాయి సార్!" అన్నాడు ఉత్సాహంగా.
ఎడిటర్ అతని వేపు ఓ పిచ్చాడిని చూసినట్లు చూశాడు.
"ఇదిగో రిపోర్టర్! డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఒకటుందని ఊరికే విర్ర వీగిపోకూడదు మనం. డెమోక్రసీ అంటే అసలర్ధం ఏమిటి? 'మెజారిటీ రూల్' అని! ఈ గ్రౌండ్ లో జనం నిండిపోయి వున్నారు. ఈ వేదిక మీద పరిపాలకులు నిండిపోయి వున్నారు. ఇక్కడ మెజారిటీ ఎవరిది? వాళ్ళదా? మన పత్రిక వాళ్ళదా?"