Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 13


    పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతోన్న కొద్దీ చంద్రశేఖర్ దంపతులు మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
    జగన్నానాధ్ సుమతికి అన్న. చాలా మంచివాడు. సుమతి కుమార్ ని చేరదీసినందుకు అతడికి కోపం రాకపోగా, సుమతిని చాలా మెచ్చుకున్నాడు. అన్న అంటే చాలా గౌరవం సుమతికి. వదిన అనూరాధ కూడా చదువుకున్నదే అయినా, ఒక మోస్తరు మనిషి. అన్నగారింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటోంటే, సుమతి వెళ్ళింది. సుమతి వెళ్ళగానే, జగన్నాధ్ కూతురు సరోజ 'అత్తా' అంటూ సుమతిని చుట్టేసుకుంది. సుమతి ఆ పిల్లని ఆప్యాయంగా దగ్గిరగా కూచోబెట్టుకుంది. పేరంటానికి వచ్చిన బంధువుల్లో ఎవరో కావాలని వేళాకోళంగా అనూరాధతో "మీ సరోజని కుమార్ కిచ్చి చెయ్యకూడదమ్మా! ఈడూ, జోడూ, వావీ వరుసా అన్నీ సరిపోతాయి" అంది. అనూరాధ ముఖం ముడుచుకుని "ఆ ముష్టి వెధవకి నా కూతుర్నెందు కిస్తాను?" అనేసింది. ఆ మాటలకు సుమతి చాలా బాధ పడింది.
    "తన కూతుర్నియ్యక్కర్లేదు. అంతమాటనటం దేనికి?'' అని చంద్రశేఖర్ దగ్గిర ఏడ్చింది. "చూద్దాం! రేప్పొద్దున్న ఈ ముష్టి వెధవే ఏ కలెక్టరో, అయినపుడు ఈవిడే సంబంధం కలుపుకుంటూ రాకపోతుందా-అప్పుడు నేను ఆవిడ మాటలు ఆవిడకు అప్పజెప్పక పోతానా" అనుకుంది అచ్చు ఆడదానిలా అక్కసుగా.
    చంద్రశేఖర్ స్నేహితుడు తన కుటుంబంతో చంద్రశేఖర్ ఇంటికి వచ్చాడు. పెద్దవాళ్ళు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలంతా ఆటల్లో పడిపోయారు. స్నేహితుడి కొడుకు మంజులతని కూడా ఆడుకోవటానికి రమ్మన్నాడు. కొత్త కారణంగా "రాను" అంది మంజు. వాడు మంజుకి స్వీట్స్ లంచం పెట్టి మంచి చేసుకుని ఆటల్లోకి తీసుకుపోయాడు. అదిచూసి  చంద్రశేఖరం నవ్వి "నీ కొడుకు మంచి ఖటికుడేనోయ్! కొత్తవాళ్ళంటే భయపడే మా అమ్మాయిని క్షణంలో మంచి చేసుకున్నాడు" అన్నాడు. ఆ స్నేహితుడు తనూ నవ్వి-
    "అయితే ఇకనేం? నీ కూతుర్నిచ్చి పెళ్ళిచెయ్యి" అన్నాడు. ఆ స్నేహితుని భార్య అప్రయత్నంగా "ఛీ?" అని అంతలో నాలుక కరచుకుని "ఇప్పటినుంచి పెళ్ళిమాట లేమిటి?" అని సర్దుకుంది.
    ఈ సంఘటన సుమతి తేలిగ్గా కొట్టిపారెయ్యలేక పోయింది. "ఏవండీ! ముందు ముందు మన మంజుకి పెళ్ళికావటం కష్టమంటారా?" అంది చంద్రశేఖర్ తో ఆందోళనగా. అతడు వేళాకోళంగా "ఏమిటిది?" ఇప్పటినుంచి నీ కూతురి పెళ్ళికోసం బెంగపెట్టుకుంటున్నావా? మరేం ఫరవాలేదులే! నీ కూతుర్ని నలకూబరుడో, వసంతుడో, మన్మధుడో ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు" అని నవ్వెయ్యబోయాడు. కాని, అప్పటినుంచి నిజంగానే సుమతి మంజు పెళ్ళిగురించి ఆరాటపడసాగింది. చంద్రశేఖర్ ఎన్నివిధాలుగా వారించినా మంజు పెళ్ళి గురించి మనసులో రకరకాలుగా ఊహించుకునేది.
    మంజు కొంచెం పెద్దయ్యాక సుమతి ఉద్యోగం మానేస్తానంది. చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు. తమది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరిజీతాలూ వస్తూంటేనే, ఒక మోస్తరుగా గడిచేది. అలాంటిది సుమతి ఉద్యోగం మానేస్తే ఇబ్బంది కాదూ?
    "ఫరవాలేదు. ఎలాగో ఒకలాగ సర్దుకోవచ్చు. ఆఫీస్ లో ఉద్యోగం అంటే ఉదయం పదింటికి పోతే, సాయంత్రం అయిదింటికి కాని రావటానికి వీలుపడదు. ఆడపిల్లని ఇంట్లో వదలి ఉద్యోగం చెయ్యాలని లేదు" అంది చంద్రశేఖర్ ఆశ్చర్యానికి సమాధానంగా. మంజు పెద్దవుతోన్న కొద్దీ సుమతిలో చాదస్తం రోజురోజుకీ ఎక్కువ కాసాగింది.
    ఒక రోజు సుబ్బులు తల్లి చంద్రశేఖరం ఇంటికి వచ్చింది వెతుక్కుంటూ. కుమార్ ని కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తూ "నా మనవడా?" అంది సంబరంగా.
    "ఛా!" అన్నాడు కుమార్ కంపరంగా. అది ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ సంగతి తెలుసుకున్న చంద్రశేఖర్ కుమార్ ని దగ్గిర కూచోబెట్టుకుని జరిగిన సంగతులన్నీ వివరించాడు. తల్లి చచ్చిపోయే నాటికి కుమార్ జ్ఞానం లేని పసివాడు కాదు. అతనికి అన్ని సంగతులూ గుర్తువచ్చాయి. బాధపడుతున్న కుమార్ ని బుజ్జగిస్తూ "కుమార్! నువ్వు నన్ను అర్ధం చేసుకోగలవనే ఈ విషయాలన్నీ చెప్పాను. నువ్వు ఎప్పటికీ నా కొడుకువే! కానీ, నువ్వు మీ మామ్మని అలా చీదరించుకోవటం నా కిష్టంలేదు. మీ అమ్మకోసమూ, మిగిలిన నీవాళ్ళకోసమూ, నువ్వు ఏ కొంచెం చెయ్యగలిగినా, అది నీ జన్మకు సార్ధక్యమే! అప్పుడే నా కొడుకుగా నిన్ను తలుచుకుని మరింత గర్వించ గలను" అన్నాడు. ఆనాటి నుండి సుబ్బులు తల్లి వచ్చినపుడు చీదరించుకోవటం మానేశాడు.  
    అభిమానంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. పెరిగి పెద్దవాడయి పరిస్థితులను అర్ధం చేసుకుంటున్న కొద్దీ తన తలిదండ్రులిద్దరూ దైవ స్వరూపుల్లాగే తోచసాగారు కుమార్ కి.
    మంజుని తీసుకుని కుమార్ వచ్చాడు, కొన్ని సంవత్సరాలుగా దూరమయినట్లు "మంజూ!" అని దగ్గరకు తీసుకుంది సుమతి.
    "అబ్బ! ఏమిటమ్మా! ఇవాళ కాలేజీలో ఫంక్షన్ ఉంది. కొంచెం ఆలస్యమయిం దంతే!" ముద్దుగా విసుక్కుని తల్లిచేతులు విడిపించుకుంది మంజు.


                                      7


    మంజుకి నవలలంటే చాలా ఇష్టం. కానీ సుమతి మంజుని నవలలు చదవనిచ్చేదికాదు. "ఇప్పుడు క్లాస్ బుక్స్ చదువుకో! నవలలు చదవటానికి ముందు ముందు చాలా రోజులున్నాయి." అని మందలించేది_సుమతి ఏనాడు గట్టిగా అదలించకపోయినా మంజుకి తల్లిని ఎదిరించటానికి చాలా భయం....మంజూ లతా ఇద్దరూ క్లాస్ మేట్స్ - స్నేహితులు. రవి సహాయంతో మురళి పాన్ దుకాణాలమీద పుస్తకాలు అద్దెకిచ్చేవాళ్ళ దగ్గిర నుంచి 'మిల్స్ అండ్ బూన్స్' కంపెనీ వాళ్ళ "రొమాన్సు"లు చాలా సంపాదించేవాడు-అవి అప్పుడప్పుడు లత కూడా చదివేది-మంజు ఆ పుస్తకాలు తనకు కావాలని అడిగింది.

 Previous Page Next Page