Previous Page Next Page 
జయ - విజయ పేజి 14


    "ఈ ఇంట్లో విజయ అనే ఆవిడ వున్నారా?" అడిగాడతను విజయనుద్దేశించి.
    విజయ నిరుత్సాహపడింది.
    అతను తననే విజయగా ఎందుకు భావించలేదు. తనే విజయయి ఉంటుందేమోనన్న అనుమానం అతనికెందుకు కలగలేదు?
    అంటే అతని మనసులో ఏర్పరచుకున్న తన ఊహా రూపం ఎంత ఉన్నతంగా ఉందో అర్థమైపోయింది. తను ఎంతో సౌందర్యవతిగా అంచనా వేసుకున్నాడతను. అందుకే ఒకవేళ తనే విజయ అయి ఉండవచ్చునన్న అనుమానం కూడా కలగడంలేదతనిలో. ఈ పరిస్థితిలో తనే విజయనన్న నిజం అతనికి తెలిస్తే అతని ఊహలకు ఎంత భంగపాటు కలుగుతుందో తనూహించుకోగలదు. తను అందవిహీనురాలన్న విషయం అతనికి ఎంత నిరుత్సాహం కలిగిస్తుందో తనకు తెలుసు. అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదనే అతనికి తన ఫోటో కూడా పంపించలేదు.
    "విజయ ఇంట్లో లేదండీ! ఇప్పుడే అలా వాళ్ళ ఫ్రెండు ఇంటికెళ్ళింది. మీరెవరు?" ఏమీ తెలీనట్లు ఠక్కున అబద్ధమాడేసింది విజయ!
    "నా పేరు చంద్రకాంత్! నేనూ, విజయగారూ కలం స్నేహితులం లెండి. అనుకోకుండా ఆఫీస్ పనిమీద ఇక్కడికొచ్చాను. ఆమెను కలుసుకుని కాసేపు మాట్లాడాలని ఎంతో ఆశపడ్డాను. తీరా చూస్తే ఇంట్లో లేరు. నేనేమో సాయంత్రం వెళ్ళిపోవాలి! ఇంతకూ మీరు విజయగారికేమవుతారు?"
    "ఓహో! మీరేనన్న మాట చంద్రకాంత్ గారు! విజయ మా అక్కలెండి! నా పేరు జయ! మీ రచనలంటే మాకందరికీ చాలా ఇష్టం!"
    "థాంక్యూ! చాలాసార్లు మీ గురించి కూడా రాశారు ఆమె."
    "రండి కూర్చోండి!" అతనిని లోపలకు ఆహ్వానిస్తూ అందామె.
    "వద్దులెండి! నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళేముందు ఓసారి వచ్చి విజయగారిని కలుసుకుంటాను" అక్కడే నిలబడి అన్నాడతను.
    "ఆగండాగండి! రాక రాక మీరు మా యింటికొస్తే అలా బయటనుంచే పంపించామన్న విషయం విందంటే మా విజయ నన్ను నానా మాటలూ అంటుంది. అందుకని దయచేసి కొద్దిసేపు కూర్చోండి! ప్లీజ్!" మిలమిలలాడుతున్న ఆమె కళ్ళు చూసేసరికి అతనికి కాదనాలనిపించలేదు.
    లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు చంద్రకాంత్.
    విజయ వెంటనే వంటింట్లోకి పరుగెత్తింది హడావుడిగా.
    "అమ్మా! చంద్రకాంత్ గారొచ్చారు" అంది ఆనందం అణుచుకోడానికి వృధా ప్రయత్నం చేస్తూ.
    "ఎవరతను?"
    "అదేనమ్మా! నేను ఉత్తరాలు రాస్తూంటానే? ఆ రచయిత!"
    "ఓహో! ఆయనా!"
    "అవునమ్మా. నువ్వోసారి వస్తే ఆయనను నీకు పరిచయం చేస్తాను."
    "నాకా? నాకెందుకే?"
    "ఊరికే! 'మీ అమ్మగారేరి?' అంటూ ఆయనడిగాకయినా పరిచయం చేసుకోక తప్పదు కదా!" నవ్వుతూ అంది విజయ.
    "సరే! పద!" బయటకు రాబోయింది పార్వతి.
    "ఆగాగు!" ఖంగారుగా ఆమెకు అడ్డంవచ్చి ఆపేసింది విజయ.
    "ఏమిటి?" విస్తుపోతూ అడిగింది పార్వతి.
    "వచ్చేముందు నీకో చిన్న రహస్యం చెప్పాలి!"
    "ఏమిటే అది?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "ఆయన ఇందాక బయటినుంచీ 'విజయగారున్నారా' అనడిగితే 'లేరని' అబద్ధం చెప్పేశాను."
    "అదేమిటి? ఎందుకలా అబద్ధం చెప్పడం?" అర్థంకాక అడిగిందామె.
    "నా అవతారం ఏమన్నా బావుందా? నేనే విజయనంటూ చెప్పేస్తే ఆయన 'ఓరి ఈ జిడ్డావతారమా' అంటూ అసహ్యించుకోరూ! అందుకని నేను జయననీ, విజయ వాళ్ళ ఫ్రెండింటి కెళ్ళిందని అబద్ధం చెప్పేశాను! నువ్వు కూడా నేను జయనన్నట్లే మాట్లాడు." విజయ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంది పార్వతి.
    తను నల్లగా ఉండటం వల్ల తనను అందరూ చిన్నచూపు చూస్తారని ఆమె భయం! లోలోపల ఆమె దేవుడు తనకిచ్చిన ఆ రూపానికి ఎంత బాధ పడుతుందోనని పార్వతి అప్పుడప్పుడు బాధపడుతూండేది. ఆమెకు ఈ కారణంగానే తన కన్నకూతురు జయకంటే కూడా విజయ మీద మమకారం ఎక్కువగా వుండేది.
    "అలా అబద్ధాలు చెప్పడం మంచిది కాదు!" అయిష్టంగా అంది పార్వతి.
    "ఫర్వాలేదులే అమ్మా! మనం అబద్ధం చెప్పినట్లు ఆయనకు తెలిసే అవకాశం లేదుగా. కాసేపు కూర్చుని ఆయన్దారిన ఆయన వెళ్ళిపోతారు." నచ్చజెప్తూ అంది విజయ.
    "ఏమో! అన్నీ తెలివితక్కువ పనులే చేస్తావ్!" విసుక్కుంటూ ఆమెతోపాటు హాల్లోకొచ్చింది పార్వతి.
    "ఈవిడ మా అమ్మగారండీ!" పార్వతిని అతనికి పరిచయం చేస్తూ అంది విజయ.
    "నమస్కారమండీ!" లేచి నిలబడి వినయంగా నమస్కరిస్తూ అన్నాడతను.
    "నమస్తే బాబూ!" ప్రతి నమస్కారం చేసింది పార్వతి.
    "కూర్చోండి మీరు! అంది ఆదరంగా. అతను మళ్ళీ కూర్చున్నాడు.

 Previous Page Next Page