"ఇప్పుడు ఫర్వాలేదండీ!"
"అదే ఆ మధ్య జయ తనకు ఉద్యోగం చూడమని అడిగింది. చాలా ప్రయత్నాలు చేశాను గానీ మన ఊళ్ళో ఎక్కడా అవకాశం కనబడడం లేదు. అయితే నాకు తెలిసిన ఓ కంపెనీ మేనేజర్ నిన్నే కనిపించాడు. హైద్రాబాద్ లోని వాళ్ళ కంపెనీ బ్రాంచ్ లో ఒక క్లర్క్ ఉద్యోగం ఖాళీ ఉందట. మనకు అంగీకారమైతే ఆ ఉద్యోగం ఇప్పించగలనన్నాడు." సందేహంగా జయ వంక చూస్తూ అన్నాడతను.
"ఫరవాలేదండీ! ఎక్కడయినా సరే. ఉద్యోగం దొరికితే చాలు. వెళ్ళిపోతాను..." ఆనందంగా అంది జయ.
"నీకు మతిపోలేదు కదా! హైద్రాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తావా?" మందలింపుగా అంది పార్వతి.
"ఏం! తప్పేముందని!" చిరు కోపంతో అంది జయ.
"ముక్కూ మొఖం తెలీనిచోటకెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేమిటి? అక్కడ ఎవరిదగ్గరుంటావ్? నిన్నెవరు చూస్తారు?"
"అబ్బ! నీకేమీ తెలీదమ్మా! అంత పెద్ద సిటీలో ఉండటానికే చోటుండదనుకున్నావా. వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ అనీ, ఉద్యోగాలు చేసే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఉన్నాయట! మా ఫ్రెండ్ వసుంధర వాళ్ళక్కయ్య అలా హాస్టల్లో ఉండి నిక్షేపంగా ఉద్యోగం చేసుకోవడం లేదూ?"
అంతవరకూ మౌనంగా ఉండిపోయిన విజయ కూడా కలుగజేసుకోక తప్పలేదు.
"అవునమ్మా! అందులో నష్టమేమీలేదు. పోనీ కొన్నాళ్ళు దానిని సిటీలో ఉద్యోగం చేయనీ! ఒకవేళ నీకిష్టం లేకపోతే అప్పుడే మానిపించేయవచ్చు!"
విజయ కూడా అలా అనడంతో పార్వతి ఇక మాట్లాడలేకపోయింది. అయితే ఆమెకు జయను అలా సిటీలో ఒంటరిగా వదిలేయడం మాత్రం నచ్చటంలేదు.
"ఏమో! మీ ఇష్టం! అయినా శుభ్రంగా చదువు పూర్తిచేయక ఎందుకొచ్చిన గొడవిది?" అంది తన అసమ్మతి తెలుపుతూ.
"పోనీలేమ్మా! అంతగా నీకిష్టం లేకపోతే పంపవద్దులే! మరికొద్దిరోజులు ఓపిక పడితే ఇక్కడే ఏదొక ఉద్యోగం చూడవచ్చు." సర్దిచెప్తూ అన్నాడు నరహరి.
"ఊహు! వద్దండీ! అనుకోకుండా వచ్చిన అవకాశం వదులుకోవడం? కనీసం మరో ఉద్యోగం వచ్చేవరకయినా అక్కడ చేస్తాను. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నావల్ల కాదు." మొండిగా అంది జయ.
పార్వతి మాట్లాడలేదు.
నరహరి వెళ్ళిపోవడానికి సంసిద్ధమై లేచి నిలబడ్డాడు.
"నేనింక వెళ్తాను" అన్నాడు విజయతో.
"ఆగండి! కాఫీ తెస్తాను..." హడావుడిగా లోపలకు పరుగెత్తింది విజయ.
"వద్దమ్మా" అంటూ అతను వారించినా వినిపించుకోలేదు.
"ఫర్వాలేదు కూర్చోండి! కాఫీ కూడా తాగకుండా ఎలా వెళ్తారు?" తనూ బలవంతం చేస్తూ అంది పార్వతి.
ఈలోగా విజయ కాఫీ కప్పుతో రానే వచ్చింది.
"అయితే మరి ఎప్పుడు బయల్దేరాలనుకుంటున్నావక్కడికి?" జయను అడిగాడు నరహరి.
"వారం రోజుల్లో వెళ్ళిపోతాను! ఈలోగా వసుంధర వాళ్ళక్కయ్యకు ఉత్తరం కూడా రాసెయ్యొచ్చు! ఏమంటావమ్మా?" తల్లినడిగింది.
"నీఇష్టం! నేను చెప్తే వింటావా ఏమన్నానా" లోలోపలే గొణుక్కుంటున్నట్లు అంది పార్వతి.
"సరే! వెళ్ళేప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన లెటర్ తీసుకువెళ్దువుగాని!" చెప్పేసి తను అక్కడినుంచి బయలుదేరాడు నరహరి.
అతను వెళ్ళిన తరువాత చాలాసేపటివరకూ జయ వెళ్ళే విషయంపై తర్జన భర్జనలు జరుగుతూనే వున్నాయి.
"నేను వసుంధర ఇంటికెళ్ళి వస్తానమ్మా! ఇవాళే వాళ్ళక్కయ్యకి ఉత్తరం రాయించేస్తాను. నన్ను స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకోమంటే సరి! ఇంక సమస్యే వుండదు."
"వెళ్ళిరా! వాళ్ళక్కయ్య నుంచి జవాబు వస్తేనేగాని నువ్వు బయల్దేరడానికి వీలుండదు!" చెప్పింది విజయ.
జయ అప్పటికప్పుడే రడీ అయి వసుంధర యింటికి బయలుదేరింది. ఆమె వెళ్ళిన గంటసేపటికి ఇంటిముందు రిక్షా ఆగడం, అందులోనుంచి ఓ యువకుడు చేతిలో ఓ బాగ్ తో సహా దిగి లోపలకు రావడం కనిపించింది విజయకు.
అతనిని కొద్దిక్షణాలు పరిశీలనగా చూసేసరికి గుర్తుపట్టగలిగిందామె.
ఫోటోకి, నిజ రూపానికీ పెద్దగా తేడా ఏమీలేదు.
అతను చంద్రకాంత్!
ఆమె హృదయం ఆనందంతో ఎగసిపడసాగింది. ఇంత హఠాత్తుగా అతను వస్తాడని గానీ, అతనిని చూస్తుందని గానీ తనెప్పుడూ ఊహించలేదు.
ఇంతకాలం ఉత్తరాల్లో అతి సన్నిహితులైన తామిద్దరూ ప్రప్రధమంగా తారసపడ్డారు. ఎవరెవరో తెలీకుండానే ఎంతో ఆత్మీయత పెంచుకున్న స్నేహమిది.
నిజంగా ఎంతటి మధురమైన క్షణాలివి!
అతను తనవంకే చూస్తూ గడప దగ్గరకొచ్చి నిలబడిపోయాడు.
అబ్బ! జీవితం ఇలా_ఇక్కడే_ఒకరినొకరు వీక్షించుకుంటూండగానే అంతమైపోతే ఎంత బావుంటుంది.