"మీరు ఎంతో మంచివారనీ, మీలాంటి అమ్మ దొరకడం ఎంతో అదృష్టమనీ ఉత్తరాల్లో రాస్తుంటుందండి మీ విజయ." నవ్వుతూ అన్నాడతను. పార్వతి నవ్వింది మౌనంగా.
తనుకూడా విజయ ఆడుతున్న నాటకంలో భాగం పంచుకోవడం నచ్చటంలేదామెకి.
"నేను అనుకోకుండా ఆఫీస్ పనిమీద వచ్చానండీ! విజయగారిని కలుసుకోవచ్చని ఎంతో ఆశపడ్డాను. మరి ఆ అవకాశం దొరుకుతుందో లేదో!"
"మీరెలాగూ సాయంత్రం వస్తానన్నారు కదా! అప్పుడు తప్పక కలుసుకోవచ్చు లెండి!" తను కల్పించుకుంటూ అంది విజయ.
"ఏమో! నాకు సాయంత్రం వీలవుతుందో లేదో?" సందేహంగా అన్నాడతను.
"ఆయనకు కాఫీ తెచ్చివ్వు!" లోపలకు నడుస్తూ అంది పార్వతి.
ఆమెతోపాటు విజయ కూడా లోపలికొచ్చేసింది.
త్వరత్వరగా కాఫీ తయారుచేసి విజయకిచ్చి పంపిందామె.
"మీరు బియస్సీ చదువుతున్నారు కదూ?" కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడతను.
"చదివేదాన్ని!" నవ్వుతూ అంది విజయ.
"అంటే ఇప్పుడు చదవడం లేదా?"
"ఊహు! మానేశాను."
"ఎందుకని?"
"ఉద్యోగం చేయాలనిపించింది."
అతను గట్టిగా నవ్వేశాడు.
"ఉద్యోగము అంత తేలిగ్గా దొరుకుతుందా?"
"ఏమో! ప్రయత్నిస్తాను!"
"మీకూ కథలూ, కాకరకాయలూ అంటే ఇష్టమేనా!"
"ఓ! అయితే మరీ మా విజయ అంత పిచ్చి లేదు!"
"బావుంది. మీ విజయగారికేమో అంత మోజు! మీకేమో ఇలా. తమాషాగా లేదు!"
"అవును!" నవ్వుతూ తలూపింది విజయ.
అతనికి ఆమెతో మాట్లాడడం సరదాగానే వుంది. అతనిక్కడికి వచ్చేముందు విజయతో ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అని బోలెడు రిహార్సల్స్ వేసుకుంటూ వచ్చాడు. తీరా వచ్చేసరికి ఆమె చెల్లెలితో మాట్లాడుతూ కూర్చోవాల్సి వచ్చింది.
"మరి నే వెళతానండీ!" లేచి నిలబడుతూ అన్నాడతను.
"అయ్యో! మా సిస్టర్ ని కలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు" సానుభూతిగా అంది విజయ.
నిజానికి అతను మళ్ళీ వస్తానంటాడేమోనని ఓ మూల భయంగానే వుంది ఆమెకి.
"బాడ్ లక్! ఏం చేయను? మరోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుసుకుంటాన్లెండి. అదీగాక చెప్పాను కదా! వీలయితే బస్సెక్కేలోగా సాయంత్రం ఓసారి వస్తాను" విజయ గుండెల్లో రాయి పడింది.
ఒకవేళ అతను నిజంగానే సాయంత్రం వస్తే తనేం చేయాలి? అప్పుడెలా తప్పించుకోవాలి?
"విజయ రాలేదు. అక్కడే వుండిపోయింది. బహుశా ఆమె స్నేహితురాలితో సినిమాకెళ్ళి వుంటుంది" అని అబద్ధం చెప్పేస్తే సరి!
అతను తన ప్రాణ స్నేహితుడు. అలాంటి స్నేహితుడికి అబద్ధాలు చెప్పడం యెంత బాధ కలిగిస్తోందో తనకు తెలుసు.
అయినా గాని తను చేయగలిగిందేమీ లేదు! అనాలోచితంగా యిరుక్కుపోయిందీ చిక్కులో!
ఇలాంటి చిక్కులనేకం అయినా భరించగలదుగానీ అతను తన రూపం చూసి నిరుత్సాహపడటం మాత్రం తను భరించలేదు.
తెల్లగా రాజకుమారుడిలా అతనుంటే అతని ప్రాణ స్నేహితురాలు నల్లగా, కాకిలా కనబడడం ఏం సబబు?
"మీ అమ్మగారితో కూడా చెప్పండి! మీరు చూపే ఆదరణకు చాలా థాంక్స్. నమస్తే." నమస్కరించి బయటకు నడిచాడతను. అతను వెళ్ళిపోతుంటే విజయ ముఖం విలవిలలాడింది.
అతను యెదురుగ్గా వున్నంతసేపూ తను అదేదో వూహా లోకంలో విహరిస్తున్నట్లు ఫీలయి ఇప్పుడు ఆ స్వర్గాన్ని యెవరో తన యెదుట నుంచి అపహరిస్తున్నట్లు అనిపిస్తోంది.
చాలాసేపు అలా గడపలోనే నిలబడిపోయి ఆయన గురించిన ఆలోచనల్లోనే మునిగిపోయిందామె.
అతని రూపం, అతని మాటలు అన్నీ తన హృదయాన్ని బలంగా తాకినయ్. అతనికి అబద్ధం చెప్పినందుకు ఓ పక్క, అతనిని కలుసుకుని కూడా తనివితీరా మాట్లాడుకునే అవకాశం దూరమయినందుకు మరోపక్క బాధగా ఉంది.
ఒకవేళ తను అబద్ధం చెప్పి తప్పు చేయలేదు కదా?
తనే విజయనని చెప్పినా అతను అదే ఆత్మీయతతో పలుకరించేవాడేమో? అతను అందానికి, రూపానికీ ప్రాముఖ్యత ఇచ్చే మనిషి కాదేమో?
ఛీ! తను అలా తొందరపడి అలా ఆలోచన లేకుండా ప్రవర్తించడం అవివేకమే!
ఏదేమయినా ఇప్పుడింక ఏం ఆలోచించి ఏం లాభం.
ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది.