Previous Page Next Page 
8 డౌన్ పేజి 13

    "ఏమిటా స్పీడ్? డ్రయివర్ నిద్రపోతున్నాడా?"    
    అప్పుడప్పుడూ అలాంటిసంఘటనలు జరుగుతూనే వుంటాయ్. ఒకసారి ఒక గూడ్స్ ట్రెయిన్ డ్రైవర్, అతని అసిస్టెంట్ ఇద్దరూ నిద్రపోయారు. బండి శరవేగంతో వెళ్ళిపోతోంది. స్టేషన్ మాస్టర్ తో 'ఆల్ రైట్ సిగ్నల్' ఎక్సేంజ్ చేయకపోవడంతో డ్రైవర్ పరిస్థితి మీద అనుమానం వచ్చింది. పక్క స్టేషన్లో సిగ్నల్స్ డేంజర్ లో వుంచిబండిని ఆపటానికి ప్రయత్నించారు కానీ అక్కడ కూడా అది ఆగకుండా వెళ్ళేసరికి డ్రైవర్ నిద్రపోతున్నాడన్న విషయం అర్ధమయింది. ఆ తర్వాత స్టేషనులో డెటనేటర్స్ పేల్చటంద్వారా డ్రైవర్ని నిద్రలేపాల్సి వచ్చింది.    
    అతను ఫ్లాట్ ఫారం నుంచి కిందకు దిగి మెయిన్ లైను సమీపంగా పరుగెత్తాడు. అతను అక్కడకు చేరుకునేసరికే బండి శరవేగంతో స్టేషన్ దాటేసింది.    
    అతను చూస్తూండగానే స్టార్టర్ సిగ్నల్ 'ఆన్'లో దాటి బ్లాక్ సెక్షన్ లో ప్రవేశించింది.    
    చంద్రశేఖర్ వళ్ళు గగుర్పొడిచింది.    
    ఆ బ్లాక్ సెక్షనులో గూడ్స్ ట్రెయిన్ వుంది.    
    8 డౌన్ ఇదే స్పీడుతో వెళితే ఆ గూడ్స్ ట్రెయిన్ ని మరో అయిదారు నిముషాల్లో వెనుకనుంచి గుద్దుతుంది.    
    అతనికి చెమటలుపట్టేసినాయ్.    
    పరుగుతో స్టేషనులోకి చేరుకుని చెరువుమాధవరం స్టేషన్ ని బ్లాక్ బెల్ మీద గాభరాగా పిలవసాగాడు.    
    చెరువుమాధవరం ఏ ఎస్సెమ్ ప్రభాకర్ చిరాగ్గా బెల్ బీట్స్ కొట్టి ఫోన్ లో కొచ్చాడు.    
    "ఏమిటా బెల్ మోత? ఫోన్ మీద కొచ్చేవరకూ ఆగలేవా? గూడ్స్ ఇప్పుడేపోయింది. నువ్ తొందరపడినంతమాత్రాన సెక్షన్ క్లియరయిపోదు తెల్సిందా?" అన్నాడు కోపంగా.
    "అదికాదు ప్రభాకర్. కొంప మునిగిపోయింది 8 డౌన్ స్టార్టర్ సిగ్నల్ డేంజర్ లో పాసయి బ్లాక్ సెక్షన్ లోకెళ్ళిపోయాడు. చాలాస్పీడ్ గా వస్తోంది బండి! డ్రైవర్ నిద్రపోయాడేమో అనుకుంటున్నాను-"    
    ప్రభాకర్ అదిరిపడ్డాడు.    
    "మైగాడ్! ఇప్పుడేమిటి చేయటం?" కంగారుగా అడిగాడు.    
    "గూడ్స్ ట్రెయిన్ కి 'త్రూ' వెళ్ళిపోయిందా?"    
    "ఇప్పుడే వెళ్ళింది-"    
    "కమాన్ హరియప్! కొండపల్లి స్టేషన్ కి కూడా చెప్పి, గూడ్స్ కి వెంటనే సిగ్నల్ ఇవ్వమను. అప్పుడు కంట్రోల్ ఫోన్ అందుకున్నాడతను.        
                                                            * * *    
    "తర్వాత స్టేషన్ గంగినేని" అన్నాడు జమదగ్ని అద్దంలోనుంచి బయట లైటు కాంతిలో కనబడుతోన్న స్టేషన్ పేరు చూస్తూ.    
    డాక్టర్ ఫణి సూట్ కేస్ లో ఉంచిన ఏ.కె-47 రైఫిల్ తీసుకుని బులెట్స్ లోడ్ చేశాడు. చంద్రిక తన సూట్ కేస్ లో నుంచి స్టెన్ గన్ తీసుకుంది. అది లోడ్ చేసి సిద్దంగా వుంది.    
    "ఎలాంటి పరిస్థితులలోనూ మన ప్లాన్ విఫలమవకూడదు. మనం ప్రాణత్యాగంచేసయినా సరే, సక్సెస్ చేయాలి" హెచ్చరించాడు ఫణి.    
    "నాకు తెలుసు! అక్రమంగా నిర్భందించినమన గ్రూప్ వాళ్ళనేక మందిని పోలీసుల బారినుంచి కాపాడాలంటే ఈ ప్లాన్ ఎలాగయినా విజయవంతంచేయడం తప్ప గత్యంతరం లేదు" వప్పుకున్నాడు జమదగ్ని.    
    "గుడ్! ఆర్ యూ రడీ చంద్రికా?" అడిగాడు ఫణి.    
    "ఎస్" అంది చంద్రిక.    
    ఫణి లేచి నుంచున్నాడు.    
                                                                    * * *    
    హోమ్ మినిస్టర్ రఘునాథ్ కి హఠాత్తుగా మెలకువవచ్చింది. టైమ్ చూసుకున్నాడతను. తెల్లారుజామున నాలుగు దాటుతోంది. ట్రెయిన్ లేటవటమే మంచిదయింది. అర్ధరాత్రి వెళ్తూంటే వచ్చే శబ్దాలు, దుమ్ము, కుదుపులు- ఇవేమీ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ కోచ్ లో వినిపించవ్. ఏ.సి. ఫస్ట్ క్లాసయితే ఇంకా కంఫర్టబుల్ గా వుండేదిగానీ అది ముందే రాష్ట్రాన్ని సందర్శిస్తోన్న కేంద్రబృందం కోసం రిజర్వ్ అయిపోయింది.    
    హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్ కి కూడా అప్పుడే మెలకువవచ్చినట్లుంది. కళ్ళు తెరచిఓసారి ఎదుటి బెర్తుమీదున్నతని వంకచూసి మళ్ళీ కళ్ళుమూసుకుని పడుకున్నాడు.    
    రఘునాథ్ కి నువ్వు వచ్చింది విజయ్ కుమార్ కి ఇంకా తెలీదు- మరి కాసేపట్లో అతనుహత్య చేయబడుతున్నాడని.    
    ఆ ప్లానంతా చాలా పకడ్బందీగా తనూ, ముఖ్యమంత్రీ కలిసి తయారుచేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ విజయవాడచేరటానికి రెండు స్టేషన్ ల ముందుతను అతనిని నిద్రలేపుతాడు. అతనులేచి బెర్తుమీదే కూర్చుంటాడు. మిగతా ప్రయాణీకులంతా గాఢ నిద్రలో వుంటారు.    
    అప్పుడు తమకు సెక్యూరిటీకోసం తమతో పాటు అదే ఏ.సి. కోచ్ లో ప్రణయంచేస్తున్న పోలీస్ ఇన్ స్పెక్టర్ రత్నాకర్ కర్టెన్ తొలగించుకుని తమ కంపార్ట్ మెంట్ లోకి అడుగుపెడతాడు. అతని చేతిలో తాము విదేశాలనుంచి తెప్పించిన సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ వుంటుంది.    
    ఆ రివాల్వర్ సరిగ్గా హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్ గుండెకు గురిపెట్టిరెండు రౌండ్స్ కాలుస్తాడు. విజయ్ కుమార్ అక్కడికక్కడే చనిపోతాడు. తరువాత ఆ రివాల్వర్ మీద వేలిముద్రలు కర్చీఫ్ తో తుడిచేసి అది తలుపు దగ్గరున్న కిటికీలోనుంచి బయటకు విసిరేస్తాడు ఇన్ స్పెక్టర్. తర్వాత తను ఏమీ తెలీనట్లు కర్టెన్ అవతలవున్న బెర్తుమీద కూర్చుంటాడు.    
    అప్పుడు హోమ్ మినిస్టర్ రఘునాథ్ బిగ్గరగా కేకలువేస్తాడు-    
    "పట్టుకోండి! పట్టుకోండి! చంపేశారు! నక్సలైట్లు చంపేశారు-" అని అరుస్తాడు. చైన్ లాగుతారు అన్ని కోచీల్లోనూ ఎక్కడా వారిజాడ వుండదు. చివరకు ట్రైన్ విజయవాడకు చేరుతుంది. అక్కడ ప్రెస్ వాళ్ళకందరికీ అతనిని నక్సలైట్సే చంపి పారిపోవటం తాము ప్రత్యక్షంగా చూశామని స్టేట్ మెంట్స్ ఇస్తారు! నిజానికి వాళ్ళ టార్గెట్ హోమ్ మినిస్టరనీ, పొరబాటున హోమ్ సెక్రటరీని చంపారనీ ఓ కట్టు కథ పెద్దఎత్తున ప్రచారం చేస్తారు. అంతే! అక్కడితో ఆ కార్యక్రమం ముగిసిపోతుంది. తనకూ, ముఖ్యమంత్రికీ ఆ హోమ్ సెక్రటరీపీడ విరగడయిపోతుంది.    
    ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ రత్నాకర్ తరువాత ఎప్పుడూ పోలీస్ లాకప్ లో గడిపే దొంగ ఒకడిని తీసుకొచ్చివాడే హోమ్ సెక్రటరీని చంపిన నక్సలైట్ అని కేస్ పెట్టి, వాడితో కన్ ఫెస్ చేయించి జైలు శిక్ష వేయిస్తారు.    
    వాడిని పట్టుకున్నందుకుగానూ ఇన్ స్పెక్టర్ రత్నాకర్ కి తను డి.యస్.పి గా ప్రమోషన్ ఇస్తాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ చిల్లర దొంగకూడా ఎక్కువ కాలం జైల్లో వుండాల్సిన అవసరంలేదు. కొద్ది నెలలు జైలుశిక్ష పూర్తవగానే మహాత్మాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఖైదీలందరినీ విడుదలచేసే స్కీమ్ ప్రవేశ పెడతారు. దాంతో వాడు మళ్ళీ బయటికొస్తాడు.    
    ఈ విధంగా తనకూ, ముఖ్యమంత్రికీ పక్కలో బల్లెంలా తయారయిన హోమ్ సెక్రటరీ పీడ విరగడ చేసుకోవటం, అనేకరాజకీయ హత్యలు చేయడం ద్వారా తమపార్టీకి సహాయం చేస్తున్న పోలీస్ ఇన్ స్పెక్టర్ రత్నాకర్ కి డబుల్ ప్రమోషన్ ఇవ్వటం-అన్నీ జరిగిపోతాయి. ఎవరికీ తమ మీద ఎలాంటి అనుమానం వుండదు.    
    రఘునాథ్ బెర్త్ మీదనుంచి లేచికూర్చున్నాడు. ఇంకొక్క స్టేషన్ దాటాలి తమ ప్లాన్ అమలు చేయడానికి.    
    "గుడ్ మానింగ్" అన్నాడు హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్.    
    "గుడ్ మానింగండీ! బాగా నిద్రపట్టిందా?"    
    "ఓ! ఇప్పుడే మెలకువరావటం"    
    "బండి లేటుగా స్టార్టవటం మంచిదయింది" అన్నాడు రఘునాథ్.    
    "అవును! నేనూ అదే అనుకున్నాను-"    
    "రాత్రి ఒకే ఒక్కసారి మెలకువ వచ్చింది! వరంగల్లో ఒకావిడ, ఒకపాప మన పై బెర్తులు తీసుకున్నారు. మన ఇన్ స్పెక్టర్ ఆమె  గురించి వాకబు చేస్తుంటే విన్నాను. గవర్నమెంటు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అట ఆమె".    
    విజయ్ కుమార్ ఉలిక్కిపడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె సంగీత కాదుకదా! తలెత్తిపై బెర్త్ వేపు చూశాడతను.    
    డిమ్ గా వున్న లైట్ కాంతిలో ఆమె ముఖంకనిపించటం లేదు. లేచి చటుక్కున లైట్ స్విచ్ వేశాడతను.    
    ఆమె అప్పుడే కళ్ళుతెరిచి తనవేపుచూసింది. తనను గుర్తిస్తూనే నివ్వెరపోయింది. నిద్రమత్తంతాగాల్లో ఎగిరిపోయిందిద్దరికీ.    
    సంగీతే!    
    వెంటనే లైటార్పి వేసి తన బెర్తు మీద కూర్చున్నాడతను.    
    "మీ వాడింకా లేవలేదనుకుంటానే" అడిగాడు హోం మినిస్టర్ రఘునాథ్.    
    విజయ్ కుమార్ తనపక్కనే పడుకుని గాఢంగా నిద్రపోతూన్న తన ఆరేళ్ళ కొడుకువేపు చూశాడు.    
    "ఊహూ! వాడు లేచేటైం ఏడుగంటలకు"    
    "పాపం! తల్లిలేనివాడు ఎలా పెంచుతున్నారో ఏమో"    
    "అందులో ఏమీ లోపం లేదులెండి. వాడిని చూడ్డానికి ఒక ఆయా, ఒక ఫ్యూన్ - ఇద్దరున్నారు-"    
    "అఫ్ కోర్స్, ఆ మాట నిజమేననుకోండి. ఎలాగయినా తల్లిప్రేమ తల్లి ప్రేమే"    
    విజయ్ కుమార్ మాట్లాడలేదు. తమ మాటలుసంగీత వింటుందేమోననిచిరాకుగా వుందతనికి.    
    సంగీత మనసంతా అల్లకల్లోలంగా తయారయింది. ఇంత అకస్మాత్తుగా విజయ్ కుమార్ ని కలుసుకోగలదని తననుకోలేదు. బహుశా ఇద్దరూ ఏనాటికీ ఎదురుపడే అవకాశం రాదనే అనుకుంది.    
    కానీ అయిదేళ్ళ తర్వాత- ఇవాళ - రైల్లో -    
    అంటే తన కొడుకుకూడా ఇప్పుడు విజయ్ కుమార్ పక్కనే వున్నాడా? ఆమెనువాడిని చూడాలన్న ఆత్రుత ఊగించి వేస్తోంది వాడికి సంవత్సరం వయసున్నప్పుడు దూరమయింది తను.    
    ఇప్పుడెలా వున్నాడు? ఎంత పెద్దయి వుంటాడు? నెమ్మదిగా తలతిప్పి విజయ్ కుమార్ కూర్చున్న బెర్తువేపు చూసిందామె. రగ్గు కప్పుకుని పడుకున్నాడు వాడు. మొఖం కనిపించటంలేదు. అవతలివేపు తిరిగిపడుకున్నాడు. ఉంగరాలు తిరిగిన జుట్టు- అంటే తన జుట్టే - చిన్నప్పుడు తనజుట్టు అచ్చం అలాగే వుండేది.

 Previous Page Next Page