"నా పేరు ఈశ్వర్రావు. మాలిని పబ్లిషింగ్ కంపెనీ ప్రోపయిటర్ని."
అతనికి తనతో పనేమిటో అర్ధం కాలేదు సీతకి.
"రండి. కూర్చోండి" అంది ఆహ్వానిస్తూ.
అతను లోపలకు నడిచి సోఫాలో కూర్చున్నాడు. ఒకవేళ ఇతనికి కధలంటే ఇష్టమేమో! బహుశా తనని చూసి పోవడానికి వచ్చి వుంటాడు. అతన్ని గురించి ఊహించుకుంటోంది సీత.
"మీ సీరియల్ నవల చాలామందికి నచ్చింది....." అతను చిరునవ్వుతో అన్నాడు.
"థాంక్యూ' తనూ నవ్వేస్తూ అంది.
'ఆ నవల విషయం మాట్లాడడానికి వచ్చాను" కొద్ది క్షణాలాగి నెమ్మదిగా అన్నాడతను.
సీతకేమీ అర్ధం కావటం లేదు. బాగుందన్నాడు, తను "థాంక్యూ" చెప్పేసింది. ఇంకా ఏం మాట్లాడాలి దాన్ని గురించి? ఒకవేళ అందులోని సన్నివేశాల గురించి చర్చిస్తాడా?
ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి తిరిగి అతనే మాట్లాడాడు.
"మీరు ఆ నవల పబ్లిషింగ్ హక్కులు ఎవరికయినా ఇచ్చారా?"
ఆ గొడవేమిటో సీతకు బొత్తిగా తెలీలేదు. పబ్లిషింగ్ హక్కులేమిటి? అవి నవలను ప్రచురిస్తున్న మాసపత్రిక వాళ్ళ కుండవా? వాళ్ళు ఎంతో కొంత తనకి ప్రతిఫలంగా ఇస్తారు కదా! అయినా ఈ గొడవలన్నీ తనకేం తెలుసు? అయన వచ్చాక మాట్లాడ మంటే సరి!
ఈ విషయాలన్నీ మావారు వొచ్చాక మాట్లాడితే బావుంటుంది' నెమ్మదిగా అందామె.
"అంటే ఎవ్వరికీ ఇవ్వలేదన్నమాటేగా?"
సీత ఏమీ మాట్లాడలేదు.
"పోనీ మీవారు ఎప్పుడొస్తారో చెప్పండి! ఆ టైము కొస్తాను" అతనే అన్నాడు చివరకు.
"సాయంత్రం అయిదున్నరకల్లా వోచ్చేస్తారు."
"సరే! ఆ టైముకొస్తాను. ఒకవేళ ఆలస్యమయినా కొద్ది సేపు వేచి వుండమని చెప్పండి ఆయనకు. నేను మళ్ళీ రాత్రి బస్ కి వెళ్ళి పోవాలనుకొంటున్నాను."
"అలాగే!"
అతను వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం మాధవరావు ఇంటికొస్తూనే ఈ విషయం చెప్పిందామె---
"ఈశ్వర్రావనీ అదేదో పబ్లిషింగ్ కంపెనీ యజమానట- నా నవల హక్కులు ఎవరికయినా ఇచ్చారా అని అడిగాడు. ఆ విషయాలన్నీ నాకు తెలీదు. మావారితో మాట్లాడమని చెప్పి పంపించి వేశాను."
మాధవరావుకి నవ్వాగలేదు.
"భలేదానివే! నవలలు రాసేదానివి ఓ పబ్లిషర్ తో మాట్లాడలేవా! బహుశా నీ నవల పబ్లిషింగ్ హక్కులు కొనడానికి వచ్చి వుంటాడతను. అతన్నలా గెంటేస్తే ఎలా? ఎంతో కొంత డబ్బొస్తుంది కదా నీకు."
"నిజంగానా?" విస్మయంతో అడిగిందామె.
"అవును మరి! లేకపోతే పబ్లిషర్ కి నీతో ఏం పని?"
"ఎంతిస్తాడతను?"
"అది నీ నవల గొప్పతనం, అతని ఆర్ధిక స్థోమత మీద ఆధారపడి వుంటుంది."
వాళ్ళలా మాట్లాడుకొంటుండగానే అటో దిగి లోపలి కొచ్చాడు పబ్లిషర్.
"రండి! కూర్చోండి' అతన్ని ఆహ్వానించాడు మాధవరావు.
"నమస్తే" అంటూ సోఫాలో కూర్చున్నాడతను.
"ఇప్పుడే మీరొచ్చి వెళ్ళారని చెప్తోంది . ఇంతలో రానే వచ్చేశారు ......." నవ్వుతూ అన్నాడు మాధవరావు.
"మాలినీ పబ్లిషింగ్ కంపెనీ మీకు తెలిసే వుంటుంది. నా కంపెనీయే అది. ఇప్పుడు సీరియల్ గా వస్తున్న సీతగారి నవలకు పబ్లిషింగ్ హక్కులు కొనే విషయం మాట్లాడడానికొచ్చాను" అన్నాడతను.
"ఓహో....." తల పంకిస్తూ అన్నాడు మాధవరావు.
"ఆ నవల వేరెవరికీ ఇవ్వలేదను కుంటాను ...." తిరిగి అన్నాడతను.
"ఊహు! ఎవరికీ ఇవ్వలేదింకా......"
"నేను ప్రచురించిన ప్రతి నవలకూ నాలుగొందలు చొప్పున రాయల్టీ ఇస్తున్నాను. నేను రెండు వేల కాపీలు వేసుకుంటాను. ఈ ఒప్పందం మనకు అయిదేళ్ళ వరకూ వుంటుంది. ఆ తరువాత మళ్ళీ ఈ నవల మీద సర్వ హక్కులూ మీకే వుంటాయి! మీకు అంగీకారమయితే చెప్పండి. ఇప్పుడే అగ్రిమెంట్ రాసుకొందాం! నాలుగు వందలకు చెక్ ఇచ్చేస్తాను....."
వంటింట్లోంచి వాళ్ళ మాటలు వింటున్న సీత తను విన్నది నిజమేనా అన్న మీమాంసలో పడిపోయింది.
పుస్తకంగా వేసుకోన్నందుకు నాలుగొందల రూపాయలు ఇస్తాడా/ అంత డబ్బు ఒక్క పుస్తకానికా/ ఏం చేసుకోవాలదంతా? ఏం కొనాలి?
మాధవరావు ఆలోచనలో పడ్డాడు. నిజానికి అతనికి ఆశ్చర్యంగానే ఉంది. నాలుగొందలు అమాంతం వచ్చి పడుతుంటే అది అనుకోకుండా -- ఎవరికి మాత్రం ఆశ్చర్యం ఉండదు. అనుకోన్నాడతను. ఒకవేళ తను నాలుగొందలకి ఒప్పుకుంటే ఎలా వుంటుంది? బాగానే ఉంటుంది. కాని తను అతను చెప్పినంతకే ఎందుకు ఒప్పుకోవాలి. ఎలాగూ అతనే తమ దగ్గర కొచ్చాడు కాబట్టి మరో వందరూపాయలు ఎక్కువడుగుతే! కొద్ది క్షణాలు తర్వాత అయిదు వందలకయితే ఎగ్రిమెంటు కుదుర్చుకోవచ్చని అతనికి చెప్పేశాడు మాధవరావు.
"సరే! మీ ఇష్టం. అలాగే కానీయండి!" అన్నాడు ఈశ్వరరావు. బాగ్ లో నుంచి కొన్ని కాగితాలు బయటకు లాగుతూ. ముందు ఆ కాగితాల మీద నవల పేరు, రచయితి పేరు, అన్నీ పూర్తి చేసి "ఆమె సంతకం పెట్టించండి ఇక్కడ" అంటూ మాధవరావు కందజేశాడు. ఆమె సంతకం చేసేలోగా అయిదు వందలకు చెక్కు రాసి అందించేడు. "మీ సీరియల్ పూర్తీ అయిన వెంటనే నేను ప్రచురుణ మొదలుపెడతాను. ఆ విషయం మీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను లెండి....." అన్నాడతను. ఈలోగా సీత రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి అందించింది ఇద్దరికీ.