కాఫీ తాగి అతను వెళ్ళిపోయాడు. తన చేతిలోని చెక్కు సీత కందించేడు మాధవరావు.
"నీ కష్టార్జితం!" అన్నాడు నవ్వుతూ.
"నా కేందుకిది. మీ దగ్గిరే ఉంచండి...."
"చెక్కు మీ పేరున ఉంది సీతగారూ! మీరో బ్యాంకులో ఎకౌంట్ ప్రారంభిస్తే గాని మీకు డబ్బు రాదు"
'అలాగయితే రేపే చేద్దాం ఆ పని! ఆనందంగా అందామె.
"మరి ఈ డబ్బు ఏం చేయదల్చుకొన్నారు తమరు?"
"ఏమో, మీరే చెప్పండి!"
"బాగుంది! నువ్వు కావాలనుకొన్న వస్తువులు లిస్టు చాలా పెద్దదుంది. అందులో నీకేం ముఖ్యమో , అది ఈ మొత్తానికి లభ్యమవుతుందో లేదో నాకేం తెలుస్తుంది? అయినా ఇది నీ డబ్బు కాబట్టి దీని మీద నేనెలాంటి అధికారం చెలాయించదల్చుకోలేదు."
"అలా మీ డబ్బూ, నా డబ్బూ అనే తెడాలేందుకు? నేను కొనదల్చుకొన్న వస్తువులు ఏవయినా అన్నీ మన యింటి కోసమేగా! పోనీ మీకిష్టం లేకపోతే చెప్పండి. ఏమీ కొనను...." నిష్టూరంగా అందామె.
ఆమెను దగ్గరకు లాక్కొని కౌగిట్లో బంధించాడు మాధవరావు.
"నా కిష్టం లేదని నీతో ఎప్పుడయినా అన్నానా? నేను చేయలేని పనులు నువ్వు చేస్తుంటే నాకు మాత్రం అనందంగా ఉండదూ?" ఆమె కళ్ళల్లోకి అనురాగంతో చూస్తూ అన్నాడతను.
సీత అతని గుండెల మీద తల వాల్చేసింది సంతృప్తిగా.
ఆ మర్నాడు సాయంత్రం మరో విచిత్రం జరిగింది.
మరో పబ్లిషరు వచ్చి అదే నవలకు హక్కులు తనకు కావాలని అడిగాడు.
"నిన్నే మాలిని పబ్లిషింగ్ కంపెనీ వారికి రాసిచ్చేశాము......" అన్నాడు మాధవరావు.
"ఎంత ఇచ్చారాయన?" అడిగాడతను.
"అయిదు వందలు......"
"దొంగ రాస్కెల్! చూశారా . ఇంత పేరొచ్చిన నవలకు అయిదొందలిచ్చి అగ్రిమెంట్ రాయించుకొంటాడా? ఇలాగేనా రచయితలనూ, రచయిత్రిలనూ అన్యాయం చేయడం! మీరే కాదండి వాడి మాటల్లో పడి చాలామంది మోసపోయారు."
"అదే మీరయితే ఎంత ఇచ్చేవారు?" అయోమయంగా అడిగింది సీత.
"ఎనిమిది వందలు! దమ్మిడి తక్కువ ఇచ్చేవాడిని కాదు! నా సంగతి నేను డీల్ చేసిన ఏ రచయితనయినా అడగండి మీకే తెలుస్తుంది. ఇప్పటికయినా మించి పోయింది లేదు. ఆ పాత అగ్రిమెంట్ రద్దు చేసుకొని అతని డబ్బు అతనికిచ్చేస్తానంటే నేనిప్పుడే ఎనిమిది వందలూ అడ్వాన్స్ గా ఇచ్చేస్తాను" అన్నాడతను. సీతా, మాధవరావులు అవాక్కయిపోయారు.
తామిద్దరికీ ఈ పబ్లిషరు ఎంతగా మోసగించిందీ ఇట్టే అర్ధమయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలో ఇద్దరకూ తెలీలేదు. అగ్రిమెంట్ రద్దు చేసుకొందామంటే అతనేమంటాడో ఏమో!
"మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి! ఏ సంగతీ నేను తరువాత తెలియజేస్తాను" కొద్ది సేపటి తర్వాత కోలుకొని అన్నాడు మాధవరావు.
"ఒకవేళ అతను ఒప్పుకోకపోతే ఈసారికి వదిలేయండి. కానీ మీ తరువాతి నవలలు మాత్రం ఎవరికీ ఇవ్వకండి. నేను తీసుకొంటాను. ఏమంటారు?" అడిగాడతను.
"సరే........" తలూపుతూ అంది సీత.
అతను తన అడ్రస్ కార్డ్ వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత కాసేపటి వరకూ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సీత పూర్తిగా తల్లక్రిందులయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు - మూడు వందలు!
తన భర్త ఇలాంటి విషయాల్లో అనుభవమున్న వారి నేవర్నయినా సంప్రదించి అప్పుడే అగ్రిమెంట్ రాయించాల్సింది . అలా చేస్తే ఇప్పుడీ మూడు వందల నష్టం వాటిల్లేది కాదు."
"తప్పునాదేలే! ఏమి తెలియకుండా అన్నీ తెలుసనుకొంటె ఇలాగే జరుగుతుంది" నెమ్మదిగా అన్నాడు మాధవరావు.
"పోనీలెండి ఇకముందు జాగ్రత్తగా ఉంటే సరి" అతనిని సంతృప్తి పరచడానికి మాట్లాడింది సీత.
"అవును! అంతకంటే చేయగలిగిందేముందీ?" నిరుత్సాహంగానే అన్నాడు.
"అయినా ఇలా వదిల్తే లాభం లేదు. ముందు అతనికో ఉత్తరం రాస్తానివాళ. అతనిచ్చిన డబ్బు చాలా తక్కువనీ, కనీస ఎనిమిది వందలయినా ఇవ్వాలనీ అంటాను! ఏం జవాబిస్తాడో చూద్దాం" పట్టుదలగా అంది సీత.
మాధవరావు ఆశ్చర్యపోయాడు.
సీత "తనకంటే ఫరవాలేదు" అనుకొన్నాడు. ఎలాగయినా ఇలాంటి విషయాల్లో మగాళ్ళ కంటే స్త్రీలే నయం ఖచ్చితంగా మాట్లాడగలరు.
"రాసిచూడు" అన్నాడతను.
సీత రాసిన ఉత్తరానికి తిరుగుటపాలో జవాబొచ్చింది.
ఆ విషయాలన్నీ అగ్రిమెంట్ రాసేముందే ఆలోచించుకోవాల్సిందినీ, ఇప్పుడు అవిషయం గురించి చర్చించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదనీ, అయినా తానూ ఇందులో మోసగించిందేమీ లేదనీ, ఎవరయినా అదే మొత్తం ఇస్తారనీ తను రచయితలకు తనకూ మధ్య నుంచీ సంబంధాలు ఉండాలని నమ్మే మనిషి కావడం వల్ల మరో వందరూపాయలు త్వరలో పంపుతున్నట్లూ ఈ విషయం ఇంతటితో ముగుస్తుందని భావిస్తున్నట్లూ రాశాడతను.
"చూశారా మోసం కాకపోతే ఇప్పుడు మరో వంద ఎందుకు పంపుతున్నట్లు? సరే ఈసారికి పోనీండి. మరోసారి మరో నవల కావాలని ఇంటి కొస్తే గడప లోంచే బయటకు వెళ్ళగొడతాను" కసిగా అంది సీత.