Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 13


    ఆ సాయింత్రమే ఆమె రాసిన కధ పోస్టులో ప్రయాణమయింది. ఇరవై రోజుల తర్వాత పోస్టు మన్ ఆ మాసపత్రిక ఇంటికి తెచ్చిచ్చే సరికి ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయింది సీత. ఆ పత్రిక నుంచి కధ ప్రచురించబోతున్నట్లు ఏదయినా ఉత్తరం లాంటిది వస్తుందేమో అని ఇన్ని రోజులూ ఎదురు చూస్తూ కూర్చుంది. కానీ ఏకంగా పత్రికే వచ్చేసింది. త్వరగా పత్రిక పేజీలు  తిరగేసిందామె. మొదట్లోనే తను రాసిన కధ కొట్టచ్చే అక్షరాలతో కనిపించేసరికి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయిపోయింది. తన పేరు చూస్తున్న కొద్దీ అనందం ఎక్కువయిపోతోంది. కనీసం తెలియజేయకుండా ప్రచురించేశారేమిటి? అది కూడా ఇరవై రోజుల్లో అంటే తన కధ అంతగా నచ్చిందా వాళ్ళకు? వెంటనే పక్కింటి వాళ్ళకు ఆ విషయం చాటించి పత్రిక చూపించిందామె. మరికొద్ది సేపట్లో ఆ కాంపౌండంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తమ కాంపౌండులోనే ఓ రచయిత్రి ఉండటం వారికి గర్వకారణంగా కూడా వుంది. మాధవరావు ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటి కోస్తాడా, ఈ విషయం ఎప్పుడు చెప్పాలా అని ఆత్రుతతో ఎదురుచూడసాగిందామె. మాధవరావు ఆరోజు మరో అరగంట ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అతని చేతిలో స్వీట్ పాకెట్ కనిపించిందామెకి.
    "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడతను ఇంట్లోకి వస్తూనే.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
    "నీ కధ పడిందిగా' తన చేతిలోని మాసపత్రిక ఆమె కందిస్తూ అన్నాడతను.
    'అరె! మీకెలా తెలిసింది! మనింటికి ఈ పత్రిక పంపించారు.......' ఇంటి కొచ్చిన పత్రిక కూడా తీసి చూపుతూ అందామె.
    "షాపులో పత్రిక వేలాడుతోంది. తిరగేసి చూశాను ముందే నీ పేరు కనిపించింది. వెంటనే ఓ కాపీ కొనుక్కొచ్చేశాను. ఈ శుభ సమయంలో "తీపి" తినిపిస్తావని ఈ స్వీట్ పాకెట్ కూడా తెచ్చాను....." నవ్వుతూ స్వీట్ పాకెట్ ఆమె కందించాడతను. అందులో నుంచి ఓ గులాబ్ జామ్ తీసి అతని నోటి కందించింది సీత.
    "మరి నీకు స్వీటు నేను తినిపిస్తాను" తనో స్వీటు అందుకొని ఆమె నోట్లో పెట్టాడతను.
    ఆ కధ ప్రచురింపబడటం ఎంతో ప్రోత్సాహం కలిగించిందామెకి. ఆ తరువాత పదిహేను రోజుల్లోనూ నాలుగు కధలు రాయగాలిగింది. వాటన్నిటిని చదివి ఎంతో మెచ్చుకొన్నాడు మాధవరావు. అన్నీ వివిధ పత్రికలకూ పోస్టు చేయించింది సీత.
    "ఇలా క్కాదోయ్. కధ రాయడం కంటే నవలలు రాయడం తెలికట. మా ఫ్రెండ్ చెప్తుండేవాడు. నవలేందుకు ప్రయత్నించకూడదు?" అడిగాడు మాధవరావు.
    "అమ్మో! నేను నవల రాయగలనా?" ఆశ్చర్యంగా అడిగింది.
    'అలా అనుకుంటూ కూర్చుంటే అసలేమీ రాయలేవు. ప్రయత్నించి చూడాలి......' ప్రోత్సాహకరంగా అన్నాడతను.
    ఆరోజు నుంచే ఆమె నవల గురించి ఆలోచనలు మొదలు పెట్టింది.
    "ఇవిగో! మంచి నవలా కారిణివి అవాలంటే ముందు ఇలాంటి మంచి నవలలు చదవాలట!" అంటూ ఓ డజను నవలలు తీసుకొచ్చి ఇచ్చాడు మాధవరావు. ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమయినా సుమారుగా కధ తెలిసిపోతూనే ఉంది. అక్కడక్కడ మరీ తెలీని చోట మాధవరావు సహాయం చేస్తున్నాడు.
    ఒకటి రెండు కధలు మినహా ఆమె పంపించిన కధలన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినాయి. కొన్ని పత్రికలు పదిహేను రూపాయలు, మరికొన్ని ముప్పయ్, ఇంకొన్ని యాభై రూపాయలు చొప్పున ప్రతిఫలం అందజేసినాయి. ఆ డబ్బు మీద సర్వాధికారాలు తనకే ఉంచుకొందామే. అన్నీ కలిపి నూట ఎనభయ్ రూపాయలవ్వగానే రెడ్డి భార్య సుభాషిణి కట్టుకొన్న లాంటి చీర ఒకటి కొనేసింది. అది కట్టుకున్న రోజు తను ఎంతో విజయం సాధించినట్లు అనిపించిందామెకి.
    అప్పటికే ఆమె పేరు ఆ చుట్టుప్రక్కల మార్మోగిపోయింది. చాలా మంది స్త్రీలు ఆమెతో స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరసాగారు.
    మత్తు పానీయాల కంటే ఎక్కువ మత్తు కలిగించేది పొగడ్త. సీతని విపరీతంగా పొగిడే అభిమానులు ఏర్పడ్డారు.
    ఈ పరిస్థితుల్లో ఆమె మొదటి నవల ఒక మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడటం మొదలయింది. నిజంగా ఆ నవల తెలుగుదేశంలో గొప్ప సంచలనం కలిగించింది. అసంఖ్యాకమైన ఉత్తరాలు ఆ నవలను పొగుడుతూ అందుతున్నాయి.
    నవల సగం కూడా ప్రచురింపబడక ముందే ఆమెకు ఇతర పత్రికల నుంచి రచనలు పంపమని అభ్యర్దిస్తూ ఉత్తరాలూ వచ్చాయి.
    ఈ పరిస్థితి ఇద్దరికీ అమితమయిన ఆశ్చర్యానందం కలిగించింది.
    "నువ్వు మరీ గొప్ప రచయిత్రివయిపోతున్నావోయ్! ఇక నాతొ మాట్లాడే తీరిక వుంటుందో ఉండదో" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    "అలాంటి మాటలంటే ఊరుకునేది లేదు" చిరుకోపంతో అంది సీత.
    ఓ నెల తర్వాత మధ్యాహ్నం పూట తీరికగా ఏదో కధ రాసుకుంటుండగా బయట అటో ఆగిన చప్పుడయింది. ఓ వ్యక్తీ అటో దిగి కాంపౌండ్ లో కొచ్చి అక్కడ ఆడుకొంటున్న పిల్లలతో "సీతగారిల్లు  ఎక్కడ" అని అడగడం కూడా వినిపించిందామెకి.
    ఒక్క ఉదటున లేచి రాసుకుంటున్న కాగితాలన్నీ ఓ మూలకు సర్దేసింది. తనకోసం వచ్చే అపరిచిత వ్యక్తీ ఎవరా అన్న ఆశ్చర్యం ఆమెని ఆవహించింది.
    ఈలోగా అతను గడపదగ్గరకు రానే వచ్చాడు. సీత అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "నమస్కారమండి! రచయిత్రి సీతగారు మీరేననుకొంటాను......" చిరునవ్వుతో నమస్కరిస్తూ అన్నాడతను.
    "అవును" ప్రతినమస్కారం చేస్తూ అందామె.

 Previous Page Next Page