"సూరీ, ప్లీజ్ అండర్ స్టాండ్ మీ" అని బ్రతిమాలుతున్నట్లుగా మైకేలు తనకు అప్పగించిన పనిని గురించి చెప్పి, సూరి అక్కడుంటే ఆ పనికి అంతరాయం కలుగుతుందని చెప్పింది.
"సో డెయిజీ, అయామ్ వెరీసారి ఇదిగో, ఇప్పుడే వెళ్లిపోతున్నా ఎక్సూజ్ మీ ఈ రాత్రి పని పూర్తికావలి తెల్లవారే వరకు శుభవార్త తెలియాలి" అని వోడ్కా సీసా తీసుకొని నిష్క్రమించాడు సూరి.
ఒక నిట్టూర్పు విడిచింది డెయిజీ ఏదో బరువు దిగిపోయినట్లయింది బయట వర్షం పడుతూంది గాలి చల్లగావస్తూంది ఫ్యాను ఆఫ్ చేసి వచ్చి కూర్చుంది మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి ప్రశ్నల పరంపరలు! స్థిర నిశ్చయానికి వచ్చింది రాజావస్తే వీరి ప్లానులన్నీ చెప్పాలని నిశ్చయించుకుంది రాజారావు కోసరం ఎదురుచూస్తూ కూర్చుంది రాత్రి 12 అయింది రెండు, నాలుగు రాజారావు రాలేదు కన్ను మలిగింది సోఫామీద పడి నిద్రపోయింది.
* * *
పేకాటలో పెద్ద మొత్తం పోయింది రాజారావుకు దాంతో జానీ వాకర్ నిషా కూడా దిగిపోయింది నయాగరాకు వెళ్ళాల్సినవాడు ఇంటికి వచ్చేశాడు మనసు సరిగా లేదు ఏదో చిరాకుగా ఉన్నాడు కారు దిగి చరచరా వెళ్ళాడు తెరను కూడా చూడకుండా గదిలో దూరాడు కొంత దూరం అతనితో వచ్చిన తెర పడిపోయింది.
పార్వతి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది అతన్ని చూచి ఆశ్చర్యపోయింది అతడు ఆ దశలో వచ్చినందుకు కాదు, అంత తొందరగా వచ్చినందుకు! రోజా పార్వతి అలాగే నిద్రను ఎదిరించి మెలకువతో ఉంటోంది ఎంత రాత్రైనా రాజారావు రావాలి ఆమె తినాలి అతడు తింటాడని కాదు తినేవస్తాడు - చిరాకు పడ్తాడు గద్దిస్తాడు విసుక్కుంటాడు అయినా, అతడు తినివచ్చాడని తేల్చుకోవాలి అప్పుడు గాని ఆమె తినదు.
పార్వతి పుస్తకం మూసింది అక్కడే పెట్టింది రాజారావును - తన భర్తను - చూసింది బూట్లు సైతం విప్పకుండా మంచంలో పడిపోవడం ఇదే మొదటిసారి అతడు ఎంత నిషాలో వచ్చినా బూట్లు, మేజోళ్ళు విప్పేవాడు బట్టలు మార్చుకునేవాడు ఈ పరిణామం ఆమె మీద మరొక పిడుగు! కొంగు వంటినిండా కప్పుకుంది భర్త పాదాల దగ్గరికి వెళ్ళింది అతడు ఈసడిస్తాడని ఆమెకు తెలుసు అయినా వెళ్ళింది బూట్ల లేసులు విప్పింది రాజారావు కిమ్మనలేదు, ఈసడించలేదు, చిరచిర లాడలేదు అదీ ఆశ్చర్యమే కలిగించింది పార్వతికి మేజోళ్ళు తీసింది బట్టలు మార్చుకోవలసిందని అందామనుకుంది కాని ధైర్యం చాలలేదు కాలి సవ్వడిసైతం కాకుండా గది దాటింది పోర్టికోలోకి వచ్చి చూచింది కారు తాళంచెవులు అలాగే వున్నాయి అని తీసుకొని గదిలోకి వెళ్ళింది యధాస్థానంలో వుంచింది వంటింట్లోకి వెళ్ళింది వంటమనిషి కొంగు పరచుకొని నేలమీద పడుకొని వుంది మెలుకువగానే వుంది పార్వతిని చూచి లేచింది పళ్ళాల్లో అన్నం వడ్డించి ఇచ్చింది పార్వతి రెండు పళ్ళాలు తీసుకొని గదిలో ప్రవేశించింది ధైర్యం కూడగట్టుకొని భర్త దగ్గరికి వెళ్ళింది వాసన గుప్పుమంది అతడు కళ్ళుతెరచి ఉన్నాడు "లేవండి బట్టలు మార్చుకోండి" అన్నది.
యంత్రవతుగా లేచాడు రాజారావు బట్టలు మార్చుకున్నాడు పార్వతి సంతోషించింది తన ప్రార్ధనలు ఫలించాయనుకుంది రాజారావు టేబులు ముందు కూర్చున్నాడు ఆమె పళ్ళెం ముందుంచింది కాళ్ళు కడుక్కోమందా మనుకుంది ధైర్యం చిక్కలేదు పలుకలేదు రాజారావు రెండు మెతుకులు నోట్లోవేసుకున్నాడు ఏదో లాంఛనానికి అన్నట్లు తిన్నాడు చేయి కడుక్కున్నాడు మళ్ళీ మంచంలో పడిపోయాడు.
అంతకే సంతోషించింది పార్వతి తిన్నాననిపించుకుంది లైటు ఆర్పేసి బెడ్ లైటు వేసింది పడుకుంది.
రాజారావు పడుకున్నాడనేకాని నిద్రపోలేదు అసలు అది రాలేదు ఎన్నో ఆలోచనలు అతనిని ముసిరాయి సూరి చెక్కుమీద సంతకం పెట్టమనడం, తాను పెట్టడం ఎంత మూర్ఖుడు తాను? అడగ్గానే సంతకం పెట్టేశాడు ఆరును అరవై చేసి కాజేశాడు సూరి ఎంత దుర్మార్గుడు! ఎంత కపటి" అసలు బ్యాంకువాళ్ళు ఎలా ఇచ్చారు? వాళ్ళనూ ఏదో మోసం చేసి ఉంటాడు! ఒళ్ళు మండింది, కళ్ళు చింతనిప్పులైనాయి వాడి అంతు తేల్చుకోవాలనుకున్నాడు తరవాత ప్రయోజనం లేదనుకున్నాడు తానే బయటపడిపోతాడు! సంఘంలో లోకువైపోతాడు"
డెయిజీ మనసులో మసలింది చలించాడు ఏదో వెన్నెల విరిసినట్లయిందిక్షణంలో నిప్పుల వాన కురిసింది మనసులో ముళ్ళపొద మొలిచింది ఛీ ఎంత దుర్మార్గురాలు! అందం ఉందా దాని దగ్గర! వట్టి పౌడరు ముండ, ఎంత లొంగాడు తాను దానికి! దాని వగలు, దాని కులుకు" అసలు దానివల్లనే తాను మునిగింది గుర్రపు పందాలు! ఎంత పోయింది దానిలో? పేకాట? కొంప గుల్ల అయ్యేస్థితి వచ్చింది! ఎంత డబ్బు పోయింది ఇవాళ! దీనంతటికీ డెయిజీయే కారణం అది లేకుంటే తాను సూరికి లొంగేవాడా? ఎంత కపటి! ఎంత వగలాడి! కొంతసేపు ఆవిడ అందం, చిరునవ్వు అతనిమీద ప్రభుత్వం చేశాయి ఇంతలో మరొక దృశ్యంలో మునిగిపోయాడు.
కారు హారను, బెదిరి పక్కకు జరగడం, ఆ కళ్ళలో భయం అబ్బ! ఎంత అందంగా ఉన్నాయి! ఎంత అమాయికత! గడగడా వడకిపోయింది ఎంత సొగసుంది లోకంలో! ఎంత ఆకర్షణ ఉంది ఆవిడలో - ఆ సుందరిలో!
లక్ష్మి అందం అతనిని ముంచెత్తింది అతడు అందులో మునిగిపోయాడు తబ్బిబ్బైనాడు ఉక్కిరి బిక్కిరి అయినాడు ఆమె తన పనిలోనే ఉంది కూలిది! తనకు వశం అవుతుందా? ఎందుకు కాదు? వశపరచుకోవాలి అన్ని ప్రయత్నాలు చేయాలి సాధించాలి.
రాజారావులో ఏదో తపన బయలుదేరింది లేచాడు లైటు వేసి సిగరెట్టు కాల్చాడు పార్వతి నిద్రపోతూంది చూచాడు లక్ష్మితో పోల్చుకున్నాడు అమాంతంగా లైటు ఆర్పి మంచంమీద కూర్చున్నాడు.
టెలిఫోను మ్రోగింది "ఎవరు? చంద్రయ్యా! ఏం మునిగిందింతరాత్రి? ఏమి? సిమెంటు లారీలు పట్టుకున్నారూ! ఎక్కన్నుంచి? గవర్నమెంటు స్టోరునుంచా? మన శ్రీనివాసరావున్నాడుగా సబిన్ స్పెక్టరు! ఏమంటున్నావు? అతనే అడుగుతున్నాడూ ఒక లారీ సిమెంటు? మరి మనం ఇచ్చే మమూల్లో? ఏమంటాడు? జేలుకు పంపుతాడా? పోలీసులు అంతేలే వాళ్ళని నమ్మడం మనదే తప్పు ఇచ్చేయి ఏం చేస్తాం? నేను వచ్చిమాత్రం చేసేదేమి? తగలబెట్టు" రిసీవర్ దభాల్నపడేసి బయటికి వచ్చాడు అటూ ఇటూ పచార్లు చేశాడు మళ్ళీ వచ్చాడు మంచంలో పడిపోయాడు అటూ ఇటూ పొర్లాడు.
తెల్లవారింది అప్పుడే అతనికి నిద్ర పట్టింది లేచేవరకు పదకొండైంది గబగబా నిత్యకృత్యాలు ముగించుకున్నాడు స్నానం చేశాడు బట్టలు వేసుకొని బయలుదేరాడు ఆస్పత్రి కడ్తున్న చోటికి చేరాడు కారు ఆగడం చూచి చంద్రయ్య పరిగెత్తుకొని వచ్చాడు తలుపు తెరిచాడు "ఎన్ని మాట లన్నడనుకున్నరు పోలీసోడు బూతులు కూడా తిట్టిండుండి" ఇంకేదో చెప్పబోయి దొర వినడం లేదని తెలుసుకొని ఊరుకున్నాడు.
"పని ఎలా జరుగుతుంది?" సాగిపోతూనే అడిగాడు రాజారావు.
"బాగానే సాగుతున్నదండి"
"పనివాళ్ళందరూ వచ్చేశారా?"
"వచ్చిమ్రండి"
"నేను చూడాలి"
ఆశ్చర్యపోయాడు చంద్రయ్య ఇంతవరకూ ఎన్నడూ ఆ మాట అనలేదు రాజారావు చంద్రయ్యే అక్కడి సర్వాధికారి డబ్బివ్వడం రాజారావు పని పనులు చేయించడం చంద్రయ్య పని ఈ రోజు తన అధికారాన్ని సవాలు చేస్తున్నాడు దొర అయినా తనేం చేయగలడు?
"చూడండి" అని వెనుక నడవసాగాడు.
"నువ్వెందుకు? నేనే చూస్తా నీ పని చూచుకో"
చంద్రయ్య మాట్లాడలేదు వెళ్లిపోయాడు అందరినీ పరీక్షగా చూస్తూ సాగిపోతున్నాడు రాజారావు.
పని యంత్రంలా జరుగుతూంది వడివడిగా జరుగుతూంది ఒక అంతస్తు చూచాడు తాను కోరింది కనిపించలేదు రెండవ అంతస్తు, మూడవ అంతస్తు కనిపించలేదు నాలుగవ అంతస్తు మీదికి వెళ్ళాడు జనం ఎక్కువగా లేరు అక్కడ కనిపించింది లక్ష్మి సన్ షేడ్ మీద నుంచొని నీళ్ళు పోస్తూంది.
వెనుకనుంచి చూచాడు రాజారావు అయినా గుర్తించాడు సన్ షేడ్ మీదినుంచి నడచాడు తన పనిలో నిమగ్నమై ఉంది లక్ష్మి అడుగుల చప్పుడు సైతం గమనించలేదు.
"అంతలా పని చేస్తే ఎలా?"
అదిరిపోయింది లక్ష్మి చేతిలోని గొట్టం వదిలేసింది అది జర్రున జారి నాలుగు అంతస్తుల క్రింద పడిపోయింది.