Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 13

 

    భీమారావ్ తను ముఖ్యమంత్రి అవలేదన్న కోపంతో రాత్రంతా నిద్రపోకుండా అల్లప్పచ్చడి వేసుకుని ఇడ్లీ తింటుండటం చేత - డోర్ బెల్ వినబడగానే మళ్ళీ డిల్లి లో హైకమాండ్ మనసు మార్చుకుందేమో నన్న ఆశతో పరుగుతో బయటికొచ్చి "ఎవర్నువ్వు? డిల్లీ నుంచి వచ్చావా?" అనడుగుతాడు ఆశగా.
    "కాదండీ! మీ ఇంట్లో పనిచేయడానికి "విద్యావంతుడయిన ఓ యువకుడు కావలెను' అని పేపర్లో వేశారుకదండీ! అందుకని వచ్చాను. నాకు ఓటు హక్కుంది! మీ ఇంటిముందు ప్రదర్శనలు జరిపేవారిని సమాధానపర్చగలను!" అంటాడా యువకుడు.
    "అంతేకాదు! ఇంట్లోకి కాయగూరలు, తేవటం లాంటి పనులు గూడా చేయాలి!" అంటాడు భీమారావ్. ఆ యువకుడు ఆనందంగా వప్పుకుంటాడు. "అదే కాదండీ! మీకూ, మీ అమ్మాయి గారికీ కాఫీ, టిఫిను కూడా అందిస్తానండీ!" అంటాడు . భీమారావ్ వెంటనే అతనికి ఉద్యోగంలోకి తీసుకుంటాడు. ఆ రోజు నుంచీ ఆ యువకుడు రాత్రింబవళ్ళు - పని లేకపోయినా - పనిచేసి భీమారావ్ ని తెగ మెప్పిస్తుంటాడు. ఇంటిముందు ప్రదర్శన జరిపే అపోజిషన్ పార్టీ వాళ్ళతో కలబడి వాళ్ళను బయటకు గెంటి - తన తలకూ, కాళ్ళకూ , చేతులకూ బాండేజీలతో తిరిగివస్తాడు. భీమారావ్ అతనిని చూచి అనందం పట్టలేక కౌగలించుకుంటాడు.
    "నాకోసం ఇంత త్యాగం చేశావా! నీ ఋణం ఎలా తీర్చుకోను?" అనడుగుతాడు అతనిని తెగ కుదిపేస్తూ.
    సరిగ్గా ఆ సమయంలో - కర్టెన్ వెనుక నుంచీ వాళ్ళ మాటలన్నీ వింటోన్న అమ్మాయ్ బయటికొస్తుంది.
    "అతని ఋణం తీర్చుకోవాలంటే మా ఇద్దరికీ పెళ్ళి చేయండి డాడీ!" అంటుంది .
    భీమారావ్ మండిపడతాడు.
    "వ్వాట్? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూతురివయుండి అప్త్రరాల్ ఓ నౌకరు వెధవని పెళ్ళి చేసుకుంటావా? నాన్సెన్స్ !" అంటాడు.
    "మీరు ఇతనిని అపార్ధం చేసుకున్నారు డాడీ! ఇతనేవరునుకుంటున్నారు? నౌకరు పాత్రలో జీవించినంతమాత్రాన నిజంగా నౌఖరనుకుంటున్నారా? నో! ఇతను ప్రఖ్యాత రచయిత దీప్ చంద్! కేవలం నా ప్రేమ కోసం తన రచనల్నీ - అంతస్తునీ త్యాగం చేసి మనింట్లో నౌకరుగా చేరాడు!" అంటుందామె.
    భీమారావ్ కళ్ళవెంబడి నీళ్ళు తిరుగుతాయ్. మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతుంది. దగ్గర కొచ్చి దీప్ చంద్ రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుంటాడు.
    "నువ్వు ప్రఖ్యాత రచయిత దీప్ చంద్ వా? ఎంత ఘోరం జరిగింది! నువ్వు నిజంగా నౌకరునుకుని నీకు అడ్డమైన పనులూ చెప్పాను. నా రేజర్ కడిగించాను. సబ్బు నురగ నీ మొఖం మీద కొట్టాను. నన్ను క్షమిస్తావా దీప్ చంద్ " అని అడుగుతాడు.
    "దట్సాల్ రైట్!" అంటాడు దీప్ చంద్. అందరూ ఆనందంగా చూస్తుండగా, నెమ్మదిగా తెర పడుతుంది. ఎలా వుంది?" అడిగాడు భవానీశంకర్.
    "సూపర్బ్! మిస్టర్ భవానీశంకర్! యూ ఆర్ ఏ జీనియస్!" అంది అమ్మాయ్ ఆశ్చర్యానందాలతో.
    "నేను నౌఖరుగా పనిచేయాలా? నో! అన్నాడు దీప్ చంద్ ఓ క్షణమాగి సీరియస్ గా.
    భవనీశంకర్ ఆశ్చర్యంగా చూశాడు.
    "యస్, మైడియర్ ఫ్రెండ్! అందులో చాలా లాభాలున్నాయ్! నెంబర్ వన్ - ఏమిటంటే, మాంచి ఎక్స్ పీరియన్స్! ఇంకెక్కడయినా ఉద్యోగం కావాల్సివస్తే అది పనికొస్తుంది! రెండోది - క్యాష్! నెలకు ఇంత అని ఖచ్చితమయిన రాబడి ఉంటుంది.
    మూడోది - భీమారావ్ ని పెళ్ళికి వప్పించవచ్చు! నాలుగోది - ఇరవై నాలుగ్గంటలూ నీ ప్రియురాలి కెదురుగా మసులుతూ , కాఫీ, ఉప్మా అందించేప్పుడు ఆమె చేతిని తాకుతూ. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఒకే ఇంట్లో గడపొచ్చు! ఐదోది ...."
    "నో!" అన్నాడు దీప్ చంద్  మళ్ళీ. "నేనొప్పుకోను"
    అమ్మాయికి  అతని మీద కోపం వచ్చింది. ఇంత అద్భుతమైన ప్లాన్ చెప్తే 'నేనొప్పుకోను' అంటాడేమిటి?
    ఎవరికోసం పాపం ఆ భవానీశంకర్ ఇంత మంచి ఉపాయాలు చెప్తున్నారు? ఈ ప్లాన్ లో నిజంగా ఎంత థ్రిల్ వుంది? దీప్ చంద్ నౌకరుగా తమ ఇంట్లో జాయినయిన దగ్గర్నుంచి - తమ పెళ్ళి జరిగేవరకూ అనుక్షణం ఆ థ్రిల్స్ అనుభవిస్తుంటే ఎంత సరదాగా వుంటుంది?
    "మైడియర్ దీప్ చంద్! మీరేదో అపోహ పడుతున్నారు గానీ - అది బెస్ట్ ప్లాన్! మా ఫ్రెండ్ మనోహరదేవ్ అనే అతను ఇలాగే వాళ్ళ పాదరిన్లా ఇంట్లో నౌకరుగా చేరి ఆ ముసలాయనకు ఎంత మోప్పించాడంటే - చివరకు ముసలాయనే సంతోషం పట్టలేక "నాకు ఓ కూతురుంటే నీకే ఇచ్చి పెళ్ళి చేసేవాడిని!" అనేశాడు. సంగతేమిటంటే నిజానికి ఆ ముసలాయన మనోహరదేవ్ ప్రేమించిన అమ్మాయి తండ్రి కాదు! వాళ్ళ బాబాయి! ఆ అమ్మాయి తండ్రి, వాళ్ళ బాబాయీ కవల పిల్లలవటం చేత ఇద్దరూ పక్కపక్క ఇళ్ళల్లోనే ఉండబట్టి - ఎవరెవరో తెలీక కన్ ఫ్యూజ్ అయి పోయాడన్నమాట!" చెప్పాడు భవానీశంకర్.
    అయినా దీప్ చంద్ వైఖరి మారలేదు.
    "సారీ! అలాంటి వేషాలు నాకు నచ్చవ్!" అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ.
    "ఆ వేషాల్ని తక్కువ అంచనా వేయకూడదు ఫ్రెండ్! మా మరో ఫ్రెండ్ కి ఫ్రెండ్ చంద్రకాంత్ చటో పాధ్యాయ్ ఏం చేశాడు? ఎక్కడా దొరక్కపోతే ఓ లక్షాధికారుల ఇంట్లో నౌకరుగా చేరి పదిహేను నిమిషాల పాటు ఎకబికిన పనిచేశాడు. అతని అద్భుతమయిన సర్వీస్ కి వాళ్ళు భరించలేనంత ఆనందపడి "మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా బాబూ?" అని అడిగేశారు. సాయంత్రానికి పెళ్ళయిపోయింది" అన్నాడు భవానీశంకర్ అతనిని ఉత్తేజపరచడానికి ప్రయత్నిస్తూ.
    "నేను నమ్మను!" అన్నాడు దీప్ చంద్.
    "ఆఫ్ కోర్స్! ఎవరూ నమ్మలేరు. అందుకే ఈ వార్తని 'నమ్మలేని నిజాలు' శీర్షికలో కూడా వేశారు అయితే వాళ్ళకంత త్వరగా పెళ్ళి చేసేయటానికి మరో కారణం ఏమిటంటే వాళ్ళ అమ్మాయికి అప్పటికే ఎనిమిదోనెల అని ఆరోజే తెలిసింది వాళ్ళకు! ఆ అమ్మాయి ప్రియుడు అడ్రస్ లేకుండా పరారయిపోయాడట!"
    దీప్ చంద్ మొఖంలో అది వరకు ఉన్న వెలుగు కూడా చీకటి గా మారిపోయింది. అమ్మాయికి అసహనంగా ఉంది.
    "దీప్ చంద్!' ఆప్యాయంగా పిలిచిందామె.
    "ఊ!" అన్నాడతను భయంగా.
    "నాకోసం ఆ మాత్రం ఎడ్వంచర్ చేయలేవా?"
    దీప్ చంద్ ఇరుకునపడిపోయాడు.
    ఇప్పటికే ఆ అమ్మాయి దృష్టిలో తన పరువు ప్రతిష్టలు రాష్ట్ర గవర్నర్ పోస్ట్ లా దిగజారిపోయి ఉన్నాయ్. అప్పటి కప్పుడే రెండుసార్లు ఆమె తండ్రితో మాట్లాడకుండా ప్రాణభయంతో పరుగెత్తాల్సి వచ్చింది.
    "అమ్మాయీ! నీకోసం ఏం చేయటానికయినా సిద్దమే! కానీ మీ డాడీ దగ్గర నౌకరుగా ఉండటం మాత్రం...."
    "అందులో పెద్ద ఇదేముంది! మన ప్రేమ విజయవంతం అవటం కోసం నౌకరుగా నటించడమే కదా?"
    "కానీ మీ డాడీకి నౌకర్ల మీద దోసకాయపచ్చడి విసిరే అలవాటుందని నువ్వే చెప్పావ్ కదా?"
    "దోసకాయకాదు! టమాటో పచ్చడి-"
    "అదే - అలా పచ్చళ్ళు విసుర్తుంటే...."
    "సరే! ఆ కొద్దిరోజులు ఆయనకు పచ్చళ్ళు అందుబాటులో లేకుండా చేసే పూచీ నాది! సరేనా?"
    దీప్ చంద్ కింకేం చేయాలో తెలీలేదు. ఇప్పుడు కూడా 'నో' అంటే అమ్మాయికి తన మీద కోపం వచ్చే అవకాశం ఉంది.
    "అయితే రేపు ఉదయం - నువ్వు మా యింటి కొచ్చి డోర్ బెల్ కొడుతున్నావ్ కదూ?" అడిగిందామె.
    "ఊ!" అన్నాడు దీప్ చంద్ .
    "ఓ! మై డార్లింగ్ ...." అతని జుట్టులోకి చేతిని పోనిచ్చి నెత్తిమీద ముద్దు పెట్టుకుందామె.
    "ముందు కాఫీ తాగండి!" అంది బేరార్ అప్పుడే తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ.
    "బైదిబై - బిల్లు నేను ఇవ్వక్కర్లేదు కదా? ఎందుకంటె పైనాన్స్ పొజిషన్ వీక్ గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలి ముందే సెటిల్ చేసుకోవటం మంచిది. మా ఫ్రెండోకతను ఇలాగే ఫైనాన్స్ చూచుకోకుండా మిర్చి బజ్జీలు తిన్నందుకుగాను ఆ బండివాడు రాసిన అయిదొందల పేజీల నవల చదవాల్సివచ్చింది."
    అమ్మాయి మనసారా నవ్వసాగింది.
    హటాత్తుగా దీప్ చంద్  బుర్ర్రలో ట్యూబ్ లైట్ అరడజను చటుక్కున వెలిగాయ్. అవును! తను ఈ ఉపద్రవం నుంచీ బ్రహ్మాండంగా తప్పించుకోవచ్చిప్పుడు!
    "అదిసరే గానీ - నిజంగా మీ డాడీకి నౌకరు కావాలని పేపర్లో వేయలేదుగా?" ఉత్సాహంగా అమ్మాయినడిగాడతను. అమ్మాయి తెల్లబోయి భవానీశంకర్ వేపు చూసింది. భవానీశంకర్ చిరునవ్వుతో అతని భుజం తట్టాడు.
    "అలాంటి చిన్న విషయాలన్నీ నాకొదిలేసేయ్ ఫ్రెండ్! ఇదిగో ! 'తెలుగు కిరణం' లో ఇవాళ ఉదయం వచ్చిన ప్రకటన కటింగ్ ....." అంటూ భీమారావ్ ప్రకటన తాలుగు భాగం జేబులో నుంచి తీసి అతని కందించాడు.
    దీప్ చంద్  మొఖం మళ్ళీ మబ్బులు కమ్మింది.


                                     *****

    సూర్యుడికి, చిరంజీవికి బొత్తిగా పడటం లేదు. ఇది చిరంజీవి అభిప్రాయం. లేపోతే ఏంటి?
    తను నడిచే రోడ్ల మీద ఎండ మంటేక్కించేస్తున్నాడు. మిగతా రోడ్లన్నీ! మబ్బుల నీడతో చల్లగా మూసేస్తున్నాడు.
    చిరంజీవి చెమటలు తుడుచుకుంటూ 'తెలుగు కిరణం ' ఆఫీస్ కి చేరుకున్నాడు. 'తెలుగు కిరణం' సర్క్యులేషన్ ని మిగతా దినపత్రికలన్నిటి కన్న ఎక్కువ చేయటం - తను సాధించగలడని కాదు గానీ ప్రయత్నం చేయడంలో తప్పేముంది ? చూస్తూ చూస్తూ తనకు హక్కుండి కూడా అంత ఆస్తిని వదులుకోవటానికి మనసొప్పటం లేదు.

 Previous Page Next Page