"నేను అద్భుతమయిన గేయాలు రాశాను సార్! గేయాల పోటీలో కన్సొలేషన్ బహుమతి కూడా వచ్చింది. అయితే ఆ పత్రికవాళ్ళు బహుమతి మొత్తం ఎగ్గొట్టారు కొడుకులు"
"కంగ్రాచ్యులేషన్స్ అలాగే కేవలం పోటీల్లో పాల్గొంటూండు బ్రదర్! ఏదొకరోజు నీ కీర్తి ప్రపంచమంతా వ్యాపించేస్తుంది.
"పోనీ ఫోటో ఫీచర్ కయినా కవితలు రాయనీయండి సార్! సగం పేజీచాలు!"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
"ఏమన్నావ్! ఫోటో ఫీచరా?"
"అవున్సార్! ఇంతకుముందు చాలా మాసపత్రికల్లో రాశాను"
"మాసపత్రికల్లో రాశావా"
"యస్సార్! అన్ని మాసపత్రికల్లో కొన్నాళ్ళు మెయింటెయిన్ చేశాను"
భవానీశంకర్ గుండెలు వేగంగా కొట్టుకున్నయ్.
తన జేబులోనుంచి పాత మాసపత్రిక కాగితం తీశాడు.
"ఇదిచూడు ఈ ఫోటో కిందున్న కవిత్వం నీదేనా?"
అతను ఓక్షణం ఆ కవిత్వం చూశాడు.
"అవును ఇది నేను రాసిందే"
భవానీశంకర్ మనసంతా ఆనందంతో నిండిపోయింది. అమాంతం లేచి అతనికి షేక్ హాండిచ్చాడు.
"సూపర్బ్ బ్రదర్! నిన్ను కలుసుకోవటం నిజంగా అద్భుతం_యూ ఆర్ రియల్లీ గ్రేట్"
"అవున్సార్! ఈ పొయిట్రీ చదివిన వారందరూ ఎంతో పొగిడారు"
"నేననేది ఈ పొయిట్రీ గురించి కాదు బ్రదర్! నువ్వు దొరకటం నా అదృష్టం"
"అలాగా సార్?"
"అవును! నాకు సహాయం చేస్తావా?"
"మీకా! మీరడిగితే చేయకపోవటం ఏమిటిసార్! ఆజ్ఞాపించండి అంతే!"
"నాకు ఈ ఫోటోలో అమ్మాయి వివరాలు కావాలి బ్రదర్! ఇదే పత్రికలోది? ఈ అమ్మాయి ఎవరు? ప్రస్తుతం ఈమె అడ్రస్ ఏమిటి? ఇవన్నీ చెప్పావంటే నీ ఋణం ఉంచుకోను."
"ఇది 'మల్లెలు' మాసపత్రికలోది సార్! నాకు బాగా గుర్తు. అందులో పనిచేసిన అమ్మాయి ఫోటోనే ఇది. ఆమె పేరు కన్యక."
"కన్యక! ఒండర్ ఫుల్ నేమ్ బ్రదర్! కన్యక అడ్రస్ ఏమిటి?"
"అది తెలీదు సార్!"
"పోనీ ఈ 'మల్లెలు' మాసపత్రిక ఎక్కడుంది?"
"అదికూడా తెలీదు సార్!"
"అంటే?"
"ఈ పత్రిక మూసేసి సంవత్సరం అయిపోయింది."
భవానీశంకర్ నిరుత్సాహపడిపోయాడు మళ్ళీ.
"కొంపముంచావ్ బ్రదర్!"
"కనీ ఈ పత్రిక ప్రొప్రయిటర్ ఇల్లు తెలుస్సార్! ఆయన దగ్గరకెళ్తే ఆ అమ్మాయి వివరాలు తెలియవచ్చు."
"అయితే పద. వెంటనే వెళ్దాం."
ఇద్దరూ ఆటోలో బయల్దేరారు.
"కానీ ఆ అమ్మాయి అడ్రస్ ఎందుకు సార్ మీకు?"
"జీవితమంతా ప్రేమ కవితలు రాశానన్నావ్! ఆ మాత్రం ఊహించలేవూ?"
"అతను ఓ క్షణం ఆలోచించి గలగల నవ్వేశాడు.
"అమ్మమ్మమ్మ అర్థమయింది సార్! అర్థమయింది."
* * * *
శరత్ బాబు ఎదురుగ్గా కూర్చున్న రాజునీ, భవానీశంకర్ నీ కొద్దిక్షణాలు పరిశీలనగా చూశాడు.
"మీరు కవిత్వం కూడా రాస్తారా?" అడిగాడతను భవానీశంకర్ ని.
"నో, నో! నెవర్ సార్! కేవలం ప్రజలకు అవసరమయినవే రాస్తాను."
"ఐసీ! 'మల్లెలు' మాసపత్రిక ద్వారా నేను ఎంతోమంది రచయితలను తయారుచేశాను. మీకు తెలుసో, తెలీదో వెంకుమాంబ అనీ ఒకావిడ మా పత్రికలోనే....."
"ఈయన కన్యక గురించి వివరాలు కనుక్కోవాలని వచ్చారండీ" అన్నాడు రాజు.
"ఓ! కన్యక! వెరీగుడ్ గాళ్! సింప్లీ ఒండర్ ఫుల్! ఆఫీస్ లో అన్ని పనులూ తనే చేసుకునేది. ఒకసారి నేను కలకత్తా వెళ్ళి నెలరోజులుండిపోయాను. అప్పుడు ఆ నెల సంచికను తనే తీసుకొచ్చేసింది. వెరీ ఇంటెలిజెంట్ గాళ్..."
"ఆ అమ్మాయి అడ్రస్..."
"అడ్రసా?"
"అవున్సార్."
"ఎందుకు?"
"ఫోటోఫీచర్ వీరి వీక్లీలో ప్రారంభిస్తున్నారట...అందుకని" అబద్ధం చెప్పేశాడు రాజు.
"సూపర్బ్ ఫేస్! ఫోటోజెనిక్. అందుకే మన పత్రికలో వేశామది. ఈమధ్యే ఓసారి మాట్లాడాను కూడా."
"ఆమె అడ్రస్..."
"అడ్రసా?"
"అవునండీ"
"అడ్రస్ తెలీదు."
"తెలీదు?"
"నో!"
"మరి ఈమధ్యే ఆమెతో మాట్లాడానన్నారు?"
"అఫ్ కోర్స్! మాట్లాడాను. కాని అడ్రస్ తెలీదు."
"మరి ఎక్కడ మాట్లాడారు?"
"మా ఇంటికొచ్చిందామధ్య. పాపం వాళ్ళ ఫాదర్ కి ఏదో జబ్బట. అంచేత వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బావుండలేదనీ, ఎక్కడయినా ఏదయినా ఉద్యోగం చూపించమనీ అడిగింది."
భవానీశంకర్ నిరుత్సాహపడిపోయాడు.
"ఆమెను ఇప్పుడు కలుసుకోవాలంటే ఎలా సార్? ఏమయినా మార్గం వుందా?"
"ఉండే వుంటుందిగానీ మనకు తెలీదు."
ఇద్దరూ లేచి నిలబడ్డారు.
"థాంక్యూ సార్! వస్తాం" అన్నాడు రాజు.
"కన్యకకు మీ పత్రికలో ఏదయినా ఉద్యోగం ఉంటే చూడండి" అన్నాడతను.
భవానీశంకర్ ఆతృతగా అతనివేపు చూశాడు.
"ఉద్యోగమా! నా దగ్గరే సబ్ ఎడిటర్ ఉద్యోగం తెగ ఖాళీగా వుంది సార్! అదేకాదు, ఆమె కనిపించాలేగాని పూలమీద నడిచే ఉద్యోగం ఏదొకటి ఇస్తాను. కానీ ఈ విషయం ఆమెకెలా తెలుస్తుంది?"
"ఎందుకు తెలీదు? నేను చెప్తాను కదా?"
"ఎలా చెబ్తారు? ఆమె అడ్రస్ లేదన్నారుగా!"
అతను నిరుత్సాహంగా చూశాడు. "అఫ్ కోర్స్! ఆ మాట నిజమే. దటీజ్ ప్రాబ్లమ్."
ముగ్గురూ కొద్దిసెకన్లు మౌనంగా ఆలోచిస్తూండిపోయారు.
"పోనీ ఓ పని చేద్దాం" అన్నాడు శరత్ బాబు ఉత్సాహంగా.
"ఏమిటది?"
"కన్యకకు ఫోన్ చేద్దాం."
భవానీశంకర్ ఆనందంగా లేచి నిలబడ్డాడు. "ఆమెకు టెలిఫోన్ ఉందా?"
"లేదు కానీ ఆమె ఫ్రెండ్ వాళ్ళింట్లో వుంది."
"ఫోన్ నెంబరెంత?" ఆతృతగా అడిగాడతను.
"అఫ్ కోర్స్! అది మనదగ్గరలేదు" నిరుత్సాహంగా అన్నాడతను. ఇంక అతనితో మాట్లాడి లాభంలేదనిపించింది భవానీశంకర్ కి. హఠాత్తుగా అతని దృష్టి గోడకున్న ఓ ఫోటో ఫ్రేమ్ మీద పడింది. ఆ గ్రూప్ ఫోటోలో కన్యక ఓమూల నిలబడి వుంది.