"ఒకవేళ నీ ప్రయత్నం ఫలించదనుకో! ఆశపట్ల నీకు స్వచ్ఛమయిన మమకారం కలుగనే కలుగదనుకో!...అప్పుడు రావుగారిని కాక మరొకరిని చేసుకుంటావా?"
"అసంభవం. సాంఘికంగా కాకపోయినా, మానసికంగా నేనాయన భార్యను. ఒక్క ఆచార చిహ్నమైన మాంగల్యాలు మెడలో లేకపోయినంత మాత్రాన నాకేమీ నష్టంలేదు. మానసికంగా నన్ను నేను ఆయనకు అర్పించేసుకున్నాను. ఆయనతో కలిసి జీవించటానికి మాత్రం కొంత వ్యవధి కావాలి. నా ప్రేమలో నాకింత గాఢమైన విశ్వాసం ఉండటంవల్లనే ఇంత ధైర్యంగా మిమ్మల్నందరినీ ఎదిరిస్తున్నాను. రావుగారి ప్రేమ నా జీవితాన్నంతా ఆక్రమించుకొంది. ఎవరు ఏమనుకొంటే నాకేం?"
"నీలో నీకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకిలా బాధపడతావు మరి? క్రొత్తదారి నలుగురూ నడిచేదారిలాగా సాఫీగా ఉండక, రాళ్ళూ రప్పలూ నిండి ఉంటుందని తెలియదా?"
"నాకంటే చిన్నదానివయినా, నాకంటే విషయాన్ని బాగా అర్థం చేసుకుని విశదీకరించావు ఉమా! అవును. నేను అత్యంత సాహసంతో చాలామంది అంగీకరించలేని ఒక క్రొత్తబాటలో కాలుపెట్టాను. ఈ బాటలో ఒంటరిగా నడవగలిగే ధైర్యమూ, చివరివరకు నడిచి గమ్యాన్ని చేరుకోగలిగే స్థైర్యము ఎదురుదెబ్బలకు ఓర్వగలిగే సహనమూ కూడా అలవరచుకోవాలి నేను"
"ఈ పూరీలు తిను మరి..."
"తే! ఆకలి మండిపోతూంది" అంటూ శోభ నవ్వుతూ పూరీల ప్లేట్ ముందుకు లాక్కుంది.
11
ఆఫీస్ కు వచ్చిన సరోజినిని చూసి ఆశ్చర్యపోయింది శోభ.
"ఇదేమిటి సరూ! ఇలా వచ్చావేమిటీ?"
"దగ్గరుండి నిన్ను సమాజానికి తీసికెళ్ళడానికి. ఈ మధ్య అసలు నువ్వటు రావటం లేదు. ఇవాళ దగ్గరుండి తీసికెళ్ళడానికి వచ్చాను. నీతో ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి."
"ఇవాళ నాకు వీలుపడదు." నెమ్మదిగా అంది శోభ.
ఆశ తనను తొందరగా రమ్మని మరి మరి చెప్పింది.
"లాభం లేదమ్మాయిగారూ! మీరు వచ్చి తీరాలి." పెంకెగా నవ్వింది సరోజిని.
ఇంక వాదించలేదు శోభ.
ఆ సమాజం ఉత్సాహం చాలావరకు చల్లారిపోయింది. కేశవ రాకపోవటంతో లైబ్రరీ మూలపడింది. శోభ రాకపోవటంతో మూర్తీ రావటం లేదు. వెక్కిరించటానికి శోభా, కాలక్షేపానికి మూర్తీ కూడా లేకపోవటంతో మాలినీ మానేసింది. చివరకు సరోజినీ, భాస్కరరావూ మిగిలారు. వాళ్ళిద్దరూ పేకాడుకుంటూ కూర్చునేవారు. ఇద్దరే కావటంతో ఆ ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది.
"ఎవ్వరూ లేకపోవటంతో విసుగ్గా ఉందికదూ!" అంది సరోజిని.
"కాదు. నాకు సంతోషంగా ఉంది."
"అదేం?"
"ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాం."
అతని మాటలకు సిగ్గుపడిపోయింది సరోజిని. వాలుగా అతని వంక చూసింది. ఎంత అందమైనవాడు భాస్కరరావు! తను అతి సామాన్యంగా ఉంటుంది. అతనిని తను ఆకర్షించగలిగిందా?
"ఇద్దరమే ఉంటే..." అమాయకత్వం నటిస్తూ అంది.
ఆమె హావభావాలు అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్న భాస్కరరావుకు ధైర్యం వచ్చింది.
"ఇతరులకు దొరికిపోకుండా నిన్ను తనివితీరా చూసుకోవచ్చు. మరొకరి ప్రమేయం లేకుండా నీతోనే కబుర్లు చెప్పుకోవచ్చు."
"అంత చూసేందుకేముంది నాలో?"
"నీలో ఏముందో నీకేం తెలుస్తుంది! నా కను పాపలలో ప్రతిఫలించే నీ పాపనడుగు చెప్తుంది."
సరోజిని కళ్ళలోకి చూశాడు భాస్కరరావు. సరోజిని సిగ్గుపడి రెప్పలు వాల్చేసుకుంది.
అలా...అలా...పరిచయం పెరిగింది.
భాస్కరరావు కాఫీ, ఫలహారాలూ, కొన్నిసార్లు భోజనమూ కూడా సరోజిని ఇంట్లోనే గడిచిపోతున్నాయి.
ఆరోజు భాస్కరరావు చాలా 'గ్లూమీ'గా ఉన్నాడు. అతనిని ఉత్సాహపరచటానికి సరోజిని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.
"ఏవిఁటది భాస్కర్? ఎందుకిలా ఉన్నావ్! నాతో చెప్పవూ?"
"చెప్తాను సరూ! నువ్వు కాక చెప్పుకునేందు కింకెవరున్నారు నాకు? బీదవాళ్ళకన్నీ కష్టాలే! ఈ బీదరికం చివరికి నా జీవితాన్నే బలితీసుకుంటుంది."
"అదేవిఁటి భాస్కర్! ఏమైనా ఇబ్బందులలో ఉన్నావా? డబ్బు సర్దుబాటు చెయ్యమంటావా?"
"అదికాదు సరూ! నాకు పెళ్ళికావలసిన ఇద్దరు చెల్లెళ్ళున్నారు. చదువుకోవలసిన తమ్ముడున్నాడు. మాకు ఆస్తి ఏమీ లేదు. నా సంపాదనతో ఇల్లు గడవటమే కష్టం. పదిహేనువేలు కట్నంతో ఏదో సంబంధం వచ్చింది. అది నేను చేసుకుతీరాలని ఇంట్లో పట్టుదల! మొదట చేసుకోనన్నాను. "సరే! నీ సుఖం చూసుకో అన్నయ్యా! మేము ఏమయిపోతే నీకేం?" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు చెల్లెళ్ళు. ఫస్టు మార్కులతో పాసయిన తమ్ముడు పైచదువులకు అప్లికేషన్ ఫారాలతో నన్ను ధీనంగా చూస్తున్నాడు. ఏం చెయ్యను సరూ! నన్ను నేను అమ్ముకోక తప్పదు. నేనొక్కణ్ణి ఆదర్శవంతంగా చేసుకొంటానంటే మాత్రం నా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళెలా అవుతాయి!"
బాధగా నుదురు రాసుకున్నాడు భాస్కరరావు.
సరోజిని ఆలోచిస్తూ కూర్చుంది.
"నేను వస్తాను సరూ!" లేచాడు భాస్కరరావు.
"కూర్చో భాస్కర్."
భాస్కరరావు కూర్చున్నాడు.
"నీకు కావలసింది పదిహేనువేలే కదూ?"
"నాక్కాదు. మా ఇంట్లోవాళ్లకి."
"అదేలే! ఆ డబ్బు ఎవరిచ్చినా మీ ఇంట్లోవాళ్లకి అభ్యంతరం ఉండదుగా..."
"ఒక కులమయితే చాలు. ఇంకే అభ్యంతరాలు లేవు."