Previous Page Next Page 
ఆత్మబలి పేజి 15


    "అలా అయితే ఆ డబ్బు నేనే ఇస్తాను."
    "నువ్వా? నువ్వు నాదానివి కావటంకంటే నాకు వేరే అదృష్టమేముంటుంది సరూ! కాని నీదగ్గర్నుండి డబ్బు తీసుకోవటానికి మనసొప్పుకోవటంలేదు. డబ్బు కోసం నిన్ను చేసుకున్నాననే భావన నీలో నేను సహించలేను. అంతకంటే నిన్ను వదులుకోవటమే నయం."
    ఆవేదన ధ్వనించే భాస్కర్ కంఠస్వరం సరోజిని మనసులో కొద్దిపాటి అనుమానాన్ని దూరంచేసి భాస్కర్ పట్ల నిండుకొన్న మమకారాన్ని మరింత దట్టంచేసింది.
    "అలా అనకు భాస్కర్. నిజానికి నీ తప్పేముందీ? నువ్వన్నట్లు నువ్వు ఆదర్శవంతంగా ఉండాలన్నా, మిగిలినవాళ్ళు ఆదర్శవంతులై నీ చెల్లెళ్ళను పెళ్ళి చేసుకోవద్దూ? ఈ సాంఘికాచారాలు మార్చటం ఒకనాటితో ఎవరివల్లా అయ్యేది కాదు. నా డబ్బు నీ డబ్బు కాదా? డబ్బు కోసం నువ్వు నాకు దూరమయితే, ఈ డబ్బు నేనేం చేసుకోను? నా సర్వస్వమూ నీది భాస్కర్! లేనిపోని అనుమానాలతో నాజీవితం చీకటి చెయ్యకు." సరోజిని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    భాస్కరరావు నిజంగా కదిలిపోయాడు. ఆమె కన్నీళ్ళు తన రుమాల్తో తుడిచాడు.
    "సారీ సరూ! నేను నిన్ను వదులుకోలేను. ఏదో ఆవేశంలో అన్నది మరిచిపో! ఛీ! ఆ కన్నీళ్ళేమిటి? నేను చూడలేను బాబూ! ఏదీ నవ్వు? ఆ..అలా.." సరోజిని కిల కిల నవ్వింది.
    సరోజినీ భాస్కరరావుల వివాహం నిశ్చయమయిపోయింది.


                                                    *    *    *


    సరోజిని ద్వారా విషయం విన్న శోభ నిర్ఘాంతపోయింది. సరోజిని నవ్వుతూ "నాలాంటి సామాన్యమైనదానిని భాస్కరరావు లాంటి అందగాడు ఎలా చేసుకుంటాడనేనా నీ ఆశ్చర్యం?" అంది.
    సరోజిని అలా కుండపగలకొట్టినట్లు మాట్లాడేసరికి శోభ తడబడింది. "అదికాదు అదికాదు." అని ఆగిపోయింది.    
    "అది కాకపోవటమేం? అదే శోభా! ప్రేమ అనేది విచిత్రమైనది. ఎవరితో, ఎవరికి, ఎందుకు కలుగుతుందో చెప్పలేము. భాస్కరరావు నన్ను ప్రేమించాడని మనసారా నమ్మి నేను చేసుకుంటున్నాను. ఒకవేళ నీ అనుమానం నిజమయి భాస్కర్ నన్ను డబ్బు కోసమే చేసుకుంటున్నాడని అనుకొందాం. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే డబ్బుకోసం పెళ్ళిచేసుకున్న ఒక ఆడదాన్ని చూసి జాలిపడినంతగా డబ్బుకోసం పెళ్ళిచేసుకున్న ఒక మొగవాణ్ణి చూసి జాలిపడనక్కర్లేదు. సంఘమూ, ప్రకృతీ కూడా వాళ్ళకు కేవలం పెళ్ళిలోనే తమ ఆనందమంతా నింపుకోవలసిన అగత్యం లేకుండా చేశాయి. పెళ్ళి విషయంలో ఆడవాళ్ళ కంటే మొగవాళ్ళు డబ్బుకు ప్రాధాన్యమియ్యటానికి కారణం ఇదేనేమో?"
    శోభ నిట్టూర్చింది.
    "అన్నీ ఇంత స్పష్టంగా తెలిసినదానివి భాస్కరరావుతో సుఖపడగలననే అనుకొంటున్నావా?"
    "ఎందుకు సుఖపడలేను? భాస్కరరావు నావాడనే భావనే నాకు అంతులేని సుఖం. ఆ మధుర భావనలో మిళితమైన ఎంత హాలాహలమైనా జీర్ణం చేసుకోగలను."
    "సుఖమంటే ఏమిటో నాకు తెలియకుండా పోతోంది సరూ! నేనేం చెప్పగలను? నువ్వు కలకాలం సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను."
    మూర్తి వచ్చాడు. శోభ వచ్చినట్లతనికి తెలిసింది.
    "హలో శోభాదేవిగారూ! బహుకాలదర్శనం" అన్నాడు. శోభ చిన్నగా నవ్వి ఊరుకొంది.
    "శుభవార్త మీరూ వినే ఉంటారు. భాస్కరరావు లక్కీఫెలో!" మళ్ళీ అన్నాడు మూర్తి.
    "లక్కీఫెలో అని ఎందుకంటున్నారు?" విరక్తిగా అడిగింది.
    "అదేవిఁటండీ! సరోజిని లాంటి బంగారుబొమ్మ లభించటం అదృష్టం కాదూ?"
    "ఆ బొమ్మలో బంగారు హృదయం గుర్తించగలిగితే నిజంగా అదృష్టవంతుడే!"
    "ఆ బంగారు హృదయాన్ని చూసే ఈ బంగారుబొమ్మను వరించాడు భాస్కరరావు."
    ఈ మాటలతో శోభకేదో ఊరట, సరోజినికి సంతృప్తి కలిగాయి.
    "అన్నట్లు బంగారమంటే గుర్తుకొచ్చింది. మీరు విరాళానికి బంగారమెంత పోగుచేశారు?" శోభనడిగాడు మూర్తి.
    "ఎక్కువ పోగుచెయ్యలేకపోయాను. ఎవరినడిగినా, ఏదో నా స్వంతానికి అడుగుతున్నట్లు కష్టంగా మాట్లాడుతుంటే చిరాకేసింది. కొద్దిగా పోగయింది."
    శోభ తన చేతి రుమాలులో మూట కట్టిన నాలుగయిదు బంగారు వస్తువులు మూర్తిచేతి కందించింది. మూర్తి ఆ మూట విప్పి అందులో డాక్టర్ రావు రిస్ట్ వాచ్ చూసి ఆశ్చర్యపోతూ "ఇది రావుగారిది కదూ!" అన్నాడు.
    "అవును."
    "ఇది ఆయనకు చాలా ప్రాణం. వాళ్ళ నాన్నగారు ప్రెజెంట్ చేసింది."
    "అవునట!"
    మూర్తి ఇంకేమీ మాట్లాడలేదు. వాచ్ వంక ఒకసారీ, శోభవంక ఒకసారీ చూసి ఊరుకొన్నాడు. ఇంతలో భాస్కరరావు వచ్చాడు.
    "శోభాదేవిగారు వచ్చారే! ఏదో విశేషం ఉంది" నవ్వుతూ అన్నాడు భాస్కరరావు.
    "మీకు నా శుభాకాంక్షలు అందచెయ్యటానికి" నవ్వింది శోభ.
    భాస్కరరావు సరోజిని వంక చూశాడు. సరోజిని సిగ్గుపడి అందరికీ కాఫీలు అందించే వంకతో అక్కడినుండి లేచిపోయింది.
    "మేరు రావుగారింటి కెళ్ళారా?" ధైర్యం చేసి శోభనడిగాడు మూర్తి.
    "ఊ!" రావు పేరు వినగానే మనసు ఏవేవో ఆలోచనలతో అల్లకల్లోలమయిపోగా పరధ్యానంగా అంది.
    "అతని కూతురు ఆశను చూశారా?"
    "చూశాను."
    "చాలా బాగుంటుంది కదూ!"
    "అవును."

 Previous Page Next Page