జ్యోతుల్లా మండుతున్న కళ్ళతో అంతకు రెట్టింపు మండుతున్న మనసుతో పడుకుని ఉన్న శోభ దగ్గరకు ఒకచేత్తో పూరీల పళ్ళెంతో, మరొకచేత్తో పాలగ్లాసుతో వచ్చింది ఉమ.
"నువ్వు బంగారుతల్లివి. దేవతవు. నేను రాక్షసిని. భోగందానిని. నా దగ్గిరకెందుకొచ్చావ్?" కసిగా అంది శోభ.
ఉమ శాంతంగా నవ్వింది.
"ఈ పూరీలు తినకపోతే నువ్వు నిజంగా రాక్షసివే! పనంతా అయ్యాక ఇప్పటికిప్పుడు పిండితడిపి చేశాను. లే!"
శోభ లేవకుండా అలానే ఉమ ముఖంవంక చూస్తూ కూర్చుంది. శోభ కళ్ళల్లో నీళ్ళు నిండి చెక్కిళ్ళ మీదుగా జారి మండుతున్న గుండెల మీద చల్లగా జాలువారాయి.
"నువ్వు నిజంగా దేవతవేనే ఉమా!" అంది.
"ఎందుకు? గుమాస్తాగా యమ చాకిరీ చేస్తూ ఇంటినంతా పోషిస్తూ, చెల్లెలికి చదువు కూడా చెప్పిస్తున్నాను గనుకనా? సంపాదిస్తూ కూడా మిల్లు చీరలూ, లాన్ జాకెట్లూ తప్ప ఆడంబరమైన దుస్తులు ధరించననా? కనీసం రిస్టువాచ్ అయినా కొనుక్కోకుండా జీతమంతా ఇంటి ఖర్చులకిచ్చి 'నాజీతం' అనైనా అనుకోనందుకా? నేను ఎందుకు దేవతనో చెప్పు."
"ఇలా చల్లగా మాట్లాడగలుగుతున్నందుకు. అలా శాంతంగా నవ్వగలుగుతున్నందుకు. నీకు ఏ చికాకులూ లేవా ఉమా?"
"లేవు."
"అన్నయ్య పిల్లలకందరకూ చాకిరీ చేస్తున్నప్పుడు...వదిన పిల్లల్ని నీమీద వదలి సినిమాకెళ్ళిపోయినప్పుడు, సన్నజాజులన్నీ వదినొక్కర్తె పెట్టుకుని 'పెళ్ళయ్యాక అన్నీ నీకే ఇస్తానులే!' అని సరసమాడినపుడు, అన్నయ్య చెల్లెలిగా కాక, ఒక దాసిలా నీమీద అధికారం చెలాయిస్తున్నప్పుడు, సంసారంలో చిరాకులు ప్రదర్శించటానికి మరెవరూ దొరక్క పిన్ని చిరాకంతా నీమీద గుమ్మరించినప్పుడు ఎప్పుడూ, ఎన్నడూ చిరాకు కలగలేదా?"
"ఏదో ఆశించి, ఆ ఆశయసిద్ధికోసం పరిస్థితుల నెదుర్కోదలచిన వాళ్ళకు అన్నీ చిరాకులే! పరిస్థితులతో రాజీపడి, వానినుండే సాధ్యమైనంత మంచిని పొందడానికి ప్రయత్నించేవాళ్లకు చిరాకులేముంటాయి?"
"అయితే, నీకీ పరిస్థితులన్నీ మంచివిగానే ఉన్నాయా?"
"నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. పరిస్థితులు బాగున్నాయనటం లేదు. వాటితో రాజీపడ్డానంటున్నాను."
"ఏవిఁటా మంచి?"
"నాకు కలుగుతున్న మనశ్శాంతీ, సంతృప్తీ ఒకటి; నా పరిసర వ్యక్తులందరి ప్రేమనూ పొందగలగటం రెండు."
"నా పరిస్థితులో నువ్వుంటే ఏం చేసేదానివో చెప్పు."
"ట్యూషన్ మానేసేదానిని."
"అన్యాయంగా వాళ్ళంటున్న మాటలకు విలువనియ్యాలంటావా?"
"అన్యాయంగా అన్నారని ఎందుకనుకుంటున్నావు అక్కయ్యా!"
"అంటే? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఉమా!"
"ఉహు! ఒక్కనాటికీ అనుమానించను. కాని, ఒక్క విషయం వివరిస్తాను. అర్థం చేసుకో! మన పక్కింటివారి అబ్బాయికి కూడా ట్యూషన్ కావాలిట చెపుతావా?"
"........."
"నాకు తెలుసు. చెప్పవు. అతనికే కాదు ఎవరికీ చెప్పవు. కాని రావుగారి అమ్మాయికి మాత్రం చెపుతావు. అంటే రావుగారు నీకు అందరిలాంటివారు కారన్నమాట!"
"........."
"ఈ ట్యూషన్ లోకానికంతకూ రావుగారికి నీ మనసులో ఏదో ప్రత్యేకస్థానముందనే విషయాన్ని స్పష్టం చేస్తూంది. వాళ్ళూరుకోరు."
"అవును. మనసులో గౌరవముంది. అంతమాత్రాన ఇంత నీచంగా మాట్లాడటమేనా?"
"సాధారణ స్థాయిలో ఎవరైనా మనసుకీ, శరీరానికీ పెద్ద బేధం పాటించరక్కయ్యా! మనసులో మమకారాన్ని పెంచుకొంటూ నిగ్రహంతో మసిలే వ్యక్తులు తక్కువ. ఈ విషయాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఇంకా తక్కువ. అందుకే సామాన్య జనులెవరూ యవ్వనాన్ని నమ్మరు. అందులో నువ్వు కొంత స్వతంత్రంతో వ్యవహరిస్తావు. పదిమంది మధ్య ఒదిగి ఉండే గృహిణిని ఏమనటానికీ ఎవ్వరూ సాహసించరు. ఆమె మనసులో ఏమున్నా, దానిని ఆచరణలో పెట్టే అవకాశాలుండవు గనుక. నీకలాంటి అవకాశాలు కొల్లలు. అందుకే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు."
"........."
"ఒక్క విషయం అడగనా అక్కయ్యా?"
"అడుగు."
ర"రావుగారిమీద నీకు కేవలం గౌరవమేనా?"
"కాదు. ఆయన నా సర్వస్వమూ."
"ఆయనకు...?"
"ఆయనకూ నామీద చాలా అభిమానమనే అనుకొంటున్నాను."
"అయినప్పుడు మీరిద్దరూ ఎందుకు పెళ్ళి చేసుకోకూడదూ? ఆయన ఏమంటున్నారు?"
"వెంటనే చేసుకుంటానన్నారు. నేనే కొంతకాలం ఆగమన్నాను."
"ఎందుకూ? మా కోసమా?"
"ముఖ్యంగా అది. ఇంకొకటి కూడా ఉంది. ఆశ ఆయన ప్రాణం. నేనింకా ఆశను నా కూతురిగా అంగీకరించలేకపోతున్నాను. మనసులో కల్మషం పెట్టుకుని రావుగారిని మోసగించగలిగే నైచ్యం ఇంకా నాలో చోటు చేసుకోలేదు. కొన్ని రోజులు ఆశకు సన్నిహితంగా మెలిగి ఆశను నిండు హృదయంతో ప్రేమించగలనో లేదో నన్ను నేను పరీక్షించుకోవాలి. రావుగారి ప్రేమను ఆశతో పంచుకోగలిగే సహనశక్తి నలవరచుకోగలగాలి. నా ఎదురుగా రావుగారు ఆశను దగ్గరకు తీసుకుని గారాబం చేస్తుంటే నా మనసులో ఏదో ముల్లు గుచ్చుకొన్నట్లుగా అయింది. ఈ భావన నుంచి అట్లాంటి సంఘటనను అత్యంత సహజంగా తీసుకోగలిగేశక్తి నాకు కలగాలి. అప్పుడు కానీ రావుగారిని వివాహం చేసుకోలేను. అందుకే ట్యూషన్ కు ఒప్పుకున్నాను. ఆశకు దగ్గిర కావడానికి ప్రయత్నిస్తున్నాను."