Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 14

   
    "ఏమిటి ఆలోచిస్తున్నావు కమల్! గోమతి అడిగింది.    
    "నిజం చెప్పితే నమ్మవేమో గోమతి!"    
    "నమ్ముతాను."    
    "నేను మగవాడినయినా నాకు నా వాళ్ళకి దూరం అయాననే బాధ లేకపోలేదు. మావాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను."  
    కీర్తి మాటలు నమ్మనట్లు కనిపించింది గోమతి అనుమానంగా చూసింది.    
    కీర్తి అనుమానంగా చూసింది గోమతిని.    
    "మనకి కావలసినవి తీసుకుందాము. నీవు చీరలుతీసుకో నా బ్యాగ్ లో నా సామానుంది మిగిలినవి దాద్దాము" అంది కీర్తి.    
    "నీ ఇష్టం కమల్." అంది గోమతి.    
    కీర్తి చీరలు, రెండుటవల్లు మాత్రం తీసి తన బ్యాగ్ లో సర్దింది మిగతావి ఈ సూట్ కేసులోవి ఆ సూట్ కేసులో ఆ సూట్ కేసులోవి ఈ సూట్ కేస్ లో సర్ది అన్ని పైకి ఎక్కించారు. బొబ్బూ చేత.    
    కీర్తి చేస్తున్నదంతా చూస్తూ కూర్చుంది గోమతి.    
    సుండా జాతి నాయకుడి దగ్గరకు, తీసుకెళ్ళారు గోమతిని కీర్తిని.    
    నాయకుడు సౌంజ్ఞచేసి అడుగుతున్న దానికి సౌంజ్ఞ ద్వారా కీర్తి చాతయిన విధంగా చెపుతున్నది.    
    గంటయింది.    
    బైట కోలాహలం వినపడింది.    
    వెత కెళ్ళినవారు ఒకతన్ని మోసుకు వచ్చారు.    
    నాయకుడితోపాటు కీర్తి, గోమతీ అతన్ని చూశారు, అతను స్పృహ తప్పి వున్నాడు. శరీరం మీద చాలా గాయాలు వున్నాయి.    
    నాయకుడి ఆజ్ఞానుసారం అతని గాయాలకి పసరుమందు రాయటం జరిగింది. స్పృహ తెప్పించ టానికి ప్రయత్నం చేస్తున్నారు.    
    "గోమతి! మనతో పాటు ప్రయాణం చేసినవాడే ఎవరైనాగాని మనం ఏ మాత్రం పరాయి వాళ్ళుగా బైట పడవద్దు. ప్లీజ్ వివరం నే చెప్పలేను. ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడది వుంటే కథ మార్పువస్తుంది మనం ఒకరి కొకరు ఆప్తులుగా వుందాం సరేనా? కీర్తి మనసులో మరో ఉద్దేశం పెట్టుకుని అంది.    
    తన సౌందర్య మీద నమ్మకం తన కోసం ఎందరో మగవాళ్ళు వలవేయటం తన్ని ఆరాధించటం గుర్తొచ్చిన గోమతి మరోవిధంగా అర్ధం చేసుకుంది. అతనెక్కడ తన్ని సొంతం చేసుకుంటాడో అని కమల్ ఆరాట పడుతున్నాడనుకుంది.    
    "మగబుద్ది పోనిచ్చుకున్నావు కాదు." అంది గోమతి మునిపంటితో పెదవి కొరుక్కుంటూ.    
    "ఆడది అనుమానం కల్సిపుట్టాయి." అంది కీర్తి.    
    మూతి తిప్పి ఊరుకుంది. గోమతి.    
    అతనికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి విస్తుపోతూ అందరినీ చూడటం మొదలు పెట్టాడు.    
    తన పేరు కమల్ మొహ్రో అని చెప్పి విమానప్రమాద వివరాలు తదితర సంగతులు క్లుప్తంగా చెప్పింది కీర్తి.    
    "నా పేరు బాజారావు! నీరసంగా అన్నాడు బాజారావు.    
    "చూడండి మిష్టర్ బాజా! ముందు విశ్రాంతి అవసరం. మెల్లగా మాట్లాడు కోవచ్చు. కొందరేముంది!" అంది కీర్తి.    
    అంత నీరసంలోను కదలలేని స్థితిలోను బాజారావు చూపులు గోమతి మీద పడి తళుక్కుమన్నాయి.    
    గోమతి ముఖం తిప్పుకుంది.
    
                                      10
    
    బాజారావు మామూలు మనిషి కావటానికి నాలుగు రోజులు పట్టింది.    
    సుండా జాతి వారు ఆధునిక ప్రపంచానికి దూరమైనా వారయినా, తగిన పరికరాలు లేకపోయినా, వారి జీవన విధానం వేరయినా ఆకుపసరు మూలికలు వాడటంలో గట్టివారు. లెప్రసీకి కావలైస్న ఔషధాలు వాడకపోవటానికి కారణం లెప్రసీ పేషంటుని దేముడిగా భావిస్తున్నారు.    
    కీర్తి కాలు తమాషాగా బాగయింది, నెప్పి తగ్గి గాయం మానింది.    
    బాజారావు కి నయమయిందిగాయాలు ఆరుతున్నవి. లేచి తిరుగుతున్నాడు.    
    సుండా జాతివారు బాజారావు కి వేరే చెట్టుమీద గుడిసె నిర్మించారు.    
    కీర్తి గోమతి ఓకే గుడిసెలో పడుకుంటున్నారు.    
    కీర్తిని మగవాడిగా తలచిన గోమతి మొదట్లోవున్న విసుగు కోపం ప్రదర్శించుట లేదు "కమల్ మంచివాడు తనంటే ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు అయినా లేకి పనులు చేయటం లేదు. లిమిట్ దాటటం లేదు" అనుకుంది.

 Previous Page Next Page