Previous Page Next Page 
దశావతారాలు పేజి 13


    మాధవ తేలిగ్గా కొట్టిపారేస్తూ "ఏదో చాదస్తం - పోనిస్తూ__" అన్నాడు.
    ఆరోజు ఇంట్లో భారీఎత్తున పూజలు ప్రారంభించింది వెంకటమ్మ...
    "ఎందుకీ పూజలు ?" అంది సునీత ...
    "ఎందుకేమిటి ? నీ కడుపున ఒక కాయ కాయటానికి..." విసుక్కుంటూ. అంది వెంకటమ్మ ...
    బిక్కచచ్చిపోయింది సునీత...చేసేదిలేక వెంకటమ్మ చెయ్యమన్ననన్నీ చేసింది... చివర పురోహితుడిచేత కంకణం కూడా కట్టించుకుంది...
    బెడ్ రూంలో ఆ కంకణం విప్పి దూరంగా పారేస్తూ "ఈ కంకణంలో నిజంగా మహత్యం ఉండి పిల్లలు పుడతారేమో! మళ్ళీ కట్టుకోకు__" అని పకపకా నవ్వాడు మాధవ్... రోషంగా తల తిప్పుకుంది సునీత...
    "పిల్లికి చెలగాటం... ఎలుక్కి ప్రాణసంకటం..." అంది కన్నీళ్ళతో...
    మాధవ్ జాలిపడి ఆ కన్నీళ్ళు తుడుస్తూ "ఇంత మాత్రానికేనా? ఆ మాత్రం భరించలేకపోతే ఎలా?" అన్నాడు ప్రేమగా.
    ఆ అనునయంలో తన చిరాకంతా మరిచిపోయింది సునీత...
    ఇంక ఆరోజునుంచీ తాయెత్తులూ, మంత్రాలు, విభూదులూ ఒకదాని వెంట ఒకటి కురవసాగాయి సునీతమీద.... చచ్చినట్టు అన్నీ భరించింది...
    ఏడాది గడిచింది...
    వెంకటమ్మకు సహనం నశించింది__తనకు మనవడు రాకపోవటానికి కారణం సునీతే అయినట్లు ఏదో వంకన సునీతను సతాయించసాగింది...
    ఆరోజు తనింటికొచ్చిన లేడీ డాక్టర్ నుచూసి ఆశ్చర్యపోయింది సునీత...
    "ఎవరికి జబ్బు ? డాక్టరెందుకు ?" అంది__
    వెంకటమ్మ మూతి, ముక్కు విరుస్తూ "ఇంకెవరికీ? నీకే! నీ కోసమే తీసుకొచ్చాను__" అంది.
    సంగతి అర్ధం చేసుకుంది సునీత ...
    తనను పరీక్షచెయ్యటానికి వచ్చిన లేడీ డాక్టర్ తో రహస్యంగా చెప్పేసింది...
    "మావారికి పిల్లలక్కర్లేదు_ఈవిడకి వెంటనే కావాలి- మధ్యలో నేను ఛస్తున్నాను__"
    లేడీ డాక్టర్ ఓదార్పుగా "ఇంతేనా? మీవారి ఆలోచనే మంచిది. ఇప్పటినుండీ పిల్లలెందుకు? రెండు మూడేళ్లయ్యాక చూసుకోవచ్చు__ మీ అత్తగారితో ఎలాగో సర్దుకుపో!" అంది...
    వెంకటమ్మతో "మీ కోడలికి జబ్బేమీలేదు_మీరు అనవసరంగా కంగారు పడకండి__" అనేసి వెళ్ళిపోయింది. ఈ వార్త వెంకటమ్మకు ఏమీ రుచించలేదు - అప్పటివరకూ ఆవిడ తన కోడలికి ఏదైనా జబ్బుకాకూడదా అని ఆశపడుతూ వచ్చింది- మందులేవో ఇప్పిస్తే ఆ జబ్బు నయమయిపోయి తనకు మనవడు పుడ్తాడని ఆశపడుతోంది_లేడీ డాక్టర్ మాటలతో ఆవిడ ఆశలన్నీ నీళ్ళు కారిపోయాయి. ఆ ఆశాభంగమంతా సునీతమీదకసిగా మారింది_రోజు ఏదో ఒక వంకన "గొడ్రాలు" అని సునీతను నిందించకుండా ఉండదు - ఆమాట విన్నప్పుడల్లా సునీతకు ఒళ్ళంతా కారం రాసినట్లు అనిపించేది. రోజురోజుకూ పిల్లలు పుట్టడానికి సలహాలు చెప్పేవాళ్ళూ... చిట్కా వైద్యాలు చెప్పేవాళ్ళూ__ఎక్కువయిపోయారు... ఎవరో బైరాగి మంత్రం వేస్తాడనీ...మరెవరో 'అమ్మ' విభూది ఇస్తుందని కూడా కబుర్లు రాసాగాయి.
    పిల్లిమీద పెట్టీ, ఎలుకమీద పెట్టీ రోజుకొకసారైనా "పిల్లలులేని ఆడదాని బ్రతుకూ ఒక బ్రతుకేనా?" అనకుండా ఉండదు వెంకటమ్మ...
    రోజురోజుకీ ఈపరిస్థితి దుర్భరమయిపోయింది సునీతకు... ఇంక భరించలేకపోయింది.
    మనవడిమీద ఆశలన్నీ వదిలేసుకున్న వెంకటమ్మ సునీత వాంతి చేసుకుంటుంటే విసుక్కుంటూ "ఏ అడ్డమైన గడ్డ తిన్నదో?" డాక్టర్ కి చూపించుకో!" అంది...
    "అదికాదత్తయ్యా ! మీకు బుల్లి మనవడు రాబోతున్నాడు__" సగర్వంగా చెప్పింది సునీత...
    వెంకటమ్మ ఆనందానికి అంతులేదు_సత్యన్నారాయణ వ్రతం చేసింది __ వేంకటేశ్వరస్వామికి కొబ్బరికాయలు కొట్టింది... రాముణ్నీ కృష్ణుణ్నీ పూజించింది_ చివరకు ఆంజనేయ దండకం కూడా చదివేసింది.
    మాధవ్ మాత్రం ముఖం చిట్లించుకున్నాడు__ "ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇంత చెప్పినా..." అన్నాడు రుసరుసలాడుతూ...
    "క్షమించండి! మీ మాట కాదనాలని నాకు లేదు__నాకుమాత్రం ఒకటి రెండేళ్ళు చంటీ వెంటీ లేకుండా సుఖపడాలనిలేదా? కానీ ఈ అమ్మలక్కల బాధ పడలేక..."
    "బాగుంది ! వాళ్ళందరికి చెప్పవలసినది పోయి, నువ్వే..."
    "నన్నేమైనా అనబోయేముందు మీరొక్కసారి ఆత్మపరీక్ష చేసుకోండి. మీ అమ్మగారికి మీరెంతవరకు నచ్చజెప్ప గలిగాను? ఏవేవో అబద్దాలతో మాయమాటలతో దాటుకుపోవాలని చూసారు కాని మీ మార్గానికి ఆవిడను రప్పించగలిగారా? మన పెద్దవాళ్ళు కూడా మన పరిస్థితి అర్ధం చేసుకుని మనతో సహకరించేవరకూ మనం ఆశించే ఆ శుభోదయం సుదూరంలోనే వుంటుంది... నేను చెప్పగలిగినదల్లా మీ ఇద్దరిమధ్యా సమన్వయాన్ని సాధించటం ఇప్పుడు మీ అమ్మగారికోసం ఒక బాబు.... ఆ తరువాత మీకోసం... సారీ... మనకోసం... అయిదేళ్ళవరకు బంద్..."
    మాధవ్ వంకచూసి మనోహరంగా నవ్వింది సునీత - ఆ చిరునవ్వుకు కరిగిపోయాడు మాధవ్__సునీత వాదనలో నిజానికి తలవంచాడు...అవునుపాపం ! సునీతకాని మరొకరు కాని ఏం చెయ్యగలరు ? వెయ్యికాకుల మధ్య హంసకేం రాణింపు ? గులకరాళ్ళ గుట్టలో రత్నానికేం గుర్తింపు ? ఈ కుటుంబ నియంత్రణ ఆవశ్యకాన్ని అందరూ గుర్తిస్తే తప్ప మనం ఆశించే ఆ శుభోదయం సుదూరంలో వుండక తప్పదు__


                               * * * 

 Previous Page Next Page