ఇన్ స్పెక్టరు లాఠీని చేతిలోకి తీసుకున్నాడు.
"మిస్టర్ మూర్తి! పోలీస్ ట్రీట్ మెంట్ గురించి తెలుసా?...." సూటిగా అడిగి, క్షణం ఆగాడు.
మూర్తి తల వంచుకున్నాడు.
మూర్తి గడ్డం కింద లాఠీ పెట్టి అతని తలను పైకెత్తాడు. "బహుశా వినే ఉంటావు. ఇక థర్డ్ డిగ్రీ మెథడ్స్ అంటే ఏమిటో తెలుసా?"
అతను మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు.
"మిష్టర్ మూర్తి! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేసిన పాపం నీ నోటితో చెప్పి ఇప్పటికైనా మనిషిలా మారడానికి ప్రయత్నించు. లేదా నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు..." అంటూ లాఠీ టేబుల్ మీద పెట్టాడు.
ఇన్ స్పెక్టరులో ఇంటరాగేషన్ కు ముందు ఉన్న ఫీలింగ్స్ కు ఇప్పుడు ఉన్న ఫీలింగ్స్ కు చాలా తేడా తెలుస్తున్నది.
తను అన్నింటికీ సంసిద్దుడైనట్టు మూర్తి మొండిగా తన చేతులు రెండూ ముందుకు చాపాడు.
"మిష్టర్ మూర్తీ! మీరు మర్యాదగా జరిగిన విషయం దాచకుండా చెబితే నేను మిమ్మల్ని ఇంటరాగేట్ చేయవలసిన అవసరం లేదు..." క్షణం ఆగాడు అతను చెబుతాడన్న ఆశతో.
"ఇన్ స్పెక్టర్! నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీ డ్యూటీ మీరు చేయండి" అన్నాడు నిశ్చయంగా మూర్తి.
ఇన్ స్పెక్టర్ భ్రుకుటి ముడిపడింది.
అతను అంత మొండికేస్తే తను నిజంగా చేయగలిగిందేమీ లేదు. ప్రాణం తీసినా అతని నుంచి విషయం రాదని అర్థం చేసుకున్నాడు.
అతనిని ఏ విధంగా వంచాలో క్షణం ఆలోచించాడు ఇన్ స్పెక్టరు.
"మిస్టర్ మూర్తీ! నిన్ను ఇంటరాగేట్ చేసి నిజం చెప్పించవలసిన అవసరం లేదు. నీ నిజ స్వరూపం బయటపడింది. కాలేజి విద్యార్థినులు నీ గురించి చెప్పారు. అమాయకులైన విద్యార్థినులకు స్వీటులో మత్తుమందు కలిపి పెట్టి, మైకంలో ఉన్న సురేఖను మానభంగం చేశావు. ఆ అవమానంతోనే సురేఖ ఆత్మహత్య చేసుకుంది. యూ ఆర్ ఎ బ్లడి...." ఇన్ స్పెక్టరు ఉద్రేకంగా అన్నాడు.
అతని మాటలకు మూర్తి నవనాడులూ క్రుంగిపోయాయి.
తన పది సంవత్సరాల ఆధ్యాపక వృత్తిలో ఎన్నడూ రాణి మచ్చ ఈ రోజున తన మీద పడింది. ఇది తన జీవితానికే కళంకం.
చేయని నేరం తన మీద పడిందన్న బాధ అతనిలో కనిపిస్తున్నది. అప్రయత్నంగా కళ్ళ నీళ్ళు తిరిగాయి మూర్తికి.
"నో ఇన్ స్పెక్టర్! నేనంత కిరాతకుడిని కాను. నన్ను నమ్మండి...."
"మిస్టర్ మూర్తీ! ఇప్పటికైనా జరిగింది చెప్పు. నేరం ఒప్పుకుంటే శిక్ష కొంతైనా తగ్గుతుంది..."
"సార్! నేను ఏ నేరం చేయలేదు. ఆరోజు అమరావతిలో రవికుమార్ తెచ్చిన స్వీటును అందరితోపాటు నేనూ తిన్నాను. కొద్ది నిముషాలలోనే నాకూ మైకం కమ్మింది. ఆ మైకంలో ఏం జరిగిందో నాకు తెలియదు. చీకటి పడుతుండగా నాకు తెలివి వచ్చింది. చుట్టూ పరిసరాలను చూశాను. విద్యార్థినులంతా దిశ మొలలతో చెల్లా చెదురుగా పడివున్నారు. వెంటనే కేకలు పెట్టాను. నా కేకలతో అందరికి మత్తు వదిలింది. అంతా సిగ్గుతో తలలు దించుకున్నారు. ఆడపిల్లలంతా కృష్ణలో పడి ప్రాణాలు తీసుకుంటామని ఏడ్చారు. వాళ్ళను సముదాయించి, చివరకు నది ఒడ్డున జరిగిన విషయాలు అక్కడే మరచిపోదామని అందరితో ప్రమాణం చేయించాను. నేనూ ప్రమాణం చేశాను. అందుకే మీతో జరిగింది చెప్పలేదు. అప్పటినుంచీ రవికుమార్ జాడ కనిపించడం లేదు. ఆ మరునాటి నుంచి సురేఖ కాలేజీకి రాలేదు. ఇంటి దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు. సురేఖ ఆత్మహత్య చేసుకుందని అందరితోపాటు నాకూ తెలిసింది" మూర్తి చెప్పడం ఆపి, రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు.
"మిష్టర్ మూర్తీ! మీరు అనవసరంగా భయపడి విషయం దాచిపెట్టారు. ఇందులో మీ ప్రమేయం ఏమీలేదు. రవికుమార్ ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఎవరు మాత్రం ఊహించగలరు? ఏమైనప్పటికీ, మీరు మిగిలిన ఆడపిల్లల జీవితాలను కాపాడగలిగారు. రవికుమార్ ఒక్కడే ధైర్యంగా ఈ పని చేశాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. అతనికి సహాయంగా మరికొందరు ఉండివుండాలి. బైదిబై...మూర్తీ! నేను ఇంతకుముందు మీ విద్యార్థినులతో పరుషంగా మాట్లాడాను. అయినా వాళ్ళెవరూ నాకు అసలు విషయం చెప్పలేదు. మీరు కూడా నాకు ఏమీ చెప్పనట్టు, ఆడపిల్లలకు మళ్ళీ ధైర్యం చెప్పండి. వాళ్లు ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూడవలసిన బాధ్యత మళ్ళీ మీమీదే పెడుతున్నాను..."
ఇన్ స్పెక్టరు తనమీద పన్నిన పన్నాగానికి తను పూస గుచ్చినట్టు అన్నీ చెప్పాడు.
అతని పాత్ర పోషణ నైపుణ్యానికి క్షణం విస్తుపోయాడు మూర్తి.
* * * *
కాలేజీకి సెలవులు.
సాహితీ, కళ్యాణి, గౌతమి తరచు కలుసుకోవడం లేదు.
సెలవులు కావడంతో తీరిగ్గా ఓపిగ్గా సమ్రాట్ నవలలన్నీ చదివింది సాహితి. ఈసారి సమ్రాట్ ముందు తను దోషిలా తల వంచుకోవలసిన పనిలేదు. అతని నవలలలోని ప్రతి పాత్రనూ విశ్లేషించి చెప్పగల ధైర్యం ఇప్పుడామెకు కలిగింది!
సమ్రాట్ ను కలిసి అతను సృష్టించిన పాత్రల గురించి ప్రశ్నలడిగి అతడిని కొంచెం తికమకపెట్టాలనే చిలిపి కోరిక కలిగింది సాహితికి.
బిందుమాధవి లేని సమయం చూసి సమ్రాట్ కు ఫోన్ చేసింది.
సాయంత్రం పార్కులో కలుసుకోవడానికి ఇద్దరూ నిశ్చయించుకున్నారు.
సాయంత్రం అవుతుండగా పార్కుకు వెళ్ళడానికి సాహితీ తయారయింది.
సరిగ్గా అదే సమయానికి బిందుమాధవి ఎదురయింది.
సాహితి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
"ఎక్కడికే బయలుదేరావు?" అనుమానంగా అడిగింది బిందుమాధవి.
"ఇంట్లో బోర్ కొడుతుంటే ఓసారి అలా గౌతమిని, కళ్యాణిని చూసివద్దామని..."
"ఉండుండు, అయితే నేనూ నీతో వస్తాను. నాకూ ఇంట్లో ఒంటరిగా ఉండడం బోరుగానే ఉంది. నీ పనయిన తరువాత, అటు నుంచి అటే పిక్చరుకు వెళదాం..."
ఆమె మాటలకు పిడుగు పడినట్టు క్షణం అదిరిపడింది సాహితి.