Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 13


    ఉదాసీనంగా అన్న మాధవరావు మాటల్లో వ్యంగ్యం అర్థమయినా సమాధానం చెప్పలేకపోయింది మణిమాల!
    మిసెస్ భాస్కరరావు ద్వారా పరిచయమయ్యాడు డాక్టర్ వినోద్ మణిమాలకి. మిసెస్ భాస్కరరావు వర్ణించగలిగినదీ డాక్టర్ వినోద్ ఐశ్వర్యాన్నే! మణిమాల చూడగలిగినదీ అతని ఐశ్వర్యాన్నే! అంతకుమించిన ప్రత్యేకత ఏమీలేదు అతని వ్యక్తిత్వంలో. డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులార్జించాడు. ఎన్నో బ్రాంచ్ లున్నాయి. ఎందఱో అసిస్టెంట్స్ పనిచేస్తున్నారు. మొదటి భార్య చచ్చిపోయింది. నడివయసులో ఉన్నాడు. మణిమాలను చూడగానే ఆవిడ ఆకర్షణకు లోబడ్డాడు వినోద్. మొదట్లో మణిమాల పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ, నలుగురిలో ఘనంగా కన్పించాలన్న కోరికా, ఆ కోరికలన్నీ తీర్చలేని మాధవరావు ఆర్ధిక స్థితీ కారణంగా అతనికి సన్నిహితురాలయింది. వినోద్ తోటి స్నేహం విషయం తెలిస్తే తనకు మాధవ్ కు యుద్ధం తప్పదనుకుంది. పరిస్థితి అంతవరకూ వస్తే మాధవ్ ను వదిలి వినోద్ దగ్గరకు వెళ్ళిపోవటానికే నిర్ణయించుకుంది. ఆ భరోసా వినోద్ ఇచ్చాడు.
    కాని ఈ విషయం తెలిసే మాధవరావు ఏమీ మాట్లాడలేదు. ఆ గాంభీర్యం మణిమాలను మరింత భయపెట్టింది. వారిద్దరూ విడిపోలేదు. కానీ ఇక ఇనుప తెర వాళ్ళ మధ్య పడిపోయింది.
    అప్పటినుండీ మణిమాల వినోద్ కోరిక మన్నించి అతనితో కలిసి తిరక్క తప్పలేదు. వాళ్ళగురించి గుసగుసలు వ్యాపించాయి.
    "ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట? వచ్చెయ్యి!" అనేవాడు వినోద్.
    మణిమాలకు ఈ వ్యవహారం నచ్చలేదు. అది వినోద్ మీద ప్రేమ కాదు. ఒకప్పుడు మణిమాల మాధవ్ ను ప్రేమించే పెళ్ళి చేసుకుంది. ఈనాడు అతణ్ని వంచించాలని మణిమాలకు లేదు. వినోద్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా అతనికి చెప్పే వెళ్తుంది. అది మాధవ్ మనసుకు ఎలాంటి రంపపు కోతో తెలియక కాదు. మాధవ్ కోపం పట్టలేక వెళ్ళిపోమంటే ఈ కపట నాటకం నుండి బయటపడి వెళ్ళిపోవాలని...
    "నా అంతట నేను మాధవ్ ను వదిలి రాలేను! కానీ, అతడు వెళ్ళిపొమ్మన్న మరుక్షణం నీ దగ్గిరకి వచ్చేస్తాను." అంది వినోద్ తో.
    ఈ మాటలంటున్నప్పుడు మణిమాల కంఠం ఎందుకు గద్గద మయిందో, ఆవిడ కంఠంలో అనురాగానికి బదులు ధ్వనించిన కసిలాంటిది ఎవరిమీదో అర్థంకాలేదు వినోద్ కి! అయితే ఇలాంటి అర్థంలేని విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ బుర్ర పాడుచేసుకునే తత్వంకాదు అతనిది! అతనికి కావలసినది మణిమాల! మణిమాల సౌందర్యం!
                                           9
    మాధవరావు స్నేహితుడికొక పూలతోట ఉంది. ఆ తోటలోకి పిక్నిక్ కి వెళ్ళటం మాధవరావుకెంతో ఇష్టం. పెళ్ళయిన కొత్తల్లో మణిమాలను తీసుకుని రెండు మూడుసార్లు ఆ తోటకి వెళ్ళాడు. కానీ, రాను రాను మణిమాల పిక్నిక్ అనేసరికల్లా ఆడా, మొగా తన స్నేహితులందరినీ పోగుచేసుకురావడంతో మాధవరావు విసుక్కుని తను వెళ్ళడం మానేసాడు. మణిమాల కారణమడిగితే "అంతమంది మధ్య నాకేం బాగుండదు! పోనీలే! నీకదే సరదా అయితే నువ్వెళ్ళు" అన్నాడు.
    "మనం ఇద్దరం వెళ్దాం!" అని మణిమాల అంటుందేమోనని అతని ఆశ. అతని ఆశ అదని మణిమాలకు తెలుసు. అయినా మణిమాల ఆ మాట అనలేదు. మాధవరావు ఆ ప్రస్తావన మళ్ళీ తేలేదు.
    మాధవరావుకు భోజనం వడ్డిస్తూ "రేపు మీకు డ్యూటీ లేదు గదూ!" అంది మణిమాల.
    "లేదు!" అన్నాడు మాధవరావు పైకి తేలకపోయినా లోలోపల కొంచెం ఆశ్చర్యపోతూ ఇటీవల తమ మధ్య ఇలాంటి సంభాషణ రావటం లేదు.
    "అయితే, రేపు, మీరు, నేను, లలితా పూలతోటకి కెళ్దాం!" అంది మణిమాల.
    సాధారణంగా తన మనసులో భావాలు బయటపడనీయని మాధవరావు ముఖం ఒక్కసారిగా వికసించింది.
    "సరే!" అన్నాడు వెంటనే.
    మణిమాల నవ్వును పెదిమల మధ్య బిగించి వదిలి "మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు!" అంది.
    "నువ్వు వాళ్ళనీ వీళ్ళనీ పోగుచెయ్యకపోతే, ఇలాంటివి నాకెప్పుడూ ఇష్టమే!"
    "ఇప్పుడు మాత్రం లలిత లేదూ?"
    మాధవరావు అన్నం తింటున్నవాడు ఆగి, మణిమాల ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
    గంభీరంగా కూర్చుంది మణిమాల.
    "లలిత విషయం వేరు."
    అప్రయత్నంగా ఒక్క నిట్టూర్పు విడిచింది మణిమాల. వింతగా చూసే మాధవరావు చూపులను తప్పించుకుంటూ "నేనూ అలాగే అనుకుంటున్నాను. అయితే లలితకు కబురుచేస్తాను. రేపు వెళ్దాం."
    అని గబగబ అక్కడినుండి వెళ్ళిపోయింది. మాధవరావు భోజనం పూర్తికాలేదు. మణిమాల వెళ్ళిపోగానే అతనికి అన్నం దగ్గిరనుంచి లేచిపోవాలనిపించింది. కాని లేవలేదు. కొన్ని క్షణాలు అలాగే కూచుని తనే లేచివెళ్ళి పెరుగు తెచ్చుకుని వడ్డించుకున్నాడు.
    మణిమాల కబురు అందుకున్న లలిత వెంటనే ఒప్పుకుంది. మాధవరావుకు సంగీతంలో ఉన్న ఆసక్తి లలితకర్థమయింది. తను కోరకుండానే మోహన్ ఆచూకీ తెలుసుకుంటానని వాగ్దానం చేసిన మాధవరావు దంపతుల స్నేహం లలిత వదులుకోదలచలేదు.
    మణిమాల ఎంతో ఉత్సాహంగా కారియర్సు సర్దింది. ఫ్లాస్కుల్లో కాఫీ పోసింది. లలిత రాగానే కూచోబెట్టి లలిత వద్దంటున్నా ఫలహారాలు రుచి చూపించింది. ఆ పూలతోట ఎంత బాగుంటుందో లలితకు వర్ణించి చెప్పింది. తీరా డ్రైవర్ కారు సిద్ధం చెయ్యగానే "అబ్బా! నాకు కడుపు నొప్పి!" అంటూ మంచంలో పడుకుంది.
    లలిత కంగారుపడింది.
    "డాక్టర్ని పిలిపించండి. ఎప్పుడైనా ఇలా వస్తుందా?" అంది ఆదుర్దాగా.
    మాధవ్ ఏం మాట్లాడకుండా మణిమాలను చూస్తూ సోఫాలో కూర్చున్నాడు.
    "ఏం కాదు! నిన్న పచ్చిమిరపకాయ బజ్జీలు ఇష్టమని ఎక్కువగా తిన్నాను. దాని ఎఫెక్ట్. నువ్వూ మాధవ్ వెళ్ళండి. నేను రెస్ట్ తీసుకుంటాను."
    లలితకు మతిపోయినట్లయి "అదెలా..." అని మాధవరావు ముఖం చూసి ఎటూ చెప్పలేక నిలబడిపోయింది...
    "ఎలా లేదు. ఏం లేదు. మాధవ్ కి ఆ పూలతోటలో గడపటం చాలా ఇష్టం! బహుశా ఆ తోట నువ్వూ ఇష్టపడతావు. వెళ్ళిరండి..." అని లలిత ఏం మాట్లాడటానికీ అవకాశమియ్యకుండా పనిమనిషిని పిలిపించి సర్దినవన్నీ కారులో పెట్టించింది.
    లలిత నిస్సహాయంగా మాధవరావు వంక చూసింది. అతనేం ఆలోచిస్తున్నాడో లలిత కంతుపట్టలేదు. అలాగే కూచున్నాడు.
    సరిగ్గా ఆ సమయంలో దిగింది రాగిణి.
    అప్పటివరకూ శిలలా కూచున్న మాధవరావు రాగిణిని చూడగానే "రండి! నా ఆఫీస్ రూంలోకి వెళ్దాం!" అని లేచాడు.
    కారులో పనిమనిషి సర్దుతోన్న సామానులు చూపించి రాగిణి ప్రయాణ సన్నాహంలో ఉన్న లలితా మాధవరావులను చూసింది. తనను చూడగానే జీవం లేనట్లు పాలిపోయిన లలిత ముఖాన్ని చదువుకుంది. వెంటనే అక్కడినుంచి కదలలేకపోయింది.

 Previous Page Next Page