కేటూ చటుక్కున పక్కకి తప్పుకుంది.
అపురూప గొంతు వినగానే కేటూని వదిలి నిదానంగా ఇటు తిరిగింది నరహరి. దాని కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. జుట్టు ఇందాకటి కంటే రేగిపోయి భీభత్సంగా ఉంది. పెద్ద గురకలా వస్తోంది శ్వాస. కనుబొమలు ముడిపడిపోయి ఆగ్రహంగా చూస్తోంది.
బండని కిందపారేసి అపురూప వైపు రావడం మొదలెట్టింది నరహరి.
కళ్ళ లెన్సులు పగిలిపోయిన చిన్న రాబొట్ కేటూకి ఏమీ కనిపించడంలేదు.
ఏమి జరుగుతోందో అర్థంకాలేదు. అగమ్యంగా తడుముకుంటూ తిరుగుతోంది అది.
ఆ చివరిక్షణాల్లో అపురూపకి తన తల్లి గుర్తుకు వచ్చింది. అతి కొద్ది సమయంలోనే తనకు చేరువై, ప్రాణానికి ప్రాణమైపోయిన అజిత్ గుర్తుకొచ్చాడు.
మరణానికి సిద్ధమవుతూ కళ్ళు మూసుకుంది అపురూప.
'దాని గోళ్ళు ఒక్కసారి ఖస్సున దిగబడిపోతే ఆ బాధ తను భరించగలదా? తన పేగులు బయటికి లాగి హారంలా మెడలో వేసుకుంటుందా ఈ నరహరి? కండలు పీకి తినేస్తుందా? దోసిళ్ళతో తన రక్తం తాగుతుందా? ఏం చేస్తుంది?'
మరోసారి చెవులు బద్దలయ్యేలా కేక వేసింది నరహరి. ఈసారి ఆ కేక మరింత దగ్గరగా వినబడింది.
ఒళ్ళు జలదరించింది అపురూపకి.అసలు తన ప్రాణం పోవడానికెంత సమయం పడుతుంది? మెడ విరిగితే త్వరగా ప్రాణం పోతుందంటారు. పులి తను పట్టుకున్న జంతువులను చంపే పద్ధతి అది. అలా చంపుతుందా ఇది? లేదా పీకిపీకి చంపుతుందా?
తనకు సునాయాసమైన మరణం వస్తే బాగుండు!
చెవులు చిల్లులు పడేటట్లు మళ్ళీ కేక పెట్టింది నరహరి. చాలా సమీపం నుంచే వినబడింది ఆ కేక.
ఊపిరి బిగపట్టింది అపురూప.
అయిదు నిమిషాలు గడిచాయి. అయినా ఏమీ కాలేదు!
ఇంతసేపు ఏం చేస్తోంది అది? ఇనపదూలం లాంటి దాని చేతిదెబ్బ తనకింకా తగలదేం?
సందేహంగా కళ్ళు తెరిచింది అపురూప. ఎదురుగా అజిత్... తన అజిత్... నరహరిని వెనుకనుంచీ భల్లూకంలా పట్టుకుని ఉన్నాడు.
వలలో పడ్డ జంతువులాగా దుర్భరంగా మూలుగుతూ, పెనుగులాడుతోంది అది.
"అజిత్!" అంది అపురూప - సంతోషమూ, దుఃఖమూ కలిసి రుద్ధమైపోతున్న గొంతుతో. అలాంటి సమయంలో అతని దృష్టిని మరల్చకూడదని ఆమెకు గుర్తు రాలేదు.
అజిత్ తలతిప్పి, 'భయంలేదు!' అన్నట్లు చూశాడు. ఆ అరక్షణం చాలు నరహరికి. అతని దృష్టి చెదరగానే బలమంతా ఉపయోగించి, గిరగిర తిరిగింది అది. పట్టు జారి కిందపడ్డాడు అజిత్.
రెప్పపాటులో గెంతుకుంటూ పొదలమధ్యకు వెళ్ళి మాయమయింది నరహరి.
అతను దాన్ని వెంబడించి వెళ్ళి, కాసేపు ఆ పొదల్లో వెదికి నిస్పృహగా తిరిగి వచ్చాడు.
"అయామ్ సారీ! వెరీ వెరీ సారీ! మంచి సమయంలో డిస్టర్బ్ చేసి, నరహరిని పట్టుకునే ఛాన్సు పోగొట్టేశాను! అయామ్ ఆఫుల్లీ సారీ!" అంది అపురూప నొచ్చుకుంటూ. బంగారం లాంటి అవకాశాన్ని పాడుచేసినందుకు అతను తనని బాగా తిడతాడేమోనని భయం కలిగింది ఆమెకు.
సహనంగా నవ్వాడు అజిత్. "ఏం చేస్తాం! ఇప్పుడింక బాధపడి లాభం లేదు. మళ్ళీ ప్రయత్నాలు మొదలెడదాం" అన్నాడు.
అతనివైపు తదేకంగా చూసింది అపురూప. చాలా చిత్రమైన మనిషి ఇతను. వేరెవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే, చిందులు తొక్కి, ఎదుటివాళ్ళమీద నేరం పెట్టేసి, పెద్ద సీన్ క్రియేట్ చేసేవాళ్ళేమో!
ఇతను అలాకాదు! ఎంతటి విషాదం, ఎంతటి నిరాశా ఎదురైనా యోగిలా నిశ్చలంగా ఉంటాడు.
ఒక్కసారిగా మనసు పట్టనంత అభిమానం పెరిగిపోయింది అతని మీద.
"నిజం చెప్పాలంటే, నిన్ను మళ్ళీ చూడగలనో, లేదో అని చాలా ఆరాటపడి పోయాను అజిత్! అలాంటిది, నువ్వు మళ్ళీ కనపడగానే సంతోషాన్ని వశంలో పెట్టుకోలేక కేక పెట్టేసాను!" అంది ఏకవచనంలోకి వచ్చేస్తూ.
ఆమె కళ్ళలోకి ఆర్ద్రంగా చూస్తూ ఆమె వైపుకి ఒక్క అడుగు వెయ్యబోయి, మళ్ళీ తటపటాయిస్తూ ఆగిపోయాడు అజిత్.
అది గమనించిన అపురూప రెండు అంగల్లో అతన్ని చేరిపోయి, చేతులతో అతన్ని చుట్టేసింది. "అజిత్! మై డియరెస్ట్ అజిత్! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ సోమచ్!" అంది కలవరిస్తున్నట్లు. విశాలంగా ఉంది అతని ఛాతీ. అతని రొమ్ముమీది గుబురు వెంట్రుకలు ఆమె చెంపలకు మృదువుగా గుచ్చుకుని, గగుర్పాటు కలిగించాయి.
పూల గుత్తుల్లా ఉన్న ఆమె భుజాలను మృదువుగా పట్టుకుని, నుదుటిమీద పెదవులతో స్పృశించాడు అజిత్. "ఐ లవ్ యూ అపూ! ఐ లవ్ యూ!" అన్నాడు అభిమానంగా.
కాసేపు ఇద్దరూ మూగగా కళ్ళతోనే మాట్లాడుకున్నారు.
"నరహరి నిన్ను చంపేసిందేమో అని అనుకున్నాను అజిత్!" అంది అపురూప మళ్ళీ ఆ సంఘటన గుర్తుకొచ్చి భయపడుతూ.
"అందరూ భయపడుతున్నంత రాక్షసిలా ఏంలేదు ఆ నరహరి!" అన్నాడు అజిత్.
"రాక్షసిలా లేకపోవడమేమిటి? దాని మిడిగుడ్లూ, జుట్టూ, గురకలాంటి శ్వాసా... అమ్మో! తలుచుకుంటే ఇప్పటికీ గుండె జారిపోతోంది."
"కానీ నేను దాన్ని అయిదు నిమిషాలసేపు పట్టుకుని ఆపగలిగాను. అది నన్నేం చెయ్యలేకపోయింది. అవునా?"
'అవును సుమీ!' అనిపించింది అపురూపకి. అది అందరినీ దడిపించింది గానీ ఎవర్నీ ఏమీ చెయ్యలేకపోయింది. చివరికి కేటూని కూడా బండతో కొట్టి నాశనం చెయ్యాలని చూసిందే తప్ప అంతకంటే ఎక్కువ శక్తియుక్తులు చూపించలేకపోయింది.
ఎందు వలన?
'పోనిస్తూ! ఇప్పటికి ప్రమాదం తప్పింది కదా!' అంది మనసు.
అలా అనుకోగానే హఠాత్తుగా ఉల్లాసంగా అనిపించింది అపురూపకి.
ఓరగా అజిత్ వైపు చూసింది. అతనూ తదేకంగా తననే చూస్తున్నాడు.
ముక్కు చిట్లించి వెక్కిరింపుగా చిరునవ్వు నవ్వింది అపురూప. అతనూ నవ్వాడు.
"ఐ..." అని అపురూప మొదలెట్టగానే, "...లవ్ యూ!" అని అతను పూర్తిచేశాడు.
మళ్ళీ ఇద్దరికీ నవ్వొచ్చింది.
అతని కౌగిట్లో ఒదిగిపోయింది అపురూప. కళ్ళెత్తి చూస్తే అందంగా అజిత్ మొహం.
ఇంకా పైన చందమామ. వెన్నెల కురుస్తోంది వాళ్ళ మీద. చాలా రొమాంటిక్ గా ఉంది వాతావరణం.
"వెన్నెల వేడిగా ఉంటుందంటే ఇదివరకు నమ్మేదాన్ని కాదు" అంది అపురూప చిలిపిగా. నిజంగానే ఒళ్ళు వెచ్చబడి పోతున్నట్లు అనిపిస్తోంది తనకి.
"అజిత్! ఇవాళ పౌర్ణమా? చంద్రుడు నిండుగా కనబడుతున్నాడు కదూ?"
ఆమె అలా అనగానే చటుక్కున ఆమెని వదిలేసి వెనక్కి జరిగాడు అజిత్. ఆకాశం వైపు చూశాడు. అతని మొహం వివర్ణమయింది.
"ఏమయింది?" అంది అపురూప గాభరాగా.
"అపూ! నిజంగానే వెన్నెల వేడిగా ఉంది. ఇవాళ పౌర్ణమి కాదు. అమావాశ్య! పైన చంద్రుడు కాదది, ఫ్లయింగ్ సాసరు!" అన్నాడు.
ఫ్లయింగ్ సాసర్ లో నుంచీ వస్తున్న వెన్నెలలాంటి కాంతి నిజంగానే వెచ్చగా ఉంది.
నిశ్చేష్టురాలైపోయింది అపురూప. మధుర స్వప్నం కాస్తా హఠాత్తుగా పీడకలగా మారిపోయి నట్లయింది.
అతని మాటలు ఆ ఫ్లయింగ్ సాసరులో ఉన్నవాళ్ళకి వినబడినట్లు మరుక్షణంలో అది బొంగరంలా విపరీతమైన వేగంతో తిరుగుతూ రోదసీలోకి వెళ్ళిపోయింది.
అది వెళ్ళిపోగానే కాంతి తొలిగిపోయి మసక చీకటి మిగిలింది. మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు కనబడ్డాయి.
అప్పుడు వినబడ్డాయి పెద్దగా తోడేళ్ళ అరుపులు!
ఇంక తట్టుకోలేక పోయింది అపురూప. "అజిత్!" అంటూ అతని చేతుల్లో వాలిపోయింది భయోద్వేగంతో, ఆమెకి ఏ క్షణమైనా స్పృహతప్పి పోయేటట్లు ఉంది.
"అపురూపా! ప్లీజ్! చిన్నపిల్లలా చెయ్యకు! ఎవ్విరిథింగ్ విల్ బీ ఆల్ రైట్! నన్ను నమ్ము!" అంటూ ఆమె వెన్ను నిమురుతూ నచ్చచెప్పాడు అజిత్. తోడేళ్ళ అరుపులు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకొని తర్వాత నెమ్మదిగా బలహీనమై వినపడకుండా పోయాయి.
చాలాసేపటి తర్వాత మగత నిద్రలోకి జారిపోయింది అపురూప.
* * * *
తెల్లవారింది.
అపురూప నిద్రలో ఉన్నప్పుడే రాబొట్ కేటూ కళ్ళకి కొత్త లెన్సులు బిగించాడు అజిత్. అపురూప లేచే సమయానికి ఇన్ స్టన్ ట్ కాఫీ కలిపి రెడీగా ఉంచాడు.
కాస్త నిద్రపోయి లేచాక మనసు స్థిమితపడి మామూలుగా అయింది అపురూప.
కాఫీ కూడా తాగేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది.