Previous Page Next Page 
బుద్ధిజీవి పేజి 13

భోగలాలసత్వంతో కూలిపోయిన రోమన్ సామ్రాజ్యము గుర్తువచ్చింది అజిత్ కి. సొడొమ్ లాంటి దుష్ట నగరాలు గుర్తువచ్చాయి. ఆ నగరాలని దేముడేం చేశాడు? స్వయంగా పూనుకుని నాశనం చేశాడు.
అలాగే ఇప్పుడు ఈ భూమి రెండుగా చీలిపోయి వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుని, ఈ భయంకరమైన నాగరికతని అంతం చేసెయ్యకూడదూ?
అది కాకతాళీయమే కావచ్చు. కానీ అతను అలా అనుకున్నదే తడవుగా-
ఆకాశం పగిలినట్లు శబ్దం. బ్రహ్మాండమైన ఉరుములు, లక్ష విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వస్తున్నట్లు హోరున రొద.
దానికి జవాబుగా భూమి గర్జించింది. శతకోటి రోడ్డు రోలర్లు భూగర్భంలో నడుస్తున్నట్లు చిత్రమైన ధ్వని. భూమి గజగజ వణికింది.
అందరూ అటూ ఇటూ వూగారు.
ఫెళఫెళమంటూ భూమి పగిలి విచ్చుకుంది.
దాన్లో పడిపోయారు - పాపా, పాపని సృష్టించిన మనిషీ, ఆ పాపతో పాపం చెయ్యబోయిన మనిషిని పోలిన మృగం - ముగ్గురూ!
ఆకాశం అంటుకున్నట్లు మహోజ్వలమైన వెలుగు వచ్చింది.
కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని, తలెత్తి చూశాడు అజిత్.
ఆకాశం అంచున కనబడుతోంది ఫ్లయింగ్ సాసరు.
అంతలోనే హఠాత్తుగా కారుమేఘాలు కమ్ముకొచ్చాయి.
అప్పటికే భయభ్రాంతులైపోయి ఉన్న జనం మేఘాలను చూడగానే "వాన! వాన!" అని దిక్కుతోచనట్లు పరిగెత్తారు.
అక్కడ వాతావరణం ఎంత కలుషితమై పోయిందంటే, వాన చినుకులు యాసిడ్ లా కాల్చేస్తాయి మనుషులని.
భూమి పగులు అజిత్ పాదాలకీ, అపురూప పాదాలకీ మధ్యనుంచి వెళ్ళింది.
పగిలిన భూమికి అటువైపు అజిత్, ఇటువైపు అపురూపా ఉండిపోయారు.
"అజిత్!" అంది అపురూప విహ్వలంగా కేక పెడుతూ, అజిత్! అజిత్! అజిత్."
మధ్యలో ఉన్న అగాధం పెద్దదవుతోంది. ఆ అగాధం మీదగా ఒరిగి చెయ్యి అందిస్తూ, "అపూ! నీ చెయ్యి అందివ్వు!" అన్నాడు అజిత్.
"అమ్మో!"
"అపూ! భయంలేదు. ఊరికే చెయ్యి అందించు చాలు! నేను లాగేసుకుంటాను. త్వరగా!"
భయంగానే ముందుకు వంగి, చెయ్యి అందించబోయింది అపురూప.
అజిత్ ఇంకొంచెం ముందుకి వంగాడు.
అంతలోనే ఒక్క కెరటంలా జనం తోసుకొచ్చేశారు. బాలెన్సు తప్పి, ఆ జనం మధ్యలో ఇరుక్కుపోయింది అపురూప. మరుక్షణంలో అతని దృష్టి పథంలో నుంచి తొలిగిపోయింది.

                                                            * * * *

పావుగంట సేపటిదాకా ఆ కల్లోలం సర్దుమణగలేదు. జన ప్రవాహంలో పడిపోయి తను ఎటు వచ్చేసిందో అర్ధంకాలేదు అపురూపకి.
అందరూ తలో దిక్కుకీ పారిపోయారు. తను వంటరిగా మిగిలిపోయింది.
పెదిమలు కొరికి పట్టుకుని, దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది అపురూప.
"అపూ! అపూ!" అని కీచుగొంతు వినిపించింది. ఛివాలున తిరిగి చూసింది.
పొట్టి రాబొట్ కేటూ! సోలార్ కారుతో సహా ఉంది అక్కడ.
"ఎక్కు! వానవస్తే కష్టం!" అంది కేటూ! కారు ఎక్కింది అపురూప. ఆమె కారు ఎక్కగానే కుంభవృష్టి ప్రారంభమయింది. కారు తలుపులు వేసుకుని చాలాసేపు అలానే కూర్చున్నారు.
అజిత్ జాడ లేదు.
"కేటూ? ఎలాగ ఇప్పుడు?" అంది అపురూప ఆదుర్దాగా.
"ఏం ఫర్వాలేదు. కారులో వెళుతూ వెదుకుదాం. వాన తగ్గగానే ఎక్కడో అక్కడ కనబడతాడు" అంది కేటు చాలా ఆత్మవిశ్వాసంతో.
అది విని ధైర్యం తెచ్చుకోబోయేటంతలోనే.
ఫ్లయింగ్ సాసరు మళ్ళీ కనబడింది.
ఒక కిరణం దాన్లో నుంచి విడుదలయి వచ్చి వాళ్ళ కారుని తాకింది. ఆ తర్వాత కారు స్టార్ట్ చెయ్యకుండానే, ఎవరో ముక్కుకి తాడేసి లాక్కెళ్ళిపోతున్నట్లు, వర్ణించనలవికాని వేగంతో ముందుకి సాగిపోయింది గాలిలో.
అలా కొంతదూరం పయనించాక, వెలుగు కిరణం కట్ అయిపోయింది.
ఫ్లయింగ్ సాసరు కనబడటంలేదు ఇప్పుడు.
గాలిపోయిన బెలూన్లా, కారు నెమ్మదిగా కిందికి దిగింది.
అసలేం జరిగింది? ఎక్కడికి వచ్చారు తాము? అపురూపకి అంతా అగమ్యగోచరంగా ఉంది.
కారు దిగీదిగగానే రాబొట్ కేటూ తలని ఒకసారి గిర్రున తిప్పింది. 'క్లిక్ క్లిక్ క్లిక్" అని శబ్దం చేసింది అలజడిగా.
"ఏమిటి కేటూ?" అంది అపురూప దడదడలాడుతున్న గుండెతో.
"చూడు! చూడు!" అంది కేటూ గాభరాగా.
చివుక్కున తలెత్తి చూసింది అపురూప.
ఎదురుగుండా విండ్ స్క్రీన్ లో నుంచి కనబడుతోంది ఒక భయానక రూపం!
నరహరి !!
తప్పించుకుపోయిన రాబొట్!!!

                                     * * * *

"ఎవరు మీరు?" అంది నరహరి.
తుప్పుపట్టిన గొలుసులు లాగితే, కర్ణకఠోరంగా శబ్దం వచ్చినట్లుంది దాని గొంతు. అదోరకమైన నవ్వుతో దాని పెదాలు వంకరగా సాగాయి.
గుండె ఆగిపోయినట్లయింది అపురూపకి. 'అజిత్!' అని ఆర్తనాదం చేసింది ఆమె మనసులోనే. 'ఎక్కడున్నావు అజిత్! ఈ పిశాచం నన్ను దారుణంగా చంపేస్తుంది అజిత్! ఎక్కడున్నావు నువ్వు!'
చిన్న బొచ్చుకుక్కపిల్ల, దున్నపోతుని చూసి కలవరపడుతూ అరుస్తున్నట్లు అరుస్తోంది కేటూ.
నరహరి ఇంకా దగ్గరకు వచ్చి, విండోలో నుంచి తల లోపలకు పెట్టింది. ఏదుపంది ముళ్ళలా ఉంది దాని జుట్టు. పెద్ద బొర్ర ముక్కు. శ్వాస పీల్చి వదలడం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నట్లు రొప్పు వినబడుతోంది.
విండోలోనుంచి చెయ్యి చాచింది నరహరి. ఆ చెయ్యి నల్లటి ఇనుపదూలంలా ఉంది. దానిమీద ఉన్న ఉక్కు స్ప్రింగులలాంటి దట్టమైన రోమాలు అపురూప బుగ్గలకి రాసుకుని వికారం కలిగించాయి.
అరుస్తున్న రాబొట్ కేటూని నరహరి తీక్షణంగా చూస్తూ చేతితో తాకింది.
వెంటనే ఆత్మరక్షణకోసం కాస్త కరెంట్ రిలీజ్ చేసింది కేటూ.
ఆ షాక్ కి చెయ్యి వెనక్కి తీసేసుకుని, "ఉహు హుహు" అని నవ్వింది నరహరి. 'హనుమంతుడి ముందు కుప్పిగంతులా?' అన్నట్లు పరిహాసం ధ్వనించింది ఆ నవ్వులో.
నరహరి కాస్త వెనక్కి తగ్గడం చూసి, కారులోనుంచి కిందకి దూకి, మళ్ళీ రెట్టింపు పవర్ తో షాక్ ఇచ్చింది కేటూ.
ఈసారి నవ్వలేదు నరహరి. ముక్కుతో ఒకసారి బుసకొట్టినట్లు శబ్దంచేసి, తర్వాత వినేవాళ్ళు దడుచుకునేటట్లు, రక్తం గడ్డకట్టి పోయేటట్లు కేకపెట్టింది. సింహగర్జనా, ఆంబోతు రంకె, మదపుటేనుగు ఘీంకారం, నక్క ఊళ, అన్నీ కలిసినట్లు ఉంది ఆ అరుపు.
"కేటూ!కే కారు స్టార్ట్ చెయ్! వెళ్ళిపోదాం" అంది అపురూప విహ్వలంగా.
"అపూ! దీన్ని పట్టుకోవడం కోసం మొత్తం ప్రపంచమంతా వెదుకుతోంది. మనకి దొరికిన తర్వాత కూడా చేతులారా వదిలేస్తే ఎలా? భయపడకు! నేను దీని పని పడతాను" అంటూ భూమికి రెండడుగుల ఎత్తున వామనావతారంలో ఉన్న ఆ చిన్న రాబొట్, చెడు తాలూకు విశ్వరూపంలా ఉన్న నరహరి మీదకి గునగున పరుగెడుతూ వెళ్ళింది.
"ఆగు!" అంది నరహరి, వార్నింగ్ ఇస్తున్నట్లు. కేటూ ఆగకుండా నరహరి మీదికి పరిగెత్తి కెళ్ళింది.
ఒడుపుగా పక్కకి తప్పుకుంది నరహరి. వేగంగా పరిగెడుతున్న కేటూ బాలన్స్ తప్పి బోర్లా పడింది. వెంటనే దాని కళ్ళకి ఉన్న లెన్సులు పగిలిపోయాయి. కష్టంమీద మళ్ళీ లేని నిలుచుంది. కళ్ళు కనబడటంలేదు దానికి. గాల్లోనే తడుముకుంటూ తన చుట్టూ తనే ఒకసారి తిరిగి, అలికిడిని గ్రహించి మళ్ళీ నరహరివైపు వెళ్ళసాగింది. తనను మించిన ప్రత్యర్థితో తలపడుతున్నానని తెలుసు దానికి. అయినా సాహసంగా ముందుకి వెళ్ళింది.
ఈలోగా పక్కనే ఉన్న పెద్ద బండని ఒకదాన్ని సునాయాసంగా ఎత్తి, చేతుల్లో పట్టుకుంది నరహరి. అది మీద పడేస్తే, కేటూ నుగ్గునుగ్గయిపోవడం ఖాయం.
కళ్ళు లేని కేటూ అది గమనించలేదు.
నరహరి తన చేతిలోని బండను గురిచూసి, కేటూ మీద వెయ్యబోతుండగా -  
"కేటూ!" అని అరిచింది అపురూప. తప్పించుకోమని హెచ్చరికగా.

 Previous Page Next Page