"మరి యింత డబ్బున్నవారుండీ ఈ వూరు ఇంత అద్వాన్నంగానే వుంది. ఎవరూ కాస్త రోడ్లు అవి బాగుచేయించడానికి పూనుకోలేదా."
"వాళ్ళంతా ఇక్కడుంటారేమిటి. చెరువులు లీజ్ కిచ్చేసి యేడాదికి ఒకటి రెండుసార్లు వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకుపోతారు. అంతా సిటీల్లో ఉండి యిక్కడ చెరువులు కొని లీజ్ కిచ్చేస్తారు. ఎకరానికి కనీసం పది పన్నెండు వేలు చొప్పున లీజ్ యిస్తారు. ఖర్చు, లాభం, నష్టం అంతా మరి లీజు తీసుకున్న వాళ్ళదే. అంటే ఓ 5 ఎకరాలు చేపల చెరువుంటే ఉన్నచోట కదలకుండా సిటీలో కూర్చుని తొమ్మిది నెలలకి అరవై డెబ్బైవేలు లక్షదాక సంపాదించవచ్చు. అదే పంటపొలం అయితే ఏడాదికి శిస్తు కింద పదివేలన్నా వచ్చేదికాదు ఇదివరకు. ఏదో ఈ చేపల చెరువుల ధర్మమా అని వ్యవసాయ కూలీలు బాగుపడ్డారు. చేపలుపట్టే టైములో రోజు కూలీ ఏభైరూపాయలు సంపాదిస్తారు. మిగతా టైము పొలం పనులు చేస్తారు." రంగా ఆ చుట్టూ కనిపించే చేపల చెరువులు ఎవరెవరివో చూపించి అన్ని సంగతులు వివరించాడు.
"చెరువు గట్లు చుట్టూ బోలెడు కొబ్బరిచెట్లున్నాయి. కాయలమ్మితే బోలెడు డబ్బు రావాలి. అదంతా ఎవరు తీసుకుంటారు?" కేశవరావు కొబ్బరిచెట్లు చూస్తూ అడిగారు.
"లీజుకిచ్చినప్పుడు మాట్లాడుకున్నదాన్నిబట్టి వుంటుంది. దానికి బహుశా కొంత డబ్బు ముట్టచెప్తారనుకుంటాను."
"మరి నీవు కూడా కొన్ని ఎకరాలు కొనకపోయావా?"
"నేనా... అంత డబ్బు నాదగ్గిరెక్కడుంది మామయ్యా - కనీసం 15,20 లక్షల పెట్టుబడి కావాలి గదా... ఏదీ మీ ధర్మమా అని పొలం దున్నుకుంటూ గడిపాం" కృతజ్ఞతగా అన్నాడు.
"ఈ ప్రాంతం అంతా కోనసీమలా కనిపిస్తుంది. ఇంత చక్కని ప్రకృతి వాతావరణం ఉన్న ఈ ప్రాంతాలలో జనం ఉండేట్టు చెయ్యాలి. అంటే పల్లెలన్నీ ప్రక్షాళనం చేసి సదుపాయాలు చెయ్యాలి. అదే మనముందున్న కర్తవ్యం. ఒక ఊరన్నా బాగుచేసి మోడల్ విలేజ్ లా చేస్తే అదిచూసి మరికొంతమందన్నా ముందుకు వస్తారేమో చూడాలి. లెటజ్ హోప్ సో... సరే పద. ఇంటికి వెళ్ళి భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటలకు మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఊరు తిరిగి ప్రెసిడెంట్ ని కలిసి వద్దాం" కేశవరావు వాచీ చూసుకుంటూ అన్నారు.
ఇరవై రోజులకే మీరంగు ఎంత తగ్గిపోయిందో తెలుసా. నల్లకప్పెసినట్లు అయిపోయింది మీ వళ్ళు. ఎండలో తిరిగివచ్చిన కేశవరావుని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గిర భోంచేస్తుండగా అంది రాజేశ్వరి.
"అవుతుంది మరి. అమెరికా వాతావరణానికి, ఇక్కడ వాతావరణానికి ఎంత తేడా. అక్కడ చలిదేశం రంగు వస్తుంది. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డానికి టైము పడ్తుంది.
"ఏం చూసివచ్చారు ఈ రోజు? ఎక్కడెక్కడి వెళ్ళారు" కుతూహలంగా అడిగింది.
"ఓసారి వూరంతా చుట్టి వచ్చాం. దేవాలయం, విద్యాలయం, మన పొలాలు అలా తిరిగి వచ్చాం. వాటిలో పాపం శివాలయం శిథిలావస్థలో వుంది. పాపం దేముడు మనం ఏం చేసినా, ఎలా చేసినా ఏం అనడనుకో- కాని బడి వుంది చూడు ఫస్ట్ ప్రయారిటీ కింద బాగు చేయించాలి. పాపం పిల్లలకి కూర్చోడానికి చాపలు కూడా లేవు. టీచర్లు లేరు. యేడాదికో క్లాసు చొప్పున పెంచుతూ మిడిల్ స్కూల్, ఆ తర్వాత హైస్కూల్ చెయ్యాలి. పిల్లలు పాపం రెండు మూడు మైళ్ళు నడిచి పక్కవూరిలో మిడిల్ స్కూల్ కి, అవతలిపక్క వూరు హైస్కూల్ కి వెళ్తారట. ఈ వూరిలో పెడతాం అని గవర్నమెంటు రాసినప్పుడు ప్రెసిడెంటు వాళ్ళు టైముకి జవాబివ్వకపోతే అది కాస్త పక్క వూరివాళ్ళు కొట్టుకు పోయారుట. అక్కడ ఎప్పుడూ డాక్టరుండడట. ఓ నర్సు, ఆయా, కాంపౌండరు ఉంటారు. ఈ ఊరిలోవాళ్ళు బీదవాళ్ళు. పాపం రెండు మూడు మైళ్ళు నడిచివెళ్ళి మందులు తెచ్చుకుంటారుట. మన ఊర్లో ఓ ఆస్పత్రి కట్టించాలి. గవర్నమెంటేమైనా గ్రాంటు ఇస్తుందేమో చూడాలి. అది వచ్చేంతవరకు ఏదో టెంపరరీగా ఓ టెంట్ వేయించో లేక ఈ ఇంటిముందు వరండాలోనో రోజూ కాసేపు కూర్చుని మందులివ్వాలి" సాలోచనగా అన్నారు కేశవరావు. రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసింది. "ప్రఖ్యాత హార్ట్ స్పెషలిస్ట్, గుండె ఆపరేషన్లు చేసే మీరు ఇక్కడ అరుగు మీద కూర్చుని మందులిస్తారా."
కేశవరావు నవ్వారు. అది అమెరికాలో...ఈ ఊరో అవన్నీ పెట్టుకుంటే ఎలా, యేదో రోగులను పరీక్షించి మందులిస్తే చాలు.
"ఫిజిషియన్ అవుతారన్నమాట. అసలు మీకు మెడిసిన్ సబ్జెక్ట్ లో టచ్ ఉందా, మందుల పేర్లన్నా తెలుసా" హాస్యంగా అంది.
"దాందేముందిలే. నాలుగు రోజులు మెడికల్ జర్నల్స్ తిరగేస్తా. యేమిటో ఈ స్పెషలైజేషన్స్ వచ్చాక. ఏ పార్టుకి ఆ పార్టుకి డాక్టర్లు వేరయ్యి బాడీలో మిగతా అంగాల గురించి మర్చిపోతున్నారు. పూర్వం డాక్టరంటే ప్రతిదీ స్వయంగా చూసి, రోగనిర్ధారణ చేసి మందు ఇచ్చి రోగికి నయమయ్యేవరకు బాధ్యత వహించేవారు. ఫ్యామిలీ డాక్టర్ అన్న పదం అర్థమే లేదు ఈ రోజుల్లో. పోనీ పక్కవూరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కూ కూర్చుంటే అనిపిస్తూంది. కాని అది మన వూరు కాదు. అయినా ఇంకో వూరు ఎవరూ వెళ్ళకుండా ఇక్కడే వుండాలి ఆస్పత్రి. అది సరేగాని ఇవాళ మన పొలాల వైపు వెళ్ళొచ్చాను. పచ్చని పొలాలు, చేపల చెరువులు, గట్ల చుట్టూ కొబ్బరి చెట్లు. అవి ఎంత బాగుందో తెలుసా. నిన్ను తీసుకెళ్ళాల్సింది అనిపించింది. ఈ మధ్య చాలామంది పల్లపు భూములన్నీ చేపల చెరువులు చేసేశారుట."
అలాగా ఆరోజు వెడదాం. ఎండలో తిరిగివచ్చారు. అన్నం సరిగ్గా తినలేకపోతున్నారు. కారు తీసికెళ్ళాల్సింది.
"ఈ రోడ్లమీద కారేం వెళ్తుంది. అలా ఎండలో నడవడం అలవాటు లేక."
"యేమిటి సుఖాన వున్న ప్రాణం దుఃఖాన పెట్టుకున్నారేమోననిపిస్తూ వుంటుంది ఓసారి నాకు" కేశవరావు కోపంగా చూసాడు భార్యవంక. "అలా మాట్లాడి నన్ను నిరుత్సాహపరచకు...నవ్విన నాపచేనే పండేట్లు చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్...
"సారీ బాబా, సారీ...యేదో అన్నాను" అంతే. మీరు సిన్సియర్ గా యేదో చెయ్యాలని వచ్చారని నాకూ అర్థం అయిందిలెండి. ఇంక నన్ను లెంపలేసుకున్నట్టు నటించి నవ్వింది రాజేశ్వరి.
"నమస్కారం డాక్టరుగారూ! కబురు పెడితే నేనేవద్దును కదా-" పంచాయితీ ప్రెసిడెంటు అంజినాయుడు సంభ్రమంగా లేచి ఎదురొచ్చి ఆహ్వానించాడు కేశవరావు తనింటికి రావడం చూసి.
"ఎవరొస్తే ఏం లేండి. ఈ వూరు గురించి నాకేం తెలీదు. మీరే నాకు అంతా వివరించి సహాయం చెయ్యాలి. మీ సహకారం కావాలి."
"అమ్మమ్మా ఎంతమాట- మీరు మా వూరి కోసం ఇన్ని త్యాగాలు చేసి వస్తే మీకు మేం సాయం చేయకపోవడం ఏమిటండీ. ముఖ్యమంత్రిగారు, కలక్టరు గారు నాకు ముందే చెప్పారు. మీరేం అడిగినా చెయ్యమని. మీరు ఆర్డరేయండి అక్షరాల్లో జరిపించేస్తాను. అవసరాన్ని మించిన వినయం ఒలకబోస్తూ నమస్కారాలు పెడుతూ అన్నాడు.
"ముందు ఈ వూరు, పంటలు, రైతులు, సేద్యానికి నీటి సదుపాయం ఏమిటి? ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారు. ఏం పంటలు పండుతాయి. రైతులకి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అవి ఎవరు తెస్తారు. ఆ ఏర్పాట్లు, పండిన పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? దళారీలా... కాయకూరలు అవి పండిస్తారా. ఎన్ని పంటలు పండిస్తారు. పప్పు ధాన్యాలు వేస్తారా. ఎకరం ధర ఎంత పలుకుతుంది. ఊర్లో సన్నకారు రైతులెందరు, భూస్వాములు ఎందరు, ట్రాక్టరులాంటివి ఉన్నాయా. అగ్రికల్చరు ఆఫీసర్లు వస్తుంటారా. పాడిపరిశ్రమ వుందా... మొత్తం ఈ పల్లెటూరిలో వుండే ఏక్టివిటీస్ తెలియచెప్పాలి మీరు నాకు అర్థం అయ్యేట్టు. అదంతా తెలిస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నది కల్సి ఆలోచిద్దాం."
"అమ్మమ్మా అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసేసారు..." నవ్వాడు అంజినాయుడు.
ఈ వూరిలో చిన్న పెద్ద రైతులు ఓ పాతికమంది వుంటారు. చిన్నకారు రైతులు అంటే ఐదు, పది, పదిహేను ఎకరాల వాళ్ళు - వాళ్ళు పండించింది తినడానికి పోను ఖర్చులు పోను మిగిలేది చాలా స్వల్పం. పెట్టుబడి వస్తే చాలనుకుంటారు. చేల గట్లలో పెసర, మినప, కొబ్బరి, కూరగాయలు పండించి నాల్గు డబ్బులు అదనంగా వస్తే చాలనుకునే అల్ప సంతోషులు వాళ్ళు.