"ఇక్కడెవరూ ప్రైవేటు ప్రాక్టీసు డాక్టర్ లేడా?"
"మామయ్యా - ఇక్కడుండేది రెండువేల జనాభా- అందులో డబ్బిచ్చి వైద్యం చేయించుకునేవారెందరు. ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయని వస్తారు. పిల్లల స్కూళ్లకిచ్చింది- ప్రాక్టీసు వుండదు- ట్రాన్సపోర్టు ప్రాబ్లమ్. వీటన్నింటి మధ్య అవస్థ పడుతూ ఈ వూర్లో ప్రాక్టీసు పెట్టడానికి ఎవరొస్తారు.
"అందుకేగా ముందు గ్రామాలలో సౌకర్యాలు మెరుగుపడాలి అనేది. రాకపోకలు వీలుగా ముందు రోడ్లు రవాణా సౌకర్యాలు మెరుగుపడాలి. ఫారిన్ లో అయితే పల్లెలకి పట్నాలకి సదుపాయాలలో తేడా వుండదు గనకే సిటీ గోలకి ప్రశాంతంగా హాయిగా వుందామని అందరూ పల్లెలే ఇష్టపడతారు. అక్కడ 50,60 మైళ్ళ దూరాలున్నా ఆఫీసులకి పల్లెటూరిలో వుండి రోజూ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే 50,60 మైళ్ళు ఓ గంటలో వెళ్ళిపోతారు. రోడ్లు బాగుంటాయి గనక. అంచేత ముందు మనం రోడ్లు బాగుపరిచి, బస్సులు ఎక్కడ వేస్తే జనం వుంటారు. ప్రజలు వస్తే స్కూళ్ళు, బజార్లు, ఆస్పత్రులు అన్నీ వాటంతటవే వస్తాయి. అంచేత మనం రోడ్లు, నీళ్ళు శానిటరీ సిస్టంలాంటివి ఇంప్రూవ్ చెయ్యాలి." ఆయన మనసులో వున్న ఆలోచనలు రూపుదిద్దుకోడానికి ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు పడుతుందో- రోడ్ అంటే రెండు మూడు లక్షల రూపాయలు తక్కువ ధర పలకవు."
"అయితే యిప్పుడెక్కడికి వెడదాం - ఇంతకీ మన పొలాలు ఎటుపక్క వున్నాయి. పొలాలు చూడడానికి వెడదామా. ఇంకా పదకొండేగా అయింది."
"నడవగలవా కారులో వెళ్ళడానికి రోడ్లు సరిగా లేవు - నీది కొత్త కారు కూడానూ. పాడయిపోతుందేమో. యిటునుంచి ఓ కిలోమీటరు దూరం వుంటాయి పొలాలు, చేపల చెరువులు-"
"పద నడుద్దాం... చేపల చెరువులేమిటి...ఆశ్చర్యంగా అడిగాడు కేశవరావు.
"అదేమిటి మామయ్యా- ఇటుపక్క అంతా చేపల పెంపకాలు జరుగుతున్నాయి గదా- చెరువులు తవ్వి చేపలు పెంచి, కలకత్తాకి ఎగుమతి చేయడం ఇదో పెద్దవ్యాపారం అయింది గదా ఈ చుట్టుపక్కల అంతా. నీకు తెలియదా?
"నిజంగానా. నాకెలా తెలుస్తుందిరా...ఇటువచ్చి పాతికేళ్ళయింది గదా!"
"అవునులే. ఇదిగో ఈ చేపల పంపకాలు మొదలయి పదిహేనేళ్ళయింది- అబ్బో చాలా లాభసాటి. లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు అంతా. పల్లపు భూములన్నీ యిప్పుడు చేపల చెరువులయిపోయాయి. ఇదివరకు దాదాపు వెయ్యి ఎకరాల పంట భూమి వుండేది. ఇక్కడ యిప్పుడది ఏడు ఎనిమిది వందల ఎకరాలకి దిగిపోయింది - మిగతా రెండొందల ఎకరాల చేపల చెరువులు అయిపోయాయి. రంగా వివరిస్తూండగానే ఇద్దరు నడుస్తూ వూరి పొలిమేరలకి రాగానే చుట్టూ పచ్చని పంట పొలాలు, చేపల చెరువులు, చెరువు గట్లమ్మట నాలుగువైపులా కొబ్బరిచెట్లతో కోనసీమలా పచ్చని ప్రకృతి దర్శనం ఇచ్చింది."
"ఏమిటి యివన్నీ చేపల చెరువులే. కారులో వస్తుంటే చిన్న చిన్న వుంటలు, చెరువులు సేద్యపు నీరనుకున్నా...అబ్బ... ఇన్ని కొబ్బరి చేలున్నాయా ఇక్కడ" చుట్టూ చూసి, సంతోషపడుతూ అన్నాడు కేశవరావు. ఎప్పుడూ ఇటుపక్కరానేలేదు నేను. ఎప్పుడో చిన్నతనంలో తప్ప. పెద్దయ్యాక ఈ పచ్చగా పొలాలే చూడలేదు. ఈ ఏరియా అంతా బాగుంది రంగా... అయ్యో రాజేశ్వరిని కూడా తీసుకు రావలసింది."
"తీసుకువద్దాం మరో రోజు... ముందు నీవు చూడు. ఇదుగో అక్కడ కనిపిస్తున్న వరి పొలాలు... అవన్నీ మనవే... ఆ గట్టుంది చూడు అక్కడిదాకా...ఇటు పక్కవి వూర్లో షావుకారు నరసింహానివి...అటు దక్షిణాన ప్రెసిడెంటువి...ఇంకా దూరం వెడితే మన మునసబు, కరణం గారివి... మన భూమి అదిగో అంతవరకు అంటూ ఎల్లలు చూపించాడు రంగా.
"ఏమిటి వరి పంట వుందే... ఇంకా కోతలు కాలేదా. డిసెంబరుకే అయిపోతాయి గదా..."
"ఇది దాళవాయి పంట. అంటే రబీ అంటారు. రెండో పంట అన్నమాట. ఈ బియ్యం సాధారణంగా ఉప్పుడు బియ్యం రకం. ఇవి మనం తినం. ఒరిస్సా, బెంగాల్, తమిళనాడువారు తింటారు. అంటే ధాన్యం ఉడకబెట్టి ఎండబెట్టి బియ్యం చేస్తారు. బాయిల్డ్ రైస్ అంటారు. ఇదిగో గట్లమ్మట పెసర, శనగ వేశారు చూడు. గట్లమ్మట కొబ్బరిచెట్లు మనవే. అదుగో అటురా చేపల చెరువులు చూపిస్తా." అంటూ మరికాస్త దూరం తీసికెళ్ళాడు. అక్కడ చిన్న చిన్న చెరువుల్లా కనిపిస్తున్నవి చూపాడు. వాటిమీద సన్నని నైలాన్ నెట్టు కప్పబడి వుంది. ఇవా చేపల చెరువులంటే. చేపలు పెంచుతారన్నమాట- ఇదేమిటి ఈ దారాలతో కట్టారు ఇలా.
"ఇవి పక్షులు నీళ్ళల్లో చేపలు తినకుండా రక్షణ..."
"ఒక్క చెరువులో ఎన్ని చేపలుంటాయేమిటి" అమ్మితే ఎంత వస్తాయి?"
"మామయ్యా ఈ చెరువు చూడు. ఇది ఐదెకరాలుంటుంది. దీన్లో ఎన్ని చేపలుంటాయో నీవు వూహించలేవు తెలుసా- ఒకసారి వలవేసారంటే నాలుగైదు టన్నుల చేపలు అంటే రెండు మూడు లారీల లోడ్ వస్తాయి తెలుసా. ఇవన్నీ లారీలలో కలకత్తా వెళ్ళిపోతాయి. ఒక లారీ లోడ్ అంటే రెండు మూడు లక్షల రూపాయలు తక్కువ ధర పలకవు."
'ఏమిటి అన్ని చేపలే' ఆశ్చర్యంగా చూశాడు కేశవరావు.
"మరేంటనుకున్నావు- ఎకరం నాలుగు ఐదు లక్షల రేటు ఇప్పుడు -అంటే ఈ చేపల పెంపకం చాలా ఖర్చుతో కూడుకుంది - పెట్టుబడి 20,25 లక్షలన్నా వుండాలి- నాలుగైదు ఎకరాలు కొని చెరువు తవ్వించాలి- చేపల గుడ్ల పొదిగి పిల్లలు చేసే హేచరీ నుంచి చేపపిల్లల్ని కొని చెరువులో వదులుతారు. అవి పెరిగి పెద్దదవడానికి 9,10 నెలలు పడుతుంది. వాటిని పెంచడానికి ఎకరానికి 40,50 వేలు ఖర్చు అవుతుంది తెలుసా. వాటికి మేత, పనివాళ్ళు ఇవన్నీ కలిసి బోలెడవుతుంది. ఎంత బాగా తిండిపెడితే అంత బాగా పెరుగుతాయి."
"ఏం దానా పెడతారు" కుతూహలంగా అడిగాడు కేశవరావు.
"నూకలు, తవుడు, కోడిపెంట లాంటివన్నీ కలిపి గుడ్డలో మూటకట్టి, ఆ గుడ్డకి కన్నాలు పెట్టి నీటి మధ్య కర్రలు పాతుతారు. ఆ కర్రలకి ఈ గుడ్డ మూటలు రోజూ తీసికెళ్ళి కడతారు. ఆ చేపలన్నీ అక్కడకి వచ్చి తింటాయి. ప్రతిరోజు చిన్నచిన్న పడవలలో పనివాళ్ళు వెళ్ళి ఆ పాత మూటలు విప్పి కొత్తవి కడతారు. బాగా ఎంత దానా పెడితే అంత పెద్ద సైజు చేపలు వస్తాయి. అలా పెరిగిన వాటిని 9,10 నెలలకి వల వేసి పడతారు. ఆ నైలాన్ వలలే కొన్ని వేలుంటాయి - ఆ చేపలు పట్టడం బలే సరదాగా వుంటుంది. ఓరోజు తీసికెళ్ళి చూపిస్తా. ఆ వల వేసేరోజు నలభై, ఏభై మంది కూలీలు వల మొత్తం చెరువులో వేసి నాలుగువైపులా కూలీలు పట్టుకుని ఓ వైపునుంచి మొదలుపెట్టి వలని లాగుకుంటూ ఓ వైపు వడ్డుకి చేర్చుతారు. ఎంత బరువంటే ఏభైమంది కూలీలు కల్సి లాగాలి. పాపం ఆ చేపలు వలలోపడి ఎంతెత్తు ఎగురుతాయో- అలా ఒడ్డుకి ఈడ్చుకొచ్చి ఆ చేపలన్నీ బస్తాలలో ఎత్తి ఓచోట పోస్తారు. అక్కడ పెద్ద పెద్ద ప్లాస్టిక్ పాల పొట్లాలు పెట్టే ప్లాస్టిక్ క్రేట్స్ లాంటివి వుంటాయి-అక్కడ చేపల రకాలు సైజులు వారిగా తూచి ప్లాస్టిక్ క్రేట్స్ లో వేసేవారు వేస్తుంటే. ఐసు పొడి చేసింది క్రేట్స్ లో వేసి చేపలు ప్యాక్ చేసి లారీల కెక్కిస్తారు. అలా ఒకసారి రెండు మూడు లారీల లోడు చేపలు వస్తాయి. ఎకరానికి అరవై డెబ్బై వేలు ఖర్చుపెడితే లక్షపైన వస్తుంది. అంటే నీకో ఐదెకరాల చేపల చెరువు ఉందంటే 3లక్షలు ఖర్చుపెట్టావంటే ఐదు లక్షలు రాబడి అన్నమాట-"
"అమ్మో అంత వస్తుందా, బాగుందే యీ వ్యాపారం."
"మరందుకే చాలామంది తమ పల్లపు పొలాలు అన్నీ చేపల చెరువులుగా మార్చేశారు.
ఈ చేపలు, రొయ్యల చెరువుల మీద లక్షలు లార్జిస్తున్నారు- ఇప్పుడు చేపల చెరువులు వచ్చాక వాటికి అనుబంధ సంస్థలుగా ఐస్ ఫ్యాక్టరీ, పేకింగ్, బేల్ బిల్డింగ్ నెల బిల్డింగ్, ఫిష్ హెబిరీస ఇవన్నీ వచ్చాయి..."
"ఇవన్నీ ఎవరు పెట్టారు ఐస్ ఫ్యాక్టరీ అవీ..."
"ఎవరేమిటి మన వూరిలో డబ్బున్నవారే- ఇప్పుడు ఈ వూరిలో మోతుబారులు చాలామందే తయారయ్యారు. పొలాలు పంట పొలాలుగా ఉన్నప్పుడు ఎంత వచ్చినా పదివేలు, పదిహేను వేలు మిగిలేది. ఖర్చులు పోను యిప్పుడు నాలుగెకరాలు ఉంటే యేడాదికి రెండు లక్షలు మిగులు.