నీరజ తల్లి వంక ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఎప్పుడోగాని ఇలా మాట్లాడదు. స్కూల్ ఫైనల్ వరకూ చదువుకుంది. ఆమెలో అజ్ఞాతంగా వున్న బాధ, ఆవేదన అర్థమయినాయి.
"మరి...ఏం చెయ్యాలి?"
"పెళ్ళి చేసుకోవాలి" అంది అరుంధతి కొంచం నవ్వి"
"పెళ్ళా?"
"ఎందుకలా ఆశ్చర్యపడతావు? నీకు పెళ్ళీడు వచ్చింది. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఇరవై రెండేళ్ళు నిండకముందే పెళ్ళిచెయ్యటం మంచిది. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
"ఇబ్బందులంటే?"
చాలా వున్నాయి. సందర్భాన్ని బట్టి అనేక రూపాలతో విశ్వరూపం ప్రదర్శిస్తూ ఉంటాయి.
"అమ్మా! ఉద్యోగం చేస్తూ పెళ్ళిచేసుకోకూడదా? ఉద్యోగం పెళ్ళికి ప్రతిబంధకమవుతుందా?
"ఈ రోజుల్లో పరిస్థితులనిబట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటేనే మంచిది. గృహిణిగా తన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించే అవకాశం పోయినా, రెండు పనులూ చూసుకోవడంవల్ల కొంచెం శ్రమ ఎక్కువయినా, వంటరితనంతో, సోమరితనంతో, అర్థంలేని ఆలోచనతో, పనికిరాని మనస్థత్వాన్ని పెంపొందింప చేసుకునే అనర్థం నుంచి బయటపడి జీవితపు విలువల్ని కొంతవరకూ అర్థంచేసుకోగలుగుతుంది. కాని భార్యాభర్తల మధ్య ఒక్కోసారి సహకారం ఉండదు. ఒక్కసారి అమురుతుంది."
"అయితే నేను ఉద్యోగం చెయ్యడానికి అభ్యంతరం లేదుకదా అంది నీరజ సంతోషంగా.
అరుంధతి కొంచమాలోచించి "లేదు" అన్నది.
నీరజ ముఖం వికసించింది. లోపలకడుగుపెట్టి క్రిందకు వొంగి "తల్లి నుదుటి మీద ముద్దుపెట్టుకుని "అమ్మా" అని ప్రేమగా అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
4
నరసింహంగారింటికి ఎదురుగా...యించుమించు వెయ్యిగజాల స్థలంలో ఇంకో ఇల్లుంది.
ఆ ఇంటి యజమాని ఇరవైఏళ్ళ క్రితమే మరణించాడు.
అతనికి అయిదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి కాపరానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి చనిపోయేవరకూ అయిదుగురు కొడుకులూ సఖ్యతగా, అరమరికగానే ఉన్నట్లు కనిపించేవారు. ఆ అయిదుగురు కొడుకుల్లో ఇద్దరు కొంచెం మొరటుగా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. మిగతా ముగ్గురూ సాత్వికులే.
తండ్రి మరణానంతరం వీలునామా చూస్తే... అదెలా పంచుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. అది ఎక్కడా స్పష్టంగా లేక చాలా అస్తవ్యస్తంగా వుంది.