Previous Page Next Page 
రక్షరేకు పేజి 14


    అందులో రహస్యమేమిటో వెంకడికి తెలీదు-
    కషాయం తయారుచెయ్యడం మాత్రం తాతదగ్గిర నేర్చుకున్నాడు.
    "కషాయం ఇస్తే గునం కనిపిస్తాదేమో అమ్మగోరూ! పని చెయ్యకపోతే నన్ననగూడదు...."
    "నిన్నెందుకంటానురా? నాకీమాత్రం మందుమాకులూ చూసే దిక్కేది? నీ పుణ్యమా అని ఆ కషాయం పనిచేసి ఈ దౌర్భాగ్యపు జీవితానికి ఒక చిన్న ఆధారం దొరికితే....."
    సరళ కళ్ళలో నీళ్ళు నిండుకొచ్చాయి.
    ఎవరి కష్టాలు విన్నా మనసు కరిగిపోయే వెంకడికీ కళ్ళు చెమ్మగిల్లాయి.
    "అట్లా అనబోకండమ్మగోరూ! మీకేంటి? నల్లగ, సుహం గుంటారు. సీసా పట్రండి- రేపుకషాయం తెస్తాను-"
    "నువ్విక్కడే ఉండు. సీసా తెస్తాను-" అని సరళ లోపలికెళ్ళి ఖాళీ హార్లిక్స్ సీసా తెచ్చియిచ్చి "వెంకా! ఈ మందు నువ్వు నాకు నలుగురిలో యివ్వకు. అంతా నవ్వుతారు. ఈ సందులోనే సహస్యంగా ఇయ్యి....." అంది.
    "అట్టాగే!" అని తలూపాడు వాడు.
    ఆ మరునాడే కషాయం తెచ్చి పెట్టాడు వెంకడు- సందులోకి వచ్చిన సరళకి సీసా అందించి "ఆ బద్రమ్మ తల్లి సల్లగా చూసి మీ కడుపుపండాలి!" అన్నాడు.
    సరళ దాన్ని అపురూపంగా అందుకుని తన దైవం శ్రీరామ చంద్రుడికి నమస్కారం చేసుకుని అందులోంచి వెంకడు తాగమన్నంత తాగింది.
    "ఇది వోరం రోలొస్తాదమ్మాయిగోరూ! అయినాక మళ్ళీ తెస్తా! ఒక నెల్లాల్లు పొద్దుటేలా, మాపిటేలా, తాగి సూడండి" అన్నాడు వెంకడు.
    ఆశగా తల ఊపింది సరళ.
                                          7
    జైహింద్ బాబు పదోక్లాసు ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. అతని సంతోషానికి అంతులేదు.
    అన్నమ్మ తనకు తెలిసిన దేవతలకందరికీ దణ్నాలు పెట్టుకుని ఉన్నంతలో ఉన్నంత నైవేద్యం పెట్టుకుంది.
    రత్నమ్మ బాగా పెద్దదయింది, ఓణీలుమానేసి చీర కడుతోంది - "నువ్వు సానా గొప్పాడివిరా?" అంది మెరుస్తున్నకళ్ళతో-
    సుందరీబాయి కూడా ఉత్సాహంగా "ఒరే అన్నా నీకు సానా డబ్బులొస్తాయి కాదొరే!" ఆశగా....
    జైహింద్ బాబు ఉల్లాసంగా నవ్వి "అప్పుడే కాదే. ఇంకా పైకి చదువుకోవాలి. అప్పుడు." అన్నాడు.
    అన్నమ్మ దిగులుపడిపోయి "ఇంకా సానా సదవాలా?" అంది.....
    తన ఇంట్లో అందరూ తను పదోక్లాసు పాసవ్వగానే తనకు కలెక్టర్ ఉద్యోగంలాంటిదేదో సిద్ధంగా ఉంటుందని అనుకుంటున్నారు. వాళ్ళ అమాయకత్వం చూస్తే జాలేసింది వాళ్ళు తనమీద పెట్టుకున్న ఆశలు చూస్తే భయమూ వేసింది....
    ఏమాత్రం సంతోషం చూపించనిది కోటయ్య ఒక్కడే! అతడికి ఇంట్లో పట్టదు. ఇంటికి వచ్చిననాడు వస్తాడు. లేనివాడు లేదు. ఇప్పటికీ బాగా తాగివస్తున్నాడు. కాని, ఇదివరకులా భార్యని చావబాదటం లేదు....
    జైహింద్ బాబు పాసయ్యాడని విని "అయితే జయన్నా! నీకు పనిదొరుకుతాదా? నీకాడ నాకూ ఏదన్నా పని చూడు!" అన్నాడు.
    "అప్పుడే కాదయ్యా! ఇంకా పైనచదవాలి......" అన్నాడు జైహింద్ బాబు, ఇంతమందికి ఈ విషయం నచ్చజెప్పవలసి వచ్చేసరికి పాసయిన ఉత్సాహం తగ్గిపోతుండగా-    
    జైహింద్ బాబు పాసయిన విషయం విని ఎంతో సంతోషించాడు వ్యాసమూర్తి.....
    "పైకి చదువుతావా" అన్నాడు ప్రోత్సాహపూర్వకంగా.....
    ఇంతసేపటికి తన ఉత్సాహాన్ని పంచుకొని తన కలలూ, ఆసలూ చెప్పుకొనేటందుకు ఒక వ్యక్తి కనిపించాడు జైహింద్ బాబుకి.....
    "చదువుతాను బాబుగారూ! ఇంటర్ పాసయ్యాక వీలయితే డాక్టర్నవుతాను. కానీ, దానికి చాలాఖర్చవుతుందట కదూ? వీలు కాకపోతే ఐ.ఏ.ఎస్ కి కూచుని కలెక్టర్నవుతాను - డాక్టర్నయితే మా వాళ్ళందరికీ వైద్యం చేసి, మంచి మంచి మందులిస్తాను. లాయర్నయితే మీలాగ మా వాళ్ళకి జరిగే అన్యాయాలన్నీ కోర్టులోనిరూపిస్తాను. న్యాయం జరిగేలా చూస్తాను- కలెక్టర్నయితే అసలు కష్టాలే లేకుండా, రాకుండా చూస్తాను....."
    ఉత్సాహం ఉరకలు వేసే ఆ ముఖంలోకి అభిమానంగా చూశాడు వ్యాసమూర్తి- "మీ వాళ్ళలో నీలాంటివాళ్ళు పదిమందికొకరున్నా, మీ జాతిమొత్తం బాగుపడేదయ్యా! ఇంటర్ లో చేరు. తప్పకుండా పైకి వస్తావు" అన్నాడు.
    పొంగిపోయాడు జైహింద్ బాబు-
    పరమానందంతో తను పాసయిన వార్త చెప్పటానికి రాజయ్య గుడిసెకు కూడా వచ్చాడు. రాజయ్య తోటలో ఉన్నాడు.....
    చంద్రి కూడా పదోక్లాసు పాసయింది - కానీ, దాని ముఖంలో ఏ కోశానా సంతోషం లేదు.
    ఆ ముఖం చూసి ఎలాగో అయిపోయాడు జైహింద్ బాబు- బహుశః నాగమ్మ చంద్రిని ఇంకా పైకి చదివించటానికి ఒప్పుకోలేదేమో! తమలో యింతవరకూ చదివించటమే గొప్ప - శక్తి వున్నా కాలేజీలో చేర్పించటానికి వెనకాడతారు. అందులో ఆడపిల్లల్ని అసలు చేర్పించరు. పాపం పైకి చదవలేకపోతున్నాననే నిరాశతో అలా ఉందేమో!
    "చంద్రి" అని పిలిచాడు ఆరాటంగా.
    క్రింద కూర్చుని తన తండ్రి తోటలోంచి తెచ్చి పడేసిన కూరగాయల్ని వేటికవి గంపలోకి సర్దుతోన్న చంద్రి తలెత్తి చూసింది.
    దాని ముఖం జీవం లేనట్లు పాలిపోయి ఉంది.
    మోటబావి దగ్గరనుంచి కుండతో నీళ్ళు మోసుకువచ్చిన నాగమ్మ కుండ దింపి అతన్ని చూసి నవ్వి-
    "ఏంటి జయన్నా! పాసియినా వంటగా" అంది....
    "అవునత్తా! ఫస్టుక్లాసులో పాసయ్యాను"
    "పని దొరుకుతాదా"
    "లేదత్తా! ఇంకా పైకి చదువుతాను"  

 Previous Page Next Page