Previous Page Next Page 
రక్షరేకు పేజి 15


    "సదువయ్యా సదువు - మొగబిడ్డవి - ఎంతయినా చదువు. నీకు ఓ మంచి కబురు సెప్తా! మా చెంద్రికి మనువు కుదిరింది. రెండువందలు ఓలిస్తామన్నారు! తులం బంగారం! రెండుతులాలు వెండి పెట్తామంటున్నారు- యేం? మన చంద్రికేం తక్కువయింది? నువ్వే సెప్పు ఇంత సక్కనిది ఈ యీదిలోనే లేదు. పెద్దిళ్ళలో మాత్రం వుందా? మనం మాత్రం తక్కువ సేస్తావంటలే! గిన్నెలన్నీ ఇస్తాం. మంచం గూడ కొంటన్నా! గొలుసు సేపిచ్చినా"
    తన ధోరణిలో చెప్పుకుపోతుంది నాగమ్మ.
    జైహింద్ బాబు చెవులకేమి వినపడటం లేదు. జీవం లేనట్లుగా పాలిపోయిన చంద్రి ముఖాన్నే చూస్తూ నిలబడిపోయాడు....
    ఆ ముఖం అలా వుండటానికి కారణం తెలిసిపోయిందిపుడు- అక్కడ నిలవలేక "వస్తానత్తా" అని ఇంటికి వచ్చేశాడు.
    "చంద్రికి మనువు కుదిరిందటగా?" అన్నాడు తల్లితో....
    అన్నమ్మ నిట్టూర్చి "అవును - అదురుస్టం - వయసు రాగానే పెళ్ళి సేసేస్తన్నాది నాగమ్మ - మన రత్తికే వయసొచ్చినాది.... దానికే పెళ్ళి చెయ్యాల" అంది.
    మరో కొత్త సమస్య కళ్ళముందుకొచ్చింది. జైహింద్ బాబుకి రత్నమ్మకు పెళ్ళి చెయ్యాలి.
    తను చదివింది పదోక్లాసే కాని, తన వయసు పందొమ్మిది - చంద్రికీ పద్దెనిమిది వుంటాయి. ఆ వయసులో నాగమ్మ చంద్రికి పెళ్ళి చెయ్యాలనుకోవడం సహజమే.
    ఏదో అశాంతి మనసులో - ఏం చెయ్యాలో తెలియని అశాంతి - ఏమీ చెయ్యలేడు- చెయ్యకుండా ఉండలేడు-
    "అమ్మ! చంద్రికిప్పుడు పెళ్ళి చెయ్యకపోతేనేం? చదివించకూడదూ?" అనేశాడు.
    ఉలిక్కిపడింది అన్నమ్మ- కొడుకు ముఖంలోకి పరీక్షగా చూసింది - భయంగా అంది.....
    "అదేంటిరోయ్! ఇంకా ఏటి సదువుద్దది? పోలీసు జవాను మనువాడతానంటున్నాడు - ఇంకేటి కావాల? లచ్చనంగా రాజాలానీలా బతుకుద్ది. నీకది వరసకాదు- నువ్వు  దాన్ని మనువాడితే, నిన్నూ దాన్నీ, మన్నీ, ఎవరినీ నిలవనియ్యరు మనోళ్ళు - అట్టాంటాలోచన రానియ్యబాక-"
    గతుక్కుమన్నాడు జైహింద్ బాబు. తను నోరు విప్పి ఏమీ అనకుండానే తన మనసులో ఏ మూలనో ఉన్న ఆలోచన పట్టేసింది తల్లి.
    తమలో ఆడపిల్లకి సొంత తల్లి తమ్ముడితో పెళ్ళి చేసేస్తారు. మేనమాఁవ వరస అని - అలాంటిది ఏదో అతి దూరపు బీరకాయ పీచుసంబంధంలో, తనకూ చంద్రికీ వరుసకాదట! చంద్రిని తను పెళ్లిచేసుకోవటం అసంభవమట!
    అన్నమ్మ ఊరుకోకుండా మళ్ళీ అంది....
    "అల్లాకి మనం దణ్నాలు పెట్టేటోళ్ళం. ఆల్లపిల్లని మనింటికెట్టా తెచ్చుకుంటాం"
    ఈ బంధుత్వాల్లో ఇదొకటి! ఆయా  బంధుత్వాలను బట్టి ఒక కుటుంబానికీ మరొక కుటుంబం దణ్ణాలు పెట్టేవరస కలుస్తుంది - తాము ఎవరికి దణ్ణం పెట్టాలో ఆ కుటుంబంలో మొగపిల్లవాడికి తమ ఇంటి ఆడపిల్లనించి పెళ్ళి చేస్తారు కాని, ఆకుటుంబంలో ఆడపిల్లను తమ మొగపిల్లవాడికి భార్యగా తెచ్చుకోరు.
    ఏమిటి ఈ ఆచారాలు? వడ్డీ వ్యాపారితో దెబ్బలాడి వడ్డీనీ, గట్టిగా ప్రయత్నిస్తే అసలు కూడా రద్దుచెయ్యచ్చునేమోగాని, అర్ధంలేని ఆచారాలను మాత్రం ఎవరూ రూపుమాపలేరు. ముందు తన తల్లే ఒప్పుకోదు.
    కాలేజీలో సీట్ కోసం అఫ్లయ్ చేశాడు జైహింద్ బాబు. ఫస్టుక్లాసులో పాసయిన అతనికి సీట్ తేలిగ్గానే వచ్చింది.
    టీచరమ్మ దగ్గిర తను దాచిన డబ్బంతా తెచ్చి ఇచ్చింది అన్నమ్మ - నలిగిపోయిన రూపాయకాగితాలూ అర్థరూపాయలూ, పావలాలూ, పదిపైసల బిళ్ళలూ చూడగానే ప్రతి చిన్ననాణెంలోనూ తన తల్లి పరిదీనవదనం ప్రత్యక్షమయి మనసు కదిలిపోయింది జైహింద్ బాబుకి.-
    "ఏం చేస్తే, ఈతల్లిరుణం తీర్చుకోగలనూ?" అనుకున్నాడు మనసులో మరొకసారి.
    జీతం కట్టిన కాలేజీలో చేరిన రోజున తన ఒళ్ళు తనకు తెలియలేదు జైహింద్ బాబుకి తన చిరకాల వాంఛితం నెరవేరింది. తన బంగారు కలలు ఆకృతి ధరిస్తున్నాయి- బాగా చదువుకోవాలి! చదువుకుని ఎన్నెన్నో, ఎన్నెన్నో చెయ్యాలి.
    కష్టపడి సెకండ్ హేండ్ పుస్తకాలకోసం ప్రయత్నించి కొన్ని కొన్నాడు జైహింద్ బాబు కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా మంచి ఆయన - జైహింద్ బాబుకి స్కాలర్ షిప్ రావడానికి ప్రయత్నిస్తానన్నారు అప్లయ్ చెయ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి తప్పకుండా వస్తుందని ధైర్యం చెప్పారు.
    కాలేజీలో చేరి చదువుకుంటున్నా తల్లికి ఇంటిపనుల్లో చాలా సాయం చేసేవాడు జైహింద్ బాబు.
    తల్లి టీచరమ్మ ఇంటికి పనిలోకి తనకు కాలేజి టైం అయ్యే వరకూ ఏదో ఒక పుస్తకం తీసి చదువుకునేవాడు.
    రత్నమ్మ మరో ఇంటికి పనికెళుతుంది. అది పొద్దున్నపోతే సాయంత్రం కానిరాదు. చిన్నపిల్లలని కూడా ఆడించాలి! అది దానికి ఒకపూట అక్కడే అన్నం పెడతారు. బేరాలున్నా, లేకపోయినా సుందరీబాయి బల్లదుకాణం దగ్గిరే కూచుటుంది! అంచేత ఇంట్లో అతని చదువుకి ఇబ్బంది కలిగించే వారెవరూ ఉండరు.
    "ఏం బావా! చదువుకుంటున్నావా?" అంటూ వచ్చింది చంద్రమ్మ.
    చంద్రిని చూచినప్పుడల్లా మనసు కలత పడుతోంది ఈ మధ్య జైహింద్ బాబుకి - అందుకే ఆ ఇంటివైపుకే పోవటంలేదు.
    "రా! కూచో!" అన్నాడు పుస్తకంమూసి.....
    "బాగా చదువుకుంటున్నావు. కంటికే కనిపించడం లేదు" నిష్ఠూరంగా అంది.
    జైహింద్ బాబు అదొక రకంగా నవ్వి "నేనెందుకూ, నీకంటికీ కనిపించటం? మీ శ్రీవారు కనిపించాలని కోరుకో!" అన్నాడు.
    "అదే కోరుకున్నాను - అందుకే ఇక్కడకి వచ్చాను" అంది చంద్రి ఏమాత్రం సిగ్గుపడకుండా.
    "ఏం మాట్లాడుతున్నావు చంద్రి!"
    "నీకు అర్థం కాలేదా!"
    "పరిస్థితులు నీకు తెలియనివా? మన ఆచారాలు, మన నమ్మకాలు, మన కట్టుబాట్లు...."
    "అన్నీ ఉన్నాయి. అన్నింటినీ "ఉప్"మని ఊది పారేసే తప్పూ ఉంది! చెయ్యదలచుకున్నది చేసేసి తప్పు కట్టేస్తే సరి....."

 Previous Page Next Page