Previous Page Next Page 
రక్షరేకు పేజి 13


    "అదేంటండీ?" అన్నాడు.
    వరదాచారి నెత్తి కొట్టుకుని "నా కర్మరా! ఈ తలనొప్పి దాన్ని వదలటంలేదు! ఎంతమంది డాక్టర్లకి చూపించానో! ఎన్ని మందులిప్పించానో!" అన్నాడు.
    వెంకడు ఉత్సాహంగా "ఈ తలనొప్పి నాకు తెలుసు అయ్యగోరూ! ఆకు పసరుపూస్తే పోతాది. తెమ్మంటారా?" అన్నాడు.
    వరదాచారి ఆశ్చర్యంగా "నీకు మూలికల వైద్యం తెలుసేమిటిరా?" అన్నాడు.
    "మా తాత సేసేవోడండి. నాకూ చెప్పాడు అన్నీ నాకూ తెలుస్తాయి. సానా రోగాలకి మందిచ్చి నాను తగ్గిపోనాయి."
    "అయితే పో, తీసుకురా! పోయిందేముంది? చూద్దాం!"
    అప్పటికప్పుడు గుడిసెకి పరుగెట్టాడు వెంకడు. పాపం, వాడికి తన మందు యెవరయినా వాడి నయమయిందని మెచ్చుకోవడమే కావాలి!
    ఎన్నెన్నో మందులు వాడి విసిగిపోయాడు వరదాచారి.
    వెంకడి పసరుతో తగ్గుతుందని నమ్మకం లేకపోయినా ప్రయత్నించి చూడటంలో నష్టంలేదని అనుకున్నాడు.
    పసరు తయారుచేసి తీసుకొచ్చాడు వెంకడు.
    "ఇదొక తీరున రాయాలండీ - మీ కొస్తాదా?" అన్నాడు వెంకడు.
    వరదాచారి విసుక్కుని "మా కెలా వస్తుందిరా! నువ్వేరాయి" అన్నాడు.
    నాకేం వద్దు. ఇప్పుడు స్నానం చెయ్యాలి" అని లబలబలాడింది రంగనాయకమ్మ.
    "నోరు మూసుకో! ఇప్పుడు కాకపోతే ఒక గంటాగి స్నానం చేద్దువుకాని..... మంచం పాకలో వేయించుకో! మందు రాయనీ! చూద్దాం! తగ్గుతుందేమో!" అనికసిరాడు వరదాచారి.
    వెంకడు రంగనాయకమ్మ నుదుటిమీద ఆకుపసరు మర్గనా చేశాడు. అతడలా మర్ధనా చేస్తున్నంతసేపూ చాలా హాయిగా అనిపించింది రంగనాయకమ్మకి. మరికాస్త ఆకు పసరు మాడుమీద కూడా రుద్దాడు.
    వెంకడు మర్దనా చెయ్యడంవల్లనో, పసరు ప్రభావం వల్లనో నిద్ర ముంచుకొచ్చింది రంగనాయకమ్మకి. ఒకగంట తర్వాత నిద్ర లేచేసరికి రంగనాయకమ్మ తలనొప్పి చేతితో తీసినట్లు తగ్గిపోయింది.
    అందరూ చాలా ఆశ్చర్యపోయారు.
    నాగమ్మ సంగతి తెలుసుకుని బుగ్గన వేలేసుకుని అంతలో గర్వంగా "మా వోడికి మంతరాలు కూడా తెలుసు - " అంది.
    "ఏరా నీకు మంత్రాలు తెలుసా?" అన్నాడు వరదాచారి -
    వెంకడు బెదిరి చూస్తుండగానే,
    నాగమ్మ కల్పించుకుని "ఆ! వొచ్చు - కోటయ్య ఎవతెనో తీసుకొస్తే ఈడు మంతరాలు చదివి ఎల్లగొట్టేశాడు - " అంది.....
    వరదాచారి పూర్తిగా నమ్మలేకపోయాడు.
    తెల్లవారిలేస్తే అదేపనిగా మంత్రాలు చదివే వ్యక్తి మంత్రాలకు శక్తి వుంటుందని ఎలా నమ్మగలడు?
    నమ్మకుండానూ ఉండలేకపోయాడు -
    ఏమో!
    ఎవరి మంత్రాలు ఎలాంటివో!
    వెంకడికి ఒక రూపాయి ఇచ్చి "ఇదిగో! తీసుకోరా!" అన్నాడు.
    అంతకుముందు డాక్టర్లకి వందలు వందలిచ్చిన వరదాచారికి ఆ రూపాయి ఇయ్యటం కూడా వృధా అనిపించింది.
    ఆ రూపాయి చూసి పొంగిపోయాడు వెంకడు!
    అంతకుముందు కూడా అతడు తన మూలికల వైద్యముతో అనేకమందికి రోగాలు తగ్గించినా. తన వైద్యంమీద అంతడబ్బు ఎప్పుడూ సంపాదించలేదు వెంకడు!
    ఆ సాయంత్రమే ఆ రూపాయి పెట్టి చంద్రికి గాజులు కొనితీసుకెళ్ళాడు.
    "అమ్మా! అన్న కొనిచ్చాడు-" అని చంద్రి చేతినున్న గాజులు చూపించినపుడు వద్దనుకున్నా, వెంకడిమీద మంచి అభిప్రాయం కలిగింది నాగమ్మలో కొద్దిగా....
    వరదాచారి ఇంటిచుట్టూ కట్టుదిట్టమయిన ప్రహరీ గోడవుంది. ప్రహరీగోడకీ, యింటికీ మధ్య రెడువైపులా సన్నని సందులున్నాయి- పనివాళ్ళు తలవాకిట్లోంచి పెరట్లోకి రావటానికి తప్ప ఆ సందులు యింట్లోవాళ్ళు ఎందుకూ ఉపయోగించరు.
    రోజూ సాయంత్రంవేళ ఆ సందులు ఊడ్చి శుభ్రం చెయ్యడం కూడా వెంకడి పనుల్లోకి చేరింది-
    వెంకడు నోరు మూసుకుని చెప్పిన పనంతా చేస్తున్న కొద్దీ అతడి పనుల జాబితా పెరిగిపోసాగింది-
    అయినా వెంకడు పనికేనాడూ బద్ధకించడు.
    ఆ రోజు సందు ఊడుస్తూండగా "వెంకా!" అనే పిలుపు వినిపించి చుట్టూ చూశాడు-
    ఆ సంధ్య చీకట్లలో ఇంటిగోడకానుకుని నిలబడి ఉంది సరళ....
    "ఏంటమ్మగోరూ?" అన్నాడు వెంకడు-
    ఆ ఇంట్లో సరళ గడుపుతోన్న జీవితం చూశాక అతడికి సరళమీద చాలా గౌరవం కలిగింది.
    సరళ వెంటనే మాట్లాడలేదు-
    వెంకడికి భయం వేసింది-
    "సెప్పండమ్మాయిగోరూ! మీకూ తలనొప్పా?" అన్నాడు.
    "తలనొప్పి కాదురా..... కానీ....."
    సరళ కొంచెంసేపు సంకోచించి, చివరకు సంకోచం వదిలించుకుని తల వంచుకుని, "నాకు పెళ్ళయి నాలుగేళ్ళయిందిరా! ఇంతవరకూ సంతానం లేదు. అందుకేమయినా మందుందా నీ దగ్గిర?" అంది.....
    సరళను చూసి జాలిపడ్డాడు వెంకడు.
    సంతానంలేని ఆడవాళ్ళు సంతానం కోసం ఎంతగా ఆరాటపడతారో అతనికి తెలుసు.
    తన తాతదగ్గిరకి అలాంటివాళ్ళు కొందరు వచ్చారు.
    తన తాత వాళ్ళకి ఒకరకమయిన కషాయం తయారుచేసి ఇచ్చేవాడు.
    ఆ కషాయం తాగినవాళ్ళలో కొందరికి సంతానం కలిగేది-
    కొందరికి కలిగేదికాదు-

 Previous Page Next Page