"మీరు స్వేచ్చను గురించి మాట్లాడుతున్నారు. స్వేచ్చ ఒక వ్యక్తిని నేరస్తుడిని చేస్తుంది తెలుసునా?"
"నేరం! నేరం గురించి మీకు ఒక తడవ చెప్పాను. కూపస్థమండూకంలా వుండటంకన్నా బయటకు వచ్చి నేరాలు చేయటం మంచిది. ప్రతి పిల్లవాడూ ఎన్నోనేరాలు చేస్తూనే పెద్దవాడౌతున్నాడు. కాని యీ విషయం తల్లితండ్రులకు తెలియదు.
"అయితే మీ దృష్టిలో తప్పు అనేది ఏమిటి?"
"అన్నిటికన్నా బ్రహ్మాండమైన తప్పు కర్తవ్యాన్ని గుర్తించకపోవటం, ఆదర్శాన్ని అవలంబించకపోవటం."
"కర్తవ్యం వేరు ఆదర్శంవేరు. ఈ రెండింటికీ యెంతో వ్యత్యాసం వుంది. మొదటిది తప్పనిసరి రెండవది వ్యక్తిగతమైన అభిలాష."
"అంచేతనే యీ రెండూ ఒకవ్యక్తిలో అవసరమంటాను డాక్టర్ ఆదర్శం అనేది ప్రతివారికీ అవసరం. లేకపోతే మీట నొక్కితే పనిచేసే యంత్రానికీ మనిషికీ భేదం వుండదు."
"కాని ఏదో ఒక ఆదర్శం పెట్టుకొని, అది సాధించలేకపోతే భగ్నహృదయుడై విషాదంతో చివికి చివికి అంతరించాలనా మీ తాత్పర్యం?"
"ఆదర్శాలు నక్షత్రాలలాంటివి" అంది అనసూయ. "మనం వాటిని చేతితో స్పృశించలేం... కాని సముద్రంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి వాటిని ఆధారంగా చేసుకొని యెలా ముందుకు పోగలుగుతాడో, అలాగే మనం వాటిని ఆధారం చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఇది నేను ఊహించి చెప్పటంలేదు డాక్టర్! ఒక మహానుభావుడు చెప్పిన భావం, భాష నేను అవగతం చేసుకున్నాను."
"ఇవన్నీ సమస్యలు తెచ్చి నెత్తికెక్కించుకోవటం మినహా ఏమీకాదు" అన్నాను మెల్లిగా.
"సమస్య అంటే భయం యెందుకు? సమస్య అంటే పరాయిది కాదు. మీరు ఒక సమస్య, నేను ఒక సమస్య మనకు రోజూ భోజనం చేయటం ఎంత అవసరమో, సమస్యను పరిష్కరించుకోవటమూ అంత అవసరమే."
"కాని ఇవన్నీ శాంతిని దూరం చేయవా?"
"చేస్తాయి మనం యిప్పుడు శాంతి అని దేనిని అనుకుంటున్నామో దానిని దూరంచేస్తాయి. ప్రతి సత్యం అనేక పొరలతో అల్లుకునివుంది. ఆ పొరలన్నీ చించుకుంటూ పోతే కట్టకడపటికి ఏదైతే మిగులుతుందో అదే నిజమైన సత్యం నిజమైన శాంతి మొదలైనవి మనకు అక్కడే దృగ్గోచరమౌతాయి."
"కంటికి కనిపించని విషయం గురించి మనం బాధపడటమెందుకూ"
ఆమె బిగ్గరగా నవ్వింది. "మన పూర్వులు కంటికి కనిపించని విషయాల గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఒక్క దేవుడు, మతం వీటిని మినహా కాని మనశాస్త్రం అభివృద్ధి చెందినది. కంటికి కనిపించని అనేక విషయాలు వున్నాయని తెలుసుకున్నారు. సూక్ష్మజీవులు కంటికి కనిపించవని మనకు అపకారమో, ఉపకారమో చేయకుండా ఊరుకుంటాయా!
"డాక్టర్! మనం ఆలోచించుకోవటం నేర్చుకోవాలి యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే నై భావించకూడదు. అవసరమైనప్పుడే యోచన చేయవచ్చునని ఉపేక్ష చేయరాదు. మన చావుని గురించి కూడా ఆలోచించుకోవాలి. అనుక్షణం చావు నీముందు వున్నదన్న భావం, భయం వుంటేనే నీకు ఒక పనిని చక్కగా నిర్వహించి సాధించగలవు. లేకపోతే నీవు చచ్చిపోయాక కూడా నీవు ప్రారంభించిన కొరవ అలానే వుండిపోతుంది."
"మీకు చావుని గురించీ భయం వుందన్నమాట."
ఆమె తల అడ్డంగా వూపి "లేదు కాని అనుకున్నవన్నీ నెరవేరకుండానే త్వరగా చచ్చిపోతానేమోనని భయంగా వుంది."
"ఇంకా దేనిగురించి భయంలేదా"
"ఉహు లేదు... కాదు వుంది డాక్టర్... వుంది నాకు సానుభూతి అంటే భయం వుంది."
"సానుభూతి అంటేనా?"
"అవును ఇతరుల సానుభూతిని పొందటంకంటే బాధాకరమైనది మరొకటి లేదు. భర్త చచ్చిపోయినప్పుడు భార్యను గురించి, హఠాత్తుగా అంగవైకల్యం పొందినవాడిని గురించీ, అభ్యాసంగా తాము గురి అవుతున్న అన్యాయం గురించీ ఇతఃరులు సానుభూతి చూపిస్తే అది ఎంత అసహ్యంగా, బాధగా ఉంటుందో తెలుసునా? అంతకంటే వారు ఏ హత్య ప్రదర్శించినా భరించవచ్చు. ఈ మధ్య ఆడవారు యిలమతి సానుభూతినే పొందుతున్నారు చాలా భాగాలనుంచి. కాని అది వ్యర్ధం. ఈ సానుభూతి వాళ్ళను కృంగదీస్తుందేగాని, వాళ్ళ అసమర్ధత అంటే వాళ్ళకు రోతపుట్టించేటట్లు చేస్తుందేగాని, వాళ్ళలో అగ్ని మండించదు. వాళ్ళ అజ్ఞానాన్ని భస్మీభూతం చేయదు. వాళ్ళని ఎవరైతే క్రూరంగా హింసిస్తున్నారో వాళ్ళ ద్వారానే సానుభూతి పొందడంకన్నా శోచనీయమైన సంగతి మరొకటిలేదు. ఈ నీ తపన వాళ్ళలో నుంచే పుట్టుకు రావాలి.
"అనసూయగారూ! క్షమించండి. అంతకంటే దగ్గరగా పిలవలేకపోయాను... మన భారతదేశంలో స్త్రీకి చాలా గౌరవం లభిస్తుందనీ, వాళ్ళను పూజనీయరాండ్రుగా భావిస్తున్నారనీ మీ ఆడవాళ్ళే ఒప్పుకున్నారే! పుస్తకాల్లో రాసుకున్నారే?"
ఆమె వెగటుగా నవ్వింది. ఆమె నవ్వులో అంత కసినీ, అసహ్యాన్నీ అంత వరకూ నేనెప్పుడూ చూడలేదు. "కారణం, గౌరవమనే మాట కొన్ని వేల సంవత్సరాలనుంచీ అపార్ధంతో వాడబడినందువల్ల, తాముచేసే ప్రతిపనినీ గౌరవిస్తున్నామనే పేరుతో పురుషులు బూకరించటంవల్ల.
"వినలేదా గీతలో మా స్త్రీలను గురించి ఒకచోట ఏమి రాసివుందో! సామాన్యమైన అధర్మము ఒకసారి ప్రబలినా ధార్మికత తిరిగి ఏర్పడవచ్చును గాని, స్త్రీలు చెడిపోవటంవల్ల వర్ణ వర్ణాంతరసాంకర్యం, వర్ణాంతర్గత సాంకర్యం కలిగి అధర్మ సంతానం జన్మించటంచేత ధర్మం శాశ్వతంగానే చెడిపోతుందిట. దీని మూలాన పితృదేవతలు పిండోదకములు లేకుండా పతితులవుతారట.