లోలాయతి నేత్రాలతో ప్రభవించిన వెన్నెలలాంటి కాంతి లలితమై, మధురమై ప్రవహిస్తుంది.
చివరకు నేనంటే నేను భయపడి పారిపోయాను. ఇది మానవకోటిలో ప్రతివాడికీ తప్పనిశిక్ష.
కాని యింటి దగ్గరకు వచ్చి పడుకున్నాను. అదృష్టవశాత్తూ యెలా పట్టిందో గాని తెల్లవారుఝామున ఒకగంటసేపు మంచి నిద్రపట్టింది. లేచాక మనసు ఉల్లాసవంతంగా లేకపోయినా రాత్రి పడినంత బాధాకరంగా లేదు.
ఇవాళకూడా వాళ్ళయింటికి వెళ్ళాలని లేదు. కాని యింజక్షన్ యిచ్చి రావాలి.
సరిగ్గా బయల్దేరబోతూండగా ఒక సంఘటన జరిగింది.
ఒక బండిలో ఎవరిదో శవాన్ని వేసుకుని వెనక కొంతమంది జనం గుంపుగా వస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. చిరాకు నభినయిస్తున్నారు. ఒక ముసలిది 'అయ్యో నా కూతురా, కూతురా' అని యేడుస్తూ నడుస్తోంది. డాకటేరు బాబుగారూ! నా కూతుర్ని రక్షించండి బాబో, నిష్కారణంగా చచ్చిపోతోంది' అంది మరింత గట్టిగా ఏడుస్తూ.
"ఏమిటి? ఏం జరిగింది?" అన్నాను.
అంటూనే ముందుకుపోయి బండిలో వున్న శరీరంమీద ముసుగు తొలగించి చూశాను. అక్కడ చాలా భయంకరమైన దృశ్యం కళ్ళబడింది. యవ్వనంలో వున్న ఒక ఆడది నెత్తురు ప్రవాహంలో పడివుంది. పొత్తికడుపుకు ప్రక్కనుంచి పెద్దప్రేవులు వికృతంగా బయటకు చొచ్చుకొని వచ్చి, భయానక మైన రూపంతో పడివుంది. కాని ఆమె చచ్చిపోలేదు. బ్రతుకుతుందో లేదో తెలియదు. నేను చప్పున చేతులను నెత్తురులో జొనిపి వాటిని ఉపాయంగా లోపలకు త్రోసివేశాను. రక్తంతో తడిసి వున్న ఆమె హృదయంమీద రక్తంతో తడిసిన పమిటను రక్తంతో తడిసిన చేతుల్తో కప్పి ఇవతలకు వచ్చాను.
"పొడిచినాడు బాబూ! ఈ యెదవ కెందుకంట లేనిపోని రోషం? దాని కిష్టమైంది. దాని మొగుడు చూడకుండా వూరుకుంటున్నాడు. మధ్య ఈ సచ్చినోడికెందుకంట ఈ దురహంకారం? నా కొడుకు బాబూ! లం..... అని తిట్టి ఒక్కపోటు పొడిచేసినాడు."
ఇంతలో మీసాలు పెంచి గంభీరంగా వున్న ఒకవ్యక్తి ముందుకు వచ్చి "ఆడెవడండయ్యా, నా పెళ్ళాన్ని ఖూనీ చేసేందుకు? పెట్టేది నేను... పోషించేది నేను. ఎప్పుడైతే అది నన్ను పెళ్ళాడి నాతో వచ్చేసినాదో దానికీ వాళ్ళకీ సంబంధం పుటుక్కున తెగిపోయిందన్నమాటే! ఇష్టమో కష్టమో నేను సయించి వూరుకొంటాను. మజ్జన ఆడికెందుకంట మంట...? బతుకుతుందా బాబూ?" అన్నాడు.
నేను అసహ్యంతో కుచించుకుపోయాను. "బ్రతుకవచ్చు పెద్ద హాస్పిటల్ కి తీసుకుపొండి. నేను చేయగలిగింది నేను చేశాను" అని లోపలకు వచ్చేశాను.
ఇంతలో కాంపౌండర్ కూడా వచ్చాడు. అతన్ని లోషన్ నీరు తయారు చెయ్యమని చెప్పి సబ్బుతో చేతులు కడుక్కుంటూ "ఇదోయ్ లోకం పోకడ! నేరకపోయి డాక్టరీ చదివాను. ఏ వృత్తిలో, ఉద్యోగంలో వాళ్ళయినా అధర్మమని చెప్పి ఒక పనిచేయకుండా తప్పించుకోవచ్చు. కాని మనవారు పరువుకన్నా ప్రాణాలకే యెక్కువ విలువగా యిచ్చే స్వభావం గలవారు అవటంచేత "అయ్యో, ప్రాణం పోతోంది" అని సానుభూతి సంపాదించుకుంటారు. నీతి, అవినీతుల వ్యత్యాసం డాక్టర్ యేమీ పాటించకూడదా" అన్నాను.
అతను తలపంకించి "అలాగే కనపడుతుంది సార్" అన్నాడు.
అనసూయ యింటికి వెళ్ళేసరికి యెనిమిది దాటింది. నన్ను చూడగానే ఆమె "రెండవసారికూడా మీరు హఠాత్తుగానే వెళ్ళిపోయారు. ఇంకా చాలా విషయాలు చెబుదామనుకున్నాను" అంది నవ్వకుండా.
"వద్దులెండి ఆ విషయాలు" అన్నాను.
"కాదు మీరు వినాలి వినకుండా వుండలేరు" అంది. ఈ అహంకారానికి విస్తుపోయి యేమని జవాబియ్యాలో తెలియక నేను మహా యిదయిపోతుంటే "మీ కళ్ళు అంత ఎర్రగా వున్నాయేం? నిద్రపోలేదా? పోనీ అదే మంచిదేలెండి. పీడకలలు వచ్చేవి" అంది.
నేను యీ మాటలను అలక్ష్యం చేస్తున్నట్టుగా నటించి రోగియైన బాబాయిని చూసే నెపంతో లోపలికి పోయాను.
ఇవాళ ఆయన మరీ నీరసంగా వున్నాడు. నిన్నరాత్రి నేను రానందుకు తన వ్యధను వెలిబుచ్చాడు. "నాయనా! నేనిక నాలుగురోజులకన్నా యెక్కువ యెలానూ బ్రతికేదిలేదు. ఆఁ, అలా బుకాయించకు. నన్ను మభ్యపెట్టి లాభం లేదు. కాస్త కనిపెట్టి వుండరా బాబూ" అన్నాడు. తను పోయాక అనసూయ బాధ్యత నేను వహించాలని మళ్ళీ మళ్ళీ కోరి అలా ఒట్టు వేయించుకున్నాడు. ఆమె చాలా అమాయకురాలు. అనాధ-అన్నాడు. తానంటే ఆమెకు అత్యంత శ్రద్దాసక్తులు అన్నాడు. "నాయనా, రాత్రి అవుతుందంటే భయంగావుంది. పగలైతే నిశ్చింతగా చచ్చిపోతాను. చీకట్లో దాటిపోతానంటే మాత్రం భరించలేకుండా వున్నాను" అన్నాడు.
అక్కడున్న బల్లమీద ఒక యాభైరూపాయలు వుంచి వస్తుంటే వెనకనుంచి అనసూయ "రాత్రికి తప్పక రండి" అన్నది తలూపి వచ్చేశాను.
* * *
'ఒక వ్యక్తి అంటే యిష్టంలేనంత మాత్రంచేత వారిచేత ఆకర్షించకుండా వుండలేము' అన్నాడు ఒక యింగ్లీషు రచయిత వెనకటికి యెప్పుడో ఇది చదివినప్పుడు యేమో అన్నాను. కాని యిప్పుడు నా విషయంలో యిది అక్షరాలా నిజమైంది. అనసూయ ప్రవర్తనపట్ల యిచ్చ నాకెప్పుడో నశించి పోయింది. ఆమె అంటే అసహ్యం, భయంకూడా ఏర్పడ్డాయి. కాని ఆమెమాటలు వినటానికి, ఆమె దారుణమైన భవాలు ఆలకించడానికీ తరచు అక్కడికి వెళుతూ వుండేవాడిని వెళ్ళకుండా వుండలేకపోయేవాన్ని.
"స్త్రీ జాతికి జ్వరం వచ్చింది" అంది ఒకరోజు.
నేను అయోమయంగా చూశాను.
"అవును, ఇప్పుడేకాదు. తరతరాలుగా స్త్రీజాతికి జ్వరం వచ్చివుంది. దాన్ని కొలిచేటందుకు మీరు ఉపయోగించే ధర్మామీటర్లు చాలవు. ఆ జ్వరం నయం చేయటానికి మీరిచ్చే మందులూ యింజక్షన్లూ చాలవు. తన ఆత్మకంటే గొప్పదైన వస్తువు ప్రపంచంలో లేదు. కాని దానికి స్త్రీలు గుడ్డిగవ్వ విలువకూడా యివ్వడం లేదు. తమ ఆత్మను తాము గుర్తు ఎరిగి, దానికి విలువ యివ్వటం నేర్చుకున్న రోజున క్రమక్రమంగా జ్వరం తగ్గిపోతోంది."