Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 15


    "ఏం? చెడిపోవటమనే విషయం రాగానే స్త్రీలనే ఉదహరిస్తారే? వాళ్ళని గురించి ఎటువంటి ఉదాహరణలిచ్చినా వాళ్ళు నోరు పారేసుకోరు. వారు చదువుకున్నవారు కాదు. ఇదీ పురుషులు ఈ జాతికి గౌరవమిచ్చిన వైనం."    
    ఆమె ఆయాసంతో ఆగింది. కంఠం నరాలు ఉబ్బి వున్నాయి. ముఖకమలం యెరుపెక్కి లోపలనుంచీ యేదో మంట ఉబుకుతున్నట్లుగా వ్యక్తం చేస్తోంది. దీర్ఘనిశ్వాసం విడిచింది.    
    తరువాత నా ఉనికిని గమనించనట్టే తీక్షణంగా ఎటో చూస్తూ కూర్చుంది. నాకు తెలియని గొప్ప రహస్యం ఆమెదగ్గర ఏదో వుండాలనిపించింది. నిట్టూర్చి లేచి బయటకు వచ్చేశాను.    
                                                      * * *    
    రాత్రి పది దాటింది. సర్వత్ర భయంకరమైన నిశ్శబ్దం. రోగియైన బాబాయి అలసి సొలసి నిద్రపోతున్నాడు. నేను, అనసూయ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాము. ఎందుకో ఆమె తలవంచుకుంది. ఒకక్షణం గడిచాక తలపైకెత్తి మ్లాన మందహాసంచేసి "డాక్టర్! మీరెవర్నీ ప్రేమించలేదా?" అంది.    
    నాది అనుభవశూన్యమైన బ్రతుకు అవుతుందేమోనని యిదివరలో అప్పుడప్పుడూ ఖేదం పొందుతూ వుండేవాడిని కాని నా జీవితరంగంలోకి అనసూయ పాత్ర ప్రవేశించాక బ్రతుకు అనుభవాలపుట్ట కాకపోయినా క్రొత్త క్రొత్త స్మఘతనాలు ఎదుర్కోసాగాను.    
    ఆయన జబ్బు మరీ ముదిరిపోతూనే వుంది. ఆయనకు రోజులు సమీపించాయని నేను తెలుసుకున్నాను. ఒకసారి ఆమె యీ ప్రసక్తే ఎత్తినప్పుడు దాపరికం ఎందుకని వున్నది వున్నట్లు చెప్పేశాను. ఆమె చప్పున నాలిక కరచుకొని "మీతో కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పనేలేదు" అంది.    
    నేను విడవకుండా వాళ్ళయింటికి పోతూనే వున్నాను. ఆయన నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని ఆప్యాయంగా కబుర్లు చెప్పటం యెక్కువైంది. ఆమెపట్ల తనకున్న ప్రేమాభిమనాలు వెల్లడిస్తూ వుండేవాడు. కాని యెప్పుడూ ఆమెను తిడుతూ వుండేవాడు. "చూడు, దీనివల్లే నాకీ కష్టాలన్నీ సంప్రాప్తించాయి" అనేవాడు. అలా తిట్టి తిట్టి నాతో రహస్యంగా "అది చాలా పతివ్రత" అనేవాడు కాని సాయంత్రం అయేసరికి నిద్రపోయేవాడు. నేను రాత్రివేళ పోయినప్పుడు ఆయన ఏనాడూ మెలకువగా లేడు. అయినా నేను యెనిమిదయేసరికి వెళుతూ వుండేవాడ్ని కాదు వెళ్ళకుండా వుండలేకపోయేవాడిని.    
    ఆమె రెండు జీవితాల కలయిక. అది అభినయం అని యెవరూ అనుకోరు. రాత్రులు ఆమె కబుర్లనీ, తెల్లవారి భర్తకు చేస్తున్న శుశ్ర్రూషా, ఆయనతో ఆడుతున్న కబుర్లూ ఆశ్చర్యచకితుడ్ని చేస్తూ వుండేవి. ఈమె క్రొత్త అనసూయ అని భ్రాంతి కలిగేది.    
    కాని వింతల్లో వింత- తన రహస్యాలూ, మనోభావాలూ అన్నీ నాకు చెప్పివేస్తూంది కదా! నేను యివన్నీ ఆయనకు చెబుతానని ఆమెకు ఎందుకు భయంలేదో నాకర్ధం కాలేదు. పైగా నన్నెప్పుడూ చెప్పవద్దని అడగలేదు.    
    నేనామెకు అన్ని విషయాలూ చెప్పలేదు. అందులో ఒకటి ఆనాడు నా యింటిముందు బండిలో చూసిన పొడిచివేయబడిన స్త్రీని గురించి ఆమె చనిపోలేదు. బ్రతికింది. అప్పుడప్పుడు సాయంత్రం ముస్తాబై, మంద్రంగా చిరునవ్వులు నవ్వుకుంటూ నా యింటిముందుగా పోతూ వుండటం చూసే వాడిని నేనడగకుండానే ఒకరోజు మా కాంపౌండర్ ఆమెనుగురించి వివరాలు చెప్పాడు. అన్నని అప్పుడు పట్టుకున్నా చివరకు మరి ఏం జరిగిందో యిప్పుడు వదిలివేశారుట. ఇప్పుడు అన్న, చెల్లెలు, మొగుడు కలసి ఒకేయింట్లో సఖ్యతగా వుంటున్నారట. 'ఒరే అన్నా నీకెందుకురా కోపం? నా మొగుడే నోరుమూసుకొని గప్ చుప్ గా వూరుకుంటే?' అందిట ఆ అమ్మాయి "ఔనే. తప్పే నీ యిష్టం వచ్చినట్లు తిరుగు ఇంకెప్పుడూ నిన్ను పొడవను' అన్నాడుట అతను.    
    నా స్నేహితురాలు నన్ను యించుమించు వెలివేశారు. ఒకరోజు అందరూ కలసి కారులో వచ్చారు. వారిలో మనోహర్ కూడా వున్నాడు. అతనిముఖం మరింత యెర్రగా వుంది. నన్ను చూస్తూనే పిడికిళ్ళు బిగించి "ఫూల్! నిన్ననాడు యెంత బ్రతిమిలాడినా సాయం చేశావు కాదు. వేరేదారి లేక నన్ను లేచిపోదాం రమ్మంది. నేనొప్పుకోలేదు. గది తలుపులు మూసుకుని ఉరేసుకొని చావ బోతుండగా వాళ్ళ నన్న చూచి సంగతి గ్రహించాడట. అప్పట్నుంచి నేను కనిపిస్తే కాల్చేద్దామని కారులో తిరుగుతున్నాడట. ఇదంతా నువ్వే చేశావు. నిన్నేం చేసినా పాపంలేదు" అన్నాడు.    
    నేనేం మాట్లాడక పెదాలు బిగించి వూరుకున్నాను. సాయిబు "హరే, నీకీ నాదీ జీత్ అడ్డు. నీ జోలికి వచ్చాడంటే వాడూ ఫైసల్ ఖతం" అన్నాడు.    
    "ఇవాళ మనసులు యెవరికీ బాగాలేదు. చిరంజీవి మనకు జల్సా చేస్తాడు" అని వీరప్రతాప్ అన్నాడు.    
    "ఎక్కడికి- రిట్జోకి పోదామా! మాంటిగోమర్ కి పోదామా?"    
    "రిట్జో చెప్పు ఇవాళ బాల్ డాన్సులు కూడా వున్నాయి. మారేడ్ పల్లి సుందరి, మిస్ మాలా కూడా రావచ్చు. టెన్నిస్ చాంపియన్- వదిలిపెట్ట కూడదు"    
    "అన్నట్లు ఊర్వశి ప్రియ ఇవాళ డాక్టర్ ని చేయిజారనివ్వదు. కమాన్ డాక్టర్, మూడొందలు చాలు."    
    "నేను రాను" అన్నాను.    
    "రావూ?"    
    "రాను" అన్నాను మొండిగా.    
    వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని, ఒకసారి బిగ్గరగా నవ్వారు. "పదండి రెక్కపుచ్చుకుని లాక్కుపోదాం" అన్నారు.    
    "లాభంలేదు నన్ను బలవంతాన యెవరూ తీసుకు వెళ్ళలేరు. మీకు కావలసినది డబ్బే అయితే, ఆ మూడు వందలూ యిస్తాను. తీసుకువెళ్ళండి" అన్నాను.

 Previous Page Next Page