Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 14


    ఆమె కొంచెం కదిలినట్లయింది గానీ తలత్రిప్పి చూడలేదు.

    "ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీలేదు. నన్ను క్షమించండి."

    ఆమె ఏమీ జవాబివ్వలేదు.

    "క్షమించరా?"

    తల ఎత్తి అతనివంక చూసింది. జాలిగా, బాధగా వున్నాడు. అమాయకంగా, పసిగా వున్నాడు. అలసిపోయి, ఆవేదనగా వున్నాడు.

    ఒక్క క్షణంలో- ప్రేమిస్తే ఇలాంటి వ్యక్తినే ప్రేమించాలి. జీవితం ఇలాంటి వ్యక్తికి అంకితం చెయ్యాలి..... అనిపించింది.

    "తర్వాత మాట్లాడుదాంలెండి."

    "క్షమించారో లేదో......"

    "తర్వాత మాట్లాడుదామన్నానుగా......"

                                            6

    రెండురోజులు గడచిపోయాయి.

    శేఖరం ఆఫీసుకు రావటంలేదు.

    ఒక సాయంత్రం గోపయ్య మాలతి దగ్గరకు వచ్చి అమ్మగారు పోయారనీ, అంత్యక్రియలుకూడా జరిగిపోయాయనీ చెప్పాడు.

    తను పరామర్శకు వెళ్ళిరావటం ధర్మమని తోచింది మలతికి. భానుమతి తనుకూడా వస్తానంది.

    ఇద్దరూ వెళ్ళేసరికి శేఖరం పంచె కట్టుకుని హాల్లోకూర్చుని వున్నారు.

    "రండి, కూర్చోండి" అన్నాడు మర్యాదగా.

    భానుమతే ఎక్కువసేపు మాట్లాడింది. అతనికి వచ్చిన కష్టానికి సానుభూతి, మన;క్లేశం అన్నీ చక్కగా చెప్పేసింది. ఆమె అలా మాట్లాడుతుంటే మాలతి చెవులప్పగించి ఆశ్చర్యంగా వింటోందిగానీ, తను ఒక్కమాటకూడా మాట్లాడలేకపోయింది. దాదాపు వాళ్ళక్కడ గంటసేపున్నారు. ఈ గంటలో శేఖరంతో ఆమె ఒక్కసారయినా మాట్లాడటంగానీ అతడామెవైపు చూడటంగానీ జరగలేదు.

                                           * * *

    మరో ఇరవై రోజులవరకూ శేఖరం ఆఫీసుకు రాలేదు.

    భానుమతి ఎప్పుడూ మాలతిని వెక్కిరిస్తూ వుండేది.

    "ఆఫీసు లోపలకు రాగానే  నీకళ్ళు ఆఫీసరుగారి గదివైపు పరుగెడుతున్నాయని, ఆశగా వెదుక్కుంటున్నాయనీ నాకు తెలుసులే. మీ ఆఫీసరుగారు ఇప్పుడప్పుడే రారటలే" అనేది నవ్వుతూ.

    "నా ఆఫీసరంటున్నావేమిటి? నీకుమాత్రం ఆఫీసరు కాదా?"

    "మా అందరికీ కేవలం ఆఫీసు పనుల్లోనే ఆయన ఆధిపత్యం. నీకు మాత్రం......"

    "ఊఁ పూర్తి చెయ్యి, ఆగావేం?"

    "కొన్ని వాక్యాలు పూర్తి చెయ్యకుండానే పూరించబడతాయి. వాటిల్లో ఇదొకటి......"

    ఒక్కొక్కరోజు గడుస్తున్నకొద్దీ బరువుగా వుంటుంది.

    ఒకరోజు భానుమతి జ్వరంవచ్చి ఆఫీసుకు సెలవుపెట్టింది. ఆ సాయంత్రం పనిపూర్తయ్యాక బస్ స్టాప్ లో నిలబడివుంటే చేతిలో ఏదోసంచీ మోసుకువస్తూ గోపయ్య కనిపించాడు. అతడామెను చూడలేదు. ఆమె ముఖం సంతోషంలో వెలిగినట్లయి "గోపయ్య!" అని కేకేసింది.

    అతను చప్పున ఆగిపోయి, వెనుకకు తిరిగి "అమ్మగారూ మీరా?" అంటూ దగ్గరకు వచ్చాడు.

    "గోపయ్యా! ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయా? అయ్యగారింకా రావాటంలేదే?"

    "మీకు తెలీదా అమ్మగారూ? అయ్యగారికి గుండెల్లో నొప్పివచ్చి చాలా గాబరా చేసింది."

    "గుండెల్లో నొప్పా?" మాలతి ముఖం వెలవెల పోయినట్లయింది.

    "అవునమ్మగారూ! అమ్మగారు పోయిన వారంరోజులకనుకుంటాను. అయ్యగారు సామానుసర్దుతూ గుండెల్లో నొప్పివచ్చి క్రిందపడి పోయారు. నేను కంగారుపడిపోయి, గబగబ వెళ్లి దాక్టరుగార్ని తీసుకొచ్చాను. వారం రోజులపాటు మంచంమీదినుంచి క్రిందకు దిగకూడదన్నారు. చాలా కష్టపడ్డారమ్మగారూ!"

    మాలతికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ఇంత జరిగితే నాకు కబురు చెయ్యలేదేం?"

    "ఎవరికీ చెప్పవద్దన్నారమ్మగారూ" మీ పేరు చెప్పి "అమ్మగార్ని పిలుచుకురమ్మంటారా" అయ్యగారూ అనడిగాను. 'వద్దు, ఈ విషయం ఎవరికీ తెలియనక్కరలేదన్నారు. నేనేం చేయ్యనమ్మగారూ?"

    "పద పోదాం"

    "గోపయ్యా! పద, వెంటనే అయ్యగార్ని చూడాలి."

    తను ఎక్కవలసిన బస్సును వదిలేసి, గోపయ్యతో మరో రూట్ కు పోయే బస్సెక్కేసింది మాలతి.

    వాళ్ళు వెళ్ళేసరికి లోపలగదిలో మంచంమీద శేఖరం పడుకుని వున్నాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఇంకా చీకటి పడకపోయినా, కిటికీ తలుపులు మూసి వుండటంచేత గదిలో మసకమసగ్గానే వుంది.

    "ఎవరు గోపయ్యా?" అన్నాడు శేఖరం అలికిడి విని.

    మాలతి గదిలోకి అడుగుపెట్టి గుమ్మందగ్గర నిలబడింది.

    "ఎవరూ.......?"

    మాలతి మాట్లాడలేదు.

    చివరకు "మీరా?" అన్నాడు గుర్తుపట్టి.

    మాలతి ముందుకునడచి మంచం దగ్గరకు వచ్చేసింది.

    "ఇంత జబ్బుగా వుంటే కబురు చెయ్యలేదేం?" ఆమె గొంతు వణికింది.

    "ఏమంత పెద్దజబ్బు?" శేఖరం నవ్వడానికి ప్రయత్నం చేశాడు. "కొంచెం గుండెల్లో నొప్పి. హార్ట్ ఎటాక్ ఏం కాదన్నారు  డాక్టర్లు."

    "ఏమయినా.......మీరు లేవటంలేదు. ఒకరోజు కాదు... రెండు రోజులుకాదు....ఇన్ని రోజులు నాకు తెలియచెయ్యకుండా......."

    "చెయ్యటానికి సాహసం లేకపోయింది.." అన్నాడు శేఖరం విచారంగా. "ఒకసారి మీకు కబురుచేసి చాలా అపచారం చేశాను. ఆ షాక్ లోంచి ఇంకా నేను కోలుకోనేలేదు. ఆరోజు మీరెంత బాధపడివుంటారో, నన్నెంత అసహ్యించుకునివుంటారో ఊహించగలను. మళ్లీ మళ్లీ ఈ నరకంలోకి మిమ్మల్ని ఈడ్వటం నాకు ఇష్టంలేదు. మిమ్మల్ని ఇంతకంటే ప్రశంతమైన పరిస్ధితుల్లో కలుసుకోవాలి. మీ దగ్గర మనస్ఫూర్తిగా క్షమాపణలు పొందాలి. ఇదే నాఆకాంక్ష చూడండి, జరిగిందాన్ని మీరు సీరియస్ గా తీసుకోకండి. ఆవిడేదో అడిగింది. ఆవిడ మనశ్శాంతికోసం మీరామాట అన్నారు. దానికేమీ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు."                                                     

 Previous Page Next Page