Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 15


    మాలతికి లోపల్నుంచి గుండెల్ని పగలకోట్టుకుని  దు;ఖం పొంగుకు వస్తున్నట్టయింది. ఉద్రేకం కట్టలు త్రెంచుకుని ప్రవహిస్తుంది. ఆ స్ధితిలో అతని మంచంమీద కూర్చుని గుండెలమీద చెయ్యిపెట్టి రాస్తూ "తప్పు, అలా మాట్లాడకండి" అంది.

    "లేకపోతే నాలో భాద చల్లారదు."

    "అసలు......నాకు చెప్పండి, అంత బాధపడే అవసరమేముంది?"

    "జరిగిందానికి......."

    "అంత దారుణమేం జరిగింది?"

    "ఒక అవివాహితురాలైన స్త్రీని......."

    మాలతికి నవ్వు వచ్చింది. "అవివాహితుల్ని కాకపోతే...వివాహితుల్ని చేసుకుంటారా ఏమిటి?"

    ఆ మసకచీకటిలో శేఖరం ముఖంలో ఎంత ఆశ్చర్యం లేక ఆనందం నిండిపోయిందో తెలియదు. అతని వంటి పులకింత మాత్రం ఆమెను తెలిసింది.

    అతని చేతులు గుండెలమీది ఆమె చేతుల్ని స్పృశించాయి.

    "నన్ను అదృష్టవంతుణ్ణి చేస్తున్నారా?"

    "కాదు, నేను అదృష్టవంతురాల్ని అవుతున్నాను"

    "నేనొకవేళ హార్టు పేషెంటునయితే......?"

    అతని చేతులనుండి మృదువుగా విడిపించుకుని కుడిచేత్తో అతని పెదవులు మూసింది. ఎడమచేతిని అతని జుట్టులోకి పోనిచ్చిరాస్తూ ఆవేశం, నిశ్చలత్వం కూడిన కంఠంతో అంది :

    "నేనెవర్ని? మాలతిని. మీకోసం పుట్టినదాన్ని. మీ జతకోసం, మీతో జీవితం పంచుకోవటం కోసం జన్మించినదాన్ని. నాలో హిందూరక్తం ప్రవహిస్తోంది. నా మనసంతా పవిత్ర హిందూభావాలతో నిండిపోయి వుంది. మీరు మామూలు మనిషా, రోగగ్రస్థుల అన్న మీమాంస నాకు లేదు. కావలసింది మీరు.....ఈ క్షణాన్న మీరు ఎలా వున్నారో..మీరేమిటో.....అలాగే.....కావాలి....."

                                                                   * * *

    ఆగి ఆగి ప్రవహించే నది ఏ మలుపు దగ్గరకో లేక పల్లందగ్గరకో వచ్చేసరికి ఝరీవేగం అందుకున్నట్లు ఒక్కొక్కసారి జీవితం ఓ వయసువరకూ సాఫీగా సాగి, అక్కడ్నుంచి పరుగు ప్రారంభిస్తుంది. ఆ పరుగు సక్రమమైన మార్గంలోనా, దారి తప్పుతూ ఉంటుందా అంటే - అది వేరే విషయం.

    చంద్రశేఖరం వ్యాధినుండి కోలుకోవటం, తిరిగి ఆఫీసుకు అటెండ్ అవటం ప్రారంభించటం, మాలతితో పెళ్ళి జరిగిపోవటం రెండుమూడు నెలల వ్యవధిలో జరిగిపోయాయి.

    పెళ్ళిరోజున మాలతికి తన జీవితం తలుచుకుంటే ఏడుపొచ్చింది. భానుమతి ఆ గదిలోకి వచ్చేసరికి ఈ దృశ్యం కనిపించి "ఆనంద భాష్పాలా?" అంది.

    "దేనికట?"

    "కోరిన వరుడ్ని కట్టుకున్నందుకు."

    "ఛా! అదికాదే, ఒక్కొక్కరి జీవితం ఎంత విషాదకరమో చూడూ? తల్లీ, తండ్రీ, అన్నా, చెల్లీ -అసలు నా అనేవాళ్ళు ఎవరూలేని వంతరితనం దెయ్యంలా ఎలా అనుభవించానా అని...."

    "కష్టమే. కాదననుగానీ ఈ భూమ్మీద అడపాతడపా ఇలాంటి జీవులు తారసపడుతూనే వుంటారు. గానీ అందరూ వుండి, తరచి చూస్తే బయటపడే వంటరితనం కన్నా ఇది కొంత మేలేననుకుంటాను."

    మాలతి వెంటనే మాట్లాడలేకపోయింది.

    "భానూ! నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను."

    "ఇది ఆనందప్రదమైన వీడ్కోలు. నాకిచ్చిన సహచర్యం, నామీద చూపించిన అభిమానం, ఆ గదిలో మన ఇద్దరి జీవితం ఎప్పుడూ మరచిపోలేను."

    "ఉండు, నాకు ఏడుపొచ్చేలా చేయకు"

    "ఒకరకంగా నా తల్లీ, తండ్రీ, అన్నా, అక్కా అన్నీ నీవే."

    "అమ్మో! ఇన్ని బాధ్యతలా?"

    "భానూ! తర్వాత నువ్వేం చేస్తావూ?"

    "బ్రతికేస్తాను"

    "అది కాదే ఎలా అని."

    "ఎలా ఏముంది? నా గది, క్యారియర్ భోజనం, ఉద్యోగం అన్నట్లు.... అన్నీ వదులుకుంతున్నట్లు మాట్లాడుతున్నావు. ఉద్యోగం మానేస్తున్నావా ఏమిటి?"

    "బహుశా చెయ్యను."

    "దేనివల్ల?"

    "భర్తక్రింద ఉద్యోగిగా వుండే అనుభూతి నాకు గిట్టదు."

    భానుమతి మాలతి కళ్ళలోకి చూసింది. ప్రతి సంఘటనగురించీ ప్రతి వ్యక్తికీ ఎలాంటి సున్నితమైన అభిప్రాయాలుంటాయో  బోధపడింది.

                                          7

    పెళ్ళి జరిగిపోయింది. వచ్చినవాళ్ళంతా స్నేహితులే కానీ ఏవైపు చూసినా, చుట్టపక్కాలెవరూ లేరు.

    హడావుడి తగ్గాక, ఆ సాయంత్రం శేఖరం - మాలతిని టాంక్ బండ్ కి తీసుకువెళ్ళాడు.

    కారు దిగి, నిశ్చలంగా వున్న నీళ్ళకేసి చూస్తూ ఇద్దరూ ప్రక్కప్రక్కన నిలబడ్డారు.

    "మాలతీ!"

    "యస్ సర్!"

    "అదేమిటి?"

    "మీరు మేనేజర్!"

    "కానీ ఇప్పుడు భర్తని."

    "కానీ మేనేజరుగానే గుర్తొస్తున్నారు."

"కానీనువ్వుక్లర్క్ గాకనబడటంలేదు."        

 Previous Page Next Page