Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 13


    టాక్సీలోంచి దిగి గోపయ్యతో ఆ చిన్న బంగళావంటి ఇంట్లోకి వెళ్లేసరికి చంద్రశేఖరం అలికిడి విని బయటకు వస్తూండగా, మాలతి చకితురాలయినట్లుగా నిలబడిపోయింది. ఒక్కరోజులోనే అతని ముఖం ఎంతో కాలంనుంచీ రోగ గ్రస్ధుదయినట్లుగా దివాలా తీసింది. ఆమెని చూసినప్పుడు మాత్రం ఆ ముఖంమీద చిన్న కాంతిరేఖ వెలిగింది.

    "రండి" అన్నాడు డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చుంటూ.

    మాలతి అతనికెదురుగా కూర్చుంది.

    "మిమ్మల్ని చాలా శ్రమపెట్టాను."

    "ఫర్వాలేదులెండి" అన్నది ఏమనాలో తెలియక.

    "చూడండి, మొదటినుంచీ నాది ఎక్కువమందితో కలిసిమెలిసి తిరిగే స్వభావంకాదు. కాలేజీ చదువు అయిపోయేవరకూ శంకర్ అనే ఓ ప్రాణ స్నేహితుడుండేవాడు. అతను నాటకాల మనిషి. తర్వాత దేశాల పాలయ్యాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు.....సరే అదలా వుంచితే నిన్నట్నుంచీ ఓ ఇరకాటంలో పడి ఈ విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక, ఆఖరుకి మీరు గుర్తొచ్చి కబురు చేశాను. ఏమీ అనుకోకండి."

    "చెప్పండి!"

    "అమ్మకు సుస్తీ బాగా ఎక్కువైందనుకోండి. రక్తం బాగా కక్కేస్తోంది. డాక్టరుగారు వచ్చి ఒకటి రెండురోజులకన్నా బ్రతకదని చెప్పారు.....న్నాళ్ళూ నన్నెవరన్నా దురంచేస్తారన్న భయంతో అలమటించి పోతుండేదా? ఇప్పుడు ధోరణి మారింది. నేను వంటరివాడ్నయి పోతానేమోనన్న బాధతో దహించుకుపోతున్నది. "నీకెవరూ లేరు, నీకెవరూ లేరు" అదే పాట. ఆ పాటకు విసుగులేదు.

    అంత పిచ్చిలోనూ ఆమె చావుగురించి తెలిసినట్టుంది....తను కన్ను మూసే లోపల అమాంతం నన్ను పెళ్ళికొడుకుని చేసేయాలని ఒకటే ఆరాటం. ఈ ఆరాటంలో నాప్రాణాలు తోడేస్తోంది. ఏం చెయ్యాలో తెలీక, ఎవరూ సలహా చెప్పేవారు లేక మీకు కబురు చేశాను."

    ఇంతలో లోపల్నుంచి పెద్ద కేక వినిపించింది. "ఒరేయ్! ఎవరూ కనిపించరేంరా?"

    "ఉండండి" అంటూ శేఖరం ఆదుర్దాగా లేచి, గబగబా లోపలకు నడిచాడు.

    "ఒరేయ్! నన్ను అన్యాయంచేసి, ఇలా రంపపుకోత కోస్తావుట్రా? ఒరేయ్! నేను రేపో మాపో చచ్చిపోతాన్రా. నా కోరిక తీర్చరా. ఏదిరా ఆ అమ్మాయి? ఎప్పుడు తీసుకోస్తావురా?"

    "తీసుకొస్తానమ్మా. తప్పకుండా తీసుకొస్తాను. కొంచెం ఓపికపట్టు."

    "ఒరేయ్! అబద్ధాలు చెప్పకురా...."ఈసారి పెద్ద దగ్గుతెర కక్కుకుంటున్నట్లు  చప్పుడు.

    మాలతి ఇహ ఉండబట్టలేకపోయింది. గభాలున లేచి లోపలకు దూసుకువెళ్ళింది.

    శేఖరం కిడ్నీ ట్రేలాంటిది పట్టుకుని వున్నాడు. అందులో ముద్దలు ముద్దలుగా ఎర్రగా రక్తం. తర్వాత ట్రే క్రిందపెట్టి తల్లిని పడుకోబెట్టి తువ్వాలుతో నోరు, ముఖం తుడుస్తున్నాడు.

    జీవంలేనట్లు అటూఇటూ కదుల్తున్న ఆమెకళ్ళు వున్నట్టుండి శేఖరం వెనగ్గా నిలబడివున్న మాలతిమీద నిలిచాయి. వెంటనే మెరుపు మెరిసినట్లయింది.

    "వచ్చావా?" అన్నట్లు చూసి దగ్గరకు రమ్మన్నట్లు సంజ్ఞచేసింది.

    మాలతి బొమ్మలా కదిలి, మంచం దగ్గరకు వెళ్ళి నిల్చుంది.  

    "నీ కోసమే .....నీ కోసమే కబురు చేస్తున్నాను. వీడేమో - చెప్పాను, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది. అంటున్నాడు. నువ్వేమో ఎంతకూ రావు. నాకేమో రావాలంటే శక్తి లేదు."

    మాలతికి ఆశ్చర్యంగా వుంది. ఆరోజు ఎంతో ఉన్మాదినిలా, భయంకరంగా గోచరించిన స్త్రీ మూర్తేనా ఈమె? ఇంత చక్కగా ఎలా మాట్లాడుతోంది? మరి గోపయ్య అలా చప్పాడేం?

    ఇంకా దగ్గరకు రమ్మన్నాట్లు సంజ్ఞ చేసింది.

    మాలతి కొంచెం ముందుకు జరిగి, ఎండుపుల్లల్లా వున్న ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది.

    "చూడు ! ఆరోజు నిన్ను చూశాను. నీ మీద పడి పీకిపెట్టానుకూడా. కానీ ఇప్పుడు నే వెళ్ళిపోతున్నాను. వాడ్ని చూసుకునేందుకు ఎవరుంటారు? నాకెందుకో నువ్వే గుర్తొచ్చావు. మీ ఇద్దరికీ ఇదివరకే మనసులు కలిసి వుంటాయి. అందుకే కలసి తిరిగారు. ఇన్నాళ్ళూ మీ మధ్య నేను అడ్డు వచ్చాను. ఇహ అడ్డురాను. వచ్చే శక్తి లేదు. నీ చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ ఇంటి బాధ్యత ఇహ నువ్వే తీసుకోవాలి......"

    "అమ్మా! అంటున్నాడు శేఖరం ఆదుర్దాగా.

    "నువ్వూరుకోరా, నీకు తెలీదు" అని అతన్ని కసిరి, "నామాట కాదనవుకదమ్మా! అయినా నేను పొరపాటు చెయ్యలేదనుకుంటాను. నీ మనసులోనిదే నేనూ చెప్పాను. అవునా? నాకు మాట ఇస్తున్నావు కదూ?"

    మాలతి నిలువునా వణికినట్లయింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటోంది. పరిస్థితి ఇలా క్రమ్ముకువస్తుందని ఆమె కలలోకూడా అనుకోలేదు.

    "అవును కదూ?నాకు మాట ఇస్తున్నావు కదూ?" మాలతి చేతుల్లో ఆ వృద్ధమూర్తి చేతులు కంపిస్తున్నాయి.

    శేఖరం ఆమె ముఖంవంక కూడా చూడటానికి ధైర్యంచాలక అసహనంగా శరీరాన్ని అటూఇటూ కదిలిస్తున్నాడు.

    మాలతి కళ్ళముందు వలయాలు, కాళ్లక్రింద భూకంపాలు.

    ఏం జరుగుతోంది? ఇంత హఠాత్తుగా ఎందుకు జరుగుతోంది?

    ఉన్నట్లుంది ఆమెలో తెగింపు వచ్చింది. ఆ వృద్ధమూర్తి చేతులచుట్టూ ఆమె చేతివ్రేళ్ళు బిగిసుకున్నాయి.

    "అ....లా....గే......"

    జీవంలేని ఆమె కళ్ళలో మళ్ళీ ఓ మెరుపు.

    ఏదో చెప్పబోయింది. అంతలోనే ఓ దగ్గుతెర - ప్రేగులు కదిలిపోయినట్లు, నరాలు పగిలిపోతున్నట్లు.

    భళ్ళుమని రక్తం.

    తర్వాత అలసిపోయినట్లు, స్పృహ తప్పిపోయినట్లు కళ్ళు మూసుకుని వుండిపోయింది.

    మాలతి హాల్లోకివచ్చి సోఫాలో ఒక ప్రక్కకు కూర్చుంది. ఆమె మనసంతా అలజడిగా, కలవరంగా వుంది.

    శేఖరం వెనకనుంచి వచ్చాడు.

    "మాలతిగారూ!"                                                        

 Previous Page Next Page