Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 14


    తను సెలవు అనే నెపంతో వెనుక వుండి, ఈ ఆట ఆడిస్తున్నాడు. ఇదంతా దామోదరం ఏర్పాటు చేశాడు. భీమరాజుని విడిపించటానికి.
    శివప్రసాద్ వైపు తిరిగి, "రివాల్వర్ తీసుకో. మెలకువగా వున్న నలుగురు సెంట్రీలని తీసుకుని భీమరాజు సెల్ దగ్గిర కాపుకాయి. వచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చెయ్" అని అటువైపు పంపేను.
    నేను చేసిన తప్పు అదే!
    అవతలి వాళ్ళ వ్యూహాన్ని సరిగ్గా అంచనా వేయలేదు.
    'ఇన్ మేట్స్'డే రోజున పంచిన స్వీట్స్ సెంట్రీలతో సహా అందరూ తింటారని అద్భుతంగా వూహించి సరిగ్గా అందులోనే మత్తుమందు కలిపిన శత్రువులు, కేవలం భీమరాజుని మాత్రమే విడిపించి, దాని ద్వారా ప్రభుత్వానికి అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తారని వూహించటం నా తప్పు.
    నేను చూస్తూ వుండగానే క్యాంటీన్ ముందున్న ఇనుప తలుపు పెద్ద చప్పుడుతో గాలిలోకి ఎగిరపోయింది. జీపులు లోపలికి ప్రవేశిస్తున్నాయి. గోడ చాటు చేసుకుని వాళ్ళమీద రివాల్వర్ కాల్పులు సాగించాను. కానీ నా పరిస్థితి, వెల్లువలా వస్తూన్న వరద నీటికి గడ్డిపరక అడ్డుపెట్టినట్టయింది. వాళ్ళు నన్ను అసలు పట్టించుకోలేదు.
    ఈ లోపులో సెల్స్ లోంచి ఖైదీల అరుపులు వినిపించాయి. "వచ్చేశారు మనవాళ్ళు. వచ్చేశారు. లేవండ్రోయ్!" అన్న కేకలు. అంతకు ముందే ఆలోచించుకుని ఒక ప్లాన్ ప్రకారం జరిగిన 'కూ(ప్)' ఇది. నేను ఇంతకాలం నా దృష్టి భీమరాజు ఒక్కడిమీదే నిలిపి మిగతా విషయాలు పట్టించుకోవటం గానీ, ఆలోచించటం గానీ చెయ్యలేదు. ముప్పు ఈ రూపంలో వస్తుందని వూహించలేదు. ఇప్పుడు యింతమంది ఖైదీలు తప్పించుకుపోతే ఎవ్వరి అనుమానమూ భీమరాజు మీదికి రాదు.
    అంతలో వరుసగా పిస్తోలు శబ్దాలు వినిపించాయి. వరండాలో పరుగెడుతూ శత్రువులు వరుసగా అన్ని గదుల తాళాలు పగలగొడ్తున్నారు.
    ఒక్కసారిగా నన్ను నిస్పృహ ఆవరించింది. ఏ మూలో ఈ జైలుని రక్షించగలనన్న ఆశ ఉంటే, యిప్పుడు అది పూర్తిగా పోయింది. వీళ్ళకి ఈ ఖైదీలు కూడా తోడయితే ఇక వీరిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు.
    అంతలో ఎవరో సెంట్రీది ఆర్తనాదం వినిపించింది. బహుశా ఎదిరించి వుంటాడు. నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇద్దరు సెంట్రీలు తుపాకులు విసిరేసి వాళ్ళకి లొంగిపోయినట్లు చేతులెత్తటం కనిపించింది. ఇప్పటివరకూ యింత పటిష్టంగా ఉన్న జైలు ఒక అద్దాల మేడలా కూలిపోయి, వాళ్ల వశమై పోవటం చూస్తూంటే మా అసమర్ధత ఎంతో అర్ధమవుతూంది. ఈ ప్రభుత్వాధికారులూ, ప్రభుత్వ సర్వెంట్లూ మామూలు సమయాల్లోనే పులులు. ఏదైనా ప్రాణంమీదకొచ్చి అత్యవసర పరిస్థితివస్తే పిల్లులు.
    నేను కూడా అంతేనా?
    నాకేం చెయ్యాలో తోచలేదు. వర్షం ప్రారంభమయింది.
    పై గదిలో రాజారాం స్పృహతప్పి పడి వున్నాడు. బయట ప్రపంచంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయి వున్నాయి. ఏం చెయ్యాలి. ఏం చెయ్యాలి....
    అంతలో దూరంనుంచి చీకటిలో ఎవరో పరుగెత్తుకు వస్తున్నారు. కళ్ళు చిట్లించి చూశాను. శివప్రసాద్. 
    వాళ్ళు.... అటొచ్చారు....భీమరాజుని వి....డి....పిం" అతని మాటలు పూర్తీకాలేదు. వెనుకనుంచి వరుసగా రెండుసార్లు పిస్టల్ చప్పుడు వినిపించింది. పరుగెత్తుకు వస్తున్నవాడు వెనుకనుంచి ఎవరో తోసినట్టు అదే వేగంతో ముందుకు పడి తడిలో సర్రున ముందుకు జారి నా కాళ్ళముందుకు వచ్చాడు. రక్తపు చార నిలువునా భూమిని తడిపింది. నా కళ్ళు ఎదుటి దృశ్యాన్ని నమ్మలేకపోయాయి. ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.
    "ప్ర...సా...ద్" అంటూ వంగాను.
    వెనుక గుచ్చుకున్న గుండు ఛాతీలో నుంచి బైటకు వచ్చినట్టు రంధ్రం అయింది. రొమ్ములన్నీ రక్తంతో తడిసిపోయాయి. పైనుంచి కురిసే వర్షానికి పలుచనై ధారాలుగా జారుతుంది.
    గొంతు మూగపోతూ వుండగా "ప్ర...సా...ద్" అన్నాను మరొక్కసారి. అతడు కళ్ళు విప్పాడు. అంతలో నొప్పి ఒక కెరటంలా లోపల్నుంచి తన్నినట్టుంది- మెలికలు తిరిగిపోయి అచేతనమయ్యాడు. ఒక క్షణం అర్ధంకాలేదు. అర్ధం అయింది నమ్మలేక మళ్ళీ పిల్చాను. అనుమానం నిజమైంది. అతడి ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసి పోయాయి. రాత్రికి మల్లెల మంచం ఎక్కవలసిన శరీరం పువ్వుల పాడెకు సిద్ధమయింది. జేబులోంచి నలిగిన పువ్వు రాలిపడింది. బిగ్గరగా ఏడవాలని పించింది. అతడింకా నా ముందు నిలబడి "డ్యూటీ అయిపోయింది గురూ. నే వెళ్ళిరానా" అంటున్నట్టే వుంది.
    నేనే- దీనంతటికీ కారణం నేనే! పెద్ద స్టీక్ట్ ఆఫీసర్ పేరుతో అతడికి శోభనం రోజున కూడా శలవు ఇవ్వకుండా ఆపుచేసింది నేనే! మొత్తం జైలంతా వాళ్ళ ఆధీనం అయిపోతున్న తరుణంలో అతడిని భీమరాజు వున్నవైపు, గుహలోకి పంపినట్టు పంపటం నా తప్పే! దానికి ఇంత పెద్ద 'వెల' చెల్లించవలసి వస్తుందని మాత్రం అనుకోలేదు. తెగిన మంగళసూత్రం, చిమ్మిన రక్తం, ఆఖరి అమాయకపు చిరునవ్వు....
    ....నాలో విచారం స్థానే ఆవేశం చోటు చేసుకోసాగింది.
    "బాస్టర్స్" అని అరిచాను దిక్కులు కదిలిపోయేలా. "ఇంతకు యింతా మీ మీద పగ తీర్చుకుంటాను. ఈ విశాల ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మిమ్మల్ని శిక్షిస్తాను.. మీరు తప్పించుకుపోలేర్రా...." నా మాటలు ఇంకా పూర్తి కాలేదు - వెనుకనుంచి సన్నగా నవ్వు వినబడింది.
    వెన్నెముకకి సరిగ్గా రెండడుగుల దూరంలో - చాలా క్లోజ్ రేంజిలో వినబడిన ఆ నవ్వు పాము బుస్సుమన్నట్టు నన్ను వణికించింది.
    చివుక్కున తలతిప్పి చూశాను.
    సరీగ్గా రెండడుగుల దూరంలో రివాల్వర్ తో నిలబడి ఉన్నాడు భీమరాజు.
                                               *    *    *
    దూరంగా ఎక్కడో యింకా ఒకటి రెండు పిస్తోలు చప్పుళ్ళు వినబడుతున్నాయి. జీపుల్లో వచ్చిన మనుష్యులు యింకా కొన్ని సెల్స్ తాళాలు బ్రద్దలు కొట్టటంలో నిమగ్నమై ఉన్నారు. బయటకొచ్చి ఎటు వెళ్ళాలో తెలియని ఖైదీలు అటు ఇటూ పరుగెడుతున్నారు. అంతా గందరగోళంగా వుంది.
    వెనుక నుంచి భీమరాజు వికటంగా నవ్వుతూ, "ఒకసారి ఇదే స్థలానికి తీసుకువచ్చి నన్ను కొట్టావ్ జ్ఞాపకం వుందా ఇం స్పెక్టర్? దానికిది జవాబు" అన్నాడు. నేనేదో అనబోయేటంతలో ఫెడిల్మని తన్నాడు. ముందుకు పడ్డాను. బురద మొహానికి అంటింది. వాడు మరింత బిగ్గరగా నవ్వేడు. నేను చేయటానికి ఏమీ లేదు. చేతిలో ఆయుధం వుండగా వాడిని ఎదుర్కోవటం అసంభవం.
    "ఒకసారి నేను పారిపోతూంటే అడ్డుకున్నావు. దానికి మెడల్ కూడా ఇచ్చారట నీకు- అవునా."
    నేను మాట్లాడలేదు.
    "అంతకు అంతా బదులు తీర్చుకుని నేను పారిపోతున్నాను. జైలుని సర్వనాశనం చేసి ఖైదీలందర్నీ విడుదల చేస్తున్నాం. ఇదంతా నీ హయాంలో జరుగుతూంది. నువ్వు చచ్చిపోయాక కూడా గోడలమీద నీ పేరూ చరిత్రా శాశ్వతంగా నిలిచిపోతాయి. టిట్ ఫర్ టాట్. ఎలా వుంది.." అతడి నవ్వు ఆగిపోయింది. "...దేవుణ్ని ప్రార్ధించుకో ఇన్ స్పెక్టర్, ఇంకా రెండు క్షణాలు. అంతే" వీపుకి రివాల్వర్ కొన తగిలింది.
    నాకు భయం వేయలేదు. ప్రాణం ఎలాగూ పోతుంది. కానీ కసి..... ఎవరిమీదో తెలియని కసి. నా మీద నాకే కోపం, ఏమీ చేయలేక పోయినందుకు-
    ప్రాణం పోయినా, మిగిలిపోయే చెడ్డపేరు-
    ఆవేశం... బిగుసుకున్న పిడికిళ్ళు....
    కళ్ళు మూసుకున్నాను. ఇంకో రెండు క్షణాలు-
    ఒక క్షణం.
    అయిపోయింది.
    పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది.
    అయితే అది నాకు దగ్గిరగా వున్న పిస్తోలునుంచి వచ్చిన ధ్వనికాదు. దూరంనుంచి వచ్చింది. తలతిప్పి చూశాను. భీమరాజు చేతిలో పిస్టల్ క్రిందపడి వుంది. అతడు వంగి అందుకోబోతూ వుంటే మళ్ళీ ఇంకోసారి పేలిన శబ్దం వినిపించి, నేలమీద వున్నది ముందుకు వెళ్ళి పోయింది. అంత సరియైన గురికి అబ్బురపడుతూ అటు చూశాను. మసక చీకటిలో నిలువెత్తు విగ్రహం నిల్చుని కనబడ్డది-
    గండ్రగొడ్డలిది!
    అదే సమయానికి భీమరాజు కూడా అటువైపు చూశాడు. గండ్రగొడ్డలిని చూడగానే "నేనే...భీమరాజుని! పారిపో!! వీడి సంగతి నేను చూసుకుంటానులే" అని అరిచాడు.
    మరోవైపు నుంచి నేను అరిచాను. "వీడికోసమే ఈ కూ జరుగుతూంది. వీడిని తప్పిస్తే బైట ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. నాకు సాయం చెయ్యి. చట్టాన్ని రక్షించు"
    భీమరాజు బిగ్గరగా నవ్వేడు. బహుశా నా అమాయకత్వం చూసి అనుకుంటాను. నా మాటలు పట్టించుకోకుండా అతడివైపు తిరిగి, "అందరూ తప్పించుకుంటున్నారు. ఈ ఛాన్సు మళ్ళీ రాదు. చీకటిలో కలిసిపో" అన్నాడు. ఈ లోపులో గండ్రగొడ్డలి మా దగ్గిరకి వచ్చాడు. అతడి కంఠం నుంచి ఒకే ఒక మాట వచ్చింది. "-భీమరాజూ లొంగిపో..."
    ఆ మాటలకి భీమరాజు అదిరిపడ్డాడు. నేను నమ్మలేనట్టూ చూశాను. అతడు మరో అడుగు ముందుకు వేశాడు.
    అంతలో ఒక జీపు గోడ అవతల్నుంచి మలుపు తిరిగి మరో సెల్ వైపు వెళ్ళింది. ఆ లైటు వెలుతురు ఒక్కసారిగా కంట్లో పడేసరికి మరిమిట్లు గొలిపినట్టయ్యాయి కళ్ళు. ఆ క్షణాన్ని సద్వినియోగ పర్చుకుని భీమరాజు చీకట్లో కలిసిపోయాడు. జీపులోంచి రివాల్వర్ పేలిన ధ్వనులు వినిపించినయ్! ఒక బులెట్ చెవి పక్కగా దూసుకుపోయింది. చటుక్కున వంగున్నాను.
    జీపు వెళ్ళాక "థాంక్స్" అన్నాను. "...నా ప్రాణాన్ని కాపాడావు."
    అతడు అదోలా చూశాడు. "ఇంత అధికారం, కమ్యూనికేషన్ వుండీ జైలుని కాపాడలేక పోయినందుకు నువ్వు సిగ్గుపడాలి."
    "హఠాత్తుగా రెండువైపుల్నుంచీ చుట్టుముట్టడంతో ఏమి చెయ్యటానికీ తోచలేదు."
    "ఓహో! అంటే వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేసి, రాత్రికి తీరుబడిగా రావాలన్నమాట."
    నేను మాట్లాడలేదు.
    "ప్రభుత్వమే అలా వుంది. ప్రభుత్వ అధికారులు ఇలా ఉండకేం చేస్తారు? కేవలం కాకీ బట్టల్లో ఖైదీల ముందు అజమాయిషీ చెలాయించటం తప్పు... అసలు మీ అందరికీ ట్రెయినింగ్ అడవుల్లో ఇవ్వాలి."
    "ఈ పరిస్థితి నీకే వస్తే ఏం చేస్తావు?" హేళనగా అన్నాను. అంతలో దూరంగా మరో చేతిబాంబు పేలింది. ఆందోళనగా అటువైపు చూస్తూ, "ఈ జైల్లో ఒక్కొక్కడూ ఒక్కొక్క నరరూప రాక్షసుడు. వీళ్ళందరూ ఈ రాత్రి బయట ప్రపంచంమీద పడితే కొన్ని రోజులపాటు కొన్ని నెలలపాటు రాష్ట్రం అల్లకల్లోలమయి పోతుంది" అన్నాను స్వగతంగా. 
    "నువ్వు తల్చుకుంటే ఈ పరిస్థితిని కంట్రోల్ చెయ్యటం అంత కష్టంకాదు జైలర్ సాబ్" గండ్రగొడ్డలి స్వరం తాపీగా వినబడింది.
    చటుక్కున తలతిప్పి, నమ్మలేనట్టు చూశాను.
    అతడి దృష్టి దూరంగా వున్న లైట్ పాయింట్ మీద పడింది. ఎత్తయిన గోపురంగా వుంది అది. ఇద్దరు సెంట్రీలు అక్కడనుంచి నిర్విరామంగా కాల్పులు సాగిస్తున్నారు.
    ఏదో అర్ధమైనట్టూ గండ్రగొడ్డలి వైపు చూశాను.

 Previous Page Next Page