"కూ కోసం వచ్చినవాళ్ళు చిన్న తప్పు చేశారు" అన్నాడు. అతడు చెప్పదల్చుకున్నది నాకు అర్ధమైంది. బైట్నుంచి వస్తూ వాళ్ళు వేసిన బాంబులు లైట్ పాయింట్ పక్కన పడడంతో వచ్చింది ఇబ్బంది వాళ్ళకి. ఇప్పుడు ఖైదీలు బయటికి తప్పించుకుపోవాలంటే లైట్ పాయింట్ స్థూపాల మీద కాపలా వున్న మా సెంట్రీలని చంపాలి. లేదు జీపుల్లో బ్యాచ్ ల క్రింద ఒక్కో బ్యాచ్ నే జాగ్రత్తగా లోపల్నుంచి బయటకు తీసుకెళ్లి దింపాలి. అందుకే బయటపడ్డ ఖైదీలు ఇంకా కాంపౌండ్ లోనే అటు ఇటూ తిరుగుతున్నారు.
ఈ విషయం ఇంతసేపూ స్పురించనందుకు సిగ్గుపడ్డాను.
"ముందు లైట్ పోస్టుల దగ్గర బలగం పెంచాలి. అక్కడున్న సెంట్రీలు స్వీట్స్ తినకపోవటం అదృష్టం." అన్నాను.
"కాదు, ముందు మెయిన్ గేటు దగ్గిర బలగం ఎంతుందో చూడాలి. ఆ గేటు తెరుచుకుంటే ప్రవాహంలా వెళ్లిపోతారు వీళ్ళు" అన్నాడు.
ఈ విషయం స్పురించినందుకు ఈసారి సిగ్గుపడలేదు. నా మెదడు పనిచేయటం మానేసిందని ఎప్పుడో అర్ధమైంది.
"అసలు ఎంతమంది సెంట్రీలు మనవైపు ఉన్నారో తెలుసుకోవాలి. దానికేదైనా మార్గం ఉందా?"
"సైరన్ వుంది. జెండా దగ్గిరకి వస్తారు. కానీ ఈ పరిస్థితుల్లో మన సైరన్ పిలుపుని వాళ్ళు అర్ధం చేసుకోగలరా అని-"
"ప్రయత్నించడంలో తప్పు లేదుగా. లైట్ పోస్టుల్లో వున్న వాళ్ళు ఎలాగూ మెట్లు దిగిరారు. అందులో ప్రాణాపాయం వుంది కాబట్టి! సెల్స్ ముందున్న వాళ్ళల్లో స్పృహతప్పి పడిపోకుండా వున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే చాలు వాళ్ళంతా లొంగిపోలేదు అనుకుంటాను. కానీ బాగా బెదిరిపోయి వుంటారు. అందుకే బయట్నించి వచ్చిన వాళ్ళు, వాళ్ళని చంపకుండా, ఖైదీల్ని విడిపించటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు విడిపించవలసినవాడు ఎవడో ఒక్కడే ఉండి వుంటాడు"
"అవును. భీమరాజు" చప్పున అన్నాను.
"అయితే అతడిని ముందు వధించాలి" అన్నాడు.
"ముందు సైరన్ మోగించాలి" అన్నాను.
"దానికన్నా ముందు కరెంటు ఆపు చెయ్యాలి" అన్నాడు.
అర్ధంకానట్టు చూశాను.
"కరెంట్ పోయేసరికి, ఊహించనిది జరిగినట్టు శత్రువులు అయోమయంలో పడతారు. ఈ లోపులో సైరన్ మ్రోగి, సెంట్రీలకి ధైర్యం వస్తుంది. అన్నట్టు లైట్ పోస్టులకు ఉన్న ఎలక్ట్రిక్ కనెక్షన్ వేరు, మిగతా లైట్లకున్నది వేరు కదా-"
"అవును."
"గుడ్, పద. ఎంతవరకూ సాధించగలమో చూద్దాం"
..దూరంగా మనుష్యుల అరుపులు, తుపాకీ మ్రోతలూ వినబడుతున్నాయి. బయటకొచ్చిన ఖైదీల్లో కొంతమంది, జీపుల్నుంచి తీసుకున్న ఆయుధాల్తో లైట్ పోస్టుల మీద వున్న వాళ్ళని కూల్చటానికి ప్రయత్నిస్తున్నారు. పైనున్న సెంట్రీలు ఏ క్షణమైనా ఆయుధాలు పారేసి లొంగిపోయేలా వున్నారు.
చెట్లనీ, గోడల్నీ చాటు చేసుకుంటూ ముఖధ్వారం వైపు పరుగెత్తాం. జైలరు ఆఫీసు, ఆయుధ సామాగ్రి అక్కడే వుంది. అక్కడున్న సెంట్రీలు దాదాపు అందరూ స్పృహతప్పి వున్నారు.
నేను గండ్రగొడ్డలి వైపు చూశాను.
ఎంత కరెక్టుగా ఊహించగలిగాడు ఇతను!!
ఏ ఒక్కఖైదీకన్నా ఈ ఆలోచన వచ్చి, ఇటొచ్చి మెయిన్ గేటు తెరిచి వుంటే- క్షణంలో జైలు ఖాళీ అయిపోయేది.
"పైకెక్కు" అన్నాడు. ఎందుకు అని అడక్కుండా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. దాదాపు ఇద్దరం పరుగెత్తాం.
"మెయిన్ ఎక్కడ"
చూపించాను.
ఈ లోపులో ఒక లైటు నా మీదకు అడ్జెస్ట్ చేస్తూ, మెయిన్ ఆఫ్ చేశాడు. జైలు ఆవరణంతా ఒక్కసారిగా చీకటి ఆవరించటమేమిటి... మరొకవైపున అతడు స్విచ్ నొక్కటమేమిటి... సైరను మ్రోగసాగింది. నామీద లైటు ఫోకస్ చేసి వెంటనే ఆర్పుతూ రెండు మూడుసార్లు అలా చేశాడు. అతడి ఉద్దేశ్యం అర్ధమైంది. లైట్లు ఆరిపోవటానికి నేను కారణం అని అందరికీ తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, నేనిక్కడ కమాండర్ - ఇన్- చీఫ్ గా ఉన్నానని తెలిసి ధైర్యం వస్తుంది. సైరను మ్రోగటంతో ఇక్కడికి రావాలన్న సూచన సెంట్రీలకి అందుతుంది. వెంటనే లైటు ఆరిపోవటంతో శత్రువులకు నన్ను షూట్ చేసే అవకాశం వుండదు.
ఆ క్షణం అతడి మేధస్సు పట్ల నాకు కలిగిన గౌరవం అంతా ఇంతా కాదు.
మేము వూహించినది సరిగ్గా జరిగింది. రెండు నిముషాల్లో దాదాపు ఇరవై మంది సెంట్రీలు అక్కడికి చేరుకున్నారు. ఈ లోపులో జరగవలసింది చెప్పాడు.
"ఎన్ని మిషన్ గన్ లున్నాయి?"
"రెండు."
"వాటిని ఉపయోగించే వాళ్ళు ఎవరున్నారు?"
"శివప్రసాద్ మరణించాడు. రాజారాం స్పృహలో లేడు. నేనొక్కణ్ణే వున్నాను."
"రెండోది నాకివ్వు" అన్నాడతను. "నేను అవతలి పోస్ట్ వైపు వెళ్తున్నాను."
ఆయుధాల గది తెరిపించాను.
సరీగ్గా అర నిముషం తరువాత పదిమంది సెంట్రీలని మెయిన్ గేటు దగ్గిర వుంచి, మిగిలిన వారిలో చెరో అయిదు మందిని తీసుకుని మేము విడిపోయి, చెరొక లైట్ పోస్టుల దగ్గిరకి చేరుకున్నాం. నాతో వున్న వాళ్ళకి సూచనలిచ్చి, నేను లైట్ పోస్టు ఎక్కాను. అక్కడ వున్న ఇద్దరు సెంట్రీలు నన్ను చూసి పొందిన ఆనందం బహుశా వారి జీవితంలో ఎప్పుడూ పొంది వుండరు... జరగవలసింది వారికి చెప్పాను.
ఇంతలో నాకు అటువైపు రెండు ఫర్లాంగుల దూరంలో వున్న లైట్ పోస్టుమీద వెలుతురు ఆరిపోయింది. ఆ బ్యాచ్ అక్కడకు చేరుకున్నట్టు గుర్తు! మా లైటు కూడా ఆర్పేసి, కాల్పులు ఆపు చేయించాను.
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దం అలుముకుంది.
ఆ చీకటిలో, అంత నిశ్శబ్దం...ముఖ్యంగా అంత గొడవ జరిగిన తరువాత శ్మశాన నిశ్శబ్దంలా వుంది.
దాదాపు రెండు నిముషాలు అలాగే వుండిపోయాం. నా గుండె వేగంగా కొట్టుకుంటూంది. ఈ ఎత్తులు ఏ మాత్రం తప్పు జరిగినా మొత్తం నష్టానికి నేను బాధ్యుణ్ణి అవుతాను. ఊపిరి బిగపట్టి చీకటిలోకి చూస్తూ వుండిపోయాను.
సరీగ్గా రెండు నిముషాల తరువాత జీపు శబ్దం వినబడింది. మేము వూహించినట్టే, కరెంటు పోగానే మిగతా సెల్స్ విడిపించే కార్యక్రమం మానుకుని పని అయిపోయినట్టు వెనక్కి మరలటానికి ఆయత్తమయ్యారు.
జీపు మాకు దగ్గిర అవసాగింది. మిగతా ఖైదీలు దాని వెనుకే పరుగెత్తుకు రాసాగారు. బాంబు ద్వారా వాళ్ళు ఏర్పరచిన రంధ్రం గుండా జీపు బయట పడబోయే సమయానికి ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టాం. అనుకోని ఈ సంఘటనకి బెదిరినట్టు, రంధ్రానికి ఒక్క అడుగు అటుగా వచ్చి జీపు ఆగిపోయింది. అందుకోసమే చూస్తున్నట్టు మూడు వైపుల్నుంచీ సెర్చిలైట్లు ఒకేసారి దానిమీద పడ్డాయి. అంత వెలుగు అన్నివైపుల్నుంచీ ఒక్కసారిగా పడేసరికి వాళ్ళు షాక్ తిన్నారు. అప్పుడు దూకాను నేను పోస్ట్ మీదనుంచి.
గాలిలో ఉండగానే నా మిషన్ గన్ నిప్పులు కక్కుతూ మ్రోగసాగింది. ఇది వాళ్ళు కలలో కూడా వూహించని సంఘటన. నేను యుక్తాయుక్తాలు ఆలోచించలేదు. ఒక రకమైన పిచ్చి ఆవేశంతో గన్ పేల్చసాగాను. మా జైలులో మిషన్ గన్ వుంటుందని వాళ్ళు వూహించలేదు. ఆ బిత్తరపాటు నుంచి వాళ్ళు తేరుకునే లోపులోనే స్టీరింగ్ దగ్గిర కూర్చున్న డ్రైవర్ ముందుకి వొరిగిపోయాడు. పెద్ద శబ్దంతో జీపు టైర్లు పేలిపోయాయి. వెనుక వస్తూన్న ఖైదీలు ఎదురుగా పాముని చూసినట్టు ఆగిపోయారు. ఇది చూసి వార్డర్లు రెట్టించిన ఉత్సాహంతో విజృంభించారు. ఇంతలో జీపులోంచి ఒక ఆకారం దిగి గోడ చాటుకి పరుగెత్తింది.
అది భీమరాజుది!
"గన్ వదిలెయ్యి ఇన్ స్పెక్టర్. లేకపోతే నీ శరీరం తూట్లు పడుతుంది" గోడ పక్కనుంచి అతడి కంఠం వినబడింది.
అడ్డు పెట్టుకోవటానికి నాకేమీ లేదు. బహిర్ ప్రదేశంలో వున్నాను.
.... గన్ వదిలేశాను.
"నీ వాళ్ళని పైనుంచి ఆయుధాలు వదిలెయ్యమను"
అలాగే సూచన ఇచ్చాను. ఇంకో దారి లేదు.
అతడు నవ్వుతూ గోడ వెనుకనుంచి వచ్చి దూరంగా వున్న ఖైదీల వైపు చెయ్యి వూపాడు. ఆ అరక్షణం చాలు.
కనురెప్పపాటులో నా వెనుక జేబులోంచి మెరుపులా వచ్చిన రివాల్వర్ వరుసగా ఆరుసార్లు పొగలు కక్కింది. గాలిలోకి ఎగిరిన అతడి శరీరం అక్కడే మెలికలు తిరిగి దబ్బున నేలమీద పడింది. ఆరు గుళ్ళూ అతడి శరీరాన్ని నిలువునా ఛిద్రం చేశాయి. ఏమీ జాలి చూపించలేదు.
ఎన్నో హత్యలు చేసినవాడూ, ఎందరో రాజకీయ నాయకుల అదృష్టాలని మార్చినవాడూ, మహా కర్కోటకుడూ, నరరూప రాక్షసుడూ అయిన భీమరాజు కథ అలా ముగిసింది.
ఆ తరువాత సంఘటలన్నీ వరుసగా, చకచకా జరిగి పోయినయ్!
నిర్జీవమైన భీమరాజు శరీరాన్ని గాలిలోకి ఎత్తి లైటు వెలుగులో బహిరంగంగా ప్రదర్శించటంలో మిగతా ఖైదీల నుంచి రెసిస్టెన్స్ ఆగి పోయింది.
చేతులు పైకెత్తి వరుసల్లో నిలబడ్డారు.
పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వార్డర్లు అందర్నీ వాళ్ళ గదుల్లోకి తోస్తున్నారు.
ఎవరివైపు ఎంత నష్టం జరిగిందీ ఇంకా తెలీదు. మెకానిక్ ని టెలిఫోన్ లు సరిచెయ్యమని పంపాను. జైలు బయట వున్న క్వార్టర్స్ నుంచి డాక్టర్ కోసం పిలుపు పంపించాను. క్వార్టర్స్ దూరంగా వుండటం వల్ల ఇక్కడ జరిగిన భీకర సంగ్రామం గురించి బయటి వారికి ఇంకా తెలీదు.
అన్ని సూచన్లూ సరిగ్గా అమలు జరుగుతున్నాయని సంతృప్తి చెంది, అటువైపు వెళ్ళాను. అయిదు నిముషాల క్రితం కురుక్షేత్రంగా వున్న ఆ స్థలం ఇప్పుడు నిశ్శబ్దంగా వుంది.
ఆ చీకట్లోంచి నడుస్తూ ఎదురుగా వస్తున్నాడు-
గండ్రగొడ్డలి.
అతడి చేతిలో ఆయుధం వుంది.
"థాంక్స్" అన్నాను. "ఒక ఘోరమైన ప్రమాదం నుంచి జైలుని రక్షించినందుకు- మా ప్రతిష్ఠ కాపాడినందుకు..." అని ఒకక్షణం ఆగి "WILL YOU GIVE ME THE MACHINE GUN PLEASE." చేయిసాచి అడిగాను.
అతడు ఆయుధం అందివ్వలేదు.
"...మై గన్ ప్లీజ్" అన్నాను.
"అందరూ దొరికిపోయారా?"
"ఆహా! మన శత్రువులందరూ దొరికిపోయినట్టే-"
"మన శత్రువులా?" అతడు అడిగాడు. "మీ శత్రువులా? నా శత్రువులా?
అతడి ప్రశ్న - నన్ను ఎటు తీసుకు వెళ్ళటానికి ఈ ప్రశ్న అడిగాడో అర్ధమైంది. ఆ రకంగానే సమాధానం చెప్పాను.
"ఆఫ్ కోర్స్. శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అదికూడా చూసుకోకుండా నువ్వు మాకు సాయం చేశావ్! .....థాంక్స్. నీ వల్ల మా జైలుకి మంచి పేరొస్తుంది."
నా వెనుక వున్న సెంట్రీ అన్నాడు - "మా గోపిగారికి బంగారు పతకం కూడా రావొచ్చు."
అతడు నిశ్శబ్దంగా తన చేతిలోని మిషన్ గన్ నా సెంట్రీకి అందించాడు. తరువాత నా వైపు చూసి అన్నాడు-