స్పోర్ట్ - అంటే జ్ఞాపకం వచ్చింది... ఆ రోజు పెళ్ళయినా ఇంత వరకూ మంగతాయారుతో మనవాడు నిద్ర చెయ్యలేదు. పెళ్ళయిన రోజే ఏదో అవాంతరం వచ్చిందని ఆ తరువాతి శుక్రవారం పెట్టారు. మనవాడు మొత్తం ఆ వారం అంతా శలవు పెట్టేశాడు. ఏం చేస్తావు గురూ అని అడిగితే "కనీసం మాటల్తో అన్నా సంతృప్తి పడనీ గురూ" అన్నాడు. వాడి సంతృప్తి ఏమోగానీ నేనూ రాజారాం గాడిదల్లా పనిచేస్తేగానీ రోజు వారీ పని పూర్తయ్యేది కాదు. వారం అయ్యాక వచ్చి శలవు పొడిగించబోయాడు గానీ నేను వూరుకోలేదు.
"మొత్తం శలవులన్నీ పెళ్ళికిముందే హాస్టల్ చుట్టూ తిరగటానికి వాడేశావు. పెళ్ళికి స్పెషల్ లీవు పెట్టావు. శోభనం రిహార్సల్ కి మిగతా కొసరేదైనా ఉంటే అదికూడా వాడేశావు. ఇక చచ్చినా ఇవ్వను."
"ప్లీజ్! ఈ రోజే గురూ ముహూర్తం."
"ఎన్నిగంటలకి?"
"రాత్రి తొమ్మిదింటికి పురోహితుడు వస్తాడట. అయిదు నిముషాలతంతు ఏదో ఉందట. ఆ తరువాత..."
"రాత్రి తొమ్మిదింటికి కదా! నీ డ్యూటీ ఎన్నింటికి అయిపోతుంది?"
"పదిన్నర వరకూ ఉంది"
"ఎనిమిదిన్నర వరకూ చెయ్యి. రిలీవ్ చేస్తాను."
"థాంక్స్ గురూ!"
నేను రౌండ్స్ కి బయల్దేరాను.
ప్రతిరోజూ నైట్ సెంట్రీలు డ్యూటీ మారే సమయానికి నేను స్వయంగా వెళ్ళి భీమరాజుని చూడటం నా దినచర్యలో ఒక భాగం. అలాగే, ఒకవేళ నైట్ డ్యూటీలో రాజారాం వుంటే అతనిని కూడా వెళ్ళి చూస్తూ వుండమని చెప్పాను. ప్రతిరోజు రాత్రి ప్రతీ మూడు గంటలకొకసారి ఒక ఆఫీసర్ జత కళ్ళు తనని గమనిస్తున్నాయని భీమరాజుకి తెలీదు. ఎటువంటి పరిస్థితిలోనూ అతడికి బయట్నుంచి సాయం లభించదని, అతడు లోపల్నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం ఏమీ చేయటం లేదనీ, ఒకవేళ అలా చేసినా, అది ప్రారంభించిన ఒక గంటలో మాకు తెలిసిపోతుందనీ నాకు నమ్మకం కుదిరింది.
ఎనిమిదయింది.
జైల్లో ఆరున్నరకే నిశ్శబ్దం అలుముకుంటుంది. ఇంకా వెలుగుండగానే సెంట్రీలు ఖైదీల్ని ఎవరి గదుల్లోకి వాళ్ళని పంపివేస్తారు. అందుకే జైలు ఏడింటికల్లా నిద్రపోతుంది. అందులోనూ మా జైలు ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వుండటంతో మరీ... బయట ప్రపంచంలో అసలు సంబంధాలు ఉండవు.
ఆ రోజు ఆకాశం అంతా బాగా మేఘావృతమైంది. చలిగాలి బాగా వీస్తూంది. కాకీ బట్టలు వేసుకోవటం వల్ల కాస్త వెచ్చగా వుంది. బయటకొచ్చి నిలబడ్డాను. చీకట్లో గాలికి ఊగుతున్న చెట్లు పూనకంతో జడలు విరబోసుకుని వూగుతున్న స్త్రీల్లా ఉన్నాయి. జేగురు రంగు గోడలు ఆ చీకటిలో మరింత నల్లగా కనబడుతున్నాయి. క్రింద సెంట్రీలు నలుగురు కలిసి ఏదో తింటున్నారు. జైల్లో సంవత్సరాని కొకసారి ఇన్ మేట్స్ డే జరుగుతుంది. ఆ ఫంక్షన్ తాలూకు మిగిలియా స్వీట్స్ అయి ఉంటాయి.
టైమ్ చూసుకున్నాను. ఎనిమిదీ పది అయింది. శివప్రసాద్ ఇంకా లోపల్నుంచి రాలేదు. అతడి మనసంతా మల్లెపూల మంచం మీదే ఉంటుందని తెలుసు. ప్రతీ నిమిషమూ గడియారం మీదే వుండి ఉంటుంది అతడి దృష్టి....
ఇంతలో దూరంనించి రాజారాం రావటం కనిపించింది. నన్ను రిలీవ్ చేసి, డ్యూటీలో చేరటానికి వస్తున్నాడు. సెంట్రీలదగ్గిర ఆగి వాళ్ళతో ఏదో మాట్లాడుతూ స్వీట్ నోటిలో వేసుకుంటున్నాడు. రాజారాం అందరితోనూ చనువుగా వుంటాడు.
అంతలో ఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తి "హలో" అన్నాను.
"టెలిఫోన్ చెకింగ్ సర్" అవతల్నుంచి వినిపించింది.
"ఇట్సాల్ రైట్"
రాజారాం వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. డ్యూటీ రిజిష్టర్ అతడి ముందుకు తోశాను. సంతకం పెడుతూ, "ఏమిటి విశేషాలూ భాయీ" అన్నాడు.
"ఈ రాత్రి పెద్ద వర్షం కురవబోతూంది. చలిగాలి కూడా... మన శివప్రసాద్ అదృష్టవంతుడే. నూటికో కోటికో ఒకరికి తప్ప, ఇలాంటి మొదటిరాత్రి రాదు" అన్నాను. రాజారాం బిగ్గరగా నవ్వేడు. "...అయితే శివప్రసాద్ దగ్గిర మళ్ళీ స్వీట్స్ తీసుకోవాల్సిందే" అన్నాడు.
"ఇలా ప్రొద్దున్నించీ తినటమే కార్యక్రమంగా పెట్టుకుంటే నువ్వు సంవత్సరానికి రెండు యూనిఫారంలు మార్చాలి భాయ్."
రాజారాం మళ్ళీ నవ్వేడు. "లావవటం అభివృద్ధికి నిదర్శనం. మన డిపార్టుమెంట్ లో చూడు, పై ఆఫీసర్లందరూ లావుగానే ఉంటారు."
"కానీ... " అంటూ ఆగాను. అప్పటికే రాజారాం మొహంలో అదోలాటి మార్పొచ్చింది. నేను ఏమైంది అనుకుంటూ కుర్చీలోంచి లేచి అతడున్నవైపుకి వెళ్ళబోయే లోపులోనే అతడు ముందు బల్లమీదకు ఒరిగిపోయాడు.
'రాజారాం... రాజారాం' అంటూ భుజం పట్టుకు వూపాను. అతడు స్పృహతప్పి వున్నాడు. అప్పటివరకూ బాగా మాట్లాడుతున్న వాడు వున్నట్టుండి అలా అయిపోవటం ఆందోళన కలిగించింది. శ్వాస పరీక్షించాను. బాగానే ఉంది. శారీరక రుగ్మత, మరే విధమైన నొప్పీ సూచించలేదు. బయటకు వచ్చి సెంట్రీ అని పిలవబోయాను. అంతలోనే గుర్తొచ్చింది- డ్యూటీ డాక్టర్ కాంపౌండ్ లోనే ఉన్నట్టు.
టెలిఫోన్ ఎత్తి డాక్టర్ రూమ్ కి కనెక్షన్ తీసుకోబోయాను. టెలిఫోన్ పనిచేయటం మానేసింది...
బయట చెట్లమీద నుంచి వస్తూన్న గాలి మరింత చికాకు కలిగిస్తూంది. కరెంటు పోలేదు. అదొక అదృష్టం.
'సెంట్రీ' అని పిల్చాను. గాలికి నా స్వరం నాకే వినిపించటం లేదు. రాజారాం ఇంకా అలానే పడి వున్నాడు. టెలిఫోన్ పక్కనుంచి బయటకొచ్చి మళ్ళీ ఒకసారి 'సెంట్రీ' అని పిలవబోయి ఆగాను. బహుశా నా జీవితంలో నేనెప్పుడూ అంత భయాన్నీ- షాక్ నీ పొంది వుండను.
గది బయట ఉండవలసిన సెంట్రీ లిద్దరూ జీవచ్చవాల్లా వాలిపోయి ఉన్నారు. ఒక సెంట్రీ అయితే పిట్టగోడమీదకుపడి, ఎప్పుడైనా అటువైపు జారిపోయేలా ఉన్నాడు. ఒక్కసారిగా నా శరీరం కంపించింది. అందులోనూ బయట ఆ భీభత్స వాతావరణం. లోపల శవాల్లాంటి ఈ మనుష్యులూ- చప్పున మళ్ళీ లోపలికి పరుగెత్తాను. ఫోన్ ఎత్తి అంబులెన్స్ కి ఫోన్ చేయబోయాను.
జైలునుంచి బయట ప్రపంచానికి కలిపే రెండోఫోను కూడా 'డెడ్' అయింది. ఆ క్షణం నా చేతిలో ఉన్న ఫోను చచ్చిన పాములా కనబడింది. అపాయాన్ని సూచించే తతంగం ఒకటి మనసు నుంచి వెలువడి శరీరం అంతా పాకింది.
గాలిలా రూమ్ లోంచి బయటకు దూసుకువచ్చాను. వరండా నిర్మానుష్యంగా, నిర్జీవంగా వుంది. పరుగెత్తుకుంటూ పక్కరూమ్ లోకి వెళ్ళాను. అదృష్టవశాత్తు శివప్రసాద్ బాగానే వున్నాడు. అప్పుడే వెళ్ళిపోవటానికి ఆయత్తమవుతున్నట్టున్నాడు. అలా విసురుగా వచ్చిన నన్నుచూసి "ఏమైంది గురూ" అని అడిగాడు. నేను సమాధానం చెప్పకుండా అదే వేగంతో ఫోన్ ఎత్తుకుని పరీక్షించాను. అదికూడా డెడ్ అయివుంది.
"ప్రసాద్, కమాన్ క్విక్" అంటూ బయటకొచ్చాను.
మా ఆఫీసు జైలు మధ్యలో వుంది. చుట్టూ వృత్తాకారంలో సెల్స్. వాటి వెనుక ఎత్తయినగోడ. రెండో అంతస్థులో ఉంది మా ఆఫీసు. క్రింద జైలర్ కార్యాలయం. నేను వడివడిగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాను. పైన ఏమీలేదు. విశాలమైన ఖాళీ స్థలం. వెనుక వస్తూన్న ప్రసాద్ కి ఏమీ అర్ధం కాలేదు. కానీ పోలీస్ డిపార్టుమెంట్ లో ట్రెయినింగు అయినవాడు కాబట్టి మారు మాట్లాడకుండా నన్ను అనుసరిస్తున్నాడు.
సెల్స్ ముందున్న వరండాలో ఎలక్ట్రిక్ దీపాలతో పాటూ హరికెన్ లాంతర్లు కూడా ఉంచుతాం. అదీగాక సెంట్రీలకి బ్యాటరీలైట్లు ఇస్తాం.
మూడో అంతస్థు మీదనుంచి సెల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఎదురుగ ఉన్న సెల్ వరండాలో దృశ్యం నా అనుమానాన్ని నిర్ధారణ చేసింది. వరండాలో ఒక సెంట్రీ పడిపోయి ఉన్నాడు. మరో సెంట్రీ అతడిని పరీక్ష చేస్తున్నాడు.
"ప్రసాద్! పుడ్ పాయిజనింగ్ జరిగినట్టుంది. వెళ్ళి డాక్టర్ ని పిలుచుకు రావాలి. ఫోన్ పనిచేయటం లేదు. ఇద్దరం క్రిందికి దిగబోతూంటే అన్నాను. ప్రసాద్ సరే అన్నట్టు తలూపుతూండగా దూరంగా ఒక మెరుపు మెరిసింది. రాబోయే వర్షానికి సూచన అనుకున్నాం. కానీ ఆ తరువాత కనబడిన దృశ్యం మా ఇద్దర్నీ భీతావహుల్ని చేసింది. అంతటి అనుభవం వున్న పోలీసాఫీసర్ ని కూడా అచేతనుడై పోయాను. మేమున్న చోటుకి సరిగ్గా ఫర్లాంగు దూరంలో ఉన్న జైలు పదహారు అడుగుల ఎత్తు గోడ- ఏదో విస్ఫోటనం చెందనట్టు బద్ధలై పోయింది. చిన్న చిన్న రాళ్ళు. మట్టి దుమ్ములా గాలిలోకి ఎగిరాయి. నాలుగైదు అడుగుల వెడల్పున రంధ్రం మేము చూస్తూ ఉండగానే ఏర్పడింది. సరిగ్గా ఇరవై సెకన్ల తరువాత ఆ రంధ్రం గుండా రెండు జీపులు నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తున్నాయి.
* * *
"కూ (ప్)...కూ(ప్)" అరిచాను గొంతు పగిలేలా! ప్రసాద్ అయితే శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతడి మొహం అంతా రక్తం ఇంకిపోయినట్టు పాలిపోయి వుంది.
"కమాన్. క్విక్" అంటూ క్రిందకి పరుగెత్తాను.
క్షణంలో వరుసగా రెండంతస్థులూ దిగి క్రిందకి వచ్చేసేం. అప్పటికే పగిలిన గోడవైపున్న సెంట్రీల తుపాకీ చప్పుళ్ళు వినబడటం ప్రారంభించాయి. ప్రతి యాభై గజాలకి గోడమీద ఒక చిన్న గది (పోస్ట్) వుంటుంది. అందులో సెర్చిలైటు, ఇద్దరు సెంట్రీలు వుంటారు. అక్కణ్ణుంచి తుపాకీ మోత వినిపిస్తూంది. నాక్కొంచెం స్వాంతన దొరికింది. పోస్టులో వున్న సెంట్రీలు స్పృహలో వుండటం! కాల్పులూ ఎదురు కాల్పుల మధ్య రెండోసారి మళ్ళీ మరో విస్ఫోటనం వినిపించింది. అయితే ఇది జైలుకి వ్యతిరేక దిక్కునుంచి... అట్నుంచి కూడా శత్రువులు ప్రవేశిస్తున్నారు.
జైలు చుట్టూ వున్న పదహారు అడుగుల ఎత్తుగోడ దాటి లోపలికి వస్తే, మళ్ళీ లోపల ఇంకొక వాల్ వుంటుంది. దాని మధ్యలోనే వుంది మా కార్యాలయం. దానిచుట్టూ సెల్స్. బయట గోడకన్నా లోపల గోడ పటిష్టమైనది. దాన్ని ఛేదించడం అంత సులభం కాదు. కానీ దానికున్న తలుపులు- ముఖ్యంగా క్యాంటీన్ వైపు వున్నా తలుపులు అంత బలమైనవి కావు.
ఆలోచనల్లో వుండగానే ఆర్తనాదం వినిపించింది. పోస్టుపైనున్న సెంట్రీ శరీరం అంత ఎత్తునుంచీ దబ్బున పడింది. దూరంగా తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి అనుభవం ఇంతకుముందు లేదు. చాలామంది జైలర్ల జీవితాల్లో అసలురాదు! సూపర్నెంటెండెంట్ లేడు. చాలామంది జవాబులు చచ్చిన నల్లుల్లా స్పృహతప్పి పడి ఉన్నారు. ఏం చెయ్యాలో తోచలేదు. ప్రసాద్ వైపు చూశాను. అతడు దాదాపు వణుకుతున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే దాన్ని డీల్ చెయ్యాలి. నేనే మాత్రం అధైర్యపడినా ఓటమి తప్పదు.
అంతలో జీపులు దగ్గిర అవుతున్న శబ్దం వినిపించింది. అవి క్యాంటీన్ వైపు వస్తున్నాయి. అంటే... ఈ సంగతి కూడా వాళ్లకి తెలిసి పోయిందన్న మాట. మైగాడ్.....
నా మనసులో ఫ్లాష్ లా వెలిగి గుర్తొచ్చింది- జగన్నాధం యింటిలో చూసిన జైలు తాలూకు మ్యాపు.
దీని వెనుక వున్నది జగన్నాధం!