Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 13


    ఏ పార్టీకి మెజారిటీ రాక, నాయకులందరూ కొట్టుకు ఛస్తుంటే అదోరకమైన శ్మశాన వైరాగ్యంలో మునిగిపోయిన ఓటరులాగా, బృహస్పతి పరిస్థితిని అదోరకమైన నిరాసక్తతతో చూస్తున్నాడు.

    బొప్పి కట్టినచోట రావు తలని తడుముకున్నాడు. అతడిని అనుకరిస్తున్నట్లు కోతికూడా అదే భంగిమతో తలని తడుముకుంది.

    అప్పుడే రావుకి ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది. తన ఆలోచన కరెక్ట్ అవుతుందా, లేదాని నిర్ధారించుకోవడం కోసం, 'కోతి'లా రెండు గంతులు వేసాడు. అది కోతే కాబట్టి కొమ్మ మీద రెండు గంతులు వేసింది. గర్వంగా నవ్వుకున్నాడు.

    కోతి కుడిచేతిలో టోపీ వుంది.

    నేలమీద పడిపోయిన ఆకుని ఒకదాన్ని వంగి తీసుకున్నాడు. కోతి టోపీని ఎలా పట్టుకుందో, తనూ ఆ ఆకుని టోపీలా మడిచి పట్టుకుని సుతారంగా నేలమీదకి జారవిడిచి, దానివైపు ఎక్స్ పెక్టింగ్ గా చూసాడు. కోతికూడా కుడిచేతిలోని టోపీని ఎడమచేతిలోకి మార్చుకుని ఒక ఆకు కోసి టోపీలా మడిచి నేలమీదకి సుతారంగా జారవిడిచింది.

    మొహంమీద పేడ కొట్టినట్టయింది! బృహస్పతి వైపు చూసి ఇబ్బందిగా నవ్వాడు. బృహస్పతి బ్లాంక్ గా ఉన్నాడు. నవ్వలేదు.

    రావుకి ఈసారి ఇంకా గొప్ప ఆలోచన వచ్చింది. "ఇక దీనికి తిరుగులేదు బ్రదర్" అంటూ బృహస్పతి దగ్గరికి వచ్చి అతడి టోపీ తీసుకెళ్ళి, చెట్టుకి కాస్త దూరంగా నిలబడి గాలిలోకి విసిరేసాడు. కోతి నవ్వింది. రావు కూడా స్నేహపూర్వకంగా నవ్వేడు.

    కోతి కిందకు వచ్చి ఆ టోపీని కూడా తీసుకుపోయింది.

    కొంచెం సేపు పాటు రావుకి ఏం జరిగిందో అర్ధం కాలేదు.

    నిస్సహాయంగా దానివైపే చూస్తోన్న రావు దగ్గరికి వచ్చి "పోదాం బ్రదర్ పద" అన్నాడు బృహస్పతి.

    "మన టోపీలు?"

    "వాటిమీద ఆశ వదిలేసుకో. అవి పోతే నష్టంలేదు కానీ. ఇప్పుడు జరిగిన దానివల్ల మాత్రం నాకో గొప్ప సత్యం అర్ధమయింది."

    "ఏమిటది?"

    "మనం ఏం చెయ్యాలో ఆ కోతి చెప్తోంది."

    "అంటే"

    "మనకేవో గొప్ప తెలివితేటలున్నాయన్న నమ్మకంతో మనం ఓటర్లుగా మిగిలిపోయాం. మనకన్నా 'నిజంగా' తెలివితేటలున్నాయి కాబట్టి అది రాజకీయ నాయకుడిలా ప్రవర్తించింది."

    రావు అయోమయంగా తలగోక్కొని- "నువ్వు చెప్పింది కరక్టే. కానీ దీనివల్ల నీకేదో అర్ధం అయిందన్నావ్. ఏమిటది?" అని అడిగాడు.

    "ఆ చెట్టు మన వ్యవస్థలాంటిది. స్వతంత్రమనే యాభై సంవత్సరాల ఆయుష్షు గల చెట్టది. దానిమీద కొన్ని కోతులున్నాయి. మన శ్రమనీ, ఆస్థినీ అవి క్రమక్రమంగా, చట్టబద్ధంగా దోచుకుంటున్నాయి. ఐదు సంవత్సరాలకి ఒకసారి 'ఓటు' అనే టోపీని మనకిస్తున్నాయి. మనం దానితోనే బోలెడు సంబరపడి పోయి, చెట్టుమీదకి విసిరినట్టు, బ్యాలెట్ బాక్స్ లో వేస్తున్నాం. ఒక్క విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. చెట్టుమీద కోతులు హాయిగా నీడలో, టోపీలతో ఉంటాయి. కింద ఎండలో మనం, మళ్లీ మన టోపీ ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తుంటాం. చేతికి రాగానే మళ్ళీ విసిరేస్తాం. అప్పుడప్పుడు మన టోపీ మరో కోతికి దొరకవచ్చు. ఏ కోతి అయితేనేం, మన నుదురు బొప్పి కట్టించడానికి?"

    అతడు ఆగి కొనసాగించాడు.

    "మనం ఎంత అల్పసంతోషులమో చూడు. టోపీ విసిరే అధికారం ఉంది కదా అని సంబరపడిపోతున్నాం. ఇద్దరు మోసగాళ్ళలో ఎవరో ఒకరికి మనల్ని మనం సమర్పించుకుంటున్నామన్న చిన్న విషయం మర్చిపోతున్నాం. రాజకీయాల్లో అవన్నీ కోతి చేష్టలనుకుంటూ నవ్వుకుంటున్నాం. కార్టూన్లు వేసుకుని ఆనందిస్తున్నాం. వాళ్ళు మాత్రం కంటి ఆపరేషన్ కి కూడా ఫారిన్ కంట్రీ వెళ్ళగలిగేలా సదుపాయాలు సమకూర్చుకున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని ఆడవాళ్లని బీదర్ తీసుకెడుతున్నారు. ముడుపుల కేసుల గతంలోంచి గవర్నర్లవుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే ఆ చెట్టుని పూర్తిగా నరికేసి కోతుల్ని కిందికి దింపాలి. అలా నరక్కుండా చేయడంకోసం పోలీసులు, ఎన్ కౌంటర్లు- అన్న రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుందీ వ్యవస్థ. 'ప్రజాస్వామ్యం' లాంటి అందమైన పేర్లతో మేధావులని ఆకట్టుకుంది" ఒక క్షణం చెప్పడం ఆపాడు. 

    "ఏభై సంవత్సరాలు నమ్మకంతో మనం పెంచి పెద్దచేసిన చెట్టది! ఎలాగూ ఆ చెట్టుని కొట్టెయ్యలేనప్పుడు మనకి మిగిలింది ఒకటే దారి!! మనం కూడా చెట్టెక్కి కోతుల్లా కూచోవడం!!!" చెప్తున్న బృహస్పతి మాటలు ఆపుచేయడంతో, రావు అతడివైపు చూసాడు. బృహస్పతి దృష్టి బోర్డు మీద నిలిచి వుండడంతో, తనుకూడా దృష్టి అటు సారించాడు.

    వాళ్ళిద్దరూ చిన్న గుట్టమీద ఉన్నారు. కిందుగా మూడు వేపులా నీళ్ళు, ఉత్తరంవైపు కొండలు ఉన్నాయి. మధ్యలో ఊరుకుంది. దానిపేరు సూచిస్తున్నట్టు గుట్టమీద బోర్డు ఉంది.

    "బుద్ధి లేనిపాలెం."


                       *    *    *


    "ఏమినేనివారి పాలెం చూసాం, రావులపాలెం చూసాం. కానీ బుద్ధిలేని పాలెం ఏమిటి గురూ? గమ్మత్తుగా వుంది కదూ పేరు!" అన్నాడు బృహస్పతితోపాటు ఆ ఊరి వైపు గుట్ట దిగుతూ.

    "అలా అనకు బ్రదర్! ఇక్కడినుంచే మన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నాం."

    "ఏమిటి? బుద్ధిలేనిపాలెం నుంచా?" ఆశ్చర్యంగా అడిగాడు రావు. "....ఊరి పేరు ఏదో అపశకునంలా వుంది. శుభప్రదంగా లేదు గురూ!"

    "పిచ్చివాడా! తి....రు....ప....తి అంటే ఏమైనా అర్ధం వుందా? 'తిరు' అన్న దానికి 'శుభము' అన్న అర్ధాన్ని మనం కల్పించుకున్నాం. ఒక పవిత్రతను ఆపాదించుకున్నాం. ఎన్నికల్లో ఒక్కరే గెలుస్తారన్న చిన్న విషయాన్ని మర్చిపోయి అధికార పక్షంలో వున్నవాడూ, ప్రతిపక్షంలో వున్నవాడూ కూడా అక్కడినుంచే తమ ప్రచారాల్ని ప్రారంభించేటంత మౌఢ్యాన్ని పెంచిందేమిటో తెలుసా? నమ్మకం!!! అలాంటి నమ్మకాన్ని ఈ 'బుద్ధి లేనిపాలెం' మీద పెంచుకో. ఈ ప్రజలే నిన్ను అందలం ఎక్కిస్తారు...."

    "నువ్వు చెప్పినదాంట్లో ఒక విషయం అర్ధమైంది కానీ, మరో విషయం అర్ధంకాలేదు గురూ! మనం ఎన్నికల్లో నిలబడబోతున్నామా?"

    "మూర్ఖుడా! అది మామూలు రాజకీయ నాయకులు చేసేపని. అంతకన్నా తెలివైనవాళ్ళు.... ఎవరికి ఓటు వెయ్యాలో ప్రజలకి నిర్దేశించే మతగురువుల స్థితిలో వుంటారు. మరికొందరు నాయకులు నాయకులకే నాయకులవుతారు. నువ్వు అలా కాబోతున్నావ్".

    అప్పటివరకూ ఉత్సాహంగా వింటున్న హనుమంతరావు ఉలిక్కిపడి "నేనా?" అన్నాడు.

    "అవును. ఈ క్షణంనుంచీ నీ పేరు ఓంఫట్ బాబా!"


                    *    *    *


    ఆడవాళ్ళు అందరూ ఒక వరుసలోనూ, మగవాళ్ళందరూ వరుసలోనూ భక్తిగా నిలబడి వున్నారు. ఒక్కొక్కరే వెళ్ళి శిరస్సు వంచి ఆ స్వామికి నమస్కరిస్తున్నారు. పిడికిలి బిగించి, వంచిన భక్తుడి (రాలి) శిరస్సు మీద బలంగా కొట్టి "ఓంఫట్" అంటున్నాడు ఆ బాబా. తన జన్మ పునీతమైనట్టు మరింత తదాత్మ్యతతో వాళ్ళు అక్కడినుంచి ముందుకు కదుల్తున్నారు.

    అరగంటలో తన్నుల ప్రహసనం ముగిసింది.

    ఎదురుదెబ్బల కార్యక్రమం మొదలైంది. "జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఎలా తప్పించుకోవాలి?" అన్న తాత్వికోపన్యాసాన్ని 'ఓంఫట్ బాబా' ఇవ్వడం ప్రారంభించాడు. ఉపన్యాసం ముగిసాక 'రహస్య సమాలోచనం' కార్యక్రమం ప్రారంభమైంది.

    భక్తులూ, భక్తురాళ్ళూ విడివిడిగా వచ్చి, తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందే కార్యక్రమం అది!

    "మా పొలం సరిగ్గా పండడంలేదు. ఏం చెయ్యాలి?"

    "నాతో తన్నులు తిను. పోతుంది."

    "నా కడుపు పండడంలేదు. ఏం చెయ్యాలి?"

    "ఓంఫట్ బాబా నీ తలమీద కొట్టడమే దానికి పరిష్కారం."

    "చదువు మీద ఏకాగ్రత కుదరడంలేదు. ఆరోగ్యం బాగోడంలేదు. అనుకున్న అమ్మాయి ప్రేమించడంలేదు. వ్యాపారంలో నష్టం వస్తోంది. ఏం చెయ్యాలి?"

    "నాలుగు సమస్యలకీ నాలుగుసార్లు కొట్టించుకుంటే చాలు."

    కళ్ళు మూసుకుని చెప్తున్నాడు ఓంఫట్ బాబా.

    ఎదురుగా కూర్చున్న బృహస్పతి కాస్త కంఠం మార్చి "అయ్యా! మీరు మాకు ఉపదేశిస్తున్న ప్రకారం ఏ సమస్యకైనా మీతో కొట్టించుకోవడమే పరిష్కారమార్గంగా వున్నట్టుంది.... దీనివల్ల ఉపశమనం లభిస్తుందంటారా?" అన్నాడు.

    కళ్ళు తెరవకుండానే "పిచ్చివాడా! ఆయిల్ పుల్లింగ్ ను ప్రచారం చేసే పత్రికలవాళ్ళు ఏ అనారోగ్యం అయినా దానితోనే పోతుందంటారు. కడుపు రాకపోయినా.... కడుపు పోయినా- పడకగది వాస్తులో దోషం వుందంటాడు అందులో నిపుణుడు. రాష్ట్రంలో జరిగే ప్రతి 'మానభంగం' ముఖ్యమంత్రి అసమర్ధతవల్లే జరిగిందంటాడు. ప్రతిపక్ష నాయకుడు. కలలో నడిచే అలవాటుకీ, కేన్సర్ కీ తన దగ్గర ఓ అరగంట పడుకోవడమే మందంటాడు హిప్నటిస్టు.... కాబట్టి ఎవరెవరికీ ఏ రంగంలో నిపుణత వుంటే, దానివల్ల మాత్రమే సర్వ భౌతిక, మానసిక సమస్యలూ నివారణ చేయగలరు. చెప్పడమే నా ధర్మం. వింటే నీ ఖర్మం" వేదాంత పూర్వకంగా అన్నాడు ఓంఫట్ బాబా.

    "నీయమ్మ కడుపు కాలా. ఎంత డెవలప్ చేసావురా రావూ!" అన్నాడు భక్తుడి రూపంలో ఎదురుగా కూర్చుని వున్న బృహస్పతి. "....నేను మన ఊరువెళ్ళి శ్రీహర్ష గాణ్ణి కలుసుకుని వచ్చేలోగా; ఇక్కడింత బాగా పాతుకుపోతావని కల్లోకూడా ఊహించలేదు."  

    బాబా నెమ్మదిగా కళ్ళు తెరిచి "ఎవరు నాయనా నువ్వు?" అన్నాడు.

    బృహస్పతి అటూ ఇటూ చూసి, "చుట్టుపక్కల ఎవరూ లేరు బ్రదర్! నువ్వు మామూలుగా మాట్లాడవచ్చు" అన్నాడు.

    "ఈ ప్రపంచంలో ఎవరికెవరూ బ్రదర్ కాడు బ్రదర్. అరటిపండు తొక్కలు విచ్చుకున్నట్టు, బంధాలు విచ్చుకోవడమే మోక్షానికి దారి."

    "నీ దుంపతెగా! నాలుగు రోజులు నానా భోగాలు అనుభవిస్తూ, నలుగురు అమ్మాయిలు చుట్టూ చేరగానే నీకు మోక్షం అంటే ఏమిటో తెలుస్తోందట్రా ఇడియట్? నీ భాగస్వామినే మర్చిపోయావ్."

    "భక్తి మార్గంలో 'భాగాలుం'డవనీ, చేసుకున్నవాడికి చేసుకున్నంత ముక్తి లభిస్తుందనీ తెలుసుకోవడమే జ్ఞానం నాయనా!" అన్నాడు బాబా. "....అటువంటి తెలివితేటలు నీకు కూడా లభించాలంటే, తలమీద ఒకటి కొడతాను. జ్ఞానసారం లభిస్తుంది పుచ్చుకో."

    'నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. అప్పుడు అసలు విషయం అందరికీ తెలుస్తుంది. కాసుకో" కోపంగా అన్నాడు బృహస్పతి. స్వామి తాపీగా నవ్వేడు.

    'బయట చాలామంది భక్తులు వేచియున్నారు నాయనా! వెళ్ళి నీ ఆశయం నెరవేరడం కోసం తల్లకిందుగా తపస్సు చేయి. నా ఆశీర్వచనం నీ తలమీద మోదటానికి ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. కొట్టించుకోవాలన్నప్పుడు రా! సిగ్గుపడకు!!"

 Previous Page Next Page