ఆమె అంత ధీమాగా చెపుతూండేసరికి అతను కొద్దిగా వెనక్కి తగ్గాడు. క్షమించండి. మీలాంటి అమ్మాయే ఎవరో నన్ను మోసం చేశారు. మనిషిని పోలిన మనుష్యులుండటం అసహజమే అయినా అసాధారణం కాదుకదా, పొరపాటు పడ్డాను."
ఆమె మొహం కూడా ప్రసన్నంగా మారింది. "సర్లేండి అయిపోయిందేదో అయిపోయింది" అంది.
"మీకు చిన్నప్పుడే తప్పిపోయిన అక్కగానీ, చెల్లిగానీ వుందా?"
"లేదు. మీ సినిమా కథల్లోలా ఏ ఫ్లాష్ బ్యాక్ అయినా వున్నదేమో మరి. మా అమ్మా నాన్నలని అడగాలి" అంది నవ్వుతూ.
"మీకు సెన్సాఫ్ హ్యూమర్ బావున్నట్టుందే" అన్నాడు.
"థాంక్స్- కాంప్లిమెంట్ కి"
"ఇలా జనం మధ్యలో నడవటం నాకు ఇబ్బందిగా వుంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తాను. లైబ్రరీ దగ్గర ఉంది నా కారు."
"మా ఇంటివరకూ మీ రథం రాదు."
"ఫర్వాలేదు."
ఇద్దరూ నడవసాగారు.
"మీరు లైబ్రరీ నుంచి నన్ను వెంటాడుతూ వస్తున్నారా?"
"అవును."
"పత్తేదారు పని చేశారన్నమాట,"
"తప్పుదార్లో!"
ఇద్దరూ కారు చేరుకున్నారు, ఆమె ఎక్కింది. అతడు కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు "ఎటు మీ ఇల్లు?"
"పోనివ్వండి చెప్తాను" అంది- "మీరు మా ఇంటికి కూడా రావచ్చు. నేను చెప్పిన విషయాలపట్ల ఏవైనా అనుమానాలుంటే మా తల్లితండ్రుల్ని కూడా కలుసుకోవచ్చు."
"అవసరంలేదు. ఒక పూర్తి ఆస్పత్రి సెటప్ తయారుచేసి నటీనటుల్తో డాక్టర్ల వేషాలు వేయించి నన్ను మతిలేని వాడిగా చిత్రీకరించటానికి ఎంతో కష్టపడ్డ నీకు ఒక పూరింట్లో తల్లితండ్రుల్ని సృష్టించటం పెద్ద కష్టం కాదు. వాళ్ళు అక్కడ రెడీగా వుంటారని నాకు తెలుసు."
"ఏమిటి మీరు మాట్లాడేది?"
"నువ్వు నా కారెక్కేవరకూ నేనూ నాటకమాడాను. ఇప్పుడిక నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నిన్ను ప్రయిగేట్ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ నిజం చెప్పేవరకు నిన్ను వుంచబోతున్నాను. నన్ను పెట్టిన హింసకి ప్రతీకారం."
ఆమె గట్టిగా అంది- "ఇది అన్యాయం. ఎవర్నో పట్టుకుని... " ఆమె మాటలు పూర్తిగా కాకుండానే అతడు ఇంకా గట్టిగా అరిచాడు- "ఎవర్నో కాదు. నిన్నే... నువ్వు నన్ను మోసం చేయలేవు-"
"అంత ధీమాగా ఎలా చెప్పగలరు?"
"మనిద్దరం కలిసి పిచ్చాసుపత్రి గోడమీద ఎక్కుతూండగా గార్డులు రైఫిల్స్ పేల్చారు. నేను నీకు చెయ్యి అందించాను. అప్పుడు నీ చేతికి గుచ్చుకున్న గాజుపెంకు గాయం ఇంకా నీ చేతిమీద తగ్గలేదు."
ఆమె చప్పున చేతివైపు చూసుకుంది. అతనన్నాడు "ఇప్పుడు చెప్పు. నీ అసలు పేరేమిటి? ఈ నాటకంలో నీ భాగం ఎంత? మళ్ళీ ఇంకో నాటకం ఆడటానికి ప్రయత్నించావో దాని పరిణామం చాలా తీవ్రంగా వుంటుంది."
ఆమె మొహం పాలిపోయింది. అతడు తనని అంత సునిశితంగా పరిశీలిస్తాడని అనుకోలేదు. కొద్దిసేపు మౌనంగా వుండి తలెత్తింది. "మా ఇంటికి వెళదాం. అక్కడ అంతా చెపుతాను" అంది. "మళ్లీ ఇంకో ఎత్తా?" అన్నాడు.
"ఇక వాటి అవసరం లేదు. మీరు నేననుకున్న దానికన్నా చాలా తెలివైనవాళ్ళు. మా ఇంటికే వెళదాం."
"మీ ఇంటివరకూ కారు వెళ్ళదన్నావ్."
ఆమె నవ్వింది. "ఊరికనే అన్నాను. పదండి వెళదాం."
"నాకు నమ్మకం లేదు. ఇంకో వలలో చిక్కుకునే ఓపికా, తీరికా నాకు లేవు."
"ఇక నాటకాలేమీ లేవు చైతన్యగారూ. మీ కోసమే నేను లైబ్రరీకి వచ్చాను. మీరు నన్ను ఫాలో అవుతున్నారని తెలిసీ ఈ ఆఫీసుకి వచ్చాను."
అతడు అమితమైన ఆశ్చర్యంతో "నేను లైబ్రరీకి వస్తున్నానని నీకెలా తెలుసు?" అన్నాడు.
"జయశ్రీ చెప్పింది" అతడు పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు.
అతడి భావం గ్రహించినట్టుగా ఆమె అంది- "జయశ్రీ నా స్నేహితురాలు. ఆస్పత్రి బిల్డింగ్ మేము ఎవరిదగ్గర తీసుకున్నామా అని ఎంక్వయిరీ చేస్తూ మీరు ఆ ఇంటి యజమాని దగ్గరకు వెళతారని నాకు తెలుసు. డాక్టర్ పాల్ ని ఆ విధంగానే మీరు కనుక్కున్నారు. డాక్టర్ ని తరచూ లైబ్రరి దగ్గర చూస్తానని జయశ్రీ మీకు అబద్ధం చెప్పింది. తను మీకు ఫోన్ చేసి స్టూడియోనుంచి పిలిపించినట్టు నాకు చెప్పగానే నేనే స్వయంగా లైబ్రరీకి వచ్చాను.... ఈ నాటకానికి చరమగీతం పలకటానికి."
"కానీ... కానీ ఎందుకీ నాటకం? అసలేమిటిదంతా?"
"ఆవేశపడకండి. ఇంకో అయిదు నిమిషాల్లో అంతా చెపుతాను మీకు. అదిగో ఆ కుడివైపు భవంతిలోకి తిప్పండి."
అతడు స్టీరింగ్ సర్రున కోశాడు.
ఆ భవంతి కనీసం కోటి రూపాయలు పైగా చేస్తుంది. చుట్టూ విశాలమైన తోట. మధ్యలో ఫౌంటెన్.
అతడిని హాల్లో కూర్చోపెట్టి, లోపలికి వెళ్ళి ఆమె తయారయివచ్చింది. అతడామెనుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. అప్సరసలా వున్నదామె.
అతడి ఎదుటి సోఫాలో కూర్చుంటూ, చెప్పమంటారా? కాఫీ తీసుకున్నాక మొదలుపెట్టనా?" అని అడిగింది.
"నా సహనాన్ని ఎక్కువ పరీక్ష పెట్టొద్దు" అన్నాడు కోపంగా.
ఆమె "సరే, చెపుతాను" అంది.
* * * *
"నీ పేరు?" అడిగాడు గూర్కా అనుమానంగా. ఆ ఇంటిముందు అతడు, చాలా రోజుల్నుంచి తచ్చాడటం గమనించాడు.
"నా పేరు శ్రీరాములు" అన్నాడు ఇస్మాయిల్. అతడికి తను చైతన్య తాలూకు బంధువుని- అని చెప్పినట్టు గుర్తుంది. ఇప్పుడు తన అసలు పేరు చెప్తే ప్రమాదమని అలా అన్నాడు.
"అమ్మగారు ఇప్పుడే తిరుపతి నుంచి వచ్చారు" గేటు తలుపు తీస్తూ అన్నాడు గూర్కా "లోపలికి వెళ్ళండి."
గుండె వేగంగా కొట్టుకుంటూ వుండగా, తడబడే కళ్ళతో లోపలికి ప్రవేశించాడు ఇస్మాయిల్.
లోపల అంతా ఆధునికంగా వుంది. ఒకవైపు పైకి మెట్లు, మరోవైపు ఒకేసారి పదిమంది కూర్చోవటానికి వీలుగా పెద్ద సోఫాసెట్టు, మరొకవైపు చైతన్య సినిమాల తాలూకు షీల్డులు...
కుర్రవాడు కాఫీ తీసుకొచ్చి పెట్టాడు.
ఇదంతా తను వాళ్ళ బంధువుని అని చెప్పటంవల్ల వచ్చిన గౌరవం అని అతడికి తెలుసు. మామూలుగా అయితే లోపలికి ప్రవేశమే కష్టం.
తను ఇప్పుడు చెప్పబోయే ఈ రహస్యం... అది వినగానే ఆవిడ ఎలా ఫీలవుతుంది? ఆనందంతో తబ్బిబ్బు అవుతుందా- స్పృహతప్పి పడిపోతుందా?
ఉద్విగ్నత పట్టలేక ఇస్మాయిల్ చేతులు నులుముకున్నాడు. నుదుటిమీద చెమట తుడుచుకున్నాడు.
అంతలో...
దూరంగా మసీదునుంచి ప్రార్ధన వినిపించింది.
నమాజ్.
యుద్ధభూమిలోనైనా సరే - ఆ టైంకి - ప్రార్ధించటం అలవాటు ఇస్మాయిల్ కి.
ఆ గదిలోనే ఒక మూల దుప్పటి పరిచి- కూర్చొని నమాజ్ చేసాడు.
అతడు కళ్ళు విప్పేసరికి ఎదురుగా చైతన్య సెక్రటరీ రాజు వున్నాడు.
"ఎవర్నువ్వు?" కర్కశంగా అడిగాడు. ఇస్మాయిల్ తడబడ్డాడు. ఏం చెప్పాలో తెలియలేదు.
రాజు అతడి భుజం పట్టుకుని లేవదీస్తూ "చైతన్యగారి బంధువునని చెప్పి లోపలికి ప్రవేశిస్తావా? ఎవడ్రా నువ్వు?" అన్నాడు. క్షణాల్లో అక్కడ పరిస్థితి మారిపోయింది. అంత సులభంగా మోసపోయినందుకు గూర్కా చీవాట్లు తిన్నాడు. ఆ కోపాన్ని వాడు ఇస్మాయిల్ మీద చూపించి దాదాపు గెంటుకుంటూ బైటకు వచ్చాడు. "పోలీసులకి ఫోన్ చెయ్యండి సార్" అంటున్నాడు పనికుర్రాడు.
ఇస్మాయిల్ గేటు బయటకొచ్చి పడ్డాడు.
ఆ పరిస్థితుల్లో కూడా చైతన్య తల్లి కనబడుతుందేమో అన్న ఆశ.
అతడి కళ్ళముందే గేట్లు మూసుకుపోయాయి. ఒక అబద్ధం చెప్పటం ద్వారా- శాశ్వతంగా ఇక ఆ ఇంటిలో ప్రవేశించే అవకాశం కోల్పోయానని అతడికి తెలుసు.
ఎలా చెప్పాలి? చైతన్య తండ్రి బ్రతికున్నాడన్న సంగతి ఆవిడతో ఎలా చెప్పాలి?
* * * *
"కాశ్మీర్ లోయవైపు నా ప్రయాణం ఒక అందమైన అనుభవం." ప్రనూష ప్రారంభించింది.
అతడు 'టీ' తాగుతూ వింటున్నాడు. ఆ విశాలమైన హాలు, ఎత్తైన గోడలు, తైలవర్ణ చిత్రాలు, ఖరీదైన సామాగ్రీ, అన్నీ ఆమె చెప్పబోయే కథకోసం ఎదురు చూస్తున్నాయి.
"ఢిల్లీనుంచి జమ్మూవరకూ నేను ప్రయాణించే రైల్లో నాకోసం ఒక ప్రత్యేకమైన కంపార్ట్ మెంట్ రిజర్వ్ చేయబడింది. కేవలం నేనూ, నా ఆయా, పక్క కంపార్ట్ మెంట్ లో మరో ఇద్దరు నౌకర్లు.... " ఆమె ఆగి అన్నది-
"ఇదంతా నేనెంత డబ్బుగలదాన్నో చెప్పుకోవడానికి కాదు చైతన్యా! నా తండ్రి నన్ను ఎలా పెంచాడో, ఎంత అపురూపంగా చూసుకుంటూ వుండేవాడో చెప్పటానికి! నేలమీద కాలుపెడితే అరిగిపోయేటంత సుకుమారంగా పెంచాడు. అలా అని చదువు, గేమ్స్, రైఫిల్స్ షూటింగ్ మొదలయిన విషయాల్లో లోపమూ చేయలేదు. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నా తండ్రి ఆర్మీలో ఒక పెద్ద ఆఫీసరు. కోట్ల కొద్దీ ఆస్తివున్నా, ఒక మాజీ సంస్థానాధీశుల వంశానికి చెందిన వాడయినా దేశం కోసం సైన్యంలో చేరి ఉన్నత పదవిని అధిగమించిన దేశభక్తుడాయన. జమ్మూలో ఒక మిలటరీ జీపులో ఆయన నాకోసం ఎదురు చూస్తున్నాడు. రెండ్రోజుల తరువాత రాబోయే నా పుట్టినరోజున నా తల్లిదండ్రులతో గడపడం కోసం వెళ్ళాను."
"వెల్ కమ్ టు కాశ్మీర్" అన్నారాయన చేతులుసాచి.
నవ్వాను.
"పరీక్షలు బాగా వ్రాసావమ్మా."
తలూపాను.
జమ్మూనుంచి శ్రీనగర్- మిలటరీ జీపులో ప్రయాణం. గతుకుల రోడ్డు. ఆయన నా బాధని గమనించి నవ్వేడు. "జమ్మూ వరకూ నా కూతురివి. అక్కడనుంచీ ఒక సైనికాధికారికి అతిధివి-" అన్నాడు.
"చైతన్యా! ఆయన వ్యక్తిత్వం గురించి ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటాను. అందుకే ఆయనంటే అంత ఇష్టం. చాలా మంది నీతులు చెబుతాను. కొద్దిమందే ఆచరిస్తారు. అందులో నా తండ్రి ఒకరు. జీవితం అంటే ఏమిటో, ఎలా జీవిస్తే పరిపూర్ణమైన ఆత్మానందం కలుగుతుందో, 'అఛీవ్ మెంట్' కి అర్ధం ఏమిటో ఆయన ద్వారానే తెలుసుకున్నాను. ఆనందంగా బ్రతకటం వేరు- ఆత్మానందంతో బ్రతకడం వేరు. డబ్బుగానీ కీర్తిగానీ ఆత్మానందాన్ని ఇవ్వవు. కేవలం మన ప్రవర్తనే ఇస్తుంది. క్షమించండి. అనవసరం విషయాలు మాట్లాడుతున్నట్టున్నాను."