Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 13


    "బావుంది సార్. యాభైరోజులు పోతుంది" వారిలో ఒకరు సమాధానం ఇచ్చాడు. వాళ్ల దృష్టిలో యాభైరోజులంటే బావున్నట్టే. ఆ పిక్చర్ గురించి రకరకాల వ్యాఖ్యానాలు విన్నాడు. తన ప్రతి పిక్చర్ రిలీజ్ కి అది తప్పదు. తన చుట్టూ వున్న వలయం గురించి అతడికి తెలుసు. నిర్మాతలు, దర్శకులు, స్నేహితులు... ప్రివ్యూ చూడగానే అద్భుతం అంటారు. షేక్ హాండ్లిస్తారు. ఆ సాయంత్రం వేర్వేరు గ్రూపులుగా చేరి మందు ప్రారంభించగానే ఇక విమర్శల పర్వం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క గ్రూపు- ఆయా దర్శకుల, నిర్మాతలు పట్ల తమకున్న అభిప్రాయాన్ని బట్టి ఆ చిత్రాన్ని శల్య పరీక్ష చేస్తారు. సాయంత్రం షేక్ హాండ్లిచ్చిన మొదటి నాలుగు రోజులూ ఎవరూ టాక్ చెప్పరు. ఇదంతా తనవరకూ రాదు. తనంటే గౌరవం, భయం. "చాలా బావుందనుకుంటున్నారు" తో మొదలవుతుంది. మొదటివారం అవగానే ఇన్ డైరెక్టుగా చెప్పాలని మిగతా నిర్మాతలు, దర్శకుల తపన. "ఏదో కలెక్షన్లు తగ్గినట్టున్నాయంటున్నారే" అంటూ ప్రారంభిస్తారు. కళ్ళలో లీలగా ఎక్కడో సంతోషం. అందరూ తనవాళ్ళే. కానీ వేరేవాళ్లు తనతో సక్సెస్ తీస్తే తమ విలువ ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయం.

    "షాట్ రెడీ సార్" అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పాడు. చైతన్య కెమెరా ముందుకు వెళ్ళాడు. సీన్ ప్రారంభమయింది.

    "ఈయనే నాన్న. నే చెప్పానే శేఖర్ అని" హీరోయిన్ అంటోంది.

    "నమస్కారం అండీ" తను నమస్కారం చేశాడు. కెమెరా రన్ అవుతున్న శబ్దం వినిపిస్తూంది. హీరోయిన్ తండ్రి బొంగురు గొంతుతో అన్నాడు. "వెళ్ళమ్మా! తరతరాల్నుంచీ మన ఇంటినే అంటిపెట్టుకుని 'అంబా' అన్న రెండక్షరాలే ప్రాణంగా, పెరట్లో మనకి సేవచేస్తున్న ఆవు 'రామూ' పొదుగునుంచి పితికిన పాలలో, కార్మికుల చెమటతో తడిసిన చెరుకునుంచి పెట్టుబడిదారులూ, బూర్జువాలూ తయారుచేసిన పంచదార వేసి కాఫీ తీసుకురా తల్లీ. మనలాంటి రైతు కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి పండించిన కాఫీ గింజల పొడి వేయటం మర్చిపోకమ్మా."

    "కట్" అన్నాడు దర్శకుడు. 

    చైతన్యకి నిస్సత్తువ ఆవరించింది. ఈ చివరి డైలాగ్ మీద మధ్యాహ్నం రెండు గంటలు చర్చ జరిగింది. ఒక్క డైలాగ్ లోనే సెంటిమెంటు, విప్లవం, వగైరా- వగైరాలు సృష్టించగలిగిన రచయిత మేథస్సుకి జోహార్లంటున్నాడు దర్శకుడు. పాపం నిర్మాతకి డైలాగ్ అర్ధంకాక బిక్కమొహం పెట్టి కూర్చున్నాడు. "వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా" అని ఒక్క డైలాగ్ చాలుకదా అంటాడు తను. షూటింగ్ ఆగిపోయింది. రచయిత కోసం కారు వెళ్ళింది. రచయిత వచ్చి ఆ డైలాగ్ గొప్పతనం ఏమిటో, అలాంటి డైలాగ్ లు వున్న తన గత సినిమాలు ఎన్నెన్ని ఎక్కడ ఎక్కడ ఎన్నిరోజులు ఆడాయో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక్క అక్షరం మార్పులేదు.

    "సార్ మీకు ఫోన్."

    చైతన్య ఆలోచన నుంచి తేరుకుని బయటకు వచ్చాడు.

    "ఏమిటి విషయం?" అడిగాడు.

    ఆ అమ్మాయి కంఠంలో టెన్షన్. "పాల్ జోసెఫ్ కనపడ్డాడు" అంది.

    చైతన్య చేయి రిసీవర్ మీద బిగుసుకుంది. "ఎక్కడ?" అన్నాడు ఆత్రంగా.

    "సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరే-"

    "లోపలే వున్నాడా?"

    "ఉన్నాడు."

    చైతన్య దర్శకుడిని అడిగాడు. "ఇంకా ఎంతసేపు వుంటుంది సీను?"

    "నేన్నిన్ను ప్రేమిస్తున్నాను- అన్న డైలాగ్ హీరో అంటే బావుంటుందో- హీరోయిన్ అంటే బావుంటుందో తెలియటం లేదు" అన్నాడు డైరెక్టర్.

    "రచయిత ఏం వ్రాశాడు?"

    "అదే తెలియటం లేదు."

    చైతన్య దర్శకుడి చేతిలో స్క్రిప్టు తీసుకుని చూశాడు. అందులో ఇలా వుంది.

    "హీ. తం: (అంటే హీరోయిన్ తండ్రి) నువ్వు మా ఇంటికి రావటం ఎంతో సంతోషంగా వుంది బాబూ! (ఫోటో దగ్గరికివెళ్ళి) విశాలాక్షీ! ఈ క్షణం నువ్వు బ్రతికి వుంటే ఎంత బావుండును. (కళ్ళనీళ్ళు తుడుచుకొనును) (క్లోజప్: పరంధామయ్య ఉలిక్కిపడి, తన భ్రమకి తనే పేలవంగా నవ్వుకుని) బ్రతికి వుండగా నీ తడి నేను తుడవలేకపోయాను. చచ్చి, నా కన్నీళ్ళు తుడుస్తావా విసాలాక్షీ (అంటూ తనని తనే తుడుచుకుని లోపలికి వెళ్లిపోయాడు. హీరో హీరోయిన్ లు మిగులుతారు.)

    హీ: నేన్నిన్ను ప్రేమిస్తున్నాను.

    చైతన్య దర్శకుడిని "ఏమిటి సమస్య?" అని అడిగాడు. దర్శకుడు స్క్రిప్టు వైపు చూస్తూ "రచయిత ఇక్కడ 'హీ' అని వ్రాశాడు. అది హీరోనో, హీరోయినో తెలియటంలేదు. ఎవరితో అనిపించను డైలాగు?" అన్నాడు.

    "రచయితకి కారు పంపలేకపోయారా?"

    "ఆ రచయిత ఇంకో సెట్టింగ్ కి వెళ్ళాడుట. మరో రచయితని పిలిపిస్తున్నాను."

    "ఈలోపు హీరోయిన్ తండ్రి క్లోజప్ తీయండి."

    "ఆయన పేలవంగా నవ్వటం ప్రాక్టీసు చేస్తున్నాడు."

    చైతన్య చిరాకు అణచుకుని "ఆయన అది ప్రాక్టీసు చేశాక 'క్లోజప్' తీసి 'ప్యాకెప్' చెప్పండి" అని బయటకొచ్చి కారెక్కాడు.

    అతడు సిటీ లైబ్రరీకి వచ్చేసరికి ఆరయింది. మొహానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని లోపలికి వెళ్ళాడు. తనది చాలా కష్టమైన పని అని అతడికి తెలుసు. చాలా సులభంగా గుర్తుపడతారు తనని.

    అతడు ఒక మూల నిలబడి చుట్టూ చూశాడు. అందరూ పుస్తక పఠనంలో నిమగ్నమై వున్నారు. అంతలో వెనుక నుంచి "చైతన్యగారూ!" అని వినబడింది. చప్పున వెనుదిరిగి చూశాడు. లైబ్రేరియన్ అతనివైపు ఎగ్జయిటింగ్ గా చూస్తూ వున్నాడు. తెలుగుతెర నెంబర్ వన్ హీరోని ఆ ప్రదేశంలో అలా చూడటంవల్ల వచ్చిన ఉద్వేగం అది.

    "జయశ్రీగారు మీకీ చీటీ యిమ్మన్నారు-"

    "జోసెఫ్ పాల్ వెళ్ళిపోతున్నాడు. అతడిని నేను ఫాలో అవటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అతను కార్లోగాని వెళితే ఫాలో అవటం సాధ్యం కాదు. మరోరోజు అతనొచ్చినప్పుడు మీకు ఫోను చేస్తాను" అని వుంది అందులో.

    చైతన్యని ఒక్కసారిగా నిరాశ ఆవరించింది. అవునుమరి, తనకి వున్నంత ఇంటరెస్ట్ ఈ కేసులో మరొకరికి ఎందుకుంటుంది? ఆ అమ్మాయి అంత క్యాజువల్ గా తీసుకోవటంలో తప్పులేదు.

    ఇప్పుడిక అక్కడ చేసేదేమీ లేదు. అతడు వెనుదిరుగుతూ వుండగా "ఆటోగ్రాఫు సార్!" అన్నాడు లైబ్రేరియన్. చైతన్య విసుగు అణచుకుంటూ సంతకం పెట్టాడు. మూడ్ ఎలావున్నా ఈ పనులు తప్పవు. కాస్త విసుగు చూపిస్తే దానికి చిలువలు పలువలు అల్లబడి పాకిపోతాయి.

    చైతన్య లైబ్రరీ మెట్లుదిగి వస్తున్నాడు. ఎత్తయిన భవంతి, చాలా విశాలమైన మెట్లు- దాదాపు పాతిక ముప్పై వుంటాయి.

    అతడు నాలుగో మెట్టు దిగుతూ వుండగా-

    క్రింద మెట్టు మీదనుంచి పైకి వస్తూ కనిపించింది ప్రనూష.

    అతను ఆగిపోయాడు.

    ఆమె అతడిని చూడలేదు.

    తల వంచుకుని అతడివైపే వస్తోంది.

    అతను ఆమె పక్కగా వెళ్ళాడు. ఆమె తల వంచుకునే ఇంకా వస్తోంది. అతడు ఆమె వెనుకకి చేరుకుని ఆమెతోపాటు సమాంతరంగా అడుగులు వేయసాగాడు.

    ఆమె లైబ్రరీలోకి వెళ్ళింది. అయితే లోపలికి వెళ్ళలేదు. ముందుగదిలో లైబ్రేరియన్ దగ్గర వున్న పుస్తకంలో సంతకం పెట్టి రెండు బుక్స్ తీసుకుని వెనక్కి నడిచింది. అతడు చప్పున స్థంభం చాటున దాక్కున్నాడు. ఆమె అతడిని గమనించకుండా మెట్లు దిగింది. అతడు చప్పున వెళ్ళి రిజిస్టర్ లో చూశాడు. 'కమల' అని వ్రాసి వుంది. అతను విస్మయంతో ఆ పేరువంక మళ్ళీ చూశాడు. ఈ అమ్మాయి అసలు పేరు కమలా? లేక అంతకు ముందు 'అక్షౌహిణి' అని మోసం చేసినట్టే ప్రనూష కూడా అసలు పేరు కాదా? అనుమానాలు పక్కన పెట్టి అతను వీధిలోకి వచ్చాడు.

    అప్పుడొచ్చింది అతడికి ఇబ్బంది.

    మొహాన్నైతే కర్చీఫ్ తో కప్పుకున్నాడు గానీ, నడకనీ, బాడీ స్టయిల్ ని ఎలా మార్చగలడు? అతన్ని ప్రజలు ఎన్నో సినిమాల్లో ఎంతో నిశితంగా గమనిస్తూ వుంటారు. అతని ప్రతీ కదలికా వాళ్ళు గుర్తుపట్టగలరు. వెనుక నుంచి చూసినా పోలిక అనుమానించగలిగేటంత ఫాన్స్ అతడికి వున్నారు.

    అతనిలోని నటుడికి అప్పుడే నిజమైన పని ఏర్పడింది. మొహాన్ని అలాగే రూమాలు చాటుచేసుకుని మొత్తం నడక విధానం మార్చి బాడీలో వంపుల్ని మరింత విభిన్నంగా చేసి నడవసాగాడు. అతడికి ఒకటి మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రనూష కోటీశ్వరురాలు అయివుండాలి. ఆమె తనని పిచ్చివాడిగా నిరూపించే కార్యక్రమంలోనే లక్షరూపాయలదాకా ఖర్చు పెట్టింది. మరి ఆ అమ్మాయి ఇంత సాదా దుస్తుల్లో వున్నదేమిటి?    

    అతడి అనుమానాన్ని బలపరుస్తూ ఆమె ఒక చిన్న ఆఫీసులో ప్రవేశించింది. అతడికి మరో ఆలోచన స్పురించింది. లక్ష్మిని తన భార్యగా నటించటానికి వాడుకున్నట్లే, ఈ కమల్ని కూడా ఎవరైనా నాటకానికి ఒప్పించారా?

    ఈ ఆలోచన అతడికి అంత ఆనందాన్ని యివ్వలేదు. తన ప్రత్యర్ధి ప్రనూష అయితే బావుండునని అతడు మనసులోనే కోరుకుంటున్నాడు. తలపడితే అంత అందమైన, తెలివితేటలున్న అమ్మాయితోనే తలపడాలి. అతడికి డాక్టర్ పాల్ మొదటినుంచీ నచ్చలేదు. ఆ డాక్టరేగాని ఈ రాకెట్ కి మూలకారకుడయి లక్ష్మినీ, కమలనీ వాడుకున్నట్టు ఋజువైతే, అతను తన చేతిలో బలమైన దెబ్బ తినబోతున్నాడు.

    అంతలో ఆమె బయటకు వచ్చింది. అతడింక ఈ ముసుగులో గుద్దులాట పెంచదల్చుకోలేదు. దగ్గరగా వెళ్ళి "హల్లో" అన్నాడు. హఠాత్తుగా వెనుకనుంచి పిలుపు వినపడేసరికి ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆమె మొహంలో ఒక్కసారిగా రకరకాల భావాలు కదలాడాయి. ఉద్విగ్నత నిండిన కంఠంతో "మీరు... మీరు చైతన్య కదూ" అంది.

    అతడు ఆమెవైపు కన్నార్పకుండా చూశాడు.

    "చాలా అద్భుతంగా నటిస్తున్నావు. సో... నీ అసలు పేరు కమల అన్నమాట."

    ఆమె అయోమయంగా "అసలు పేరేమిటి? నా పేరే కమల. మీరు చైతన్యే కదా- ఆ విషయం చెప్పండి ముందు" అంది.

    "నాతో అన్ని రోజులు హాస్పిటల్లో గడిపినా నీకా విషయం అనుమానంగా వుందా?"

    "హాస్పిటల్ ఏమిటి?"

    "ఇంకా నటించకు ప్రనూషా- ఉరఫ్ అక్షౌహిణి- ఉరఫ్ కమలా."

    ఆమె మొహం ఎర్రబడింది. "మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధంకావటం లేదు."

    "ఆ మాట నేననాలి. చెప్పు- ఇంత నాటకం ఎందుకాడావు! నన్ను ఎందుకు ఆస్పత్రిలో పెట్టారు? చెప్పు ప్రనూషా! నాకు లక్ష్మి అంతా చెప్పింది. ఈ గ్యాంగ్ కి నువ్వే లీడర్ వని కూడా నాకు తెలుసు. నాకు విషయమంతా చెప్తేసరి. లేకపోతే నిన్ను పోలీసులకి పట్టించవలసి వస్తుంది."

    "పోలీసులకా? ఎందుకు? నేనేం తప్పు చేశాను?"

    "నన్ను ఆస్పత్రిలో పిచ్చివాడిగా నిరూపించటానికి చేసే ప్రయత్నం."

    "చూడండి, మీరు ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నారో. నేను చిన్న ఏజెన్సీ బిజినెస్ చేసుకునేదాన్ని. మా అమ్మానాన్నలతో కలసి వుంటున్నాను. మిమ్మల్ని తెరమీద చూడటమే తప్ప ప్రత్యక్షంగా చూడటం ఇదే ప్రధమం. నేను మీతోపాటు ఆస్పత్రిలో వున్నానంటున్నారు. ఆ రోజుల్లో నేను మా తల్లిదండ్రులతో కలసి ఒరిస్సాలో వున్నాను. ఇవన్నీ మీకు చెప్పవలసిన అవసరంలేదు. కానీ మీరు చైతన్య అన్న గౌరవంతో, మీరేదో అపోహలో వున్నారు కాబట్టి అంతా చెపుతున్నాను. మీకేమైనా అనుమానాలుంటే ఏ సాక్ష్యాలు కావాలంటే అవి పరిశీలించుకోవచ్చు. ఇక మీరు నన్ను వదిలిపెట్టకపోతే నేనే పోలీసుల్ని పిలవవలసి వుంటుంది" అంది కోపంగా.

 Previous Page Next Page