Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 15


    "లేదు. చెప్పు."

    "అబ్సెషన్ అన్న పదానికి సరిఅయిన అర్ధం నాకు తెలీదు కానీ, నా తండ్రి అంటే నాకెంత అభిమానమో, అబ్సెషనో చెప్పటానికి పై ఉపోద్ఘాతం అంతా" అంది. ప్రనూష తరువాత కొనసాగించింది.

    "శ్రీనగర్ వరకూ కాశ్మీర్ లోయ అందాలు చూసిన నేను, శ్రీనగర్ దాటగానే మరో వాతావరణాన్ని చూశాను. అక్కడ పచ్చదనం రక్తవర్ణంతో పోటీపడింది. ప్రకృతిమీద మానవ నిర్మితమైన కందకాలు, యుద్ధం మనిషి ఆనందాన్ని, భగవంతుడి సృష్టిని గూడా కలుషితం చేయగలదన్న నిజాన్ని నిరూపిస్తున్నట్టుంది కాశ్మీర్. ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం మాట. అప్పటికే పాకిస్తాను- భారతదేశంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ప్రచ్చన్నయుద్ధం ముమ్మరంగా సాగుతోంది. మా క్యాంపు, శ్రీనగర్ దాటాక వంద కిలోమీటర్ల అవతల, సరిహద్దు ప్రక్కగా వుంది.

    ఆర్మీ క్యాంప్ లోకి ప్రవేశించాం. అమ్మా తమ్ముడూ అక్కడే వున్నారు. తమ్ముడు డెహ్రాడూన్ లో చదువుకుంటూ, వేసవి శెలవులకి అక్కడికొచ్చాడు. దాదాపు ఆర్నెల్ల తరువాత మేమందరం కలుసుకున్నాం. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి.

    మరుసటిరోజు శ్రీనగర్ వెళదామనుకున్నారు నాన్నగారు. అంటే మేమున్న క్యాంప్ కి వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. 'శ్రీనగర్ వద్దు- ఆర్మీ క్యాంపులో విశేషాలు చూడటానికి వెళదాం' అన్నాను. ఆయన నా వైపు విచిత్రంగా చూశారు. "అవును నాన్న గారూ, శ్రీనగర్ నే నెప్పుడయినా ఎక్స్ కర్షన్ కి రావచ్చు. నాకు ఆర్మీ విషయాలు తెలుసుకోవాలని వుంది" అన్నాను.

    "నువ్వు మళ్ళీ వచ్చేసరికి శ్రీనగర్ మన దేశంలో కలిసి వుండకపోవచ్చు" అన్నారు.

    "అదేమిటి?" అన్నాను ఆశ్చర్యంగా.

    "అది స్వతంత్ర రాజ్యం అవ్వాలని చాలామంది అక్కడి వారి కోరిక."

    "ఎవరి కోరిక? కాశ్మీర్ పండిట్స్ దా? పాకిస్తానీ ముస్లిమ్ లదా?" కోపంగా అడిగాను.

    ఆయన నవ్వి, "నువ్వికా చిన్నపిల్లవిలే. నీకు తెలియదు" అని సమాధానం దాటేశారు. కానీ నా కోరిక తీర్చటం కోసం ఆయన నన్ను క్యాంప్ లోపలికి తీసుకువెళ్ళారు. చాలామంది ఆఫీసర్లు, దేశంకోసం ఏదో చెయ్యాలన్న దీక్ష, తహతహ వున్న సైనికాధికార్లు... నాన్నంటే వారందరికీ ఎంతో గౌరవం. అది వారి కళ్ళలో నాకు కనపడింది. నేను నా దేశం అంటే ఎంతో గర్వపడతాను అన్న భావానికి అసలైన అర్ధం తెలిసింది. నేనడిగిన యుద్ధ సంబంధమైన ప్రశ్నలన్నీటికీ ఓర్పుగా సమాధానం చెప్పారు.

    దూరంగా వున్న చెక్క కట్టడాలను చూపించి అదేమిటని అడిగాను. సమాధానం చెప్పటానికి నాన్న అంత ఉత్సాహం చూపించలేదు. పక్కనున్న మరొక ఆఫీసర్ చెప్పాడు- అది ప్రిజ్ నర్స్ సెల్ అని. దొరికిన శత్రు సైనికుల్ని అక్కడ బంధించి, ఇంటరాగేట్ చేస్తారని తెలిసింది. శత్రువులకి దొరికిపోతే నిజంగా ఆ జీవితం దుర్భరం .సైనిక రహస్యాలు చెప్పేవరకూ ప్రాణాలు తోడేస్తారని ఎక్కడో చదివాను. ఆ విషయమే నాన్న గారిని అడిగాను.

    "ప్రనూషా! అవసరమైనంతవరకూ తెలుసుకో చాలు. అనవసరమైన విషయాల జోలికి పోకు" అన్నారాయన గంభీరంగా. అంతలో ఆ జైలు కట్టడాల్లోంచి ఒక మిలటరీ జీపు బయట కొచ్చింది. ఆ జీపుముందు రెండు మోటార్ సైకిళ్ళు వెనుక సైనికులు.... ఆ దృశ్యం చూస్తూంటేనే నా కెందుకో జీపులో వ్యక్తి ఎవరో అసాధారణమైన మనిషిగా అనిపించాడు. నాన్నగారి పక్కనున్న ఆఫీసర్లందరూ అప్రయత్నంగా టెన్షన్ తో క్షణకాలంపాటు వున్నట్టు అనిపించింది.

     "ఎవరు నాన్నా అతను?" వస్తున్న జీపుని చూసి అడిగాను. నాన్న మాట్లాడలేదు. కనీసం నావైపు చూడలేదు. జీపు మా దగ్గిరకు రాగానే నాన్నని చూసి డ్రైవర్ వాహనాన్ని 'స్లో' చేశాడు. నాన్న వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. జీపు వెనుక సీట్లో- నలుగురు ధృడమైన సైనికాధికారుల మధ్య కూర్చుని వున్నాడు అతడు. బోనులో సింహంలా వున్నాడు. మూర్తీభవించిన కౄరత్వంలా వున్నాడు.

    చైతన్యబాబూ! ఒక్క చూపులో మనుషుల్ని అర్ధం చేసుకోవటం కష్టం అంటారు. 'సోత్కర్ష' అనుకోకపోతే, నా తెలివి తేటలమీద, అర్ధం చేసుకునే శక్తిమీద నాకు చాలా నమ్మకం వుంది. జీపు 'స్లో' అయినప్పుడు అతడు మా వైపు చూసిన చూపు.. నాకెందుకో లిప్తకాలంపాటు వెన్నులో చలి పుట్టింది. భయంతో వెన్ను జలదరించింది. అది భయం కాదు. ఏ సైన్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ కమ్యూనికేషన్! ఏదో జరగబోతూంది అన్న సూచన. చిన్న అవహేళన. జీపు వెళ్ళిపోయింది.

    నాన్న కొంచెం సీరియస్ గా వుండటం గమనించాను. తరువాత పక్క ఆఫీసర్ ని అడిగాను- అతనెవరని.

    "అజ్మరాలీ"

    అ..జ్మ....రా...లీ

    పేరు విచిత్రంగా, భయానకంగా ధ్వనించింది.

    "ఎవరతను?"

    "పాకిస్తాన్ - ఈస్ట్ వింగ్-కమాండర్- ఇన్-చీఫ్."

    కమాండర్- ఇన్-చీఫ్... భారత సైన్యపు ఆధీనంలో...

    నాకు నమ్మశక్యం కాలేదు.

    నా అనుమానం అతడు గ్రహించినట్టున్నాడు. గర్వంగా చెప్పాడు. "అన్ని వైపుల్నుంచి చుట్టుముట్టాం మేడమ్? దొరికిపోయాడు."

    నాకు నమ్మకం కుదర్లేదు....

    ఏదో అనుమానం....

    ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. మళ్ళీ ఒకసారి... ఇంకొక్కసారి అతడిని చూడాలనిపించింది.

    అజ్మరాలీ...

    అతడిని కలుసుకోవాలి. ఎందుకో తెలీదు... దాన్ని సిక్త్స్ సెన్స్ అంటారేమో.

    అక్కడి సైనికాధికారుల కన్నా నేను తెలివైనదాన్ని కాదు. యుద్ధం గురించిగానీ, మనస్తత్వశాస్త్రం గురించిగానీ నాకేమీ తెలీదు. కానీ నా మనసెందుకో ప్రమాదాన్ని శంకించసాగింది.

    అర్ధరాత్రి దాటింది. బయటకొచ్చాను.

    హిమాలయాల మీదనుంచి వచ్చే చల్లటిగాలి శరీరాన్ని వణికిస్తూంది. వెన్నెల్లో మంచుపర్వతాలు తెల్లగా కనబడుతున్నాయి.

    నెమ్మదిగా అడుగులు వేయసాగాను.

    నా జీవితాన్ని మలుపుతిప్పే సంఘటనవైపు అడుగులు వేస్తున్నానని నాకు ఆ క్షణం తెలీదు. మరో వంద గజాలు నడిచి వుంటాను. "కౌన్ హై" చిన్నకేక వినిపించింది. ఆగాను. ఒక సైనికాధికారి నా దగ్గరకు టార్చిలైట్ తో వచ్చాడు. 'అజ్మరాలీ' అన్న పేరు నాకు చెప్పిన ఆఫీసరే. నన్ను గుర్తించి సెల్యూట్ చేశాడు. "ఇంత రాత్రిపూట ఇలా బయట తిరగటం అపాయకరం మేడమ్" అన్నాడు.

    నేను విషయం దాచదల్చుకోలేదు. "నాకు అజ్మరాలీని చూడాలని వుంది" అన్నాను. బహుశా నాకు మతిభ్రమించి వుంటుందని అనుకుని వుంటాడు. అయినా నాన్నగారి మీద వున్న గౌరవంతో నమ్రతగా మాట్లాడాడు.

    "ఇది సైనిక శిబిరం మేడమ్! (మీ వంటిల్లు కాదు- అన్నట్టు నాకు ధ్వనించింది) అజ్మరాలీ మామూలు ఖైదీ కాదు, ఈస్ట్ వింగ్ కమాండర్ ఇన్-చీఫ్. అతడిని రేప్రొద్దున్నే సరిహద్దునుంచి దూరంగా తీసుకువెళుతున్నాం. దాదాపు పదిమంది ఆఫీసర్లు, వందమంది సైనికులు అతడికి కాపలా వుంటారు. అనుమతి లేనిదే మా సైనికాధికారులకి కూడా అతడితో మాట్లాడే అధికారం లేదు. (నీ వెంత?)"

    "కానీ...."

    "వద్దు మేడమ్. మీరిక్కడ ఎక్కువసేపు వుండి మాట్లాడటం కూడా మంచిదికాదు. గూఢచారి శాఖకి అనుమానం వస్తే ప్రమాదం." ఇక ఎంత వాదించినా లాభంవుండదని నేను నిరాశతో వెనుదిరిగాను. తిరిగి మా బంగ్లాకి వచ్చేటప్పటికి అయిదు నిమిషాలు పట్టి వుంటుంది. అప్పుడు వినిపించింది చిన్న మూలుగు.

    చీకట్లోంచి, దూరంనుంచి-

    దట్టంగా నిశ్శబ్దం వ్యాపించి వుండబట్టి వినిపించింది అది.

    ఒక్కక్షణం తటపటాయించాను. ఆ సందిగ్ధంలో లోపలికి వెళ్ళి నాన్నగార్ని హెచ్చరించాలన్న ఆలోచన రాలేదు. అనుమాన నివృత్తికోసం ఆ శబ్దం వినిపించిన వైపు వెళ్ళాను.

    పొదలచాటున పడివున్నాడు- నాతో మాట్లాడిన ఆఫీసర్! వియత్నాం గెరిల్లా యుద్ధ పద్ధతిలో అతడి మెడ కత్తిరించబడి వుంది. క్షణాల క్రితం నాతో మాట్లాడిన మనిషి- అంతలోనే అంత దారుణంగా నిర్జీవుడై పోవటంతో నేను షాక్ తిన్నాను. కనీసం వెనక్కివెళ్ళి మా గార్డులని హెచ్చరించాలని కూడా తోచలేదు.

    దూరంనుంచి బ్యాటరీ లైటు వెలుగుతూ ఆరుతూ కనిపించింది. ఎవరో కోడ్ లో సందేశం పంపుతున్నారు. అప్రయత్నంగా అటు నడిచాను. గార్డులందరూ నిద్రలో వున్నట్టు పడివున్నారు. అక్కడి వాతావరణంలో అదో రకమైన వాసన మిళితమై వుండటం గమనించాను. చాలా కొద్దిసేపు క్రితమే ఒక విషవాయువు ప్రయోగింపబడి వుండాలి.

    నలుగురు విదేశీ సైనికులు సెల్ వైపు వెళుతున్నారు. వారి మొహాలకి గ్యాస్ మాస్కులున్నాయి. ఎంత ప్లాన్డ్ గా జరిగినట్టుంది ఈ వ్యవహారం. అజ్మరాలీ క్షణాల్లో బంధవిముక్తుడయ్యాడు. అయిదుగురూ కలిసి ఇనుప తీగెలవైపు వెళుతున్నారు. అకస్మాత్తుగా నన్నెవరో మేల్కొలిపినట్టు అయింది. స్పృహలోకి వచ్చినట్టు కదిలాను. ఇనుప తీగెల కంచె అవతల జీపు సిద్ధంగా వుంది. స్పృహతప్పి పడివున్న సైనికుడి పక్కనే మెషిన్ గన్ వుంది. నాకు రైఫిల్ షూటింగ్ తెలుసు కానీ మెషీన్ గన్ ఎలా ఉపయోగించాలో తెలీదు అయినా ప్రయత్నించదల్చుకున్నాను. ఎక్కువ టైమ్ కూడా లేదు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కొద్ది సెకన్లే వుంది. జీప్ డ్రైవర్ తో కలిపి మొత్తం ఆరుగురున్నారు. అజ్మరాలీ తప్ప మిగతా అందరి దగ్గర ఆయుధాలున్నాయి. ఆయుధాన్ని ఉపయోగించటంలో ఏమాత్రం తప్పు జరిగినా, లేదా ఆయుధం పేలకపోయినా నా జీవితం అంతటితో సరి అని తెలుసు.

    అప్పటికి గాలిలో విషవాయువు ప్రభావం తగ్గినట్టుంది. స్వచ్చంగా వీస్తోంది. అజ్మరాలీ జీపు ఎక్కబోతున్నాడు. గురిచూసి పేల్చాను. వరుసగా పది రౌండ్లు....

    అక్కడి ప్రశాంతత ఒక్కసారిగా భగ్నమైంది. నిశ్శబ్దపు మంచుకొండల్లో మిషన్ గన్ శబ్దం మార్మోగింది. అక్కడి భూమి కంపించినట్టయింది. జీపు అంటుకుని మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఆకస్మిక పరిణామానికి అజ్మరాలీ నిశ్చేష్టుడైనట్లు కనిపించాడు. అతడి అనుచరులందరూ రక్తపు మడుగులో పడి వున్నారు. నేను చీకట్లోంచి వెలుగులోకి వచ్చాను.

    అతడు నన్ను ఆ సమయంలో ఊహించలేదు. ఎవరో సైనికుడు అనుకున్నట్టున్నాడు. ఒక స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అంతలోనే వంగి అనుచరుడి పక్కనే పడివున్న రైఫిల్ అందుకోబోయాడు. అంత సరీగ్గా గురి చూడగలనని నాకు తెలీదు. అతడి చేతిపక్కనుంచి దూసుకువెళ్ళిన గుండు రైఫిల్ ని దూరంగా తోసింది. అంత దారుణమైన పరిస్థితిలో కూడా అతడు విభ్రాంతుడై చూశాడు.

    రైఫిల్ షూటింగ్ కన్నా మిషన్ గన్ సులువని అర్ధమైంది. నామీద నాకు నమ్మకం పెరిగింది.

    అంతలో దూరంగా కలకలం వినిపించసాగింది. మత్తులో వున్న సైనికులు క్రమక్రమంగా లేవసాగారు. బూట్ల చప్పుడు వినిపించింది. నాన్న హడావుడిగా వచ్చాడు. ఆయనింకా షాక్ నుంచి తేరుకోలేదనిపించింది. అందులో చిత్రమేమీ లేదు. ఒక సైనిక శిబిరం నుంచి శత్రువు అంత సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని ఎవరూ కలలో కూడా వూహించి వుండరు. నాన్న నన్నూ, నా చేతిలో మిషన్ గన్ నీ చూస్తూ వుండిపోయారు. ఈలోగా ఆఫీసర్లు అజ్మరాలీని చుట్టుముట్టి బందీని చేశారు. కొందరేమో, మరణించిన శత్రుసైనికుల శరీరాల్ని ఒకచోటకి చేరుస్తున్నారు. స్వేచ్చగా తప్పించుకోబోయే ఆఖరి క్షణంలో అంతా తారుమారయ్యేసరికి కలిగే కోపం, ఆవేశం అజ్మరాలీ మొహంలో కనపడ్డాయి. అతడి కళ్ళకేగానీ శక్తి నన్నాక్షణమే దహించివేసేవి. ఎంతో జాగ్రత్తగా వేసిన ప్లాను, రక్షణశాఖతో ఏ మాత్రం సంబంధంలేని ఒక సాధారణ అమ్మాయివల్ల అలా పాడయినందుకు అతను ఉడికిపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తూంది. 

 Previous Page Next Page