Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 13

                                       రెండు
   
    బంజారా హిల్స్ లో చాలా అద్భుతమైన బంగళా అది.
   
    రాత్రి పదకొండయింది. నీలిరంగు కాంటెస్సా కారు గేటు దగ్గరకు రాగానే గూర్ఖా సెల్యూట్ చేసి గేటు తెరిచాడు.
   
    ఇంటి ముఖద్వారం దగ్గర నౌఖరు సింహాచలం సిద్దంగా నిలబడ్డాడు. వినయచంద్ర కారు పోర్టికోలో ఆపి దిగి మేలల్గా లోపలకు నడిచాడు. అతడిలో గొప్పతనం అదే. ఎంత తాగినా మనిషి తూలడు, మాట్లాడడు. అతఃడు వచ్చి సోఫాలో కూర్చోగానే సింహాచలం బూట్లు, సాక్సు విప్పాడు. నిర్మల గదిలోంచి బైటకు వచ్చింది. సింహాచలం అక్కడ్నుంచి లోపలకు వెళ్ళిపోయాడు. అక్కడ నిశ్శబ్దం భయపెడుతూంది. భయపెట్టే ఆ నిశ్శబ్దంలోంచి ఆమె కంఠం నెమ్మదిగా వినిపించింది.
   
    "మీరు పెళ్ళెందుకు చేసుకున్నారు?"
   
    ఊహించని ఈ ప్రశ్నకి తలెత్తి అయోమయంగా చూశాడు. పదిహేను రోజుల తరువాత పదివేల మైళ్ళ దూరంనుంచి వస్తే ఆమె అడిగిన మొదటి ప్రశ్న అది. ఆమె చాలా చెడ్డ మూడ్ లో వున్నట్లు గ్రహించాడు. వెంటనే సమాధానం చెప్పలేదు.
   
    "మిమ్మల్నే! పెళ్ళెందుకు చేసుకున్నారు? పిల్లల్నెందుకు కన్నారు?" రెట్టించింది పెద్ద గొంతుతో.
   
    అప్పటికి అతడు సర్దుకున్నాడు. అఫెన్సుని డిఫెన్సుతో సర్దుకోవటం అతనికి అలవాటు లేదు. వ్యాపారవేత్త అతను. వాదన సమకూర్చుకోగలడు. "నువ్వు నన్నెందుకు చేసుకున్నావు?" అతడు కూడా అంతే తాపీగా అడిగాడు. నిర్మల ఖంగుతింది.
   
    అతడు సోఫాలోంచి లేచి "నా డబ్బు చూసేగా? అందమైన బంగ్లా, విలువయిన నగలు, చీరలు.....అవి వేసుకుని గొప్పగా తిరగడానికి! ఇవేగా నువ్వు కావాలనుకున్నది. అన్నీ అమర్చాను. ఇంకేం కావాలి నీకు? పెళ్ళో పెళ్ళో అని అయ్యేవరకూ ఏడుస్తారు. ఎందుకు చేసుకున్నామా అని ఆ తరువాత ఏడుస్తారు. మీ ఆడవాళ్ళకి ఏడవటం తప్ప ఇంకేమీ చేతకాదు" అన్నాడు.
   
    అతన్నుంచి యిలాంటి సమాధానం ఆశించని నిర్మల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అయినా తమాయించుకుంది. "నేనేం అడుక్కుతినే కుటుంబంలోంచి రాలేదు. మా నాన్న ధనవంతుడే. నేనూ చిన్నప్పటినుంచి కార్లలో తిరిగినదాన్నే" అంది ఉక్రోషంగా.
   
    "మరయితే నన్ను కాకుండా ఇరవై నాలుగ్గంటలూ నీ కాళ్ళ దగ్గర పడుండే వెధవని కొనుక్కోకపోయావా?"
   
    "మీరు కూడా ఇరవై నాలుగ్గంటలూ మీతో కలిసి క్లబ్బుల్లో తిరిగి, డాన్సులు చేసి, పేకాటలాడే ఆ వయ్యార్నే చేసుకోలేకపోయారా?"
   
    "షటప్! ఆ పెళ్ళికి అడ్డుపడింది నువ్వు."
   
    "నేను కాదు....మీ పిరికితనం! ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి తీరా పెళ్ళి ప్రసక్తి వచ్చేసరికి తండ్రిని వొప్పించలేక నన్ను బ్రతిమాలారు. మీతో పెళ్ళి ఇష్టంలేదని చెప్పాల్సిన అవసరం నాకేమిటి? నేనెందుకు చెడ్డదాన్నవ్వాలి? పైగా మామయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. తండ్రిని వొప్పించలేకపోతే అప్పుడే ఆస్థి వదులుకొని వెళ్ళి దాన్నే చేసుకోవలసింది."
   
    "అవును ఇలాంటి వంకే చెప్పి పెళ్ళికి ఒప్పుకున్నావు. నేను మరొకరిని ప్రేమిస్తున్నా అది నీకు అభ్యంతరం కలిగించలేకపోయింది. ఏ రకంగానైనా ఆస్థి మీ చేతులు దాటిపోకూడదు. అంతేగా! పైగా అందమైన దాన్నని నీకు గర్వం నిన్ను కాదని ఆ తాయారులో ఏం చూశానా అని నీ అహం దెబ్బతిన్నది. అందుకని చేసుకున్నావ్."
   
    నిర్మల కష్టంమీద ఆవేశం తగ్గించుకుని "నేను మిమ్మల్ని రోజంతా నాతో వుండమని చెప్పడం లేదు. సినిమాలకు, షికార్లకు తిప్పమనడం లేదు. కానీ ఓ పసిదానికి తండ్రిగా మీ బాధ్యత గుర్తించమంటున్నాను" అంది.
   
    "కావలసినదంతా చూసుకోవడానికి నువ్వు ఖాళీగానే వున్నావుగా నేను చేసేదేముంది?"
   
    "నేను చేస్తే చాలా? మీరు పదిహేను రోజులపాటు విదేశాలకు వెళ్ళారు. తిరిగి వచ్చి రెండు రోజులయింది. అయినా బాంబేలోనే వుండిపోయారు. ఈ వూరు పొద్దుటనగా వచ్చారు. ఇల్లు చేరేసరికి రాత్రి పదకొండు. నిన్న సాహితి పుట్టినరోజు. ఆ విషయంకూడా మీకు గుర్తులేదు. డబ్బు.... డబ్బు.... డబ్బు.....అంతే! సంపాదించటం కోసం కష్టపడటం.... ఆ కష్టాన్ని మర్చిపోవటం కోసం తాగటం. డాడీ రాలేదేం అన్న దాని ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం కలిగించారు. ఆ చిన్న మనసుని పుట్టినరోజునాడైనా సంతోషపెట్టాల్సిన అవసరం మీకు లేదా?"
   
    "పదిహేను రోజులపాటు లేకుండా ఇంటికి రాగానే ఎలాంటి స్వాగతం లభిస్తుందో చూశాను. డైలాగులు చాలిక, నాకు నిద్ర వస్తోంది" లేచి బెడ్ రూంలోకి విసురుగా వెళ్ళిపోయాడు వినయచంద్ర.
   
    సాహితికి నిద్రపట్టడం లేదు. నిర్మల హాల్లోనుంచి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం గమనించాక వచ్చి పక్కమీద వాలింది.
   
    అమ్మా, నాన్నా ఎందుకు అట్లా పోట్లాడుకుంటారు? డాడీ ఎప్పుడూ ఎందుకు మమ్మీని ఏడిపిస్తుంటాడు? అనుకుంది ఆ అమ్మాయి తల్లి ఎక్కడకూ వెళ్ళదు. తన స్కూలుకి కూడా రాదు. పూజ చేసుకుంటూనో, పుస్తకాలు చదువుకుంటూనో కూర్చుంటుంది. డాడీ ఎప్పుడూ ఇంట్లో వుండడు. పక్కింట్లో పిల్లలు అమ్మా, నాన్నలతో లాన్ లో ఆడుకుంటారు. షికార్లకు వెళతారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. తన మమ్మీ, డాడీ కూడా అలాగే వుంటే ఎంత బావుంటుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.
   
    నిద్రలో ఎవరిదో చల్లటి చెయ్యి తలమీద పడటంతో సాహితి నెమ్మదిగా కళ్ళు తెరిచి "మమ్మీ" అని పిలవబోయి ఆగిపోయింది. వచ్చింది మమ్మీ కాదు, డాడీ.
   
    "డాడీ" మెల్లిగా అంది.
   
    "సారీ బేబీ! బర్త్ డే కి రాలేదని ఏడ్చేవా, కుదరలేదమ్మా" అన్నాడు. అతని కంఠంలో సిన్సియారిటీ వుంది.
   
    "లేదు డాడీ! ఏడుపొచ్చిందిగానీ అందరూ చూస్తే బాగోదని ఆపుకున్నాను" అంది.
   
    బెడ్ లాంప్ వెలుతురులో అతడి కళ్ళల్లో సన్నటి తడి మెరిసింది. తనెందుకు రాలేకపోయాడో, బొంబాయిలో ఎంత ముఖ్యమైన మీటింగుకి హాజరు కావాల్సి వచ్చిందో చెప్దామనుకున్నట్టు తటపటాయించాడు. మళ్ళీ ఆ ఉద్దేశ్యం మానుకుని "గుడ్ గర్ల్! పడుకో చాలా రాత్రయింది" అని నుదుటిమీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు.
   
    "డాడీ కూడా మంచివాడే. ఆయన ఇంటికి రాగానే మమ్మీ అలా అరవకుండా వుండాల్సింది" అనుకుంది సాహితి. ఏది మంచో, ఏది చెడో - ఎవరు కరెక్టో తెలియని సందిగ్దావస్థ ఆమె వయసు కాదు కారణం. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికీ....ఏ రెండు పార్టీలకీ ఏ రెండు దేశాలకీ ఎందుకు గొడవలొస్తాయో ఎవరూ చెప్పలేరు. ఎవరి వాదన వారిది.
   
    ఉదయం లేవగానే పక్కలో పెద్ద ప్యాకెట్ కనిపించింది.
   
    "ఎక్కడిది? రాత్రి లేదే" అనుకుంటూ సాహితి పై కవరు విప్పింది. లోపల పెట్టెలో అడుగున్నర ఎత్తు అందాల బొమ్మవుంది. బంగారు రంగు జుట్టు, పింక్ ఫ్రాక్.... వెనక్కి తిప్పిచూస్తుంటే బటన్ కనిపించింది. దాన్ని నొక్కగానే చిన్నగా నవ్వు వినిపించింది.
   
    "హలో..... అయామ్ పమేలా డూ యూ లైక్ మీ? ఐ లవ్ యూ .... అయామ్ యువర్ ఫ్రెండ్."
   
    సాహితి సంభ్రమంతో సన్నగా అరిచింది.
   
    ఆ పాప మొహం సంతోషంతో వెలిగిపోతుంది. ఆ టాకింగ్ డాల్ ను గుండెలకు హత్తుకుంది. "డాడీ.... మంచి డాడీ..... నేనంటే ఎంత యిష్టం" అనుకుంది. తను మరణించాక, తన కూతురి జీవితాంతం వెంటవుండి ఏకైక నెచ్చలి అదే అవుతుందని 40 డాలర్లు పెట్టి ఆ బొమ్మని కొంటున్నప్పుడు ఆ తండ్రి వూహించి వుండడు.
   
                               *    *    *
   
    "కారు పంపించమంటే పంపలేదే?" వినయచంద్ర కోపంగా అడిగాడు. అతనెప్పుడు వచ్చిందీ కూడా ఇద్దరూ గమనించలేదు.
   
    "గుడికెళ్ళాను - ఆలస్యమైంది. రాగానే పంపించాను" అంది నిర్మల. అతని కారు రిపేర్లో వుంది.
   
    "గదినిండా అందరి దేవతలనూ బంగారు విగ్రహాలతో ప్రతిష్టించావు. పొద్దుట నాలుగు గంటలకే పూజ చేస్తావు. అంత కొంపలంటుకుపోతున్నట్టు ఇంకే గుడికి వెళ్ళాలి? నాకవసరమని తెలిసి కూడా నువ్వు కారు పంపక పోవటంలో నీ ఉద్దేశ్యం?" తీవ్రంగా అడిగాడు.
   
    వెనుక వినయచంద్ర స్నేహితుడు రాజేష్, అతని భార్య కొడుకూ నిలబడి వున్నారు. ఆమె కర్ధమయింది. కారు కావలసింది వాళ్ళకోసం జరిగిన పొరపాటుకి శిక్షగా వాళ్ళముందు తనను అవమానించాలని వినయచంద్ర ఉద్దేశ్యం.

 Previous Page Next Page