Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 14

   

    ఇద్దరి చేతిలో పరదాలా దుప్పటి అలాగే వుంది.
   
    అతను మళ్ళీ మళ్ళీ బ్రతిమాలాడాడు.
   
    "మరీ...శోభనంనాడు కూడా తెరకట్టుకుని కనీవినీ ఎరుగని సాంప్రదాయాలు మొదలుపెట్టాం" ప్రభావతి ఎలాగో చెప్పేసింది.
   
    ఇద్దరి చేతుల్లోంచి దుప్పటి ఠపీమని జారిపోయింది.
   
    అతని భారతీయ ఆదర్శాలు జంటగా మంచంమీద నిద్రపోయాయి.
   
    కొత్త పెళ్ళికూతురు మైకంలాంటిది. ఆ మైకంలో ఒళ్ళూ పైనా తెలియహ్డు. రాత్రికీ పగలుకూ తేడా తెలియదు. ఎవరేమనుకుంటున్నారోనని ఆలోచించబుద్దికాదు. తమని చూచి నలుగురూ నవ్వుకుంటున్నా లెక్కచేయరు. అసలా విషయం గుర్తుండదు.
   
    ప్రతిభార్యా తన మొగుడ్ని చూసి కధానాయకుడనుకుంటుంది. ఆమెకతన్లో ఇతరుల్లో లేని గొప్ప లక్షణాలూ, కథానాయకుడి కళలూ కనిపిస్తాయి.
   
    కొత్త పెళ్ళాన్ని చూసి, భర్త ఇదివరలో తన ప్రేమకందకుండా పోయిన ఆడవాళ్ళెవరయినా వుంటే వాళ్ళను తృణీకారంగా తనూ చూసేసమయం వచ్చిందని విర్రవీగుతాడు. వాళ్ళమీద కసి తీర్చుకుంటున్నట్లుగా ఫీలవుతాడు.
   
    కుమార్ ఏ ఊరికి వెళ్ళినా, తక్షణం తండ్రికి ఉత్తరం రాయాలి కులాసాగా చేరానని లేకపోతే ఆయన కంగారుపడతారు. చిన్నప్పటినుంచీ అది ఆ ఇంట్లో వచ్చిన అలవాటు.
   
    అతను అత్తగారింటికి వచ్చి వారంరోజులు గడిచిపోయినా, పండగయాక తెరిసిన కాలేజీ గుర్తురాలేదు. తండ్రికి ఉత్తరం రాయాలన్న సంగతీ గుర్తురాలేదు.
   
    మధ్యలో తండ్రి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది-కులాసాగా వున్నదీ, లేనిదీ తెలియజేస్తూ వెంటనే రాయమని.
   
    ఆ సమయంలో అతనికి తండ్రి తండ్రిలా కనిపించలేదు. ఎవర్నిగురించీ ఆలోచించి, లెక్కచేసే స్థితిలో లేడు.
   
    "మామగారికి జవాబు రాయండీ, రాయకపోతే వాళ్ళు మనగురించి చెడుగా అనుకుంటారు" అని ప్రభావతి బ్రతిమిలాడింది.
   
    "రాద్దాం, రాద్దాంలే!" అని కుమార్ మరో రెండురోజులు గడిపేశాడు.
   
    మూడో రోజుకల్లా తండ్రి దగ్గర్నుంచి వియ్యంకుడికి టెలిగ్రాం వచ్చింది తన కొడుకు యోగక్షేమాలని వైర్ ద్వారా తెలియజెయ్యమని.
   
    పాపం ఆయన సిగ్గుతో కుచించుకుపోయి, వెంటనే వైర్ ఇచ్చేసి ఈ అపరాధమంతా కూతురిది అయినట్లుగా ఆమెను గట్టిగా మందలించాడు.
   
    ఆ తర్వాత రెండు రోజులకు ప్రభావతిని తీసుకుని అతను ఊరికి ప్రయాణమయ్యాడు. తల్లి, కోడల్ని కూడా తనతో తీసుకురమ్మని రాసింది.
   
    అత్తారింట్లో ఏం జరిగిందో వీళ్ళకు తెలియదు. అందుకని శారదమ్మగారు కోడల్ని తన దగ్గర పడుకోబెట్టుకుంది.
   
    అతనికి ప్రభావతితో మాట్లాడటానికి వీలుకుదరటంలేదు. మాట్లాడితే పెద్దవాళ్ళేమనుకుంటారోనని భయం, మొహమాటం. ఆడది తల్లిదండ్రుల దగ్గర పెనిమిటితో సిగ్గును పారద్రోలుకుని ప్రవర్తించి, అత్తారింట్లో దూరంగా జరుగుతుంది. మొగవాడు అత్తవారింట్లో స్వేచ్చగా ప్రవర్తించి తల్లిదండ్రుల దగ్గర ముడుచుకుపోతాడు.
   
    తామిద్దరూ ఒకటయిపోయారన్న విషయం తల్లికి చెప్పటం ఎలాగో తెలియక అతను తారట్లాడసాగాడు. అవతల కాలేజీలు తెరిచారు. అక్కడికి వెళ్ళాలి.
   
    ఒకసారి ప్రభావతి ఒంటరిగా దొరికింది. అటూఇటూ చూసి ఎవరూ లేరని నిర్దారణ చేసుకుని ఆమెను దగ్గరకు లాక్కుని పెదవులమీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
   
    గది ఊడుద్దామని గుమ్మంలోకి వచ్చిన పనిమనిషి రాజమ్మ ఈ దృశ్యం చూసి ఆగిపోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అమ్మగారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చేరేసింది.
   
    శారదమ్మగారికి మిగతా విషయంకూడా ఎందుకో అనుమానంవచ్చింది.
   
    కొడుకును ప్రక్కకు పిలిచి అడిగింది.
   
    కుమార్ కి చాలా చిరాకనిపించింది. ఇందులో చర్చిండడానికేముంది? మౌనంగా అంగీకరించటంలో వున్న అందం బయటపెట్టుకుంటే లేదుకధా? అయినా ప్రమేయం వచ్చింది కాబట్టి విధిలేక 'అవును అనుకోకుండా జరిగిపోయింది' అన్నాడు.
   
    శారదమ్మగారి ముఖంలో చిరాకేమీ కనిపించలేదు కానీ 'నా అచ్చటా ముచ్చటా తీరలేదన్న' అసంతృప్తి కనిపించింది.
   
    తర్వాత కాపురం పెట్టక తప్పలేదు. భార్యకోసం చీటికీమాటికీ అత్తారింటికి పోవటం, అలా పోతున్నందుకు సిగ్గుపడటం - ఈ బాధపడలేక ఏకంగా కాపురం పెట్టేశాడు.
   
    చదువు పూర్తి కాకముందు పెళ్ళి చేసుకుంటే ఎన్ని బాధలు పడాలో అన్నీ అనుభవించాడు. ఇదివరకయితే తండ్రి పంపించే నూటపాతిక రూపాయలూ తన ఒక్కడికే సరిపోయేవి. ఇప్పుడు ఆ డబ్బు ఇద్దరూ సరిపెట్టుకోవాలి. తండ్రి పంపించే డబ్బుతో పెళ్ళానికి చీరెలూ, జాకెట్లూ, పువ్వులూ కొనిపెట్టాలి. ఈ ఆలోచన అతన్ని రంపపుకోత కోస్తూ వుండేది. మొదటి అయిదేళ్ళూ పిల్లలు పుట్టకూడదనుకున్నాడు. అతను మెడిసన్ పూర్తి చేసేసరికి ఒక కొడుకూ, కూతురూ పుట్టేశారు. ఇవతల చదువు అవతల సంసారం, పిల్లలు, వాళ్ళ గోల, డబ్బు చాలక ఇబ్బందులు......అతనికి తనని చూస్తే తనకే అసహ్యమేసేది. పగలు పుస్తకం పట్టుకునేందుకు ప్రాప్తం లేకపోయేది. తప్పించుకుందామన్నా వీలులేని విషవలయంలో ఇరుక్కున్నట్లు ఇరుక్కుపోయాడు.
   
    అయితే తన బాధ బయటకు వ్యక్తపరుచుకోవడానికీ, ఇతరులతో పంచుకోవడానికీ అతనేనాడూ ప్రయత్నించలేదు.
   
    తమ్ముడు హరి బి.కాం. పాసయి సి.ఎ. చదువులోకి వచ్చేసరికి అతనికీ పెళ్ళి చేద్దామని తల్లితండ్రులు తైతక్కలాడటం, తమ్ముడుకూడా సుముఖంగా ఉండటంచూసి, తమ్ముడికిప్పుడే పెళ్ళి వద్దంటే వాళ్ళు అపార్ధం చేసుకుంటారని హరిని ఓసారి ఒంటరిగా పట్టుకుని హితబోధ చేశాడు.
   
    "పెళ్ళీ పెళ్లనుకుంటాంగానీ శారీరక ఉద్రేకం చల్లారటం తప్పితే అందులో ఏమీ సుఖంలేదుగా తమ్ముడూ! స్వేచ్చగా వున్న జీవితాన్ని తీసుకెళ్ళి సంకెళ్ళతో బంధించటమే. దీన్ని ఎంతవరకూ వాయిదా వేయగలిగితే అంత మంచిది. చదువు పూర్తిచేసుకుని, సంపాదనా పరులమయ్యాక మన కాళ్ళమీద మనం నిలబడగలిగే శక్తి వచ్చాక పెళ్ళి చేసుకుంటే అందులో తృప్తి వుంది.
   
    అంతావిని హరి తేలిగ్గా నవ్వేశాడు. తనమాటల్ని అతనేమీ లెక్కచేయలేదని అప్పుడే బోధపడింది.
   
    మళ్ళీ అదే చరిత్ర. పెళ్ళి, పెళ్ళానికి కడుపులు, పిల్లలు, డబ్బు చాలక ఇబ్బందులు... రెండేళ్లు గడిచేసరికి హరి తన తర్వాతవాడికి పెళ్ళి చేసుకోవద్దని సలహా చెప్పే స్థితికి వచ్చాడు.
   
    అందుకనే కుమార్ కి తన తమ్ముడంటే ఒకందుకు కోపం, ఒకందుకు అసూయ.
   
    భోజనాలయిపోయాక చెయ్యి కడుక్కునేందుకు పెరట్లో వున్న వాష్ బేసిన్ దగ్గరకు వెడుతుండగా ప్రభావతి ఎదురుగా వచ్చింది.
   
    ఎందుకో ఆమె పైకివెళ్ళి క్రిందికి దిగి వస్తోంది.
   
    ఇద్దరూ ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ క్షణంసేపు నిలబడ్డారు.
   
    ఆ క్షణంలో ప్రభావతి అతనికి చాలా అందంగా కనిపించింది. పైగా ఏమిటో జాలివేసింది కూడా ఆమెను చూస్తే.
   
    ఒక్కోసారి ప్రభావతిని చూస్తుంటే ఎక్కడలేని ఆపేక్షా పొంగుకువస్తుంది. ఆమె అంతటి అమాయకురాలు ఈ భూమ్మీద లేదనిపిస్తుంది.
   
    ప్రభావతి అతని ముఖంలోకి చూస్తూ నవ్వింది.
   
    ఆ నవ్వు చాలా ముగ్ధమనోహరంగా వుంది.
   
    అతన్లోంచి అనురాగం కట్టలుతెగి ప్రవహించినట్లయింది.
   
    హఠాత్తుగా ఆమెను ముద్దు పెట్టుకోవాలనిపించింది.
   
    ఆమె కళ్ళలోకి చూస్తూ దగ్గరకు అడుగులు వేస్తూ అటూఇటూ చూశాడు. తండ్రి అప్పుడే చెయ్యి కడుక్కుని లోపలకు వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ప్రభావతి ఒంటరిగానే వున్నది.
   
    ఆమెను సమీపించాడు.
   
    ఇంతలో "పెదనాన్నా" అంటూ తమ్ముడి కూతురు రాణి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది.

 Previous Page Next Page