Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 15

   

    "రాణికి నాలుగేళ్ళుంటాయి. దానికిష్టమైనప్పుడు నర్సరీ స్కూలుకు వెళుతుంది. లేకపోతే మానేస్తుంది. వెళ్ళినా పనిమనిషి మధ్యాహ్నం కేరియర్ తీసుకెళ్ళినప్పుడు దానితో వచ్చేస్తుంది."
   
    "ఏమిటే?" అన్నాడు ఉలిక్కిపడి.
   
    "నేనూ పైకి వస్తాను పెదనాన్నా"
   
    "సరే, రా!"
   
    ప్రభావతి కొంటెగా నవ్వింది.
   
    రాణికి  వాళ్ళమ్మా వాళ్ళ దగ్గరకంటే ప్రభావతి, కుమార్ ల దగ్గరే బాగా అలవాటు.
   
    ప్రభావతి దగ్గర ఎందుకోగానీ పిల్లలు ఇట్టే మచ్చికైపోతారు. ఆమె విసుక్కుంటున్నా, ఒక్కొక్కసారి కసిరినా ఆమెదగ్గరే గుమిగూడుతూంటారు.
   
    విమల లోపల్నుండి ఈ మాటలు ఎప్పుడు విన్నదోగానీ పెరట్లోకి వచ్చింది.
   
    "క్రింద పడుకోకుండా ఇప్పుడు పైకెందుకే భడవా! వాళ్ళెవర్నీ నిద్రపోకుండా చెయ్యటానికా" అంది.
   
    "నా ఇష్టం! నేను వెడతాను" అంది రాణి.
   
    "నీ ఇష్టమేలే, మళ్ళీ  క్రిందకి వస్తావుగా, అప్పుడు కాళ్ళు విరగ్గొట్టకపోతే చూడు...."
   
    కుమార్ మౌనంగా పైకి నడిచాడు. తల్లిని వెక్కిరించి అతని చిటికినవేలు పట్టుకుని రాణి పైకెళ్ళిపోయింది.
   
    విమల రూపం ప్రభావతికి అదోరకంగా కనిపించింది. ఆమెకేదో అనుమానం వచ్చింది.
   
    విమల దగ్గరకొచ్చింది.
   
    "విమలా! నిజంచెప్పు?" అన్నది ప్రభావతి.
   
    ఉన్నట్లుండి విమల ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయినట్లయింది.
   
    "నిజమే! ఏటా ఈ బాధ భరించలేను బాబూ! ఆయనకు బుద్దిలేదు. అంతకంటే నాకు బుద్దిలేదు. రేపు లేడీడాక్టరు దగ్గరకు వెడతాను. తీసెయ్యమంటాను" అంది.
   
    ప్రభావతి నవ్వింది "అంతపని దేనికిలే. ఈ ఒక్కసారీ కళ్ళు మూసుకుంటే సరి. తర్వాత ఆపరేషన్ చేయించుకోవచ్చు."
   
    "పొండి అక్కయ్యగారూ, మీరూ అలాగే అంటారు....చూడండి ఆ భడవని, మీ దగ్గర అలవాటు చేసుకోకండి. అదిప్పటికే నామాట వినటంలేదు" అని లోపలకు వెళ్ళిపోయింది.
   
    ప్రభావతి కంచాలెత్తుదామని వంటింట్లోకి వెడుతూండగా సుధాకర్ ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వచ్చాడు.
   
    "వదినా! త్వరగా అన్నంపెట్టు, ఆకలేస్తుంది" అన్నాడు.
   
    ప్రభావతి గబగబా కంచాలెత్తేసి డైనింగ్ టేబిల్ శుభ్రంగా తుడిచి మరిదికి కంచం పెడుతోంది.
   
    "నేను పెడతాలెండి. బావగారికేమైనా కావాలేమో పైకి వెళ్ళండి" అంది విమల వంటింట్లోకి వచ్చి.
   
    "అన్నం తిన్నాక ఆయనకు కళ్ళు కూరుకుపోతాయి. ఓ అరగంటసేపు పైకి వెళ్ళకపోవటమే మంచిది. అదిగో మీ రాలుగాయి ఏడుస్తున్నాడు. వెళ్ళు పాలుకావాలో ఏం కావాలో చూడు. సుధాకర్ కి నేనన్నం పెడతానులే."
   
    విమల "నేను చెబితే వినరు" అంటూ లోపలకు వెళ్ళిపోయింది.
   
    లోపల తన గదిలో రంగారావుగారు భార్యతో ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఆయనకి భార్యతో చెప్పడానికి ఎక్కడలేని కబుర్లూ వస్తాయి. హాస్పిటల్ లో జరిగిన విశేషాల దగ్గర్నుంచి, పేపర్లో చదివిన వింతల వరకూ అన్నీ ఆవిడకు వివరిస్తూనే వుంటాడు. ఆవిడ వాటికి ఊ కొడుతూనే వుంటుంది. భోజనం చేశాక అయిదునిముషాలు ఆవిడతో మాట్లాడి నిద్రపోవటం ఆయనకలవాటు.
   
    ప్రభావతి సుధాకర్ కి అన్నం పెట్టింది.
   
    సుధాకర్ కంచంముందు కూర్చుని "ఈపూట వంట ఎవరెవరు ఏమేమిటి చేశారో చెప్పెయ్యనా? పప్పు అమ్మవండింది, ఎందుకంటే ఉప్పు తక్కువై చప్పగా వుంది. కూర చిన్నవదిన వండింది, ఎందుకంటే ఇందులో పాళ్ళన్నీ సరిపొయీ పోనట్లుగా వున్నాయి. పచ్చడి నువ్వు చేశావు. ఎందుకంటే కారం ఓ పాలు ఎక్కువయింది" అని ఒక్కొక్కటే నోట్లో వుంచుకుని వర్ణించసాగాడు.
   
    "అయితే కారం ఎక్కువైందల్లా చేసింది నేనేనంటావా?" అంది ప్రభావతి.
   
    "తప్పదు మరి" అన్నాడు సుధాకర్.
   
    కొంచం ఆగి ప్రభావతి "నువ్వు బి.ఎస్.సి. పూర్తిచేశావు కదా, తర్వాత ఏం చెయ్యబోతున్నావు?" అనడిగింది.
   
    సుధాకర్ నవ్వాడు "ఏం చేసినా, ఏం చెయ్యబోయినా తల్లిదండ్రులకు మాత్రం కష్టం కలిగించబోతున్నాను."
   
    "అదేమిటి?"
   
    "నేను పెద్దన్నయ్యలా బుద్దిమంతుడ్ని కాదు. అతను ఆదర్శపుత్రుడు. తండ్రిగారి అడుగుజాడల్లో నడిచినవాడు. చిన్నన్నయ్య తన ఇష్టప్రకారం అన్నీ చేసుకుంటూ ఎదుటివార్ని కాంప్రమైజ్ చేయగల సమర్ధుడు. నన్నుకూడా మా నాన్నగారు డాక్టర్ని చేద్దామనుకున్నారు. ఏ పరిస్థితుల్లోనూ అయ్యే యోగ్యతలు నాకు లేవు. అందువల్ల ఏదో ఒకటి చేసి కష్టం కలిగించాబోతున్నాను."
   
    "పోనీ, ఏం చేయదలుచుకున్నావో చెప్పు?"
   
    "అమ్మా! నీకు చెబితే అందరికీ చాటేస్తావు"
   
    "చెప్పనులే....ఒట్టు.....చెప్పు?"
   
    "మీ ఒట్లమీద నాకు నమ్మకం లేదు. ఒకరకంగా ఒట్టువేయకుండా వుంటేనే మంచిది. ఒత్తువేసిన దగ్గర్నుంచీ అదెంత ముఖ్యమైన విషయమోనని ఇతరుల చెవుల్లో ఊదేదాకా గంగవెర్రులెత్తిపోతారు. మీరెప్పుడు దెబ్బలాడుకుంటారో, ఎప్పుడు రహస్యాలు చెప్పుకుంటారో పరమాత్మునికెరుక. పాపం అన్నయ్యలు మీరెంతో ప్రాణప్రదంగా కాపాడతారని నమ్మి మీకు చెప్పిన రహస్యాలు మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకుని, ఇద్దరూ కలిసి అమ్మకుచెప్పటం, ఆవిడ అర్దరాత్రిపూట నాన్నగారు లేచి కబుర్లు మొదలుపెట్టినప్పుడు చల్లగా ఆయనకు చేరెయ్యటం - ఇలా వుంటాయి మీ రహస్యాలు."
   
    "పోనీ ఒట్టు వెయ్యనులే.....చెప్పు?"
   
    "ముందు నన్ను బాగా నిర్ణయించుకోనియ్యి, తర్వాత చెబుతాలే!"
   
    కొంతసేపటికి సుధాకర్ భోజనమైపోయి తనగదిలోకి వెళ్ళిపోయాడు.
   
    కుమార్ మేడమీద గదిలో రాణివేసే అంతూపొంతు లేని ప్రశ్నలకు కొన్నిటికి జవాబులివ్వలేకపోతూ నానా అవస్థా పడుతున్న టైములో ఆ ఇంటి చుట్టుప్రక్కల పరిస్థితి ఇలావుంది.

    ప్రక్కఇంట్లో క్రిందిభాగాల్లో అద్దెకుంటున్నవారంతా ఆ ఇంటి మొత్తానికీ వున్న ఒకే ఒక రేడియో నిరుడే
పి.డబ్ల్యు .డి.లో గుమాస్తాగా రిటైరైన కాంతయ్య గారు తగు వాల్యూమ్ లో త్రిప్పివినిపిస్తూ వుండగా, వసారాలో కూర్చుని ఆసక్తిగా వింటున్నారు. మేడమీది భాగంలోవున్న ఉద్యోగస్తుడి ఉద్యోగస్తురాలయిన భార్య హడావుడిగా ఇంటికివచ్చి ఇంత అన్నం బొక్కేసి పిల్లాడికి పాలుపట్టేసి పనిమనిషికి అప్పజెప్పి తిరిగి ఆఫీసుకెళ్ళే ప్రయత్నంలో వుంది. ఎదురుగా వున్న కోమట్లఇంట్లో అమ్మకం చాలించి తలుపులు బిడాయించుకున్నాడని ఇంటి యజమానీ, యజమాని భార్యా గుసగుసలాడుకుంటున్నారు. రైలుగేటు మూసేస్తే అటూఇటూ రిక్షాలు, కార్లూ, బస్సులూ బారులుతీరి ఆగిపోయిన డ్రైవర్లు అర్ధం లేకుండా హారన్లు మ్రోగిస్తున్నారు. పాకల్లో వున్న కళ్ళ డాక్టరుదగ్గర పనిచేసే నర్సు ఇంటికి వచ్చి లంచ్ తీసుకుని తీరిగ్గా పడుకుని పనికిమాలిన వాడైన మొగుడ్ని నెమ్మదిగా దుయ్యబడుతుంది. ఎలిమెంటరీ స్కూలు పంతులమ్మ అన్నం తినేసి అంట్లు తోముకుంటుంది.....గాజులవాడు ప్రొద్దున్న చిత్తుగా తన్నేసిన పెళ్ళాన్ని రాత్రికి మళ్ళీ అవసరం వున్నదని కాబోలు మచ్చిక చేసుకుని పిచ్చిగా నవ్విస్తున్నాడు. ఆమె చాలా స్పోర్టివ్ గా నవ్వుతోంది......ఎప్పుడూ ఎవర్నో తిట్టడం జన్మహక్కుగా చేసుకున్న కల్లుపాక యజమాని తన ఎండిపోయిన గుండెను వీరుడిలా విరుస్తూ తన ప్రతాపాన్ని చాటే మాటలంటూ ఎవర్నో తిడుతున్నాడు. కట్టెల అతడిలో మగవాళ్ళు మంచాల మీద పడి నిద్రపోతున్నారు. ఆడవాళ్ళు ఒకళ్ళ తలల్లో ఒకరు పేలు చూసుకుంటున్నారు.
   
    ప్రభావతి పైకి రాలేదని కుమార్ కు కోపం వస్తున్నది. మరోమూలనుంచి నిద్ర ముంచుకొస్తున్నది.
   
    నిద్రపోతే ముద్దుపెట్టుకోవటం మరచిపోతాడేమోనన్న భయం నిద్రపోకుండా చేస్తున్నది.

 Previous Page Next Page